మేయర్ భాగ్యలక్ష్మికి రాజీనామా పత్రం అందిస్తున్న కార్పొరేటర్ కేశినేని శ్వేత
సాక్షి ప్రతినిధి, విజయవాడ/పటమట (విజయవాడ తూర్పు): టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్ చేస్తున్న నీచ రాజకీయాలకు ఎన్టీఆర్ జిల్లాలో ఆ పార్టీలో పెద్ద ముసలమే పుట్టింది. ముఖ్యంగా లోకేశ్ కొట్టిన దెబ్బకు జిల్లాలో ఆ పార్టీ కకావికలవుతోంది. బాబు, లోకేశ్ చర్యలకు విసిగిపోయి పార్టీకి ఎంపీ కేశినేని శ్రీనివాస్ (నాని) గుడ్‌బై చెప్పడంతో జిల్లాలో పార్టీ నేతలు అధిక సంఖ్యలో రాజీనామాలకు సిద్ధమవుతున్నారు. ఇకపై పార్టీలో పని చేయలేమని తెగేసి చెబుతున్నారు. టీడీపీకి చెందిన విజయవాడ 11వ డివిజన్ కార్పొరేటర్, నాని కుమార్తె కేశినేని శ్వేత సోమవారం తన పదవికి రాజీనామా చేశారు.
ఈ అంశం బెజవాడ టీడీపీలో మరింత కలకలం రేపింది. రాజీనామా ఆమోదం పొందిన వెంటనే పార్టీకి రాజీనామా చేస్తామని శ్వేత వెల్లడించారు. కేశినేని నాని పార్టీకి రాజీనామా చేశాక కార్యకర్తలతో మాట్లాడి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తారన్నారు. గౌరవం లేని పార్టీలో ఇమడలేకే రాజీనామా చేస్తున్నామని ఆమె చేసిన వ్యాఖ్యలు టీడీపీలో అలజడి రేపుతున్నాయి. ఏడాదిన్నరగా పార్టీలో తీవ్ర అవమానాలకు గురయ్యామని ఆమె ఆవేదన వ్యక్తం చేయడం పార్టీలో చర్చకు దారితీసింది. కేశినేని వర్గీయులు మరికొంత మంది కూడా రాజీనామాలకు సిద్ధమవుతున్నారు.
ప్రధాన అనుచరులుగా ఉన్న తిరువూరు మాజీ ఎమ్మెల్యే స్వామిదాసు, మైలవరం నియోజకవర్గానికి చెందిన బొమ్మసాని సుబ్బారావు, విజయవాడ వెస్ట్ నియోజకవర్గానికి చెందిన బేగ్ వంటి వారు కేశినేని వెంటే ఉన్నారు. కేశినేని నాని మూడోసారి కూడా విజయవాడ నుంచే లోక్‌సభకు పోటీ చేస్తారని, విజయం సాధిస్తారని శ్వేత ప్రకటించారు. తన బాబాయ్ కేశినేని చిన్ని గురించి మాట్లాడి తమ స్థాయిని తగ్గించుకోలేమని అన్నారు. అవినీతిపరులను పార్టీ ప్రోత్సహిస్తోందని విమర్శించారు.
ఇది లోకేశ్ అజ్ఞానమే
తిరువూరు సభకు, కేశినేని నానికి సంబంధం ఏమిటన్న లోకేశ్ వ్యాఖ్యలపై పలువురు టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాని ప్రాతినిధ్యం వహిస్తున్న లోక్‌సభ నియోజకవర్గంలో భాగమైన తిరువూరులో జరుగుతున్న పార్టీ సభతో సంబంధం లేదని అనడం లోకేశ్æ అజ్ఞానమేనని వ్యాఖ్యానిస్తున్నారు. ‘మా నాన్న నియోజకవర్గంలో సభ జరుగుతుంటే ఎంపీగా ఆయనకు సంబంధం ఉండదా’ అని కేశినేని శ్వేత గట్టిగానే ప్రశ్నించారు. లోకేశ్ అజ్ఞానం వల్లే పార్టీలో విభేదాలు తలెత్తుతున్నాయని, సీనియర్ నేతలను ఆయన అవమానిస్తున్నారని విమర్శిస్తున్నారు.
లోకేశ్ గుట్లు తెలిసిన కేశినేని నాని వ్యతిరేక వర్గం ఆయన్ని బ్లాక్ మెయిల్ చేసి, అధిపత్యం చలాయిస్తోందని చెబుతున్నారు. కేశినేని చిన్ని, నాని వ్యతిరేక వర్గంలోని ముగ్గురు టీడీపీ నేతలు చెప్పినట్లే ప్రస్తుతం పార్టీలో నడుస్తోందని వ్యాఖ్యానిస్తున్నారు. ముగ్గురు బ్లాక్ మెయిలర్ల చెప్పు చేతల్లోకి లోకేశ్, పార్టీ వెళ్లిపోయారంటూ కేశినేని శ్వేత అన్నారు. జిల్లాలో టీడీపీ అధినేత కార్యక్రమాలేవీ నానికి చెప్పడంలేదని తెలిపారు. ఎన్నో అవమానాలు భరించి పార్టీలో ఉన్నామన్నారు. మీరు పార్టీలో వద్దు పొమ్మన్నాక కూడ ఉండలేం కదా అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అండగా ఉన్నామని, ఆస్తులు అమ్ముకున్నామని, వ్యాపారాలు నిలిపివేసి, త్యాగం చేస్తే, చివరికి చంద్రబాబు తమను వంచించారని కేశినేని నాని రగిలిపోతున్నారు. పిలిచి మాట్లాడకుండా, దూతలను పంపి పార్టీ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని చెప్పడాన్ని తీవ్ర అవమానంగా భావిస్తున్నారు. చుట్టుపక్కల రాజమండ్రి, ఏలూరు, గుంటూరు, బాపట్ల ఎంపీ స్థానాలకు టీడీపీ అభ్యర్ధులే కరువైన తరుణంలో ప్రజల్లో పట్టున్న విజయవాడ సిట్టింగ్ ఎంపీకి టికెట్ లేదని చెప్పటాన్ని ఆ పార్టీ నాయకులే జీర్ణించుకోలేక పోతున్నారు.
మేయర్ ఫార్మాట్‌లో కార్పొరేటర్ శ్వేత రాజీనామా
ఎంపీ కేశినేని నాని కుమార్తె, విజయవాడ 11వ డివిజన్ కార్పొరేటర్ కేశినేని శ్వేత సోమవారం తన అనుచరులతో కలిసి వీఎంసీ ప్రధాన కార్యాలయంలో మేయర్ రాయన భాగ్యలక్ష్మిని కలిసి రాజీనామాను సమర్పించారు. మేయర్ ఫార్మాట్‌లో ఆమె రాజీనామా లేఖ సమర్పించారు. ఈ సందర్భంగా శ్వేత మాట్లాడుతూ.. తమకు టీడీపీలో గౌరవం లేదని, అందుకే రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. రాజీనామా ఆమోదం పొందాక టీడీపీకి రాజీనామా చేస్తానని తెలిపారు.
నాని, తాను ప్రజల తరపున పోరాటం చేస్తామని చెప్పారు. మున్సిపల్ ఎన్నికల్లో నగరంలోని మూడు నియోజకవర్గాల నాయకులు తమను ఇబ్బంది పెట్టారని చెప్పారు. ఇప్పుడు టీడీపీకి విజయవాడ, మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గాల్లో అభ్యర్థులే లేరని అన్నారు. టీడీపీ నుంచి తమతో వచ్చేవాళ్ళకి కచ్చితంగా అండగా ఉంటామని పేర్కొన్నారు. అంతకు ముందు ఆమె విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ను కలిసి తన రాజీనామా నిర్ణయాన్ని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment