ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి పుష్పగుచ్ఛం అందజేస్తున్న ఎంపీ కేశినేని నాని
సాక్షి, అమరావతి: ‘‘చంద్రబాబు పచ్చి మోసగాడు.. ఈ రాష్ట్రానికి పనికిరాని వ్యక్తి అని తెలిసి కూడా విజయవాడపై ప్రేమ, నియోజకవర్గం కోసమే టీడీపీలో ఇంతకాలం ఉన్నా..’’ అని విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్ (నాని) వ్యాఖ్యానించారు. టీడీపీలో ఎన్నో అవమానాలను ఓర్చుకున్నానని, ఇక భరించలేక బయటికి వచ్చేయాలని నిర్ణయించున్నట్లు తెలిపారు. ‘సీఎం జగన్ పేదల పక్షపాతి. ఆయన విధానాలు నాకు నచ్చాయి. సీఎం జగన్ వెనుక నడవాలని నిర్ణయించుకున్నా. పార్టీ కోసం ఆయన ఏం చేయమంటే అది చేస్తా..’ అని పేర్కొన్నారు.
తాను నైతిక విలువలు పాటించే వ్యక్తినని, టీడీపీకి రాజీనామాతోపాటు ఎంపీ పదవికి రాజీనామాను స్పీకర్ ఫార్మాట్‌లో పంపుతానన్నారు. ఆ తర్వాత వైఎస్సార్‌సీపీలో చేరతానని తెలిపారు. బుధవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ను కలసిన అనంతరం ఎంపీ కేశినేని నాని మీడియాతో మాట్లాడారు. సీఎంను మర్యాద పూర్వకంగానే కలిశానని చెప్పారు. ఎంపీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్‌కుమార్, వైఎస్సార్‌సీపీ విజయవాడ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త దేవినేని అవినాష్ తదితరులు ఆయన వెంట ఉన్నారు.
నాతో నెల జీతాలు ఇప్పించారు..
పేదలకు అండగా ఉన్న సీఎం జగన్ వెంట నడవాలని నిర్ణయించున్నట్లు ఎంపీ కేశినేని నాని వెల్లడించారు. టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడితో ప్రెస్‌మీట్ పెట్టించి తనను దూషించారని, చెప్పు తీసుకొని కొడతానని ఓ క్యారెక్టర్‌లెస్ వ్యక్తి తిట్టినా పార్టీ స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తనను గొట్టంగాడు అని దారుణంగా అవమానించినా భరించానన్నారు. ‘ఉమ్మడి కృష్ణా జిల్లాలో పార్టీని నా భుజస్కందాలపై నడిపించా. పార్టీ కోసం నా సొంత వ్యాపారాలను పక్కనపెట్టా. చంద్రబాబు పాదయాత్ర, స్థానిక సంస్థల ఎన్నికలను నా భుజాలపై మోశా. కొందరికి నెలవారీ జీతాలు ఇవ్వమని చంద్రబాబు చెబితే డబ్బులు ఖర్చు పెట్టా. తొమ్మిదేళ్లుగా పార్టీలో ఉంటే నేను చేసిన తప్పేమిటో కనీసం చెప్పాలి కదా?’ అని ఎంపీ కేశినేని పేర్కొన్నారు.
బొండా భార్యను నిలబెడితే ప్రమాదం..
‘విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల్లో బొండా ఉమ భార్యను నిలబెడితే చాలా ప్రమాదం. నీ కుమార్తెను పోటీ చేయించు అని చంద్రబాబు నాతో అన్నారు. విజయవాడ మేయర్ అభ్యర్థిగా శ్వేతను చంద్రబాబే నిర్ణయించారు. ఆయన మూడు రోజులు అడిగితేనే ముందుకొచ్చాం. టీడీపీ కోసం సమయం, డబ్బు వృథా చేసుకోవద్దని చాలా మంది హితవు చెప్పినా వినకుండా పార్టీలో కొనసాగా’ అని కేశినేని ఆవేదన వ్యక్తం చేశారు.
సీఎం కార్యక్రమాలకు హాజరు కానివ్వలేదు
‘చంద్రబాబు పచ్చి మోసగాడని ప్రపంచానికి తెలుసు. ఇంత దగా చేస్తాడనుకోలేదు. ప్రోటోకాల్ ప్రకారం ఎంపీగా ముఖ్యమంత్రి కార్యక్రమాలకు నేను హాజరు కావాలి. కానీ సీఎం కార్యక్రమాలకు చంద్రబాబు నన్ను హాజరు కానివ్వలేదు. చంద్రబాబు ఏపీకి పనికి రాని వ్యక్తి. టీడీపీకి, ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని ఇప్పటికే ప్రకటించా. నా రాజీనామా ఆమోదం పొందగానే వైఎస్సార్‌సీపీలో చేరుతా’ అని ఎంపీ కేశినేని చెప్పారు.
బెజవాడ, గుంటూరు నిజం.. అమరావతి ఓ కల
‘నాకు విజయవాడ అంటే ప్రాణం. విజయవాడ కోసం చంద్రబాబు రూ.100 కోట్లైనా ఇచ్చాడా? కానీ విజయవాడ కోసం నేను ఎంతో చేశా. షాజహాన్ తాజ్‌మహల్ కడితే నేను అమరావతి కడతానంటూ చంద్రబాబు గొప్పలు చెప్పారు. విజయవాడ, గుంటూరు మాత్రమే నిజం.. అమరావతి ఒక కలే. అది భ్రమరావతి. అక్కడంతా రియల్ ఎస్టేట్’ అని కేశినేని నాని పేర్కొన్నారు.
లోకేశ్.. ఆఫ్ట్రాల్
‘టీడీపీ కోసం నేను అమ్ముకున్న ఆస్తుల విలువ రూ.2 వేల కోట్లు ఉంటుంది. చివరకు నా కుటుంబంలో చిచ్చు పెట్టారు. నా కుటుంబ సభ్యులతో, రౌడీలతో కొట్టించాలని లోకేశ్ ఎందుకు ప్రయత్నించారు? లోకేశ్ అనే వ్యక్తి ఆ్రఫ్టాల్..! చంద్రబాబు కుమారుడిగా మినహాయిస్తే ఆయనకు ఎలాంటి అర్హతా లేదు. అతడికి పార్టీ అన్నీ ఇచ్చినా ఓడిపోయాడు. నేను నా సొంత వనరులతో గెలిచా. అలాంటిది అతడి వద్ద మోకరిల్లాలంటే సాధ్యం కాదు’ అని కేశినేని స్పష్టం చేశారు.
కేశినేని బాటలో క్యాడర్
సాక్షి ప్రతినిధి, విజయవాడ: ఎంపీ కేశినేని నాని టీడీపీని వీడటంతో నగర పరిధిలో పార్టీ క్యాడర్ ఆయన వెంట నడిచేందుకు సిద్ధమైంది. విజయవాడ ఈస్ట్, వెస్ట్, సెంట్రల్ మూడు నియోజకవర్గాల్లోనూ కేశినేని నానికి బలమైన క్యాడర్ ఉంది. నానికి మద్దతుగా వారంతా వైఎస్సార్‌సీపీలో చేరనున్నారు. టీడీపీ నేతలు బొండా ఉమా, బుద్దా వెంకన్న, నాగుల్‌మీరా తదితరులపై తీవ్ర అవినీతి ఆరోపణలున్నాయి. ఈస్ట్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహనరావు క్యాడర్‌ను పట్టించుకోరన్నది బహిరంగ రహస్యమే! లోకేశ్ వ్యవహార శైలితో పార్టీకి భవిష్యత్ లేకుండా పోయిందని కార్యకర్తలు వాపోతున్నారు. మరోవైపు ఎంపీ కేశినేని నాని బుధవారం క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ను కలసిన సందర్భంగా పలువురు వైఎస్సార్ సీపీ కీలక నేతలంతా అక్కడే ఉండటం ఇకపై వారంతా సమన్వయంతో పని చేస్తారనే సానుకూల సంకేతాలను పంపింది.
గ్రామీణ ప్రాంతాల్లో పట్టు
ఎంపీ కేశినేని నానికి ఎన్టీఆర్ జిల్లా మైలవరం నుంచి జగ్గయ్యపేట, తిరువూరు వరకు బలమైన అనుచర గణం ఉంది. ప్రధానంగా వారంతా దేవినేని ఉమా బాధితులే కావడం గమనార్హం. గ్రామాల్లో కేశినేని సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. ఓ మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ స్థాయి నేతలతోపాటు ద్వితీయ శ్రేణి నాయకులు వైఎస్సార్ సీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. మైలవరంలో ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్, నందిగామలో ఎమ్మెల్యే మొండితోక జగన్‌మోహనరావు తదితరులకు కేశినేని నానితో మొదటి నుంచి సత్సంబంధాలున్నాయి.
నియోజకవర్గ అభివృద్ధి కోసం రాజకీయాలకు అతీతంగా వారు కలసి పని చేయడాన్ని అన్ని వర్గాలు ప్రశంసించాయి. తాజా పరిణామాలు తిరువూరు, జగ్గయ్యపేట నియోజకవర్గాల్లో వైఎస్సార్ సీపీని మరింత బలోపేతం చేయనున్నాయి. కాగా, చంద్రబాబు పచ్చి మోసగాడని, ఈ రాష్ట్రానికి పనికి రాని వ్యక్తి అని ఎంపీ కేశినేని నాని తాజాగా చేసిన వ్యాఖ్యలు టీడీపీలో కలకలం రేపుతున్నాయి. బాబు మోసాలను బహిర్గతం చేస్తూ కేశినేని మాట్లాడిన మాటలు పార్టీలో చర్చనీయాంశంగా మారాయి. కేశినేని పార్టీని వీడటం ఎన్టీఆర్ జిల్లాలో టీడీపీకి గట్టి షాక్ తగిలినట్లేనని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment