Vijayawada East Assembly Constituency
-
పొత్తు కోసం ఆ నలుగురు నేతలు పాట్లు..!
ఏపీ బీజేపీలో ఒంటరి పోరాటానికే మొగ్గు కనిపిస్తోందనే టాక్ నడుస్తోంది. రాష్ట్రంలో కమలం వికసించాలంటే సింగిల్‌గానే వెళ్లాలని పాత బీజేపీలంతా పట్టుపడుతున్నరట. కానీ చంద్రబాబు డైరెక్షన్లో బీజేపీలో చేరిన టీడీపీ వారు మాత్రం టీడీపీ, జనసేన పార్టీలతో పొత్తు కోరుకుంటున్నారు. బీజేపీలోని చంద్రబాబు మద్దతుదారులు పొత్తు కోసం ఢిల్లీలో పైరవీ చేస్తున్నా.. ఢిల్లీ పెద్దలు మాత్రం అంగీకరించడంలేదట. ఇంతకీ పొత్తుల కోసం పాటుపడుతున్న ఆ నలుగురు ఎవరు? ఆంధ్రప్రదేశ్ బీజేపీలో ఎన్నికల పొత్తులపై ఏకాభిప్రాయం కుదరడం లేదు. గత నెలలో రెండు రోజుల పాటు జరిగిన కీలక సమావేశాలలో రాబోయే ఎన్నికలు, కార్యాచరణ, పొత్తులపై చర్చించారు. మెజార్టీ నేతలు ఏపీలో బీజేపీలో ఒంటరిగానే పోటీచేయాలని అభిప్రాయపడ్డారు. అదే సమయంలో రహస్యంగా లిఖితపూర్వక అభిప్రాయాలు కోరిన సందర్బంలో అధిష్టానానికి సైతం ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. కానీ ఆ నలుగురు నేతలు మాత్రం టీడీపీతో పొత్తుకోసం తహతహలాడిపోతున్నారట. టీడీపీ, జనసేనతో పొత్తు ఉంటేనే పార్టీకి సీట్లు వస్తాయంటూ లెక్కలతో ఢిల్లీ పెద్దలకు వివరిస్తున్నారట. ఇంతకీ ఆ నలుగురు ఎవరా అని చూస్తే బీజేపీలోకి వలసవచ్చిన పక్షులే కావడం విశేషం. తెలుగుదేశం పార్టీలో ఉండి బీజేపీలో చేరిన సిఎం రమేష్, సుజనా చౌదరి, ఆదినారాయణరెడ్డి ప్రధానంగా పొత్తు కోసం వెంపర్లాడుతున్నారట. బీజేపీలో చేరినప్పటికీ వీరు చంద్రబాబు ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నారని ఏపీ బీజేపీ నేతలు చెబుతుంటారు. అందుకోసమే ఇపుడు చంద్రబాబు డైరక్టన్ లోనే బీజేపీ వైపు నుంచి పొత్తు కోసం ప్రతిపాదన వచ్చేలా పైరవీలు ప్రారంభించారు. వీరితో పాటు కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరి ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా ఉన్న పురందేశ్వరి సైతం పొత్తు కోసమే ప్రయత్నిస్తున్నారనే టాక్ నడుస్తోంది. విజయవాడ ఎంపీ సీటుపై కన్నేసిన సుజనాచౌదరి ఇటీవలే ఆ విషయాన్ని బయటకు చెప్పారు. టీడీపీ, జనసేనతో కలిసి పోటీ చేస్తే విజయవాడ ఎంపీ స్దానంలో తనకు ఆ రెండు పార్టీల నుంచి మద్దతు లభిస్తుందని సుజనా చౌదరి భావిస్తున్నారట. ఇందులో భాగంగానే ఆయన ఈ విషయాన్ని టీడీపీ అధినేత చంద్రబాబుతోనూ చర్చించి సీటుపై స్ఫష్టమైన హామీ పొందారంటున్నారు. దీంతో పాటు కృష్ణా జిల్లా వ్యాప్తంగా టీడీపీ అసెంబ్లీ అభ్యర్ధులందరికీ ఆర్దిక వనరులు సమకూర్చడానికి కూడా సుజన్ చౌదరి హామీ ఇచ్చారట. తన సీటు కోసమే సుజనా చౌదరి ఢిల్లీలో పొత్తులకోసం బీజేపీ పెద్దలపై ఒత్తిడి తీసుకొచ్చే పనిలో బిజీగా ఉన్నారట. సుజనా కోసమే అన్నదమ్ముల మధ్య చిచ్చు పెట్టి టీడీపీలో ఉన్న సిట్టింగ్ ఎంపీ కేశినేని నానిని బయటకి వెళ్లగొట్టారనే ప్రచారం జరుగుతోంది. ఇక టీడీపీలో రాజ్యసభ సభ్యుడిగా ఉంటూ బీజేపీలో చేరిన సిఎం రమేష్ సైతం సుజనాతో కలిసి ఇదే ప్రయత్నాలు చేస్తున్నారు. సిఎం రమేష్ కడప పార్లమెంట్ స్ధానం నుంచి పోటీ చేయాలని ఉవ్విళ్లూరుతున్నారు. టీడీపీ, జనసేన మద్దతుంటే తన స్ధానానికి ఢోకా ఉండదని ఆయన భావిస్తున్నారట. గతంలో టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన ఆదినారాయణ రెడ్డి బీజేపీ తరపున జమ్మలమడుగు అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయడానికి రంగం సిద్దం చేసుకుంటున్నారు. ఇక ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి అటు విశాఖపట్టణం..ఇటు విజయవాడ రెండు ఎంపీ సీట్లపైనా కన్నేసారు. గతంలో విశాఖ నుంచి గెలుపొందిన నేపధ్యంలో విశాఖ సేఫ్ సీటుగా భావిస్తున్నారు. అయితే బీజేపీ రాజ్యసభ సభ్యులు జివిఎల్ నరసింహరావు గత రెండేళ్లగా విశాఖలోనే ఉంటూ గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ విశాఖ టిక్కెట్ పై ఆశలు పెట్టుకున్నారు. విశాఖ లేదా విజయవాడలో ఏదీ దక్కకపోతే చివరగా నర్సారావుపేట నుంచైనా పోటీకి సిద్దపడుతున్నారు. ఈ మూడు స్ధానాలలో ఎక్కడ నుంచి పోటీ చేయాలన్నా కూడా తనకి తన మరిది పార్టీ టీడీపీ నుంచి మద్దతు ఉండాలని పురందేశ్వరి భావిస్తున్నారట. అందుకోసమే టీడీపీ, జనసేన పార్టీలతో బీజేపీ కూడా చేరాలనే అభిప్రాయంతో పురందేశ్వరి ఉన్నారంటున్నారు. ఇక జాతీయ కార్యదర్శిగా ఉన్న సత్యకుమార్ కూడా రాజంపేట పార్లమెంట్ సీటుకు పోటీ చేయాలని ఆశ పడుతున్నారు. పొత్తులు ఉంటేనే టీడీపీ, జనసేన మద్దతుతో బీజేపీ తరపున రాజంపేట ఎంపి స్ధానానికి పోటీ చేయాలని అనుకుంటున్నారట. ఇలా వీరందరి సొంత ప్రయోజనాల కోసమే పార్టీని పొత్తుల్లోకి దింపాలని భావిస్తున్నారట. ఇందుకోసమే అదిష్టానంపై వీరంతా ఒత్తిడి తీసుకొస్తున్నారని సమాచారం. వాస్తవానికి బీజేపీ అగ్ర నేతలెవరికీ కూడా టీడీపీతో జట్టుకట్టడం ఇష్టం లేదు. పార్టీలో మొదటి నుంచి ఉన్న నేతలంతా ఇదే విషయాన్ని ఇటీవల జరిగిన సమావేశాలలో స్పష్టం చేశారు. గతంలో చంద్రబాబు పొత్తుల పేరుతో బీజేపీని వాడుకుని ఏ విధంగా అధికారంలోకి వచ్చింది..పార్టీ ఓటు బ్యాంకు ఏ విధంగా నష్టపోయిందనేది ఒరిజినల్ బీజేపీ నేతలకు తెలుసు. ఇపుడు కూడా పొత్తులతో ముందుకు వెళ్తే ఎప్పటికీ ఏపీలో ఓటు బ్యాంక్ పెంచుకోలేమనేది బీజేపీ నేతల మాట. పొత్తు పెట్టుకుంటే బీజేపీ ద్వారా టీడీపీ లాభపడుతుంది తప్పితే బీజేపీకి వచ్చే లాభమేమి ఉండదనేది వారి అభిప్రాయం. అదే సమయంలో చంద్రబాబుకు మద్దతిచ్చే ఆ నలుగురు తమ గెలుపు అవకాశాల కోసమే పొత్తులపై ఒత్తిడి తెస్తున్నారు తప్పితే బీజేపీని బలోపేతం చేయడం కోసం కాదని చెబుతున్నారు. అసలు ఈ నలుగురు ద్వారా కధ నడిపించేది టీడీపీ అధినేత చంద్రబాబేనని కూడా బీజేపీ అగ్రనేతలు అనుమానిస్తున్నారు. చంద్రబాబుకి ఏ విధంగానూ నష్టం కలగకుండా ఈ నలుగురే బీజేపీ నుంచి ప్రయత్నిస్తుంటారని అంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో టీడీపీకి ఏదైనా ప్రయోజనం కలగాలంటే బీజేపీతో పొత్తు అనివార్యమని వారు భావిస్తున్నారు. చంద్రబాబు మార్కు రాజకీయాలు అన్నీ తెలిసిన బీజేపీ అధిష్టానం పొత్తులపై ఆచితూచి అడుగులు వేస్తోందని సమాచారం. -
టీడీపీ 60 శాతం ఖాళీ అవుతుంది: ఎంపీ కేశినేని నాని
సాక్షి, విజయవాడ: కాల్ మనీ, అక్రమ వ్యాపారాలు చేసే వాళ్ల గురించి తాను మాట్లాడనని ఎంపీ కేశినేని నాని అన్నారు. శనివారం కంచికచర్ల మండలం పెండ్యాలలో 70 లక్షల అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని నాని మాట్లాడారు. కేశినేని చిన్ని వ్యాఖ్యలపై.. ఎన్నికల అనంతరం ఈవీఎంలు ఓపెన్ చేసిన తర్వాత మాట్లాడుతానని అన్నారు. ఉత్తర కుమార ప్రగల్భాలు పలకొద్దని, గతంలో తనతో ఉన్న అనుచరులను తనతో రమ్మని పిలవలేదని తెలిపారు. ఇక.. ప్రజలు సీఎం జగన్ వెంటే ఉన్నారని, నాయకుల పాత్ర తక్కువ ప్రజల పాత్ర ఎక్కువ అని తెలిపారు. రాజీనామా అనంతరం తన అనుచరులతో సమావేశం తర్వాతే వైఎస్సార్సీపీలో చేరాలని అనుకున్నానని నాని స్పష్టం చేశారు. సీఎం జగన్ పిలుపుతో వెంటనే వైఎస్సార్సీపీలో చేరినట్లు వెల్లడించారు. టీడీపీ 60 శాతం ఖాళీ అవుతుందని ఇప్పటికీ చెబుతున్నానని అన్నారు. రాజకీయాల్లో తన స్థాయి చంద్రబాబు స్థాయి ఒక్కటేనని.. స్థాయిలో లోకేష్.. తన కంటే చాలా తక్కువని అన్నారు. కాల్ మనీ కార్యకలాపాలకు పాల్పడేవాళ్ల మాటలకు తాను సమాధానం చెప్పనని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కేశినేని నానిలో పాటు ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ పాల్గొన్నారు. చదవండి: అంబేద్కర్‌ను పచ్చ మీడియా అవమానించింది: ఆర్కే. రోజా -
Kesineni Nani: ఉంటే ఉండండి.. పొతే పోండి..
రెండేళ్లుగా తనను పార్టీలో కుదురుగా ఉండనివ్వకుండా ఇబ్బందులు పెడుతూ వస్తున్న తెలుగుదేశాన్ని వీడిన కేశినేని నాని ఇప్పుడు తన వ్యూహాలకు పదునుపెడుతున్నారు. తనను కాదని తన సోదరుడు కేశినేని శివనాథ్ (చిన్ని)కి తెలుగుదేశం ఎంపీ టికెట్ ఇస్తున్నట్లు చెబుతున్నారు. మరోవైపు కేశినేని నానిని ఇప్పటికే వైఎస్సార్సీపీ పార్టీ విజయవాడ లోక్‌సభ నియోజకవర్గం ఇంచార్జ్‌గా నియమించగా ఇప్పటికే ఆయన తన పనులు మొదలు పెట్టారు. కేడర్‌తో సమావేశం కావడం, వారిని తనవెంట నడిపించేలా వ్యూహాలు అమలు చేస్తున్నారు. మరోవైపు ఆయన తన పరిధిలోని విజయవాడ ఈస్ట్, వెస్ట్, సెంట్రల్ నియోజకవర్గాలతోబాటు తిరువూరు, మైలవరం.. నందిగామ.. జగ్గయ్యపేటల్లోని తన కేడర్‌తో కూడా భేటీలు నిర్వహిస్తూ ఎప్పటిలా తనకు మద్దతుఇవ్వాల్సిందిగా కోరుతూ ముందుకుసాగుతున్నారు. ఇదిలా ఉండగా ఆయనకు సంబంధించి ఒక ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకున్నది. కేశినేని నాని తన ప్రధాన అనుచరులు.. నాయకులతో కూడిన వాట్సాప్ గ్రూపులో మొన్న ఆయన తరఫున ఒక మెసేజ్ పోస్ట్ చేసారు. కేశినేని నాని ఇకపై వైఎస్సార్సీపీతో కలిసి ప్రయాణించాలని నిర్ణయించుకున్నారని, ఈ క్రమంలో ఆయన ఆలోచలను.. నిర్ణయాలు.. అడుగుల గమనాన్ని అంగీకరించి, ఆమోదించేవాళ్ళు మాత్రమే ఆ వాట్సాప్ గ్రూపులో ఉండాలని, ఆయన ఆలోచనలు, నిర్ణయాలను వ్యతిరేకించేవాళ్ళు సదరు గ్రూపు నుంచి వెళ్లిపోవచ్చని అందులో ప్రత్యేకంగా పేర్కొన్నారు. అంటే నాని అలా టీడీపీని వీడి వైఎస్సార్సీపీ వెంట నడవడాన్ని అంగీకరించాలని వాళ్లు గ్రూపు నుంచి వెళ్లిపోవాలని అందులో తేల్చి చెప్పేశారు. అయితే, అలా చెప్పినప్పటికీ ఒక్కరు కూడా గ్రూపు నుంచి వెళ్లలేదని తెలుస్తోంది. అంటే వారంతా నాని నిర్ణయాన్ని ఆమోదిస్తున్నట్లే అని తెలుస్తోంది. ఇది కాకుండా ఇంకా ఆ ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో గ్రామ మండల స్థాయి నాయకులు పెద్ద ఎత్తున కేశినేని నాని వెంట వైఎస్సార్సీపీ వెంట నడిచేందుకు సిద్ధం అవుతున్నారు. ఆయన సైతం తన బలాన్ని.. బలగాన్ని నిరూపించుకుని ఎన్నికల్లో తన పట్టును రుజువు చేసుకునేందుకు ఇప్పటికే ప్రయత్నాలు మొదలు పెట్టారు. వాస్తవానికి కేశినేని నాని వెంట తిరువూరు మాజీ ఎమ్మెల్యే స్వామిదాసు కూడా వైఎస్సార్సీపీలో చేరారు. ఆయనకు టిక్కెట్ ఇస్తారని ప్రచారం జరుగుతోంది. ఆయనతోబాటు ఇంకా పెద్ద సంఖ్యలో గ్రామ, మండల స్థాయి నాయకులూ వైఎస్సార్సీపీలో చేరుతున్నారు. తామంతా ఈసారి ఐక్యంగా కదులుతామని, నాని మొన్న చెప్పినట్లు జిల్లాలో 60 శాతం వరకూ టీడీపీ కేడర్‌ను తమ వెంట తీసుకుపోతామని వారు అంటున్నారు. రెండుసార్లు గెలిచిన నాని ఇప్పుడు వైఎస్సార్సీపీలో చేరడంతో ఆ సామాజికవర్గంలో కూడా ఆలోచన మొదలైంది. మళ్ళీ వచ్చేది జగన్.. గెలిచేది జగన్ అని వారు భావిస్తున్నారు. దీంతో ఎన్టీయార్ జిల్లాలో ఈసారి తెలుగుదేశానికి గట్టి దెబ్బ తప్పదు అని తెలుస్తోంది. - సిమ్మాదిరప్పన్న -
బాబు బ్యాచ్ చిత్తు..!
