సాక్షి, విజయవాడ: కాల్ మనీ, అక్రమ వ్యాపారాలు చేసే వాళ్ల గురించి తాను మాట్లాడనని ఎంపీ కేశినేని నాని అన్నారు. శనివారం కంచికచర్ల మండలం పెండ్యాలలో 70 లక్షల అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని నాని మాట్లాడారు. కేశినేని చిన్ని వ్యాఖ్యలపై.. ఎన్నికల అనంతరం ఈవీఎంలు ఓపెన్ చేసిన తర్వాత మాట్లాడుతానని అన్నారు. ఉత్తర కుమార ప్రగల్భాలు పలకొద్దని, గతంలో తనతో ఉన్న అనుచరులను తనతో రమ్మని పిలవలేదని తెలిపారు. ఇక.. ప్రజలు సీఎం జగన్ వెంటే ఉన్నారని, నాయకుల పాత్ర తక్కువ ప్రజల పాత్ర ఎక్కువ అని తెలిపారు.
రాజీనామా అనంతరం తన అనుచరులతో సమావేశం తర్వాతే వైఎస్సార్‌సీపీలో చేరాలని అనుకున్నానని నాని స్పష్టం చేశారు. సీఎం జగన్ పిలుపుతో వెంటనే వైఎస్సార్‌సీపీలో చేరినట్లు వెల్లడించారు. టీడీపీ 60 శాతం ఖాళీ అవుతుందని ఇప్పటికీ చెబుతున్నానని అన్నారు.
రాజకీయాల్లో తన స్థాయి చంద్రబాబు స్థాయి ఒక్కటేనని.. స్థాయిలో లోకేష్.. తన కంటే చాలా తక్కువని అన్నారు. కాల్ మనీ కార్యకలాపాలకు పాల్పడేవాళ్ల మాటలకు తాను సమాధానం చెప్పనని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కేశినేని నానిలో పాటు ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment