Krishna Elections
-
చంద్రబాబుకు సొంత పార్టీలో తలనొప్పులు
ఏ పార్టీ కనిపిస్తే ఆ పార్టీతో పొత్తుకు సిద్ధమవుతున్న టీడీపీ అధినేత చంద్రబాబుకు సొంత పార్టీలో తలనొప్పులు ఎక్కువవుతున్నాయి. గెలిచేది లేకపోయినా..టిక్కెట్ కోసం మాత్రం పోటీ ఎక్కువవుతోంది. ఈ మధ్యలో జనసేన నేతలు సీన్లోకి ఎంటరై పొత్తులో భాగంగా ఈ సీటు మాదే అంటున్నారు. ఇప్పుడు బెజవాడ వెస్ట్ నియోజకవర్గంలో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఏం చేయాలో తెలియక చంద్రబాబు తల పట్టుకుంటున్నారని టాక్. ఆఖరు నిమిషం వరకు టిక్కెట్ల విషయం తేల్చే అలవాటు చంద్రబాబుకు లేదని అందరికీ తెలుసు. అందుకే బెజవాడ వెస్ట్ తమ్ముళ్ళు చివరి వరకు మేము ఆగలేమని..వెంటనే తేల్చాలని పార్టీ అధినేతను డిమాండ్ చేస్తున్నారని సమాచారం. టీడీపీ ఆవిర్భవించాక 1983లో ఒకే ఒక్కసారి ఇక్కడ పచ్చ జెండా ఎగిరింది. ఈ నలభై ఏళ్ళ కాలంలో మళ్ళీ అక్కడ టీడీపీ జెండా ఎగిరింది లేదు. కాని ఈసారి ఎలాగైనా గెలవాల్సిందే అని చంద్రబాబు అక్కడి నేతలకు హుకుం జారీ చేశారట. ఇప్పుడు బుద్ధా వెంకన్న, జలీల్‌ఖాన్‌లు టిక్కెట్ కోసం పట్టుబడుతున్నారు. తమ మనసులో మాట అప్పుడప్పుడు అధిష్టానానికి వినిపించే ప్రయత్నం చేసిన బుద్ధా వెంకన్న , జలీల్ ఖాన్ ఇప్పుడు టిక్కెట్ కోసం నేరుగా పంచాయతీ పెట్టేస్తున్నారట. తాజాగా బుద్ధా వెంకన్న వెస్ట్ నియోజకవర్గంలో తనకు ఉన్న బలం చంద్రబాబుకు తెలియచేసేందుకు ఓ ర్యాలీ నిర్వహించారు. పశ్చిమ టీడీపీ టిక్కెట్ కోసం తాను పెట్టుకున్న అప్లికేషన్ ను ర్యాలీగా వెళ్లి బెజవాడ దుర్గమ్మ సన్నిధిలో ఉంచి మరీ పూజలు చేయించాడట. తెలుగుదేశం పార్టీ, అధినేత చంద్రబాబు, ఆయన కుటుంబంపై ఈగ వాలకుండా చూసుకుంటున్న తనకే టిక్కెట్ అడిగే హక్కు ఉందని బుద్ధా వెంకన్న అంటున్నారు. తనకే టిక్కెట్ ఇచ్చి తీరాలంటూ పబ్లిక్‌గానే తన డిమాండ్ ను చంద్రబాబు ముందు ఉంచారట. ఒకవేళ పొత్తులో భాగంగా వెస్ట్ టిక్కెట్ ఇవ్వడానికి కుదరకపోతే అనకాపల్లి ఎంపీ టిక్కెట్ ఇవ్వాలని తన డిమాండ్ల చిట్టాను చంద్రబాబుకు వినిపించారట. గతంలో ఒకసారి తనకు టిక్కెట్టివ్వకపోతే ఎక్కడ స్విచ్ వేస్తే.. ఎక్కడ బల్బు వెలుగుతుందో తనకు తెలుసని బెదిరించిన బుద్ధా తాజాగా చేసిన వ్యాఖ్యలు బెజవాడ టీడీపీలో రచ్చకు దారి తీసాయి. ఇదిలా ఉంటే నాకేం తక్కువ అంటూ మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ టిక్కెట్ రేస్ లోకి దూసుకొచ్చారు. బుద్ధా వెంకన్న ర్యాలీ నిర్వహించాడని తెలియగానే... నేనే లోకల్...నాకే టిక్కెట్టివ్వాలంటూ జలీల్ ఖాన్ పార్టీ నాయకత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఎవడు పడితే వాడు టిక్కెట్ అంటే కుదరదు...టీడీపీ కూడా పశ్చిమ టిక్కెట్ ను మైనార్టీలకు కేటాయించాలి...ఆ టిక్కెట్ తనకే ఇవ్వాలి అని చంద్రబాబును నిలదీస్తున్నారట. తనకు బెజవాడ వెస్ట్ టిక్కెట్ ఇవ్వకపోతే ఉరేసుకుంటానని జలీల్‌ఖాన్ బెదిరిస్తున్నారట. టీడీపీ నాయకత్వాన్ని డిమాండ్ చేయడంతో పాటుగా.. పవన్ కళ్యాణ్‌ను కూడా అర్థిస్తున్నారట. వెస్ట్ టిక్కెట్ కోసం జనసేన పట్టుపట్టవద్దని తనకే మద్దతుగా నిలవాలని పవన్‌ను ప్రత్యేకంగా కలిసి విజ్ఞప్తి చేశారట. తనకు టిక్కెట్ ఇవ్వకపోతే పరిణామాలు వేరేలా ఉంటాయని చంద్రబాబును జలీల్‌ఖాన్ వార్నింగ్ ఇస్తున్నాడట. ఇలా ఓ వైపు బుద్ధా వెంకన్న...మరోవైపు జలీల్ ఖాన్ టిక్కెట్ కోసం కుస్తీ పడుతుంటే..పశ్చిమ నియోజకవర్గం జనసేన శ్రేణుల్లో కలవరం మొదలైందని టాక్. పొత్తులో భాగంగా పశ్చిమ టిక్కెట్ జనసేనకు వస్తుందని నియోజకవర్గ జనసేన సమన్వయకర్త పోతిన మహేష్ గంపెడాశతో ఉన్నారు. ఇప్పుడు తెలుగు తమ్ముళ్లు టిక్కెట్ కోసం కొట్లాడుకోవడంతో తనకు దక్కకుండా పోతుందనే ఆందోళన పోతిన మహేష్‌కు పెరిగిపోతోందట. అందరితోనూ పొత్తులు పెట్టుకుంటూ సంతోషపడుతున్న చంద్రబాబుకు టిక్కెట్ల విషయంలో సొంత పార్టీ నేతలతోనే తలనొప్పులు ఎదురవ్వడంతో దిక్కు తోచడంలేదని చెబుతున్నారు. మరి బెజవాడ వెస్ట్‌లో ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి. -
పవన్‌ను నిలదీసేందుకు సిద్ధం!
ఎన్టీఆర్, సాక్షి: పొత్తు సంగతి ఏమోగానీ జనసేన నేతల్లో టెన్షన్ పెరిగిపోతోంది. ఒకవైపు టీడీపీ అధినేత చంద్రబాబు సీట్ల పంపకంపై ఎటూ తేల్చకుండానే.. ఏకపక్షంగా అభ్యర్థుల్ని ప్రకటించుకుంటూ పోతున్నారు. మరోవైపు జనసేనాని తన పోటీ విషయంలోనే కాదు.. సీట్ల విషయంలోనూ స్పష్టత లేకుండా పోయారు. ఈ పరిణామాల నడుమ.. ఈ దఫా అసెంబ్లీ ఎన్నికల్లో పట్టుమని పదిహేను స్థానాల్లో కూడా పోటీ చేస్తామో? లేదో? అనే ఆందోళనలో ఉన్నారు. పదేళ్లుగా పార్టీ కోసం కష్టపడ్డందుకు ఫలితం ఇదేనా అని పవన్‌ను నిలదీసేందుకు ‘సిద్ధం’ అవుతున్నారు. పొత్తు రాజకీయాల్లో మునుపెన్నడూ లేని చిత్రమైన పరిణామాలకు ఏపీ కేంద్రంగా మారింది. ఒక పార్టీ అధినేత అయ్యి ఉండి కూడా పోటీ విషయంలో పవన్ ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. పొత్తు ధర్మం పాటించలేదని బాబుపై అసంతృప్తి మాత్రమే వ్యక్తం చేస్తూ.. ఆ జట్టును వీడేది లేదంటూ పాత పాటే పాడుతున్నారు. అదే సమయంలో టీడీపీ నేతలకు పవన్ అపాయింట్మెంట్ ఇస్తుండడం.. తమ టికెట్లకు ఎసరు పెట్టొద్దన్న వాళ్ల(మాగంటి బాబు, వేదవ్యాస్, జలీల్ఖాన్లాంటి వాళ్లు) విజ్ఞప్తులను పరిశీలిస్తానని చెప్తుండడంపై జనసేన నేతలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో తమ పోటీకి అనుకూలంగా మొదటి నుంచి భావిస్తున్న సీటు.. విజయవాడ వెస్ట్. అయితే దాని కోసం టీడీపీ నేతలు తన్నుకున్నంత పని చేస్తుండడం.. ఆ పరిణామాలపై చంద్రబాబు మౌనంగా ఉండడం.. వెరసి ఆ సీటు వదులుకోవాల్సి వస్తుందేమో అనే ఆందోళనలో ఉన్నారు. విజయవాడ వెస్ట్‌కు తెలుగు దేశంలో మామూలు పోటీ లేదు. ఒకవైపు బుద్ధా వెంకన్న ఆ సీటును చంద్రబాబు తనకే ఇస్తారని ఆశతో ఉన్నారు. దుర్గగుడిలో ప్రత్యేక పూజలు బైక్ ర్యాలీతో బలప్రదర్శన నిర్వహించుకున్నారు. అదే సమయంలో మైనారిటీ వర్గాలకే ఆ టికెట్ కేటాయించాలంటూ జలీల్‌ఖాన్ తెరపైకి వచ్చారు. తమ సామాజిక వర్గం తరఫున తనకే టికెట్ దక్కుతుందని ధీమా ప్రకటించారు. బుద్దాకు కౌంటర్‌గా ఇవాళ(శుక్రవారం) వన్‌టౌన్‌లో బలప్రదర్శన పేరిట ర్యాలీ నిర్వహించారు. ఇక ర్యాలీల పర్వం చూస్తున్న జనసేనలో టెన్షన్ పెరిగిపోతోంది. విజయవాడ వెస్ట్ నుంచి పోతిన వెంకట మహేష్ టికెట్ ఆశిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే చాలాకాలం నుంచి బరిలో తానే నిలవబోయేదని ఇంటర్వ్యూలు ఇస్తూ వస్తున్నారు. అయితే తాజా పరిణామాలు ఆయనకు మింగుడుపడడం లేదు. ఈ విషయంపై పవన్‌ను కలిసి చర్చించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. పోటీ యాత్రలు.. మరోవైపు.. ఇలాగే చూస్తూ ఊరుకుంటే.. విజయవాడ వెస్ట్‌లోనే కాదు ఇంకా చాలా నియోజకవర్గాల్లో ఇలాంటి పరిస్థితులే ఎదురు కావొచ్చని జనసేన నేతలు ఒక అంచనాకి వచ్చారు. జనసేనకు కాస్తో కూస్తో బలం, పేరు ఉన్న చోట్ల కూడా టీడీపీ నేతలు పాదయాత్రలు, బలనిరూపణలు చేసుకుంటూ కొట్లాడుకుంటున్నారు. ఈ క్రమంలో పోటీ యాత్రలకు సిద్దం అవుతున్నారు. ఇప్పటికే పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలంలో జనసేన బొర్రా వెంకట అప్పారావు మహా పాదయాత్రకు సిద్ధం కాగా, గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో బలం చూపించుకోవాలని జనసేన తాపత్రయపడుతోంది. ఎన్నికలకు సమయం సమీపిస్తుండడంతో ఇకనైనా ఈ అంశంపై సీరియస్‌గా దృష్టి సారించాలని.. చంద్రబాబుతో తాడోపేడో తేల్చుకోవాలని.. టీడీపీ నేతల దూకుడుకు కళ్లెం వేయించే దిశగా పవన్‌పై ఒత్తిడి పెంచేందుకు జనసేన నేతలు ‘సిద్ధం’ అవుతున్నారు. -
టీడీపీలో సీట్ల కోసం ఫీట్లు
సాక్షి ప్రతినిధి, విజయవాడ: సార్వత్రిక ఎన్నికల్లో సీట్ల కోసం టీడీపీ నేతలు నానాపాట్లు పడుతున్నారు. ఆ పార్టీ ఉనికి కోసం నేతలు ఫీట్లు చేస్తున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఎంపీ, ఎమ్మెల్యే టికెట్ల కోసం ఆ పార్టీ నేతలు కొందరు పూజలు చేస్తుంటే, మరికొందరు వివాదాస్పద వ్యాఖ్యలతో చర్చనీయాంశమవుతున్నారు. టీడీపీతో పొత్తులో ఉన్న జనసేన నేతలు కూడా టికెట్ తమకేనంటూ నియోజకవర్గంలో తిరుగుతున్నారు. ప్రతి ఒక్కరూ టికెట్ కోసం పాట్లు పడుతున్నారు. పశ్చిమలో మూడు ముక్కలాట ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పశ్చిమ నియోజక వర్గంలో సీటు కోసం టీడీపీలో మూడు ముక్కలాట నడుస్తోంది. ఆ పార్టీ ఆవిర్భావ సమయంలో తప్ప ఈ నియోజక వర్గంలో టీడీపీ గెలిచిన దాఖలాలు లేవు. నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ బలంగా ఉంది. పార్టీ ఆవిర్భావం నుంచి వైఎస్సార్ సీపీ అభ్యర్థులే విజయబావుటా ఎగరేస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలుచేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు నియోజక వర్గ ప్రజల్లో విశేష ఆదరణ పొందాయి. దీంతో పార్టీ నేతలు జోష్‌లో ఉన్నారు. భారీ మెజార్టీతో గెలుపే లక్ష్యంగా వైఎస్సార్ సీపీ ‘పశ్చిమ’ ఇన్చార్జి ఆసిఫ్, స్థానిక నేతలను కలుపుకొని ప్రభుత్వ, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ దూసుకుపోతున్నారు. టీడీపీలో ఎవరి గోల వారిదే.. పశ్చిమ నియోజక వర్గంలో పార్టీకి బలం లేదని తెలిసినా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, లోకేష్ వద్ద మెప్పు కోసం ఇక్కడ టీడీపీ నాయకులు హడావుడి చేస్తున్నారు. ఎటూ సీటురాదు, వచ్చినా గెలిచే అవకాశం లేదని స్పష్టంగా తెలిసినా పేపరు పులిగా పేరొందిన బుద్దా వెంకన్న తమకు సీటు కేటాయించాలని ర్యాలీ చేసి హడావుడి చేస్తున్నారు. ఇటీవల కొంత మంది ముస్లిం నేతలు, తమ సామాజిక వర్గానికే సీటు కేటాయించాలని హంగామా చేస్తున్నారు. విజయవాడ టికెట్ తనదేనని టీడీపీ నేత జలీల్‌ఖాన్ ప్రకటించుకున్నారు. ‘అందరు టికెట్టు అడుగుతారుకానీ గెలిచే స్థోమత ఉండాలి. మంచి విలువలు ఉండాలి. నాకు సీటు ఇవ్వకపోతే ముస్లిం మైనార్టీలు ఉరి వేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు.’ అని జలీల్‌ఖాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమైంది. మరో ముస్లిం మైనార్టీ నేత ఎంఎస్ బేగ్ తనదే టికెట్ అని ప్రచారం చేసుకుంటున్నారు. మరోవైపు జనసేన నేత పోతిన మహేష్ పొత్తులో భాగంగా తమకే టికెట్ కేటాయిస్తారని ధీమాగా నియోజక వర్గంలో తిరుగుతున్నారు. పశ్చిమలో టీడీపీ, జనసేనలో ఎవరికివారే తమదే సీటు అని చెప్పుకొని నాయకులు తిరుగుతుంటే, అరకొరగా ఉన్న పార్టీ నేతలు, క్యాడర్ అయోమయానికి గురవుతున్నారు. సీనియర్ నేతలు కూడా.. టీడీపీలో సీనియర్ నేతలమంటూ గొప్పలు చెప్పుకొనే కొంత మంది, తమ నియోజక వర్గంలో వ్యక్తమవుతున్న తీవ్ర అసంతృప్తికి తోడు, పట్టుకోల్పోయి, టికెట్ మీద ఆశలు సన్నగిల్లి పూజలు చేస్తున్నారు. మాజీ మంత్రి దేవినేని ఉమా ఇటీవల కృష్ణా తీరంలో చేసిన పూజలే నిదర్శనం. ఇది టీడీపీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పూజలపై రకరకాల ఊహాగానాలు వినిపించాయి. పేరుకు మాత్రం చంద్రబాబును సీఎం చేయడానికి పూజలు చేస్తున్నామని కలరింగ్ ఇస్తున్నా నియోజకవర్గంలో తమకు సీటుతోపాటు, గెలుస్తామనే నమ్మకం లేకనే, పూజలు చేసుకుంటూ కాలం వెళ్లబుచ్చుతున్నారనే విమర్శలు ఉన్నాయి. మచిలీపట్నంలో.. కృష్ణా జిల్లాలోని మచిలీపట్నంలో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర పూజలు చేయడం దానికి దేవినేని ఉమా సైతం హాజరయ్యారు. ఇటీవల విజయవాడ గురునానక్ కాలనీ సమీపంలో మూడు రోజులపాటు టీడీపీ నేత కేశినేని చిన్ని సైతం యాగం చేశారు. ప్రజల్లో విశ్వాసం కోల్పోయిన వీరు, చివరి ప్రయత్నంగా పలు కార్యక్రమాలు చేస్తూ గట్టెక్కాలని తాపత్రయ పడుతున్నారు. పార్టీ శ్రేణులను సమాయత్తం చేసి, నియోజక వర్గంలో తిరుగుతూ కార్యకర్తల్లో ధైర్యం నింపకుండా కాల హరణం చేస్తున్నారని టీడీపీలో కొందరు నేతలు విమర్శిస్తున్నారు. -
టీడీపీలో వెస్ట్ ఫైట్: నోరు జారిన జలీల్ ఖాన్!
ఎన్టీఆర్, సాక్షి: విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ టికెట్ వార్ ముదురుతోంది. టికెట్ కోసం సీనియర్ నేత బుద్దా వెంకన్న ప్రయత్నాలు చేస్తుండగా.. మరోవైపు మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ తెరపైకి వచ్చారు. టికెట్ ఇవ్వకపోతే తీవ్ర పరిణామాలే తప్పవంటూ హెచ్చరించే క్రమంలో నోరు జారారాయన. విజయవాడ వెస్ట్‌లో టీడీపీ టికెట్ కోసం బుద్దా వెంకన్న, జలీల్ ఖాన్ పోటీ పడుతున్నారు. ఈ క్రమంలో వార్ ముదురుతోంది. మైనారిటీలకు టికెట్‌ఇవ్వకపోతే ఉరి వేసుకుంటారో.. ఏం చేసుకుంటారో తెలియదంటూ జలీల్ ఖాన్ వ్యాఖ్యానించారు. అయితే అంతకు ముందు ఆయన నోరు జారారు. టికెట్ ఇవ్వకపోతే తానే ఉరేసుకుంటానని జలీల్ ఖాన్ అన్నారు. ఆ వెంటనే సవరించుకుని.. మైనారిటీలకు గనుక టికెట్ దక్కకపోతే ఉరి వేసుకుంటారో.. ఏం చేసుకుంటారో తెలియదంటూ వ్యాఖ్యానించారు. ఇప్పటికే ఇద్దరు ముగ్గురు ఉరేసుకునేందుకు ప్రయత్నించగా.. తాను వారించి ఆపానని ఆయన చెప్పుకొచ్చారు. అంతేకాదు సర్వేలన్నీ తనకు అనుకూలంగా ఉన్నాయని.. చంద్రబాబు ఈ స్థానం నుంచి మైనారిటీలకే టికెట్ ఇస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారాయన. ఆపై ఓ అడుగు ముందుకేసి వెస్ట్ టికెట్ తనదేనని.. ఎన్నికల బరిలో నిలబడతానంటూ జలీల్ ఖాన్ వ్యాఖ్యానించారు. అలాగే ఈ విషయంపైనే పవన్ కల్యాన్‌ను కలిసి పరిస్థితి వివరించానని.. పొత్తులో భాగంగా ఈ సీటును వదిలేసుకోవాలని జనసేనను కోరారని చెప్పుకొచ్చారు. ఇక.. చంద్రబాబుకు దరఖాస్తు సమర్పిస్తానంటూ గురువారం బుద్దా వెంకన్న విజయవాడలో గురువారం ర్యాలీ నిర్వహించారు. దుర్గ గుడికి వెళ్లి విజయవాడ వెస్ట్ టికెట్ తనకే దక్కాలంటూ పూజలు చేసినట్లు చెప్పారు. విజయవాడ వెస్ట్ టికెట్ గనుక ఇవ్వడం కుదరకుంటే.. అనకాపల్లి ఎంపీ సీటు అయినా ఇవ్వాలని టీడీపీ అధినేత చంద్రబాబుని కోరే ఆలోచనలో బుద్దా వెంకన్న ఉన్నట్లు తెలుస్తోంది. ఒక పొత్తులో భాగంగా ఆ స్థానాన్ని తమకే కేటాయించాలని కోరేందుకు జనసేన సైతం సిద్ధమవుతోంది. ఈ క్రమంలో బుద్దా వెంకన్న ర్యాలీ పరిణామాలను ఆ పార్టీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎక్కడ ఏకపక్షంగా టీడీపీ తమ అభ్యర్థిని ప్రకటిస్తుందో అనే ఆందోళనతో పవన కల్యాణ్‌ను కలిసేందుకు సిద్దమవుతున్నారు. -
టికెట్టు నాదే.. తాట తీస్తా: బుద్దా వెంకన్న
విజయవాడ, సాక్షి: టీడీపీ సీనియర్ నేత బుద్ధా వెంకన్న తీరుపై మిత్రపక్షం జనసేన తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. విజయవాడ పశ్చిమలో జనసేన తరఫున అభ్యర్థిని నిలబెట్టాలని ఆ పార్టీ నేతలు బలంగా ప్రయత్నిస్తుండగా.. ఆ ప్రయత్నాలకు బుద్ధా వెంకన్న గండికొడుతూ వస్తున్నారు. ఈ క్రమంలో ఇవాళ బలప్రదర్శన పేరిట నిర్వహించిన హడావిడిపై జనసేన నేతలు మండిపడుతున్నారు. విజయవాడ వెస్ట్ టిక్కెట్ తనకే ఇవ్వాలంటూ గురువారం బుద్ధా వెంకన్న దుర్గగుడి వరకు ర్యాలీ చేపట్టారు. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడికి ఇవ్వబోయే దరఖాస్తును అమ్మవారి పాదాల వద్ద ఉంచి పూజలు చేశారు. తనకే బాబు టికెట్ ఇప్పించేలా అమ్మవారి ఆశీర్వదించారంటూ బయటకు వచ్చి హడావిడి చేశారు. ‘‘చంద్రబాబుకిచ్చే అప్లికేషన్ ముందుగా కనకదుర్గమ్మకు ఇచ్చా. విజయవాడ వెస్ట్ లేదా అనకాపల్లి ఎంపీగా నాకు అవకాశం ఇవ్వాలని అప్లికేషన్ ఇచ్చా. .. చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకున్నా శిరసావహిస్తా. అలాగని టిక్కెట్ రాలేదని ఎవరైనా చంద్రబాబుని విమర్శించినా తాట తీస్తా. నాకు టిక్కెట్ కేటాయించాలని చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఇద్దర్నీ కోరుతున్నా’’ అని అన్నారాయన. అయితే.. ఈ తతంగం అంతా చూస్తున్న జనసేన నేతలకు మండిపోతోంది. పశ్చిమ టిక్కెట్ తమకే కేటాయించాలంటూ జనసేన నేత పోతిన మహేష్ చాలాకాలంగా డిమాండ్ చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో.. ఇప్పుడు బుద్ధా చేసిన హడావిడిని జనసేన నేతలు తట్టుకోలేకపోతున్నారు. ఎక్కడ చంద్రబాబు ఏకపక్షంగా ఈ సీటును కూడా ప్రకటిస్తారేమోనని ఆందోళన చెందుతున్నారు. ఇలా పదే పదే పొత్తు ధర్మాన్ని ఉల్లంఘిస్తూ సీట్లు ప్రకటించుకోవడంపై పార్టీ అధినేత పవన్‌ను కలిసి నిలదీసే యోచనలో జనసేన నేతలు ఉన్నట్లు సమాచారం. -
అది కొల్లు రవీంద్ర దిగజారుడుతనం: పేర్ని నాని
సాక్షి, కృష్ణా: రాజకీయాల్లో టీడీపీ నేత కొల్లురవీంద్ర వంటి దిగజారుడు మనిషిని ఇంకొకరిని చూడలేదని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై బురదజల్లి ఎన్నికల్లో పబ్బం గడుపుకోవాలని కొల్లు రవీంద్ర చూస్తున్నారని, ఇది ఆయన దిగజారుడు తననానికి నిదర్శనమని నాని మండిపడ్డారు. ‘‘గుమ్మటాల చెరువులో డబ్బులు తీసుకుని ఇళ్లు అమ్మిందెవరు?. పేదల దగ్గర వేల రూపాయలు వసూలు చేసిందెవరు?. సంపత్ అనే మున్సిపల్ కమీషనర్‌ను బూతులు తిట్టి అవమానించి పంపిందెవరు? మీరు కాదా? అని కొల్లు రవీంద్రను పేర్ని నాని ప్రశ్నించారు. పేర్ని నాని ఎప్పుడూ తప్పుడు పనులు చేయలేదు.. చేయడు కూడా. రాజుపేట కరెంట్ సబ్ స్టేషన్ వెనుక పేదల పాకలు తొలగిస్తుంటే పోరాడిన వ్యక్తిని నేనే. పేదవాళ్లకు అండగా ఉండే వ్యక్తి పేర్నినాని అయితే.. తప్పుడు పనులు చేసే వ్యక్తి కొల్లు రవీంద్ర. ఎవరెన్ని కుయుక్తులు పన్నినా కుమ్మరిగూడెం ప్రజలకు తాను అండగా నిలబడతా అని పేర్ని నాని ప్రకటించారు. చాలా మంది టీడీపీ నేతలు, ప్రత్యర్ధులతో తాను రాజకీయాల్లో పోటీ పడి నెగ్గిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు. -
ఏసీబీ కోర్టులో నేడు స్కిల్ కేసు విచారణ
సాక్షి, విజయవాడ: టీడీపీ ప్రభుత్వ హయాంలో పెద్దఎత్తున ప్రజాధనాన్ని కొల్లగొట్టిన ‘స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్’ కుంభకోణం కేసులో నేడు ఏసీబీ కోర్డులో విచారణ కొనసాగనుంది. అప్రూవర్‌గా మారిన ఏసీఐ ఎండి చంద్రకాంత్ షా స్టేట్మెంట్ని అడ్డుకునేందుకు చంద్రబాబు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. షా పిటిషన్‌పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ స్కిల్ స్కామ్ లో ఏ-2 ముద్దాయి మాజీ లక్ష్మీ నారాయణ ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. లక్ష్మీనారాయణ పిటిషన్‌పై నేడు ఏసీబీ కోర్టులో విచారణ జరగనుంది. అప్రూవర్‌గా మారతానని ఏసీఐ ఎండి చంద్రకాంత్ షా ఇప్పటికే ఏసీబీ కోర్టులో పిటిషన్ వేశారు. కౌంటర్ పేరుతో చంద్రబాబు న్యాయవాదులు పలుమార్లు సమయం కోరారు. కేసులో కోర్టుకి సమర్పించిన డాక్యుమెంట్స్ చంద్రబాబు తరపున న్యాయవాదులు ఇవ్వాలని కోరారు. దీనిపై కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని చంద్రబాబు తరపున న్యాయవాదులకు కోర్టు ఆదేశించింది. అప్పటి వరకు శిరీష్ చంద్రకాంత్ షా స్టేట్ మెంట్ రికార్డును ఏసీబీ కోర్టు వాయిదా వేసింది. చంద్రబాబు తరపు న్యాయవాదుల అభ్యంతరాలపై ఈ నెల 22న ఏసీబీ కోర్టులో విచారణ జరిపగా, కౌంటర్ వేయడానికి సమయమివ్వాలని చంద్రబాబు న్యాయవాదులు కోరారు. అడ్డంగా దొరికిపోవడంతో చంద్రకాంత్ షా వాంగ్మూలం అడ్డుకునేందుకు చంద్రబాబు తరపు న్యాయవాదుల కుట్రలకు పాల్పడుతున్నారు. -