ఏపీలో సంక్రాంతి సందడి నెలకొంది. పందెం కోళ్లు కత్తులు కట్టుకుని నువ్వా నేనా అంటున్నాయి. భోగి మంటలు చలిని తరిమేస్తున్నాయి. మంచు తెరలు ముచ్చట గొలుపుతున్నాయి. కానీ.. రాజకీయ వేడి దెబ్బకు మంచు తెరలు కరిగిపోతున్నాయోమో అనిపిస్తోంది. ప్రతి పక్షాల కంటే వైఎస్సార్సీపీ దూకుడుగా కనిపిస్తోంది. టార్గెట్ 175 దిశగా సీఎం జగన్ రామబాణంలా దూసుకెళ్తున్నారు. ఇప్పటికే 50 శాసన సభ నియోజకవర్గాలు, 9 లోక్ సభ స్థానాల్లో సమన్వయకర్తలను నియమించారు. రాజకీయంగా ప్రయోజనం చేకూర్చే కఠినమైన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకెళ్తున్నారు. టికెట్ రాని వారిని బుజ్జగిస్తూ.. ఆశావాహులకు సర్ధి చెబుతూ విజయావకాశాలు ఉన్న వారికి టికెట్లు ఇస్తున్నారు. సామాజిక సమీకరణలు మనసులో పెట్టుకుని సీఎం జగన్ నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకుంటున్నారు.ఒకటికీ పది సార్లు ఆలోచించి ముందుకెళ్తున్నారు. గడప గడపకు మన ప్రభుత్వం, సామాజిక సాధికార యాత్రలు విజయవంతం అవడంతో వైఎస్ఆర్ సీపీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. జనవరి 25 నుంచి సీఎం జగన్ ప్రాంతాల వారీగా నేతలు, కార్యకర్తలతో సమావేశమవుతున్నారు. ఉత్తరాంధ్ర నుంచి ఈ పర్యటన ప్రారంభం కానుంది. ఎన్నికల యుద్ధానికి సీఎం జగన్ సకలం సిద్దం చేసుకుంటూ ఉంటే.. ప్రతిపక్షాలు మాత్రం పొత్తులతో కుస్తీ పడుతున్నాయి. నాలుగు దశబ్దాల చరిత్ర ఉన్న తెలుగు దేశం పార్టీ 175 స్థానాల్లో సరైన అభ్యర్ధులు లేక విలవిలలాడిపోతుంది. ఇప్పటికే.. విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని వైఎస్ఆర్ సీపీలో చేరారు. గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ రాజకీయాలకే రాంరాం చెప్పేశారు. ఇప్పటి వరకూ టీడీపీకి ఆర్ధికంగా అండదండగా ఉన్న రాయపాటి సాంబశివ రావు కుమారుడు రాయపాటి రంగారావు టీడీపీకి రాజీనామా చేశారు. ఈయన చంద్రబాబు హయాంలో పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టర్. ఈ పచ్చ సునామీ అంతా కూడా అమరావతి సరిహద్దుగా ఉన్నా.. గుంటూరు , ఎన్టీఆర్ జిల్లాలో సంభవించింది. గత వారం రోజులుగా ఈ రెండు జిల్లాల్లో జరుగుతోన్న రాజకీయ పరిణామాలతో టీడీపీ కుదేలు కాబోతుందనే సంకేతాలు బలంగా వెలువడుతున్నాయి. 1995లో ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి టీడీపీ, సీఎం పదవిని లాక్కున్న దగ్గరి నుంచి చంద్రబాబు రెండింటినే నమ్ముకున్నారు. 1. ఎల్లో మీడియా 2. పొత్తులు ఈ రెండు లేకుండా చంద్రబాబు రాజకీయ జీవితం లేదు. 