లోకేష్ ‘రెడ్ బుక్’ బెదిరింపులు.. నేడు ఏసీబీ కోర్టులో విచారణ
సాక్షి, విజయవాడ: నారా లోకేష్ రెడ్ బుక్ బెదిరింపుల కేసుపై నేడు ఏసీబీ కోర్టులో విచారణ జరగనుంది. యువగళం ముగింపు రోజు మీడియా ఛానెళ్లతో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నారా లోకేష్.. చంద్రబాబుపై తప్పుడు కేసులు బనాయించారని, రిమాండ్ విధించడం తప్పంటూ ఏసీబీ న్యాయస్ధానానికి దురుద్దేశాలు ఆపాదించారు. రెడ్ బుక్ పేరుతో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, యంత్రాంగాన్ని బెదిరిస్తూ భయోత్పాతానికి గురి చేశారు. వీడియోలతో సహా ఏసీబీ కోర్టులో గత నెలలో సీఐడీ పిటిషన్ వేసింది. ఏసీబీ కోర్టు ఆదేశాలతో నోటీసులు పంపినా లోకేష్ అందుకోలేదు. చివరగా ఏసీబీ కోర్టు నుంచే లోకేష్‌కి నోటీసులు అందాయి. స్వయంగా హాజరు లేదా న్యాయవాది ద్వారా విచారణకి రావాలని గత వారం కోర్టు ఆదేశించింది. ఈ నెల 22న జరిగిన విచారణలో లోకేష్ న్యాయవాదులు రెండు వారాల సమయం కోరారు. ఒక వారమే సమయమిచ్చిన న్యాయస్ధానం.. నేడు విచారణ జరపనుంది. కోర్టు ఆదేశాల్ని ధిక్కరించేలా లోకేష్ వ్యాఖ్యలు యువగళం ముగింపు సమయంలో లోకేష్ పలు ఇంటర్వ్యూల్లో పాల్గొన్నారు. ఈ క్రమంలో.. తన తండ్రి చంద్రబాబు నాయుడిపై సీఐడీ తప్పుడు కేసులు బనాయించిందని, రిమాండ్ విధించడం తప్పంటూ ఆరోపణలు చేశారు. ఈ వ్యాఖ్యలు దర్యాప్తు సంస్థను కించపరిచేలా ఉన్నాయని.. ఏసీబీ న్యాయమూర్తి ఆదేశాల్ని తప్పుబట్టేలా ఉన్నాయని.. అన్నింటికి మించి కోర్టు ఆదేశాల్ని ధిక్కరించేలా లోకేష్ వ్యాఖ్యలు ఉన్నాయంటూ మెమోలో సీఐడీ పేర్కొంది. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్, ఇన్నర్ రింగ్‌రోడ్ కుంభకోణం, ఫైబర్ నెట్ స్కామ్.. తదితర కేసులలో ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నిబంధనలు ఉల్లంఘించి అవినీతికి పాల్పడ్డారు. అయితే.. ఆ సమయంలో తమ అభ్యంతరాలని పట్టించుకోలేదని టీడీపీ హయాంలో పని చేసిన ఉన్నతాధికారులు ఇప్పటికే న్యాయమూర్తి ఎదుట 164 సీఆర్పీసీ కింద వాంగ్మూలం ఇచ్చారు. ఆ వాంగ్మూలాలను నారా లోకేష్ తప్పుబడుతూ వ్యాఖ్యలు చేశారు. ‘‘అసలు అధికారులు 164 సీఆర్పీసీ క్రింద వాంగ్మూలం ఎలా ఇస్తారు? వాళ్ల పేర్లు రెడ్ బుక్ లో పేర్లు రికార్డు చేశా. మా ప్రభుత్వం వస్తే వారి సంగతి తేలుస్తా’ అంటూ లోకేష్ హెచ్చరికలు జారీ చేశారు. ఇది సాక్ష్యులను బెదిరించి.. కేసు దర్యాప్తుని పక్కదారి పట్డించడమే అవుతుందని సీఐడీ ఏసీబీ కోర్టు పిటిషన్లో పేర్కొంది. అంతేకాదు.. గతంలో లోకేష్‌కి జారీ చేసిన 41ఏ నోటీసులలో పేర్కొన్న షరతులకీ విరుద్ధంగా ఆయన మాట్లాడారని పేర్కొంది. రెడ్ బుక్ బెదిరింపుల వ్యవహారంలో కేసులో.. నారా లోకేష్‌కు నోటీసులు జారీ చేయాలని కోర్టు ఆదేశించింది. అయితే సీఐడీ అధికారులు ఇచ్చిన నోటీసులను లోకేష్ తొలుత స్వీకరించలేదు. ఈ పరిణామంలో లోకేష్ తీరుపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రిజిస్టర్ పోస్టులో పంపాలని సీఐడీని ఆదేశించిన సంగతి తెలిసిందే. ఇదీ చదవండి: ఫిరాయింపు ఎమ్మెల్యేలకు చుక్కెదురు -
చంద్రబాబుకు మంత్రి జోగి రమేష్ సవాల్
సాక్షి, కృష్ణా జిల్లా: పెనమలూరులో నాపై పోటీ చేసే దమ్ముందా? అంటూ చంద్రబాబుకు సవాల్ విసిరారు మంత్రి జోగి రమేష్. కంకిపాడులో పెనమలూరు నియోజకవర్గ కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, చంద్రబాబు సర్వేలు కూడా చేయించుకున్నాడని, ఎవరు పోటీ చేసినా గెలిసేది తానేనన్నారు. ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా జగన్‌ను ఎదుర్కోలేరు. ప్రతిపక్షాలను కృష్ణా నదిలో కలిపేస్తామన్నారు. ‘‘ప్రజల గుండెల్లో జగన్ నిలిచిపోయారు. ఢిల్లీలో కాంగ్రెస్ పీఠాన్ని వణికించిన ధీరుడు సీఎం జగన్. ఆయనపై సోనియా, రాహుల్ కుట్రలు పన్నారు. చంద్రబాబు వెన్నుపోటు పొడుస్తాడు. కాంగ్రెస్ ముందుపోటు పొడుస్తుంది. వచ్చే ఎన్నికల్లో 175కు 175 స్థానాలు గెలుస్తాం. పెనమలూరు గడ్డ వైఎస్సార్సీపీ అడ్డా’’ అని మంత్రి పేర్కొన్నారు. ఇదీ చదవండి: షర్మిలకు ఏ అన్యాయం చేశామో.. ఆమె చెప్పాలి: సజ్జల -
పచ్చ ‘సేన’
సాక్షి, అమరావతి: పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించే అరకొర సీట్లకూ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఎసరు పెట్టారు! పచ్చ ముఖాలకే జనసేన ముసుగు వేసి ఆ పార్టీకి కేటాయించే సీట్లలో పోటీకి దించే ఎత్తుగడకు శ్రీకారం చుట్టారు. వారంతా పైకి మాత్రం జనసేనలో కొనసాగుతూ తాను చెప్పినట్లు నడుచుకునేలా వ్యూహం సిద్ధం చేశారు. పథకం ప్రకారం ఒక్కో నేతను జనసేనలో చేర్చే కార్యక్రమాన్ని ఇప్పటికే మొదలు పెట్టారు. బాబు ఆదేశాలతో బూరగడ్డ..! కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గానికి చెందిన టీడీపీ నేత బూరగడ్డ వేదవ్యాస్ గురువారం మంగళగిరిలోని జనసేన కార్యాలయానికి వెళ్లి పవన్‌కళ్యాణ్‌తో సమావేశమయ్యారు. వేదవ్యాస్‌తోపాటు మరో టీడీపీ నేత కాగిత కృష్ణప్రసాద్ కూడా పెడన టిక్కెట్ ఆశిస్తుండగా, పొత్తుల్లో భాగంగా తమకు కేటాయించాలంటూ జనసేన ఇప్పటికే ప్రతిపాదించడం గమనార్హం. వేదవ్యాస్ గతంలో ప్రజారాజ్యం పార్టీలో పని చేశారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఆదేశాల మేరకు ఆయన పవన్‌ను కలసినట్లు జనసేనలో చర్చ సాగుతోంది. టీడీపీకే చెందిన మాగంటి బాబు, జలీల్‌ఖాన్ తదితరులు కూడా పవన్ కళ్యాణ్‌తో సమావేశం కావడం వెనుక చంద్రబాబు పాత్ర ఉన్నట్లు జనసైనికులు భావిస్తున్నారు. ఎమ్మెల్సీ వంశీకృష్ణ చేరిక కూడా.. వైఎస్సార్సీపీ అసెంబ్లీ టికెట్ నిరాకరించడంతో ఎమ్మెల్సీ వంశీకృష్ణ ఇటీవల జనసేనలో చేరారు. ఆయన తొలుత చంద్రబాబును సంప్రదించారని, టీడీపీ అధినేత ఆదేశాల మేరకే జనసేనలో చేరారనే చర్చ సాగుతోంది. జనసేనకు కేటాయించే సీట్ల సంఖ్య ఇంకా ఖరారు కాకున్నా, అతి తక్కువగా కేటాయించడంతోపాటు అందులోనూ ఇన్నాళ్లూ జనసేనను నమ్ముకున్న నాయకులకు కాకుండా తన మనుషులను చంద్రబాబు ప్రవేశపెడుతున్నట్లు రాజకీయ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే ఎన్నికల అనంతరం తమ పార్టీ ఉనికికే ప్రమాదం ఏర్పడుతుందని జనసేన నేతలు ఆందోళన చెందుతున్నారు. 2014 పొత్తులే నిదర్శనం.. 2014 ఎన్నికల సమయంలో కూడా బీజేపీతో పొత్తు పెట్టుకొని చంద్రబాబు ఇదే ఎత్తుగడ అమలు చేసినట్లు రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. బీజేపీకి తొలుత 15 అసెంబ్లీ సీట్లను కేటాయించి నామినేషన్ల సమయానికి 11కి పరిమితం చేశారు. తీరా అందులోనూ మూడు చోట్ల స్నేహపూర్వక పోటీ పేరుతో టీడీపీ అభ్యర్ధులను కూడా బరిలోకి దించినట్లు గుర్తు చేస్తున్నారు. మొత్తంగా ఆ ఎన్నికల ముందు కొత్తగా బీజేపీలో చేరిన చంద్రబాబు మనుషులకే టిక్కెట్లు దక్కాయని పేర్కొంటున్నారు. -
లోకేష్, చంద్రబాబుపై కేశినేని నాని ఆసక్తికర కామెంట్స్
సాక్షి, విజయవాడ: వచ్చే ఎన్నికల్లో టీడీపీ 50 స్థానాల్లో కూడా గెలిచి పరిస్థితి లేదు అని తన సర్వేల్లో తేలిందన్నారు ఎంపీ కేశినేని నాని. నారా లోకేష్‌ను ముఖ్యమంత్రిని చేయడమే చంద్రబాబు లక్ష్యమని ఆయన చెప్పుకొచ్చారు. రాబోయే రోజుల్లో పవన్ కల్యాణ్‌ను కూడా చంద్రబాబు మోసం చేస్తారని నాని తెలిపారు. కాగా, ఎంపీ కేశినేని నాని విజయవాడలోని ఆటోనగర్‌లో ఎంపీ నిధులతో నిర్మించిన వాటర్ హెడ్ ట్యాంక్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా కేశినేని నాని మాట్లాడుతూ..‘నాకు విజయవాడ అంటే పిచ్చి.. ఆటోనగర్ అంటే ప్రాణం. నేను ఆటోనగర్ తీసేస్తున్నాని ప్రచారం చేశారు. బాండ్ లేకుండా రెండు ఎకరాలు నేను రాసిచ్చాను. దాని విలువ రూ. 100కోట్లు. నిస్వార్దంగా చేసిన పని ఇప్పుడు ఆటోనగర్‌కి ఉపయోగపడుతోంది. దేశంలోనే ఎక్కువగా కార్మికులు పనిచేసే ప్రాంతం ఆటోనగర్. కార్మికుల ఆరోగ్యానికే పెద్దపీట. ఆటోనగర్ అభివృద్ధికి కేశినేని కుటుంబం కట్టుబడి ఉంది. నన్ను ఎంపీగా ఎన్నుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ధన్యవాదాలు. ఎంపీగా గెలిచి ముఖ్యమంత్రి జగన్‌కు గిఫ్ట్ ఇస్తాను. టీడీపీ నన్ను పార్టీ నుంచి గెంటేసింది. లోకేష్‌ను సీఎం చేయడమే చంద్రబాబు లక్ష్యం. లోకేష్‌ను సీఎం చేయడం కోసం రేపు పవన్‌ను కూడా చంద్రబాబు మోసగిస్తారు. విజయవాడను స్మశానం చేశాడు చంద్రబాబు. విజయవాడపై చంద్రబాబుకు చిన్నచూపు. 33వేల ఏకరాలతో రైతులను మోసం చేశారు. 30 ఏళ్లు అయినా రాజధాని నిర్మాణం పూర్తి అవ్వదు అని నేను నాడే చెప్పాను. భూ మాఫియాకి టీడీపీ నేతలు తెర లేపారు. రాజధాని విషయంలో చంద్రబాబు స్వార్థం పూరితంగా వ్యవహరించారు. మంచి చేసేవాళ్లు.. మంచివాళ్ళు కొందరే ఉంటారు. సమర్థత కూడా కావాలి. సీఎం నుండి నిధులు తెచ్చే సమర్థత అవినాష్‌ది. తూర్పు నియోజకవర్గానికి కేశినేని, దేవినేని రక్షణగా ఉంటాం. మా కాంబినేషన్ అంటే డబుల్ రిటైనింగ్ వాల్. మా ఇద్దరి వల్ల రాబోయే రోజుల్లో అద్భుత ఫలితాలు వస్తాయి. ఎందుకు చెబుతున్నానో విజయవాడ ప్రజలు అర్థం చేసుకోవాలి’ అని కామెంట్స్ చేశారు. -
ఇది ఆరంభం మాత్రమే.. కేశినేని నాని ట్వీట్
సాక్షి, విజయవాడ: ఇది ఆరంభం మాత్రమేనంటూ టీడీపీకి చురకలు అంటించారు కేశినేని నాని. వైఎస్సార్సీపీలో చేరిన తిరువూరు మాజీ ఎమ్మెల్యే స్వామిదాసుకు ఆయన ఎక్స్(ట్విట్టర్) ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. మనల్ని అవమానించిన వాళ్లకు గుణపాఠం చెబుదాం అంటూ స్వామిదాసును ఉద్దేశించి కేశినేని ట్వీట్ చేశారు. కాగా, ఎన్టీఆర్ జిల్లాలో తెలుగు దేశం పార్టీకి పెద్ద దెబ్బ పడింది. తిరువూరు మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాస్ టీడీపీని వీడారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారాయన. గురువారం సాయంత్రం సీఎం క్యాంప్ కార్యాలయంలో స్వామిదాస్‌కు కండువా కప్పి వైఎస్సార్సీపీలోకి ఆహ్వానించారు సీఎం జగన్. స్వామిదాస్‌తో పాటు ఆయన సతీమణి సుధారాణి కూడా వైఎస్సార్సీపీ కండువా కప్పుకున్నారు. చంద్రబాబులో మానవత్వం మచ్చుకైనా లేదని.. ఎవరితోనూ మానవీయతతో వ్యవహరించరని తిరువూరు నల్లగట్ల స్వామిదాస్ అన్నారు. గురువారం సాయంత్రం సీఎం జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీ పార్టీలో చేరిన ఆయన సాక్షి టీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు. ‘‘అవసరం లేకపోతే చంద్రబాబు ఎవర్నీ పట్టించుకోరు. ఆయన ఎవరితోనూ మానవీయతతో వ్యవహరించరు. దాదాపుగా 30 ఏళ్లుగా టీడీపీలో పని చేసినా కనీసం ఇంట్లోకి కూడా రానివ్వలేదు. భార్యాభర్తలం పది రోజులపాటు చంద్రబాబు ఇంటి ముందు ఎదురుచూసినా ఫలితం లేదు. టీడీపీ నేతలే మాకు వెన్నుపోటు పొడిచారు. Congratulations my dear Swamy Das and Sudha Rani. This is just a beginning we shall teach a lesson to everyone who has humiliated us. pic.twitter.com/i4aQt3nH46 — Kesineni Nani (@kesineni_nani) January 11, 2024 -
‘చంద్రబాబు మమ్మల్ని ఇంట్లోకి కూడా రానివ్వలేదు’
గుంటూరు, సాక్షి: చంద్రబాబులో మానవత్వం మచ్చుకైనా లేదని.. ఎవరితోనూ మానవీయతతో వ్యవహరించరని తిరువూరు మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాస్ అన్నారు. గురువారం సాయంత్రం సీఎం జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీ పార్టీలో చేరిన ఆయన సాక్షి టీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు. ‘‘అవసరం లేకపోతే చంద్రబాబు ఎవర్నీ పట్టించుకోరు. ఆయన ఎవరితోనూ మానవీయతతో వ్యవహరించరు. దాదాపుగా 30 ఏళ్లుగా టీడీపీలో పని చేసినా కనీసం ఇంట్లోకి కూడా రానివ్వలేదు. భార్యాభర్తలం పది రోజులపాటు చంద్రబాబు ఇంటి ముందు ఎదురుచూసినా ఫలితం లేదు. టీడీపీ నేతలే మాకు వెన్నుపోటు పొడిచారు.. .. మాతో మంచిగా ఉంటూనే తిరువూరులో వెన్నుపోటుతో ఓడించారు. మా దళితులకు సీఎం జగన్ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమాలు అద్భుతం. అవి నచ్చి ఆయన సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరాం. సీఎం జగన్ ఏం చెప్తే అది చేయటానికి మేము సిద్ధం’’ అని స్వామిదాస్ తెలిపారు. సంబంధిత వార్త: టీడీపీకి భారీ షాక్.. సీఎం జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలోకి స్వామిదాస్ -
సీఎం జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరిన స్వామిదాస్
గుంటూరు, సాక్షి: ఎన్టీఆర్ జిల్లాలో తెలుగు దేశం పార్టీకి పెద్ద దెబ్బ పడింది. తిరువూరు మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాస్ టీడీపీని వీడారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారాయన. గురువారం సాయంత్రం సీఎం క్యాంప్ కార్యాలయంలో స్వామిదాస్‌కు కండువా కప్పి వైఎస్సార్సీపీలోకి ఆహ్వానించారు సీఎం జగన్. స్వామిదాస్‌తో పాటు ఆయన సతీమణి సుధారాణి కూడా వైఎస్సార్సీపీ కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ ఆళ్ళ అయోధ్య రామిరెడ్డి, ఎమ్మెల్సీలు మర్రి రాజశేఖర్, మొండితోక అరుణ్‌కుమార్, ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు పాల్గొన్నారు. స్వామిదాస్ 1994, 1999 లో రెండు సార్లు తిరువూరు నియోజకవర్గంలో టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇటీవల సీఎం జగన్‌ను కలిసిన విజయవాడ ఎంపీ కేశినేని నాని.. ఉమ్మడి కృష్ణా జిల్లాలో టీడీపీ ఖాళీ కావడం ఖాయమంటూ జోస్యం చెప్పిన సంగతి తెలిసిందే. -
లోకేశ్ దెబ్బకు టీడీపీ కకావికలు
సాక్షి ప్రతినిధి, విజయవాడ/పటమట (విజయవాడ తూర్పు): టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్ చేస్తున్న నీచ రాజకీయాలకు ఎన్టీఆర్ జిల్లాలో ఆ పార్టీలో పెద్ద ముసలమే పుట్టింది. ముఖ్యంగా లోకేశ్ కొట్టిన దెబ్బకు జిల్లాలో ఆ పార్టీ కకావికలవుతోంది. బాబు, లోకేశ్ చర్యలకు విసిగిపోయి పార్టీకి ఎంపీ కేశినేని శ్రీనివాస్ (నాని) గుడ్‌బై చెప్పడంతో జిల్లాలో పార్టీ నేతలు అధిక సంఖ్యలో రాజీనామాలకు సిద్ధమవుతున్నారు. ఇకపై పార్టీలో పని చేయలేమని తెగేసి చెబుతున్నారు. టీడీపీకి చెందిన విజయవాడ 11వ డివిజన్ కార్పొరేటర్, నాని కుమార్తె కేశినేని శ్వేత సోమవారం తన పదవికి రాజీనామా చేశారు. ఈ అంశం బెజవాడ టీడీపీలో మరింత కలకలం రేపింది. రాజీనామా ఆమోదం పొందిన వెంటనే పార్టీకి రాజీనామా చేస్తామని శ్వేత వెల్లడించారు. కేశినేని నాని పార్టీకి రాజీనామా చేశాక కార్యకర్తలతో మాట్లాడి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తారన్నారు. గౌరవం లేని పార్టీలో ఇమడలేకే రాజీనామా చేస్తున్నామని ఆమె చేసిన వ్యాఖ్యలు టీడీపీలో అలజడి రేపుతున్నాయి. ఏడాదిన్నరగా పార్టీలో తీవ్ర అవమానాలకు గురయ్యామని ఆమె ఆవేదన వ్యక్తం చేయడం పార్టీలో చర్చకు దారితీసింది. కేశినేని వర్గీయులు మరికొంత మంది కూడా రాజీనామాలకు సిద్ధమవుతున్నారు. ప్రధాన అనుచరులుగా ఉన్న తిరువూరు మాజీ ఎమ్మెల్యే స్వామిదాసు, మైలవరం నియోజకవర్గానికి చెందిన బొమ్మసాని సుబ్బారావు, విజయవాడ వెస్ట్ నియోజకవర్గానికి చెందిన బేగ్ వంటి వారు కేశినేని వెంటే ఉన్నారు. కేశినేని నాని మూడోసారి కూడా విజయవాడ నుంచే లోక్‌సభకు పోటీ చేస్తారని, విజయం సాధిస్తారని శ్వేత ప్రకటించారు. తన బాబాయ్ కేశినేని చిన్ని గురించి మాట్లాడి తమ స్థాయిని తగ్గించుకోలేమని అన్నారు. అవినీతిపరులను పార్టీ ప్రోత్సహిస్తోందని విమర్శించారు. ఇది లోకేశ్ అజ్ఞానమే తిరువూరు సభకు, కేశినేని నానికి సంబంధం ఏమిటన్న లోకేశ్ వ్యాఖ్యలపై పలువురు టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాని ప్రాతినిధ్యం వహిస్తున్న లోక్‌సభ నియోజకవర్గంలో భాగమైన తిరువూరులో జరుగుతున్న పార్టీ సభతో సంబంధం లేదని అనడం లోకేశ్æ అజ్ఞానమేనని వ్యాఖ్యానిస్తున్నారు. ‘మా నాన్న నియోజకవర్గంలో సభ జరుగుతుంటే ఎంపీగా ఆయనకు సంబంధం ఉండదా’ అని కేశినేని శ్వేత గట్టిగానే ప్రశ్నించారు. లోకేశ్ అజ్ఞానం వల్లే పార్టీలో విభేదాలు తలెత్తుతున్నాయని, సీనియర్ నేతలను ఆయన అవమానిస్తున్నారని విమర్శిస్తున్నారు. లోకేశ్ గుట్లు తెలిసిన కేశినేని నాని వ్యతిరేక వర్గం ఆయన్ని బ్లాక్ మెయిల్ చేసి, అధిపత్యం చలాయిస్తోందని చెబుతున్నారు. కేశినేని చిన్ని, నాని వ్యతిరేక వర్గంలోని ముగ్గురు టీడీపీ నేతలు చెప్పినట్లే ప్రస్తుతం పార్టీలో నడుస్తోందని వ్యాఖ్యానిస్తున్నారు. ముగ్గురు బ్లాక్ మెయిలర్ల చెప్పు చేతల్లోకి లోకేశ్, పార్టీ వెళ్లిపోయారంటూ కేశినేని శ్వేత అన్నారు. జిల్లాలో టీడీపీ అధినేత కార్యక్రమాలేవీ నానికి చెప్పడంలేదని తెలిపారు. ఎన్నో అవమానాలు భరించి పార్టీలో ఉన్నామన్నారు. మీరు పార్టీలో వద్దు పొమ్మన్నాక కూడ ఉండలేం కదా అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అండగా ఉన్నామని, ఆస్తులు అమ్ముకున్నామని, వ్యాపారాలు నిలిపివేసి, త్యాగం చేస్తే, చివరికి చంద్రబాబు తమను వంచించారని కేశినేని నాని రగిలిపోతున్నారు. పిలిచి మాట్లాడకుండా, దూతలను పంపి పార్టీ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని చెప్పడాన్ని తీవ్ర అవమానంగా భావిస్తున్నారు. చుట్టుపక్కల రాజమండ్రి, ఏలూరు, గుంటూరు, బాపట్ల ఎంపీ స్థానాలకు టీడీపీ అభ్యర్ధులే కరువైన తరుణంలో ప్రజల్లో పట్టున్న విజయవాడ సిట్టింగ్ ఎంపీకి టికెట్ లేదని చెప్పటాన్ని ఆ పార్టీ నాయకులే జీర్ణించుకోలేక పోతున్నారు. మేయర్ ఫార్మాట్లో కార్పొరేటర్ శ్వేత రాజీనామా ఎంపీ కేశినేని నాని కుమార్తె, విజయవాడ 11వ డివిజన్ కార్పొరేటర్ కేశినేని శ్వేత సోమవారం తన అనుచరులతో కలిసి వీఎంసీ ప్రధాన కార్యాలయంలో మేయర్ రాయన భాగ్యలక్ష్మిని కలిసి రాజీనామాను సమర్పించారు. మేయర్ ఫార్మాట్లో ఆమె రాజీనామా లేఖ సమర్పించారు. ఈ సందర్భంగా శ్వేత మాట్లాడుతూ.. తమకు టీడీపీలో గౌరవం లేదని, అందుకే రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. రాజీనామా ఆమోదం పొందాక టీడీపీకి రాజీనామా చేస్తానని తెలిపారు. నాని, తాను ప్రజల తరపున పోరాటం చేస్తామని చెప్పారు. మున్సిపల్ ఎన్నికల్లో నగరంలోని మూడు నియోజకవర్గాల నాయకులు తమను ఇబ్బంది పెట్టారని చెప్పారు. ఇప్పుడు టీడీపీకి విజయవాడ, మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గాల్లో అభ్యర్థులే లేరని అన్నారు. టీడీపీ నుంచి తమతో వచ్చేవాళ్ళకి కచ్చితంగా అండగా ఉంటామని పేర్కొన్నారు. అంతకు ముందు ఆమె విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ను కలిసి తన రాజీనామా నిర్ణయాన్ని చెప్పారు. -
ఎంపీ సీటు రూ.150 కోట్లకు అమ్ముకున్న చంద్రబాబు
సాక్షి, అమరావతి: చంద్రబాబునాయుడు సీట్లు అమ్ముకుంటున్నారని, రూ.150 కోట్లకు ఎంపీ సీటు కేశినేని చిన్నికి అమ్మారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) చెప్పారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం వద్ద సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. టీడీపీ కోసం అహర్నిశలు పనిచేసిన కేశినేని నానిని చంద్రబాబు మోసం చేశారని విమర్శించారు. గుడివాడలో కూడా రూ.100 కోట్లు ఇచ్చినోడికి సీటిచ్చారని తెలిపారు. రాజ్యసభ, ఎమ్మెల్సీ సీట్లు కూడా చంద్రబాబు అమ్ముకుంటారని మండిపడ్డారు. ఇంకా ఆయన ఏమన్నారంటే.. రేవంత్‌ను కలవాల్సిన అవసరం ఏముంది? తెలంగాణలో మేం ఏ పార్టీకి మద్దతు తెలపలేదు. ఆ రాష్ట్ర సీఎం గురించి ఇక్కడ చర్చ అనవసరం. రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ తరఫున ఎన్నికైన సీఎం. ఆయనది ఏమైనా ప్రాంతీయ పార్టీనా? ఆయన ఏమైనా సుప్రీమా? ఆయనకు ఏందీ ఫోన్ చేసేది. రేవంత్ ముఖ్యమంత్రి అయినందుకు సీఎం వైఎస్ జగన్ కంగ్రాట్స్ చెబుతూ ట్వీట్ చేశారు. చంద్రబాబు అయితే ఎవరు సీఎం అవుతారా అని చూస్తుంటారు. రేవంత్‌రెడ్డిని సీఎం జగన్ ప్రత్యేకంగా ఎందుకు కలుస్తారు. తుంటి ఎముక విరిగినందుకు మాజీ సీఎం కేసీఆర్‌ను సీఎం జగన్ పరామర్శించారు. రేవంత్‌ను పరామర్శించడానికి ఆయనకు తుంటి ఎముక విరగలేదు కదా?. ఏపీలో సీట్లు ఎవరికి ఇవ్వాలో కాంగ్రెస్ అధిష్టానం చూసుకుంటుంది. రేవంత్ చెప్తే ఇక్కడ సీట్లు ఇవ్వరు. ఇక్కడికి వచ్చి రాజకీయం చేయాలి అనుకుంటే తెలంగాణలో సీఎం పదవికి రాజీనామా చేసి ఏపీలో పోటీ చేయాలి. ఆయనే ఆంధ్రాలో పీసీసీ అధ్యక్షుడు అయినా మాకేం అభ్యంతరం లేదు. చంద్రబాబును గెలిపించేందుకే షర్మిలను వినియోగించుకుంటున్నారు. మా సీఎంను కలిసేందుకు మాకు సమయం సరిపోవడం లేదు. పక్క రాష్ట్రం సీఎంను కలసి మేం ఏం చేస్తాం. పక్క రాష్ట్రాల రాజకీయాలు పట్టించుకునే స్థితిలో మా నాయకుడు, మేము లేం. ఏబీఎన్ రాధాకృష్ణవి అన్నీ వెకిలి ప్రోగ్రాములు. ముగ్గురిని కంటే రూ.45 వేలు ఇస్తానని చంద్రబాబు అంటున్నారు. అదే రూ.45 వేలు ఇచ్చి వాళ్ల పప్పుగాడిని పిల్లలను కనమని చెప్పాలి. వాడినే ఐదారుగురుని కనమని చెప్పాలి. కృష్ణా జిల్లాలో పార్టీని ఎవరూ వీడటంలేదు కారణాలు చెప్పి వైఎస్సార్సీపీ సమన్వయకర్తలను సీఎం జగన్ మారుస్తున్నారు. ఏ సీటు మార్చుతున్నారో వారినే సీఎం పిలిచి మాట్లాడుతున్నారు. కృష్ణా జిల్లాలో ఎవరూ పార్టీ నుంచి వెళ్లడం లేదు. పార్థసారథికి సీటు ఇవ్వడంలేదని సీఎం ఎక్కడా చెప్పలేదు. ఎక్కడ ఎవరు పోటీ చేస్తే బాగుంటుందనేది లిస్టు పెట్టుకుని సీఎం చర్చిస్తున్నారు. నా నియోజకవర్గంలో సమస్యలపై సీఎంను కలిసి మాట్లాడా. -
నారా లోకేష్‌కు పొలిటికల్ పంచ్.. టీడీపీకి కేశినేని శ్వేత రాజీనామా
సాక్షి, విజయవాడ: టీడీపీకి కేశినేని శ్వేత రాజీనామా చేశారు. తన కార్పొరేటర్ పదవికి, టీడీపీకి ఆమె గుడ్‌బై చెప్పారు. తాజాగా విజయవాడ మేయర్ భాగ్యలక్ష్మికి కేశినేని శ్వేత తన రాజీనామా లేఖను అందించారు. ఈ సందర్భంగా తన కార్పొరేటర్ సభ్యత్వం రాజీనామా లేఖను కౌన్సిల్లో పెట్టి ఆమోదించాలని మేయర్‌ను శ్వేత కోరారు. ఈ సందర్బంగా కేశినేని శ్వేత మీడియాతో మాట్లాడుతూ.. విజయవాడ పదకొండవ డివిజన్ కార్పొరేటర్‌గా నేను రాజీనామా చేశాను. రాజీనామా ఆమోదం పొందాక నేను కూడా టీడీపీకి రాజీనామా చేస్తాను. మేము ఎప్పుడూ టీడీపీని వీడాలని అనుకోలేదు. టీడీపీ మమ్మల్ని వద్దు అనుకున్నప్పుడు మేము పార్టీలో కొనసాగడం కరెక్ట్ కాదు. పార్టీకి తర్వాత కేశినేని నాని కార్యకర్తలతో మాట్లాడి భవిష్యత్ కార్యచరణను ప్రకటిస్తారు. గౌరవం లేని చోట మేము పనిచేయలేము. కేశినేని నాని, నేను ప్రజల తరుపున పోరాటం చేస్తాము. గత సంవత్సరం కాలం నుంచి టీడీపీలో కేశినేని నాని అవమానాలు ఎదుర్కొంటూనే ఉన్నారు. కృష్ణాజిల్లాలో జరుగుతున్న విషయాలు ఇప్పటి వరకూ టీడీపీ అధిష్టానానికి తెలియదు అనే భ్రమలో ఉన్నాము. మున్సిపల్ ఎన్నికలప్పుడు విజయవాడలో ముగ్గురు నాయకులు మమ్మల్ని ఇబ్బంది పెట్టారు. మేము బయటకి వెళ్తున్నము.. పార్టీ నుంచి మాతో వచ్చే వాళ్ళకి కచ్చితంగా అండగా ఉంటాము. తిరువూరు సభకి కేశినేని నానికి ఏంటి సంబంధం అని లోకేష్ అడిగారు. ఆయన పార్లమెంట్ నియోజవర్గంలో ఆయనకు సంబంధం ఏంటి అని అడగడం లోకేష్ తెలివితేటలకు నిదర్శనం. కేశినేని నాని మూడోసారి కూడా విజయవాడ పార్లమెంట్ నుంచే పోటీ చేస్తారు’ అని కామెంట్స్ చేశారు. ఇక, అంతకుముందు కేశినేని శ్వేత, టీడీపీకి రాజీనామా చేయబోతున్నట్టు ఎంపీ కేశినేని నాని ట్విట్టర్ వేదికగా చెప్పిన విషయం తెలిసిందే. కాగా, వీరి రాజీనామాలతో టీడీపీకి బిగ్ షాక్ తగిలినట్టు అయ్యింది. రాజీనామాల నేపథ్యంలో విజయవాడలో రాజకీయం రసవత్తరంగా మారింది. అందరికీ నమస్కారం 🙏🏼 ఈ రోజు శ్వేతా 10.30 గంటలకు మునిసిపల్ కార్పొరేషన్ ఆఫిసుకు వెళ్ళి తన కార్పొరేటర్ పదవికి రాజీనామా చేసి ఆమోదింప చేయించుకొని మరుక్షణం తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తుంది . pic.twitter.com/gANCVCKrZJ — Kesineni Nani (@kesineni_nani) January 7, 2024 -
ఎంపీ కేశినేని నాని కార్యాలయంలో జెండా పీకేశారు..
సాక్షి ప్రతినిధి, విజయవాడ: విజయవాడ ఎంపీ కేశినేని నాని తన పార్టీ కార్యాలయంలో ఆదివారం టీడీపీ జెండాలను పీకేసినట్లు స్వయంగా ఆయనే తెలిపారు. దీంతో ఆయన టీడీపీతో పూర్తిగా తెగతెంపులు చేసుకొన్నట్లుగా అర్థం అవుతోంది. టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ శనివారం రాత్రి కేశినేని నానితో సమావేశమై బుజ్జగించే ప్రయత్నం చేశారు. తిరువూరు సభకు రావాలని అధిష్టానం దూతగా కోరినట్లు తెలిసింది. అయితే ఆయన ససేమిరా అంటూ తిరస్కరించారని సమాచారం. ఆదివారం సైతం తన రాజీనామాపై స్పందించారు. రాజీనామా చేస్తామని చెప్పాక కచ్చితంగా చేసేస్తానని స్పష్టం చేశారు. సాంకేతిక సమస్యతో రాజీనామా ఆలస్యం అవుతుందని, దానిపై ఇక చర్చించేది ఏమీ ఉండదని తేల్చి చెప్పారు. దీనిని బట్టి ఎంపీ కేశినేని నాని పూర్తిగా టీడీపీ నుంచి వెళ్లిపోవటానికి, తన ఎంపీ పదవికి రాజీనామా చేయటానికి నిర్ణయించుకున్నట్టు స్పష్టమవుతోంది. విజయవాడ ఎంపీగానే పోటీ చేస్తానని ఆయన మరోసారి స్పష్టం చేశారు. ఎంపీ ఆదివారం తన కార్యాలయంలో అనుచరులతో మంతనాలు జరిపారు. తిరువూరులో జరిగిన రా కదిలిరా సభకు ఎంపీ కేశినేని నాని అనుచరులు మాజీ ఎమ్మెల్యే స్వామిదాస్, రామసుబ్బారావు, వాసన్ మునెయ్య, చెరుకూరి రాజేశ్వరరావు, దేవభక్తుని సీతారాం ప్రసాద్, జక్కె వెంకటేశ్వరరావుతో తదితరులు దూరంగా ఉన్నారు. తిరువూరు సభలో సీటు కేటాయించినా.. తిరువూరు సభలో టీడీపీ నేతలు వేసిన ఎత్తుగడ బెడిసి కొట్టింది. తిరువూరు సభలో ముందు వరుసలో ఎంపీ కేశినేని నానికి సీటు కేటాయించారు. అక్కడ ఏర్పాటు చేసిన ప్లెక్సీల్లో సైతం ప్రొటోకాల్ ప్రకారం ఎంపీ ఫొటోలు వేశారు. ఈ విషయం ఎంపీ కేశినేని నాని దృష్టికి మీడియా తీసుకెళ్తే.. ‘నాకు ప్రొటోకాల్ ఇచ్చామని, పాటిస్తున్నామని చెప్పుకోవటానికి బ్యానర్లలో ఫొటోలు వేశారు. గతంలో ప్రొటోకాల్ పాటించలేదే’ అని ప్రశ్నించారు. అన్ని పద్ధతులూ పాటిస్తున్నామని చెప్పుకోవటానికే ఇదంతా అని అన్నారు. ఇదేదో తనమీద, ప్రేమ, గౌరవంతో చేసిన విషయం కాదని తేల్చి చెప్పారు. తమ తప్పు లేదని విజయవాడలో మీడియాకు చెప్పుకోవటానికి గిమ్మిక్కు చేశారని ఎద్దేవా చేశారు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీగా గెలిచాక, తనకు పలు అవకాశాలు వచ్చాయన్నారు. అయితే అప్పట్లో టీడీపీని వీడాలనేది తన ఉద్దేశం కాదని కేశినేని నాని అన్నారు. కష్టాల్లో ఉన్న అధినేత చంద్రబాబుకు అండగా ఉండాలని ఆయన వెంటే నడిచానన్నారు. ఇప్పుడేమో తన వద్దకు దూతలను పంపి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండమని, పట్టించుకోవద్దని చెబుతున్నారని ఆరోపించారు. అధినేత ఆదేశాలను శిరసావహిస్తున్నా, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదని వ్యంగ్యంగా అన్నారు. ఎంపీ హోదాలో అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటానని స్పష్టం చేశారు. అనుచరులతో చర్చించి విజయవాడ పార్లమెంటు పరిధిలో తన అనుచరులుగా ఉన్న ఎంకే బేగ్, బొమ్మసాని సుబ్బారావు, స్వామిదాస్, మరికొంత మంది పరిస్థితి ఏమిటని విలేకర్లు అడిగిన ప్రశ్నకు ‘వేచి చూడండి’ అని నాని బదులిచ్చారు. ప్రజాస్వామంలో డిసైడ్ చేసేది ప్రజలే. తనను నమ్ముకొని విజయవాడ పార్లమెంట్ పరిధిలో కొన్ని వేల మంది అనుచరులు, శ్రేయోభిలాషులు ఉన్నారని పేర్కొన్నారు. వారి మనోభావాలను దృష్టిలో పెట్టుకొని, తన ఒక్కడి నిర్ణయం కాకుండా, వారి ఆలోచనలకు అనుగుణంగా కలిసికట్టుగా నిర్ణయం తీసుకొంటామని స్పష్టం చేశారు. విజయవాడ ఎంపీగానే పోటీ చేస్తానని, మూడో సారి తానే గెలుస్తాననే ధీమా వ్యక్తం చేశారు. -
జూ.ఎన్టీఆర్ X టీడీపీ
సాక్షి, భీమవరం/పెనుగొండ/తిరువూరు: పశ్చిమగోదావరి జిల్లా ఆచంట, ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ‘రా... కదలి రా..’ పేరిట ఆదివారం నిర్వహించిన సభకు హాజరైన జూనియర్ ఎన్టీఆర్ అభిమానులపై టీడీపీ కార్యకర్తలు దౌర్జన్యానికి దిగారు. వారు తీసుకొచ్చిన ఫ్లెక్సీలు, జెండాలను లాక్కుని వారిపై వీరంగం సృష్టించి అక్కడినుంచి తరిమేశారు. ఆచంటలో వారిని అడ్డుకునేందుకు వచ్చిన జనసేన కార్యకర్తలపైనా టీడీపీ కార్యకర్తలు దాడికి తెగబడ్డారు. ఆచంటలో లక్ష మంది జనంతో ఈ సభ నిర్వహించాలని టీడీపీ నాయకత్వం విస్తృత ప్రచారం నిర్వహించినా కనీసం 12 వేల మంది కూడా హాజరుకాకపోవడంతో క్యాడర్లో నిరుత్సాహం నెలకొంది. ఈ తరుణంలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ జై ఎన్టీఆర్ పేరుతో జూనియర్ ఎన్టీఆర్ బొమ్మతో రూపొందించిన ఫ్లెక్సీలు తీసుకుని సభాస్థలికి వచ్చారు. టీడీపీ క్యాడర్ వారిని అడ్డుకున్నారు. వారి చేతిలోని ఫ్లెక్సీని లాక్కుని వారితో వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు జై ఎన్టీఆర్, జై జూనియర్ ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేశారు. ఇదే సమయంలో జనసేన అభిమానులు సైతం వారి పార్టీ జెండాలతో రావడంతో వారి చేతుల్లోని జెండాలను కూడా టీడీపీ క్యాడర్ లాక్కుని బయటకు విసిరేశారు. ఈ తరుణంలో ఇరు వర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఆచంటలో కానరాని జనసేన టీడీపీ, జనసేన నాయకత్వం మధ్య అంతర్గత పోరు జరుగుతున్నట్టు ఆచంటలో జరిగిన చంద్రబాబు సభ ద్వారా బయటపడింది. ఈ సభకు సంబంధించి జనసేనకు సరైన సమాచారం ఇవ్వలేదన్న భావనతో ఆ పార్టీ నాయకులు బహిరంగ సభకు దూరంగా ఉన్నారని తెలియవచ్చింది. నియోజకవర్గ జనసేన ఇన్చార్జి చేగొండి సూర్యప్రకాష్ సైతం రాకపోవడం చర్చనీయాంశంగా మారింది. వెలవెలబోయిన రెండు సభలు తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహించిన రెండు సభలకు జనం నుంచి ఆదరణ కరువైంది. రెండు చోట్లా ఆశించిన రీతిలో జనం రాకపోవడంతో నాయకులు హతాశులయ్యారు. ఆచంటలో చంద్రబాబు జనంకోసం ఎదురు చూస్తూ హెలీప్యాడ్ వద్దే నిరీక్షించాల్సి వచ్చింది. దీంతో ఆలస్యంగా సభ ప్రారంభం కావడంతో వచ్చిన జనం కాస్తా వెనుదిరిగి వెళ్లిపోయారు. ఇక తిరువూరులో 20 ఎకరాల్లో ఏర్పాటు చేసిన సభ జనం లేక వెలవెలబోయింది. సగానికి పైగా స్థలంలో ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి. సభకు వచ్చిన జనం కూడా చంద్రబాబు ప్రసంగం ప్రారంభించకముందే వెనుదిరగడం గమనార్హం. ఎంపీ కేశినేని నాని రావడం లేదన్న సమాచారంతో ద్వితీయ వర్గం నాయకులు, కార్యకర్తలు డుమ్మా కొట్టారు. విసుగెత్తించిన ‘బాబు’ ప్రసంగం రెండు సభల్లో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రసంగించిన తీరు హాజరైన ప్రజలను విసుగెత్తించింది. ఆరు హామీల అమలుపై ‘బాబు’ ప్రసంగంపై మహిళలు పెదవి విరిచారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో అమలుచేసే సంక్షేమ పథకాలు తమకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయంటూ బాహాటంగానే విమర్శించడం గమనార్హం. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను చంద్రబాబు విమర్శించిన తీరుని సైతం పలువురు తప్పుపట్టారు. ప్రసంగం ఆద్యంతం ఆత్మస్తుతి పరనిందగా సాగింది. ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పిస్తూనే రాష్ట్రాన్ని అభివృద్ధి చేసింది తానేనని చెప్పుకొచ్చారు. అంబులెన్సుకూ దారివ్వని తమ్ముళ్లు తిరువూరు సభకు వచ్చిన వాహనాలు విజయవాడ–జగదల్పూర్ జాతీయ రహదారిపై అడ్డదిడ్డంగా నిలిపివేయడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. దూరప్రాంతాల నుంచి వచ్చిపోయే భారీవాహనాలతో పాటు అత్యవసర చికిత్స నిమిత్తం రోగులను తరలించే అంబులెన్సుకు కూడా దారి ఇవ్వకుండా తెలుగుతమ్ముళ్ళు అవరోధాలు కల్పించారు. తిరువూరు సీఐ అబ్దుల్ నబీ తన సిబ్బందితో ట్రాఫిక్ నియంత్రణ చేసి అంబులెన్సును పంపారు. అధికారమిస్తే ఆరుపథకాలు తిరువూరు, ఆచంట సభల్లో చంద్రబాబు నాయుడు తిరువూరు/సాక్షి, భీమవరం/పెనుగొండ: రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కూటమిని గెలిపించి అధికారం కట్టబెడితే ఆరు పథకాలను అమలు చేస్తామని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు, పశ్చిమగోదావరి జిల్లా ఆచంటలో ఆదివారం నిర్వహించిన రా కదలిరా పేరిట టీడీపీ నిర్వహించిన సభల్లో ఆయన ప్రసంగించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, నిరుద్యోగులకు నెలకు రూ.3 వేల భృతి, మూడు వంటగ్యాస్ సిలిండర్లు ఉచిత సరఫరా, రైతులకు ఏడాదికి రూ.50 వేల ఆర్థికసాయం ప్రధానంగా అమలు చేస్తామన్నారు. రాష్ట్రంలోని ప్రతి పేదవాడికీ అండగా నిలబడటమే టీడీపీ, జనసేన లక్ష్యమని చెప్పుకొచ్చారు. తెలుగు జాతిని తిరుగులేని శక్తిగా తయారు చేసే బాధ్యతను తీసుకుంటామని పేర్కొన్నారు. ఆక్వారంగాన్ని వైఎస్సార్సీపీ అతలాకుతలం చేసిందనీ, తాము అధికారంలోకి వస్తే ఆక్వా రంగానికి పూర్వ వైభవం తెస్తామని తెలిపారు. ఈ ప్రభుత్వంలో సమర్థుడైన మంత్రి ఒకరూ లేరన్నారు. తాము అధికారంలోకి రాగానే 20 లక్షల ఉద్యోగాలు తెస్తామని చెప్పారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తన విజన్ కారణంగానే హైదరాబాద్ సాఫ్ట్వేర్ రంగానికి ప్రధాన కేంద్రమైందని, లక్షలాదిమంది ఉద్యోగాలు పొందడానికి తానే కారణమని గొప్పగా చెప్పారు. తిరువూరు సభలో వేదికపై ఎంపీ కేశినేని నానికి ప్రోటోకాల్ ప్రకారం చంద్రబాబు పక్కనే సీటు కేటాయించారు. కానీ ఆయన డుమ్మాకొట్టారు. తిరువూరు మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాసు సైతం సభ వైపునకు రాకపోవడం చర్చనీయాంశమైంది. తిరువూరు అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా ప్రకటిస్తారని ఆశించిన ప్రస్తుత ఇన్చార్జి శావల దేవదత్ ఆ ఊసే లేకపోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యారు. ఆచంట సభలో పాలకొల్లు, ఉండి ఎమ్మెల్యేలు నిమ్మల రామానాయుడు, మంతెన రామరాజు, మాజీ మంత్రులు పితాని సత్యనారాయణ, కేఎస్ జవహర్, పీతల సుజాత తదితరులు ప్రసంగించారు. -
సారీ రాలేను.. చంద్రబాబుకు మరో షాకిచ్చిన కేశినేని నాని
సాక్షి, విజయవాడ: ఏపీ టీడీపీలో రాజకీయం రసవత్తరంగా మారింది. టీడీపీ ఎంపీ కేశినేని నాని.. పార్టీ అధినేత చంద్రబాబుకు షాక్‌ల మీద షాక్‌లు ఇస్తున్నారు. తాజాగా కేశినేని భవన్ నుండి టీడీపీ జెండాను కేశినేని నాని తొలగించారు. దీంతో, టీడీపీ కార్యకర్తలు ఒక్కసారిగా ఖంగుతిన్నారు. మరోవైపు, ఎన్టీఆర్ జిల్లాలో చంద్రబాబు సభ జరుగుతున్న నేపథ్యంలో ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది. అయితే, చంద్రబాబు నిర్ణయంతో కేశినేని నాని టీడీపీకి ఝలక్ ఇస్తున్నారు. తాజాగా కేశినేని భవన్ నుంచి టీడీపీ జెండాను తొలగించారు. మరోవైపు.. చంద్రబాబు సభలో కేశినేని నాని కోసం టీడీపీ నేతలు కుర్చీని కేటాయించారు. ఈ మేరకు చంద్రబాబు సభకు రావాలని కనకమేడలతో నిన్న(శనివారం) కేశినేని నానికి రాయబారం పంపించారు. కాగా, చంద్రబాబు ఆహ్వానాన్ని, రాయబారాన్ని కేశినేని లెక్క చేయలేదు. మరోవైపు.. చంద్రబాబు సభకు కేశినేని వర్గం, మద్దతుదారులు దూరంగా ఉండటం విశేషం. ఇదిలా ఉండగా.. చంద్రబాబు తలపెట్టిన రా కదలిరా కార్యక్రమం అట్టర్ ప్లాప్ అయ్యింది. చంద్రబాబు సభపై తెలుగు తమ్ముల్లు ఆసక్తి చూపించలేదు. చంద్రబాబు సభను పట్టించుకోలేదు. రా కదలిరా అంటూ వైన్ షాపుల వద్దకు టీడీపీ శ్రేణులు వెళ్లిపోయారు. టీడీపీ కేడర్ మందేసి మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక, కాసేపట్లో సభకు చంద్రబాబు హాజరు కానున్నారు. అయితే, సభలో మాత్రం ఖాళీ కుర్చీలు దర్శనమిస్తున్నాయి. జనసమీకరణ కోసం టీడీపీ నేతల నానా కష్టాలు పడుతున్నారు. -
టార్గెట్ టీడీపీ.. కేశినేని నాని మరోసారి సంచలన కామెంట్స్
సాక్షి, ఎన్టీఆర్: టీడీపీ ఎంపీ కేశినేని నాని మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు షాకిచ్చారు. కొందరు వ్యక్తులు తన కుటుంబాన్ని చీల్చే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. అలాగే, త్వరలోనే తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తానని చెప్పకొచ్చారు. ఇందుకోసం లోక్‌సభ స్పీకర్ అనుమతి కూడా తీసుకున్నట్టు స్పష్టం చేశారు. కాగా, కేశినేని నాని శనివారం చందర్లపాడు మండలంలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా కేశినేని నాని మాట్లాడుతూ.. టీడీపీకి రాజీనామా చేస్తున్నాను. లోక్‌సభ స్పీకర్ అనుమతి కూడా కోరాను. స్పీకర్ అపాయింట్మెంట్ ఇస్తే అప్పుడు వెళ్లి ఎంపీ పదవికి రాజీనామా చేస్తాను. తర్వాత తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తాను. ఎంపీ పదవికి, పార్టీకి రాజీనామా చేసి అనుచరులతో సమావేశమై భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తాను. రాజీనామా అనంతరం టార్గెట్ చేసేందుకు మా వాళ్లు ఏం చేయమంటే అదే చేస్తాను. ఇందులో నా సొంత నిర్ణయం ఉండదు. నేను ఏం చేసినా పారదర్శకంగా ఉంటుంది. నేను ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తెల్లవారుజామున పోస్టులో పెడుతున్నాను. దాన్ని మీడియా ఫాల్ అవ్వండి. రోజూ ప్రశ్నలకు నేను సమాధానం చెప్పలేను. ఇక్కడి ప్రాంతం, ప్రజల కోసం పనిచేశాను. ప్రజలను, నాతో ఉన్న వాళ్ళను వదిలేసి నిర్ణయాలు తీసుకోలేను అని చెప్పుకొచ్చారు. ఇది కూడా చదవండి: చంద్రబాబుకు బిగ్ షాక్.. కేశినేని నాని సంచలన నిర్ణయం -
చంద్రబాబుకు బిగ్ షాక్.. కేశినేని నాని సంచలన నిర్ణయం
సాక్షి, విజయవాడ: టీడీపీలో రాజకీయం రసవత్తరంగా మారింది. టీడీపీ అధినేత చంద్రబాబుకు ఆ పార్టీ ఎంపీ కేశినేని నాని గట్టి షాక్ ఇచ్చారు. లోక్‌సభ సభ్యత్వంతో పాటు పార్టీకి కూడా రాజీనామా చేస్తున్నట్టు తెలిపారు. దీంతో, ఈ పరిణామం ఆసక్తికరంగా మారింది. కాగా, కేశినేని నాని ట్విట్టర్ వేదికగా..‘చంద్రబాబు నాయుడు.. పార్టీకి నా అవసరం లేదు అని భావించిన తరువాత కుడా నేను పార్టీలో కొనసాగటం కరెక్ట్ కాదు అని నా భావన. కాబట్టి త్వరలోనే ఢిల్లీ వెళ్లి లోక్‌సభ స్పీకర్ గారిని కలిసి నా లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేసి ఆ మరుక్షణం పార్టీకి రాజీనామా చేస్తానని అందరికీ తెలియ చేస్తున్నాను’ అని పోస్టు చేశారు. చంద్రబాబు నాయుడు గారు పార్టీ కి నా అవసరం లేదు అని భావించిన తరువాత కుడా నేను పార్టీలో కొనసాగటం కరెక్ట్ కాదు అని నా భావన కాబట్టి త్వరలోనే ఢిల్లీ వెళ్లి లోకసభ స్పీకర్ గారిని కలసి నా లోకసభ సభ్యత్వానికి రాజీనామా చేసి ఆ మరుక్షణం పార్టీకి రాజీనామా చేస్తానని అందరికీ తెలియ చేస్తన్నాను . pic.twitter.com/dFq85E4SxG — Kesineni Nani (@kesineni_nani) January 5, 2024 అంతకుముందు, కేశినేని నాని శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ..‘తిరువూరు సభకు నన్ను రావొద్దన్నారు.. నేను వెళ్లడం లేదు. నా మైండ్ సెట్ అభిమానులందరికీ తెలుసు. అభిమానుల మైండ్ సెట్ నాకు తెలుసు. మా వాళ్లందరికీ క్లారిటీ ఉంది నేను టీడీపీ పార్టీకి ఓనర్‌ను కాదు. చెప్పాల్సిన టైమ్ వచ్చినప్పుడు అన్నీ చెబుతా. తినబోతూ రుచులెందుకు. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటా. కాలమే అన్నింటిని నిర్ణయిస్తుంది. ఎవరు గెలుస్తారో.. ఎవరు ఓడాతారో ప్రజలే నిర్ణయిస్తారు. అందరి మనోభావాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకుంటా. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని పార్టీ అధినేత ముగ్గురు పెద్ద మనుషులతో చెప్పించారు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలన్నారు సరే. కానీ, ఎంపీగా ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనొద్దని చెప్పే అధికారం ఎవరికీ లేదు. ఇండిపెండెంట్‌గా గెలుస్తా.. నేను ఎన్ని అవకాశాలు వచ్చినా పార్టీ కోసమే నిలబడ్డా. కానీ, ఎప్పుడూ పార్టీ మారాలనుకోలేదు. చంద్రబాబుకి నేను వెన్నుపోటు పొడవలేదు. పొడిచి ఉంటే ఇంకా మంచి పదవిలో ఉండేవాడినేమో. పార్టీ పంపించిన ముగ్గురు పెద్దమనుషులు చెప్పిందే నేను పోస్టులో పెట్టా. నాదగ్గరికి ఆ ముగ్గురు వచ్చిపుడు మరో ముగ్గురు సాక్షులు కూడా వచ్చారు. నేను ఇండిపెండెంట్ గా పోటీ చేసైనా గెలుస్తా. ఆ విషయంలో సందేహం లేదు. రాబోయే ఎన్నికల్లో నేను విజయవాడ నుంచే పోటీచేస్తా. కచ్చితంగా మూడో సారి గెలుస్తా. వసంత కృష్ణప్రసాద్ నేను మంచి స్నేహితులం. ఆయన పార్టీకి ఆయన కష్టపడ్డారు.. నా పార్టీకి నేను కష్టపడ్డా. అలాగని కొండపల్లి ఎన్నికల్లో మేం కలిసి పనిచేయలేదు కదా’ అని కామెంట్స్ చేశారు. -
‘సీఎం జగన్ వ్యూహానికి పచ్చ మంద బెంబేలు’
సాక్షి, కృష్ణా జిల్లా: సీఎం జగన్ తీసుకుంటున్న నిర్ణయాలకు టీడీపీ బెంబేలెత్తిపోతుందని మంత్రి వేణుగోపాలకృష్ణ అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబు తన కుల పత్రిక ఈనాడులో పిచ్చిరాతలు రాయిస్తున్నాడంటూ మండిపడ్డారు. ఇంత కాలం బీసీలను బానిసలుగా చూసిన పెత్తందారులు టీడీపీ నాయకులేనంటూ మంత్రి దుయ్యబట్టారు. మంత్రి వేణు ఇంకా ఏమన్నారంటే ఆయన మాటల్లోనే.. జగన్ నిర్ణయాలతో టీడీపీ వెన్నులో వణుకు: జగన్ గారి నిర్ణయాల వల్ల ప్రజల్లో లభిస్తున్న ఆదరణ చూసి టీడీపీ బెంబేలెత్తుతోంది..ఆ పార్టీ నాయకులు కంపిస్తున్నారు. దానికి నిదర్శనమే ఈ రోజు ఈనాడులో ‘పెత్తందారి పోకడ’ అనే శీర్షికతో వచ్చిన వార్తే. బీసీ వర్గాలను బానిస వర్గాలు చూసిన పెత్తందార్లు టీడీపీ, చంద్రబాబు అండ్ కో..నే. ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు కొంత మంది బీసీలు ఆయన పట్ల ఆకర్షితులైన మాట వాస్తవం. ఎన్టీఆర్‌ను పదవీచ్యుతుడిగా చేసిన సందర్భంలో చంద్రబాబుకు మద్దతు పలికిన ప్రతి ఒక్క నాయకుడూ చంద్రబాబు వెన్నుపోటులో వాటాదారేలే. యనమల, అయ్యన్నపాత్రుడు, బండారు సత్యనారాయణ వంటి నేతలంతా ఆ మోసంలో వాటాదారులు. ఇంత కాలం బలహీనవర్గాలను పలువిధాలుగా మోసం చేసి, మీరు చేసిన మోసాన్ని ప్రత్యర్థులపై నెట్టి, ప్రజల దృష్టిని మరల్చి అధికారం పొందిన సందర్భాలున్నాయి. కానీ ఈ రోజు అది సాధ్యం కాదని చంద్రబాబుకు కూడా తెలిసిపోయింది. ఎందుకంటే బీసీలు అంత బలంగా ఉన్నారు. చంద్రబాబు మోసాన్ని బీసీలు గ్రహించారు. రాజకీయ వ్యూహంలో భాగంగా, జగన్ తీసుకుంటున్న నిర్ణయాలకు టీడీపీలో భయం పుట్టిందనేది వాస్తవం. అందుకే వారు ప్రజాస్వామ్య వాదులు బాధపడేలా తమ భాషను వాడుతున్నారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్న వ్యక్తిపై బండారు సత్యనారాయణ, అచ్చెన్నాయుడులు వాడిన భాషను ఎవరూ హర్షించరు. సామాజిక న్యాయానికి అర్ధం, పరమార్ధం చెప్పింది సీఎం జగన్: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సామాజిక న్యాయం పదాలకు అర్ధం, పరమార్ధం చెప్పింది వైఎస్ జగన్ మాత్రమే. గతంలో ఈ వర్గాల వారిని టీడీపీ వారు బానిసలుగా చూశారు. సమాజంలో బీసీలను బాధిత వర్గాలుగా మార్చారు. బలహీన వర్గాలు బాధలో ఉంటేనే పెత్తందార్ల ముందు సాగిలపడి, వారు చెప్పినట్లు వింటారు అన్నది వారి నమ్మకం. జగన్ ఒక్క స్ట్రోక్‌తో పేద వాడు పెత్తందారుల వద్దకు వెళ్లకుండా, ఎవరి సిఫార్సులు లేకుండా, ఎవరి చుట్టూ తిరిగే పనిలేకుండా, ప్రతి నెలా అర్హులైన లబ్ధిదారులకు సంక్షేమ పథకాలను బాధ్యతగా డీబీటీ ద్వారా అందిస్తున్నారు. గతంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల స్కీములన్నీ గతంలో టీడీపీ స్కామిస్టులు దోపిడీ చేశారు. ఈ రాష్ట్రంలో పేదవాడి ఆరోగ్యం గురించి చంద్రబాబు ఏనాడైనా ఆలోచించాడా?. పేదవాడు చదువు గురించి ఆలోచించాడా?. పేదవాడికి ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీషు మీడియం చెప్పించాలని ఆలోచించాడా..?. టీడీపీ నాయకులు ఈ విషయాన్ని చంద్రబాబును ప్రశ్నించండి. ఆరోగ్యశ్రీని ఆనాడు వైఎస్సార్ ప్రవేశపెడితే.. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు కార్పొరేట్ ఆస్పత్రుల బాగు కోసం పనిచేశాడు. ఆరోగ్యశ్రీలో 2300 ప్రొసీజర్స్ ఉంటే దాన్ని 1000 ప్రొసీజర్స్‌కి తగ్గించాడు. చంద్రబాబుకు ఒకటే ధైర్యం.. తనకు ఈనాడు ఉంది.. తనకు ఏబీఎన్ ఉంది, టీవీ5 టీవీ చానల్ ఉందన్నదే. తనకు అవసరం వస్తే ఎవడి కాళ్లైనా పట్టుకోగలననే ధైర్యం ఆయనది. ఈ ధైర్యంతో ప్రజలను ఏమార్చారు. దాన్ని ప్రజలు తెలుసుకోవడానికి కొంత ఆలస్యం అయ్యింది. ప్రత్యేకంగా బీసీ వర్గాలు చంద్రబాబు చేసిన మోసాన్ని తెలుసుకోడానికి కొంత ఆలస్యమైంది. ఆదరణ అన్నాడు..ఇంకా ఆ పదాన్ని ఉచ్ఛరిస్తున్నారు..బీసీ నేతలారా ఆలోచించండి. కులవృత్తి చేసుకునే వారిని విద్యావంతులుగా చేస్తేనే సామాజికంగా ఎదుగుదల ఉంటుందని మేధావులు చెప్పారు. ఎప్పుడైనా చంద్రబాబు ఇలా ఆలోచించాడా? పది శాతం కడితే 90 శాతం లోన్ అంటూ ఎన్నికల ముందు వాగ్దానాలు చేస్తాడు. ఎన్నికలయ్యాక నా దగ్గరకు వస్తే.. తోకలు కత్తిరిస్తానని బెదిరిస్తాడు. ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా బీసీ బిడ్డలను ఇంజినీరింగ్, డాక్టర్ లాంటి ఉన్నత చదువులు చదివించిన వైఎస్సార్‌లా చంద్రబాబు ఎప్పుడైనా ఆలోచించాడా? బాబుకు ఎందుకు బాధ..?: బదిలీలు అంటూ మాట్లాడుతున్నాడు. రాజకీయ వ్యూహంలో భాగంగా, కొంతమంది అభ్యర్థులను మార్పులు, చేర్పులు చేస్తే చంద్రబాబుకు ఎందుకు బాధ?. మార్పులు, చేర్పులకు ఎమ్మెల్యేలు, మంత్రులు అనే బేధం లేదు. దానికి నేనూ అతీతుడిని కాదు. జగన్ నిర్ణయాన్ని స్వాగతించాను. దానికి మాకు బాధ లేదుగానీ.. మీరు బాధపడటమేంటి..? కారణం మీరనుకున్న స్ట్రాటజీ పారడం లేదు. కారణం, స్థానిక నాయకులపై నిందలేశాం.. ప్రజలందరూ నమ్మేశారు.. ఇక వాళ్లకు ఓట్లు వేయకుండా మీకు వేస్తారని మీరు భావించారు. మార్పులు, చేర్పులతో మీ పాచిక పారటం లేదు. ఇన్నాళ్ళూ బీసీలను మోసం చేసిన మీరు.. జయహో బీసీ అనటానికి సిగ్గు ఎక్కడ లేదు..? బీసీల గురించి మాట్లాడే నైతిక అర్హత మీకెక్కడుంది?. అచ్చెన్నాయుడిని అడుగుతున్నా.. రాజమండ్రిలో పవన్ కల్యాణ్ వస్తే నిన్ను పక్కకి గెంటేశారు. చంద్రబాబు బీసీలకు ఇచ్చే ప్రాధాన్యత ఏమిటో నీకు ఇంకా అర్థం కాలేదా.. చంద్రబాబు తన చుట్టూ నలుగురు బీసీ నాయకులను, యనమల, అచ్చెన్నాయుడు, బండారు, అయ్యన్న లాంటివారిని పెట్టుకుని, మీ చేతే బీసీల కళ్ళు పొడిపిస్తున్నాడు. చంద్రబాబు ఉసిగొల్పాడని, మీరు స్థాయిని మర్చిపోయి ఒక ముఖ్యమంత్రిని, పేదవాడి ఆకలి తీరుస్తున్న జగన్‌ను ఇష్టారీతిన మాట్లాడటం మంచిది కాదు. బీసీలు మేధావులు.. చైతన్యవంతులయ్యారు. 2024 ఎన్నికల్లో బీసీలే టీడీపీకి గుణపాఠం చెప్పబోతున్నారు. బీసీల్లో వచ్చిన చైతన్యమే 2024లో వైఎస్సార్ కాంగ్రెస్‌ను 175కు 175 స్థానాల్లో గెలిపిస్తారు. అంబేద్కర్, పూలే వంటి మహనీయులు ఆశించే సంస్కరణలు అమలు చేస్తున్న జగన్ గారిని మళ్లీ ముఖ్యమంత్రిగా చేసుకుంటారు. మీరెన్ని కుట్రలు చేసినా... మీరు ఎంతగా రోత రాతలు రాసినా.. బీసీలు మిమ్మల్ని ఎప్పటికీ నమ్మరు. ఇదీ చదవండి: టీడీపీ ప్లాన్.. కాంగ్రెస్ యాక్షన్ -
తెలుగు తమ్ముళ్ల బాహాబాహీ..
తిరువూరు: టీడీపీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. తిరువూరు నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో బుధవారం విజయవాడ ఎంపీ కేశినేని నాని, ఆయన సోదరుడు చిన్ని వర్గీయులు బాహాబాహీకి దిగారు. ఈ నెల 7న టీడీపీ అధినేత చంద్రబాబు తిరువూరు రానున్న సందర్భంగా ఏర్పాట్ల పరిశీలనకు విచ్చేసిన నాయకుల నడుమ ప్లెక్సీ వివాదం ఘర్షణకు దారితీసింది. జిల్లా పార్టీ అధ్యక్షుడు నెట్టెం రఘురాం, ఎమ్మెల్యే గద్దె రాంమోహన్, మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణ, టీడీపీ నేత నాగుల్‌మీరాలతో కలిసి కేశినేని నాని పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. ఈలోగా పార్టీ కార్యాలయం వద్ద నియోజకవర్గ పార్టీ ఇన్చార్జి దేవదత్ ఏర్పాటు చేసిన ప్లెక్సీలలో ఎంపీ నాని ఫొటో లేదంటూ ఆయన వర్గీయులు ఆందోళనకు దిగారు. ఉద్దేశపూర్వకంగానే ఎంపీ ఫొటో ప్లెక్సీలో లేకుండా చేశారని ఆరోపిస్తూ కార్యాలయం బయట నాని వర్గం బైఠాయించింది. ఇందుకు నియోజకవర్గ ఇన్చార్జి దేవదత్ కారణమని ఆరోపిస్తూ ఆయనపై దాడికి యత్నించారు. స్థానిక నేతలు దేవదత్‌ను ఒక గదిలో ఉంచి తలుపులు వేశారు. బహిరంగ సభాస్థలిని పరిశీలించిన అనంతరం నాని సోదరుడు చిన్ని కూడా పార్టీ కార్యాలయానికి విచ్చేశారు. చిన్నీ గో బ్యాక్ అంటూ నాని వర్గం గేటు వద్ద బైఠాయించగా, పోలీసులు చిన్నీని కార్యాలయంలోకి తీసుకెళ్ళారు. ఏర్పాట్లపై సమీక్ష జరిపే అవకాశం లేకుండా ఇరు వర్గాల కార్యకర్తలు టీడీపీ కార్యాలయ ఆవరణలో కుర్చీలు విసురుకుంటూ దాడులకు పాల్పడుతూ గందరగోళం సృష్టించారు. జిందాబాద్, గో బ్యాక్ నినాదాలతో సుమారు రెండు గంటల పాటు కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. టీడీపీ ఆఫీసులో కుర్చీలు విసురుకుంటున్న కార్యకర్తలు ఎస్ఐపై కార్యకర్తల దాడి.. టీడీపీ వర్గవిబేధాల నేపథ్యంలో బుధవారం తిరువూరు పార్టీ కార్యాలయంలో ఘర్షణ పడిన కార్యకర్తలు పోలీసులపైనే దాడులకు పాల్పడ్డారు. రణరంగాన్ని తలపించే రీతిలో కార్యాలయంలో ఎంపీ కేశినేని నాని, ఆయన సోదరుడు చిన్నిల వర్గీయులు దాడికి తెగపడి కుర్చీలు విసురుకున్నారు. పరిస్థితి అదుపు చేయడానికి, శాంతిభద్రతల పరిరక్షణకు సీఐ అబ్దుల్ నబీ ఆధ్వర్యంలో పోలీసులు ఇరువర్గాలను చెదర గొట్టినప్పటికీ రెచ్చగొట్టే ధోరణిలో నాని, చిన్నీల అనుచరులు బీభత్సం సృష్టించారు. చేతికందిన వస్తువుల్ని విసురుకుంటూ కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న ఇరువర్గాలను పోలీసులు శాంతింపజేసే యత్నం చేసినా ప్రయోజనం లేకపోయింది. గాయపడిన ఎస్ఐ సతీష్ తిరువూరు, గంపలగూడెం, ఎ.కొండూరు, విస్సన్నపేట మండలాల నుంచి నియోజకవర్గ స్థాయి సమావేశానికి వచ్చిన పార్టీ నేతలు, కార్యకర్తలు ఈ సంఘటనతో భయాందోళనలకు గురై పరుగులు తీశారు. దాడులకు పాల్పడవద్దని, శాంతియుతంగా వ్యవహరించాలని పదే పదే కోరినా ఫలితం లేకపోవడంతో లాఠీఛార్జీ చేసి అల్లరిమూకలను చెదరగొట్టేందుకు యత్నించిన పోలీసులపై కొందరు కుర్చీలు విసిరారు. ఈ దాడిలో తిరువూరు ఎస్ఐ సతీష్ తలకు బలమైన గాయమైంది. ఎట్టకేలకు ఏసీపీ రమేష్ ఆధ్వర్యంలో పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టి పరిస్థితి అదుపులోకి తెచ్చారు. ఎస్ఐ సతీష్‌ను ఆసుపత్రికి తరలించారు. కవ్వింపు చర్యలకు పాల్పడిన ఇరువర్గాలు.. పార్టీ కార్యాలయంలో పరిస్థితి చేయి దాటుతున్నప్పటికీ ఎంపీ నాని, చిన్ని ఏమాత్రం వెనక్కు తగ్గకుండా మీడియాతో మాట్లాడేందుకు అత్యుత్సాహం ప్రదర్శించడంతో పోలీసులు సైతం అదుపు చేయలేకపోయారు. తోపులాటలో ఒక మహిళా కార్యకర్తకు సైతం గాయాలయ్యాయి. చంద్రబాబు పర్యటన గురించి ఏమాత్రం సమీక్షించకుండానే గద్దె రామ్మోహన్, తిరువూరు మాజీ ఎమ్మెల్యే స్వామిదాసు తదితరులు వెళ్ళిపోయారు. దళితుడిని కాబట్టి షటప్, గెటవుట్ అంటారా.. ‘నేనొక దళిత నాయకుడిని. నన్ను షటప్, గెటవుట్ అంటారా. నాలుగు గోడల మధ్య మీరు అంటే సరిపోయిందా. బయటకు వచ్చి అందరి ముందు ఇవే మాటలు అనండ’ని తిరువూరు టీడీపీ నియోజకవర్గ ఇంఛార్జి ఎస్.దేవదత్తు విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్ (నాని)ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. కేశినేని నాని, ఆయన వర్గీయులు తాను ఏర్పాటు చేసుకున్న టీడీపీ కార్యాలయానికి వచ్చి పరుష పదజాలంతో దూషించారని ఆవేదన వ్యక్తం చేశారు. కేశినేని చిన్ని తన వర్గీయులతో కలిసి పక్కనే ఉండగా దేవదత్తు మాట్లాడిన అంశం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆయన మాటల్లోనే.. ‘దళితుడినైన నేను ఉన్నత విద్యను అభ్యసించి, 15 సంవత్సరాలు వివిధ దేశాల్లో పనిచేసి జ్ఞానం పొందా. నేనేదో సమావేశంలో మాట్లాడబోతుంటే నా ఆఫీసుకే వచ్చి నన్ను షటప్, గెటవుట్ అని కేశినేని నాని అంటారా.. నా ఆఫీసులో నాకు మాట్లాడే హక్కు లేదా? రెండు సార్లు గెలిచిన మీకే హక్కు ఉందా? మీరేనా నియోజకవర్గ నాయకులు. మేము కాదా. మాకు అవకాశం లేదా. మాకు చెప్పుకునే అర్హత లేదా. ఇంకా ఎంతకాలం మీరు దళితులపై ఇలా హీనంగా మాట్లాడతారు. ఏడు నియోజకవర్గాలను గెలిపిస్తామంటున్నారు. ఎక్కడ గెలిపించారు. మీరు మాత్రమే గెలిచారు. తక్కినవి ఓడిపోయారు’. దాడి సంఘటనపై కేసు నమోదు స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తిరువూరు ఎస్ఐ సతీష్‌పై దాడికి పాల్పడిన సంఘటనపై కేసు నమోదు చేసినట్లు ఏసీపీ రమేష్ తెలిపారు. తిరువూరు పోలీసుస్టేషన్లో బుధవారం రాత్రి ఆయన విలేకరులతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలో ఇరువర్గాలు దాడికి పాల్పడుతుండగా అదుపు చేయడానికి యత్నించిన ఎస్ఐ సతీష్‌కు తీవ్ర గాయాలయ్యాయని తెలిపారు. ఎస్ఐపై దాడికి పాల్పడిన నిందితులను గుర్తించి అరెస్టు చేస్తామన్నారు. నిందితులను అరెస్టు చేస్తాం.. తిరువూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద ఎస్ఐ సతీష్‌పై దాడికి పాల్పడిన సంఘటనపై కేసు నమోదు చేశాం. నిందితులు ఎంతటి వారైనా కఠిన చర్యలు తప్పవు. శాంతిభద్రతలు కాపాడటానికి యత్నించిన పోలీసులపై విచక్షణా రహితంగా దాడి చేయడం శోచనీయం. సమగ్ర దర్యాప్తు జరిపి నిందితులను గుర్తించి అరెస్టు చేస్తాం. – కాంతి రాణా టాటా, ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ -
AP: నన్ను గొట్టంగాడన్నా భరించా: కేశినేని నాని
ఎన్టీఆర్, సాక్షి: పార్టీ పొలిట్‌బ్యూరోలో ఉన్న ఓ వ్యక్తి తనను గొట్టంగాడని అన్నా భరించానని, పార్టీ కోసమే ఓపికపడుతున్నానని విజయవాడ ఎంపీ కేశినేని నాని అన్నారు. గతంలోనూ తాను చాలా అవమానాలు పడ్డానన్నారు. తిరువూరు నియోజకవర్గంలో బుధవారం టీడీపీ సమన్వయ సమావేశంలో గొడవ తర్వాత నాని అక్కడి నుంచి వెళ్లిపోయారు. అనంతరం టీడీపీ మీటింగ్ జరిగిన ప్రదేశాన్ని ఆ పార్టీ నాయకులు పసుపు నీళ్లతో సంప్రోక్షణ చేశారు. ఈ ఘటనపై మీడియాతో మాట్లాడుతూ నాని ఆవేదన వ్యక్తం చేశారు. ‘విజయవాడ కార్పొరేషన్ ఎన్నికలప్పుడు ఒక వ్యక్తి ప్రెస్ మీట్ పెట్టి నన్ను చెప్పుతీసుకుని కొడతా అన్నాడు. క్యారెక్టర్ లెస్ ఫెలో అన్న ఆ వ్యక్తి మాటలపైనా పార్టీ నుంచి కనీసం ఎవరూ స్పందించలేదు. నన్ను అవమానించినా పార్టీ కోసం భరించా. నేను ఏరోజూ పార్టీలో వర్గాలను ప్రోత్సహించలేదు. ఏడాదిన్నర నుంచి పార్టీలో కుంపటి నడుస్తోంది...ఎక్కడో చోట పుల్ స్టాప్ పెట్టాలి. ఇలాంటి సంఘర్షణలు జరుగుతాయనే నేను పార్టీ కార్యకమాలకు దూరంగా ఉంటున్నా. తిరువూరు టీడీపీ ఇంఛార్జ్ శావల దేవదత్ పూజకు పనికిరాని పువ్వు. గతంలోనే చంద్రబాబుకు ఈ విషయాన్ని చెప్పా. కేశినేని చిన్నికి పార్టీకి ఏం సంబంధం. అతనేమైనా పార్టీలో ఎంపీనా... ఎమ్మెల్యేనా. తిరువూరు ఇంఛార్జ్ పార్టీలో క్యాడర్ మనోభావాలు దెబ్బతీసేలా వ్యవహరించారు. అందుకే మా క్యాడర్ నుంచి రియాక్షన్ వచ్చింది. కొంతమంది వ్యక్తులు తమకు బాధ్యతలు అప్పగించారని అబద్ధపు ప్రచారం చేసుకుంటున్నారు. నేను రెండు సార్లు ఎంపీగా గెలిచా. రతన్ టాటా స్థాయి వ్యక్తిని నేను. బెజవాడ పేరు చెడగొట్టకూడదనే ఓపిక పట్టా. రాబోయే పరిణామాలు దేవుడు ..ప్రజలే చూసుకుంటారు’అని నాని అన్నారు. స్పందించిన చిన్ని తిరువూరు ఘటనపై కేశినేని చిన్ని స్పందించారు. తిరువూరు ప్రజలకు క్షమాపణలు చెబుతూ.. ఇలాంటి ఘటనలు పునరావృతం కావని హామీ ఇస్తున్నట్లు తెలిపారు. అలాగే.. ఇవాళ జరిగిన తిరువూరు గొడవను అధిష్టానం చూసుకుంటుందని అన్నారాయన. ఇదీచదవండి..రణరంగంగా నాని వర్సెస్ చిన్ని