1999లో బీజేపీతో పొత్తు, 2014లో బీజేపీ - జనసేనలతో పొత్తు. పొత్తులు ఉంటేనే చంద్రబాబు... పొత్తులు లేకపోతే చంద్రబాబు లేడు అనడానికి ఇదే సాక్ష్యం. తన రాజకీయ జీవితంలో చంద్రబాబు ఏనాడు ప్రజలను నమ్ముకోలేదు.. నమ్ముకోడు కూడా. ఎందుకంటే.. చంద్రబాబు దృష్టిలో ప్రజలంటే మనుషులు కాదు ఓటర్లు మాత్రమేనన్న ప్రచారం జనబాహుళ్యంలో ఉంది. చంద్రబాబు ఇచ్చే హామీలు అధికారంలోకి రావడానికేనని తెలుగు తమ్ముళ్లే చెప్పుకుంటుంటారు. అధికారంలోకి వచ్చాక ఆ హామీలకు సమాధి ఎలా కట్టాలో చంద్రబాబుకు బాగా తెలుసు. 2014లో మేనిఫెస్టోలో 650 హామీలిచ్చారు. 650 హామీల్లో ఏనాడు ఒక్క హామీ నెరవేర్చలేదు. పైగా మేనిఫెస్టో టీడీపీ అధికారిక వెబ్ సైట్ నుంచి తొలగించారు. ఇదీ.. చంద్రబాబుకు మేనిఫెస్టో మీద ఉన్న విశ్వసనీయత అన్నది చరిత్ర చెబుతున్న సత్యం. 2024 ఎన్నికల్లో కూడా చంద్రబాబు తన సహజ సిద్ధ రాజకీయాలతో ముందుకు వస్తున్నారు. ఎల్లో మీడియాను ముందు పెట్టి యుద్ధం చేస్తున్నారని, కాపుల ఓట్ల కోసం జనసేన పొత్తు అనే నాటకాన్ని మొదలు పెట్టారని అర్థమవుతోంది. టీడీపీ - జనసేన ఉమ్మడి మేనిఫెస్టో పేరుతో కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను తమ పేజీల్లో ఇరికించబోతున్నారని, ప్రజలను మరోసారి ప్రజాస్వామ్యం సాక్షిగా మోసం చేయడానికి సిద్ధమవుతున్నారని ఆయన్ను అనుసరిస్తోన్న రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. పొత్తు కోసం చర్చలు, మేనిఫెస్టోపై చర్చలు ఎల్లో కల్పనలే.. ప్రజలను నమ్మించడానికేనంటున్నారు విశ్లేషకులు. -
లోకేష్, చంద్రబాబుపై కేశినేని నాని ఆసక్తికర కామెంట్స్
సాక్షి, విజయవాడ: వచ్చే ఎన్నికల్లో టీడీపీ 50 స్థానాల్లో కూడా గెలిచి పరిస్థితి లేదు అని తన సర్వేల్లో తేలిందన్నారు ఎంపీ కేశినేని నాని. నారా లోకేష్‌ను ముఖ్యమంత్రిని చేయడమే చంద్రబాబు లక్ష్యమని ఆయన చెప్పుకొచ్చారు. రాబోయే రోజుల్లో పవన్ కల్యాణ్‌ను కూడా చంద్రబాబు మోసం చేస్తారని నాని తెలిపారు. కాగా, ఎంపీ కేశినేని నాని విజయవాడలోని ఆటోనగర్‌లో ఎంపీ నిధులతో నిర్మించిన వాటర్ హెడ్ ట్యాంక్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా కేశినేని నాని మాట్లాడుతూ..‘నాకు విజయవాడ అంటే పిచ్చి.. ఆటోనగర్ అంటే ప్రాణం. నేను ఆటోనగర్ తీసేస్తున్నాని ప్రచారం చేశారు. బాండ్ లేకుండా రెండు ఎకరాలు నేను రాసిచ్చాను. దాని విలువ రూ. 100కోట్లు. నిస్వార్దంగా చేసిన పని ఇప్పుడు ఆటోనగర్‌కి ఉపయోగపడుతోంది. దేశంలోనే ఎక్కువగా కార్మికులు పనిచేసే ప్రాంతం ఆటోనగర్. కార్మికుల ఆరోగ్యానికే పెద్దపీట. ఆటోనగర్ అభివృద్ధికి కేశినేని కుటుంబం కట్టుబడి ఉంది. నన్ను ఎంపీగా ఎన్నుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ధన్యవాదాలు. ఎంపీగా గెలిచి ముఖ్యమంత్రి జగన్‌కు గిఫ్ట్ ఇస్తాను. టీడీపీ నన్ను పార్టీ నుంచి గెంటేసింది. లోకేష్‌ను సీఎం చేయడమే చంద్రబాబు లక్ష్యం. లోకేష్‌ను సీఎం చేయడం కోసం రేపు పవన్‌ను కూడా చంద్రబాబు మోసగిస్తారు. విజయవాడను స్మశానం చేశాడు చంద్రబాబు. విజయవాడపై చంద్రబాబుకు చిన్నచూపు. 33వేల ఏకరాలతో రైతులను మోసం చేశారు. 30 ఏళ్లు అయినా రాజధాని నిర్మాణం పూర్తి అవ్వదు అని నేను నాడే చెప్పాను. భూ మాఫియాకి టీడీపీ నేతలు తెర లేపారు. రాజధాని విషయంలో చంద్రబాబు స్వార్థం పూరితంగా వ్యవహరించారు. మంచి చేసేవాళ్లు.. మంచివాళ్ళు కొందరే ఉంటారు. సమర్థత కూడా కావాలి. సీఎం నుండి నిధులు తెచ్చే సమర్థత అవినాష్‌ది. తూర్పు నియోజకవర్గానికి కేశినేని, దేవినేని రక్షణగా ఉంటాం. మా కాంబినేషన్ అంటే డబుల్ రిటైనింగ్ వాల్. మా ఇద్దరి వల్ల రాబోయే రోజుల్లో అద్భుత ఫలితాలు వస్తాయి. ఎందుకు చెబుతున్నానో విజయవాడ ప్రజలు అర్థం చేసుకోవాలి’ అని కామెంట్స్ చేశారు. -
లోకేశ్ దెబ్బకు టీడీపీ కకావికలు
సాక్షి ప్రతినిధి, విజయవాడ/పటమట (విజయవాడ తూర్పు): టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్ చేస్తున్న నీచ రాజకీయాలకు ఎన్టీఆర్ జిల్లాలో ఆ పార్టీలో పెద్ద ముసలమే పుట్టింది. ముఖ్యంగా లోకేశ్ కొట్టిన దెబ్బకు జిల్లాలో ఆ పార్టీ కకావికలవుతోంది. బాబు, లోకేశ్ చర్యలకు విసిగిపోయి పార్టీకి ఎంపీ కేశినేని శ్రీనివాస్ (నాని) గుడ్‌బై చెప్పడంతో జిల్లాలో పార్టీ నేతలు అధిక సంఖ్యలో రాజీనామాలకు సిద్ధమవుతున్నారు. ఇకపై పార్టీలో పని చేయలేమని తెగేసి చెబుతున్నారు. టీడీపీకి చెందిన విజయవాడ 11వ డివిజన్ కార్పొరేటర్, నాని కుమార్తె కేశినేని శ్వేత సోమవారం తన పదవికి రాజీనామా చేశారు. ఈ అంశం బెజవాడ టీడీపీలో మరింత కలకలం రేపింది. రాజీనామా ఆమోదం పొందిన వెంటనే పార్టీకి రాజీనామా చేస్తామని శ్వేత వెల్లడించారు. కేశినేని నాని పార్టీకి రాజీనామా చేశాక కార్యకర్తలతో మాట్లాడి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తారన్నారు. గౌరవం లేని పార్టీలో ఇమడలేకే రాజీనామా చేస్తున్నామని ఆమె చేసిన వ్యాఖ్యలు టీడీపీలో అలజడి రేపుతున్నాయి. ఏడాదిన్నరగా పార్టీలో తీవ్ర అవమానాలకు గురయ్యామని ఆమె ఆవేదన వ్యక్తం చేయడం పార్టీలో చర్చకు దారితీసింది. కేశినేని వర్గీయులు మరికొంత మంది కూడా రాజీనామాలకు సిద్ధమవుతున్నారు. ప్రధాన అనుచరులుగా ఉన్న తిరువూరు మాజీ ఎమ్మెల్యే స్వామిదాసు, మైలవరం నియోజకవర్గానికి చెందిన బొమ్మసాని సుబ్బారావు, విజయవాడ వెస్ట్ నియోజకవర్గానికి చెందిన బేగ్ వంటి వారు కేశినేని వెంటే ఉన్నారు. కేశినేని నాని మూడోసారి కూడా విజయవాడ నుంచే లోక్‌సభకు పోటీ చేస్తారని, విజయం సాధిస్తారని శ్వేత ప్రకటించారు. తన బాబాయ్ కేశినేని చిన్ని గురించి మాట్లాడి తమ స్థాయిని తగ్గించుకోలేమని అన్నారు. అవినీతిపరులను పార్టీ ప్రోత్సహిస్తోందని విమర్శించారు. ఇది లోకేశ్ అజ్ఞానమే తిరువూరు సభకు, కేశినేని నానికి సంబంధం ఏమిటన్న లోకేశ్ వ్యాఖ్యలపై పలువురు టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాని ప్రాతినిధ్యం వహిస్తున్న లోక్‌సభ నియోజకవర్గంలో భాగమైన తిరువూరులో జరుగుతున్న పార్టీ సభతో సంబంధం లేదని అనడం లోకేశ్æ అజ్ఞానమేనని వ్యాఖ్యానిస్తున్నారు. ‘మా నాన్న నియోజకవర్గంలో సభ జరుగుతుంటే ఎంపీగా ఆయనకు సంబంధం ఉండదా’ అని కేశినేని శ్వేత గట్టిగానే ప్రశ్నించారు. లోకేశ్ అజ్ఞానం వల్లే పార్టీలో విభేదాలు తలెత్తుతున్నాయని, సీనియర్ నేతలను ఆయన అవమానిస్తున్నారని విమర్శిస్తున్నారు. లోకేశ్ గుట్లు తెలిసిన కేశినేని నాని వ్యతిరేక వర్గం ఆయన్ని బ్లాక్ మెయిల్ చేసి, అధిపత్యం చలాయిస్తోందని చెబుతున్నారు. కేశినేని చిన్ని, నాని వ్యతిరేక వర్గంలోని ముగ్గురు టీడీపీ నేతలు చెప్పినట్లే ప్రస్తుతం పార్టీలో నడుస్తోందని వ్యాఖ్యానిస్తున్నారు. ముగ్గురు బ్లాక్ మెయిలర్ల చెప్పు చేతల్లోకి లోకేశ్, పార్టీ వెళ్లిపోయారంటూ కేశినేని శ్వేత అన్నారు. జిల్లాలో టీడీపీ అధినేత కార్యక్రమాలేవీ నానికి చెప్పడంలేదని తెలిపారు. ఎన్నో అవమానాలు భరించి పార్టీలో ఉన్నామన్నారు. మీరు పార్టీలో వద్దు పొమ్మన్నాక కూడ ఉండలేం కదా అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అండగా ఉన్నామని, ఆస్తులు అమ్ముకున్నామని, వ్యాపారాలు నిలిపివేసి, త్యాగం చేస్తే, చివరికి చంద్రబాబు తమను వంచించారని కేశినేని నాని రగిలిపోతున్నారు. పిలిచి మాట్లాడకుండా, దూతలను పంపి పార్టీ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని చెప్పడాన్ని తీవ్ర అవమానంగా భావిస్తున్నారు. చుట్టుపక్కల రాజమండ్రి, ఏలూరు, గుంటూరు, బాపట్ల ఎంపీ స్థానాలకు టీడీపీ అభ్యర్ధులే కరువైన తరుణంలో ప్రజల్లో పట్టున్న విజయవాడ సిట్టింగ్ ఎంపీకి టికెట్ లేదని చెప్పటాన్ని ఆ పార్టీ నాయకులే జీర్ణించుకోలేక పోతున్నారు. మేయర్ ఫార్మాట్లో కార్పొరేటర్ శ్వేత రాజీనామా ఎంపీ కేశినేని నాని కుమార్తె, విజయవాడ 11వ డివిజన్ కార్పొరేటర్ కేశినేని శ్వేత సోమవారం తన అనుచరులతో కలిసి వీఎంసీ ప్రధాన కార్యాలయంలో మేయర్ రాయన భాగ్యలక్ష్మిని కలిసి రాజీనామాను సమర్పించారు. మేయర్ ఫార్మాట్లో ఆమె రాజీనామా లేఖ సమర్పించారు. ఈ సందర్భంగా శ్వేత మాట్లాడుతూ.. తమకు టీడీపీలో గౌరవం లేదని, అందుకే రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. రాజీనామా ఆమోదం పొందాక టీడీపీకి రాజీనామా చేస్తానని తెలిపారు. నాని, తాను ప్రజల తరపున పోరాటం చేస్తామని చెప్పారు. మున్సిపల్ ఎన్నికల్లో నగరంలోని మూడు నియోజకవర్గాల నాయకులు తమను ఇబ్బంది పెట్టారని చెప్పారు. ఇప్పుడు టీడీపీకి విజయవాడ, మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గాల్లో అభ్యర్థులే లేరని అన్నారు. టీడీపీ నుంచి తమతో వచ్చేవాళ్ళకి కచ్చితంగా అండగా ఉంటామని పేర్కొన్నారు. అంతకు ముందు ఆమె విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ను కలిసి తన రాజీనామా నిర్ణయాన్ని చెప్పారు.