ఎన్టీఆర్, సాక్షి: విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ టికెట్ వార్ ముదురుతోంది. టికెట్ కోసం సీనియర్ నేత బుద్దా వెంకన్న ప్రయత్నాలు చేస్తుండగా.. మరోవైపు మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ తెరపైకి వచ్చారు. టికెట్ ఇవ్వకపోతే తీవ్ర పరిణామాలే తప్పవంటూ హెచ్చరించే క్రమంలో నోరు జారారాయన.
విజయవాడ వెస్ట్‌లో టీడీపీ టికెట్ కోసం బుద్దా వెంకన్న, జలీల్ ఖాన్ పోటీ పడుతున్నారు. ఈ క్రమంలో వార్ ముదురుతోంది. మైనారిటీలకు టికెట్‌ఇవ్వకపోతే ఉరి వేసుకుంటారో.. ఏం చేసుకుంటారో తెలియదంటూ జలీల్ ఖాన్ వ్యాఖ్యానించారు. అయితే అంతకు ముందు ఆయన నోరు జారారు. టికెట్ ఇవ్వకపోతే తానే ఉరేసుకుంటానని జలీల్ ఖాన్ అన్నారు.
ఆ వెంటనే సవరించుకుని.. మైనారిటీలకు గనుక టికెట్ దక్కకపోతే ఉరి వేసుకుంటారో.. ఏం చేసుకుంటారో తెలియదంటూ వ్యాఖ్యానించారు. ఇప్పటికే ఇద్దరు ముగ్గురు ఉరేసుకునేందుకు ప్రయత్నించగా.. తాను వారించి ఆపానని ఆయన చెప్పుకొచ్చారు. అంతేకాదు సర్వేలన్నీ తనకు అనుకూలంగా ఉన్నాయని.. చంద్రబాబు ఈ స్థానం నుంచి మైనారిటీలకే టికెట్ ఇస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారాయన. ఆపై ఓ అడుగు ముందుకేసి వెస్ట్ టికెట్ తనదేనని.. ఎన్నికల బరిలో నిలబడతానంటూ జలీల్ ఖాన్ వ్యాఖ్యానించారు. అలాగే ఈ విషయంపైనే పవన్ కల్యాన్‌ను కలిసి పరిస్థితి వివరించానని.. పొత్తులో భాగంగా ఈ సీటును వదిలేసుకోవాలని జనసేనను కోరారని చెప్పుకొచ్చారు.
ఇక.. చంద్రబాబుకు దరఖాస్తు సమర్పిస్తానంటూ గురువారం బుద్దా వెంకన్న విజయవాడలో గురువారం ర్యాలీ నిర్వహించారు. దుర్గ గుడికి వెళ్లి విజయవాడ వెస్ట్ టికెట్ తనకే దక్కాలంటూ పూజలు చేసినట్లు చెప్పారు. విజయవాడ వెస్ట్ టికెట్ గనుక ఇవ్వడం కుదరకుంటే.. అనకాపల్లి ఎంపీ సీటు అయినా ఇవ్వాలని టీడీపీ అధినేత చంద్రబాబుని కోరే ఆలోచనలో బుద్దా వెంకన్న ఉన్నట్లు తెలుస్తోంది.
ఒక పొత్తులో భాగంగా ఆ స్థానాన్ని తమకే కేటాయించాలని కోరేందుకు జనసేన సైతం సిద్ధమవుతోంది. ఈ క్రమంలో బుద్దా వెంకన్న ర్యాలీ పరిణామాలను ఆ పార్టీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎక్కడ ఏకపక్షంగా టీడీపీ తమ అభ్యర్థిని ప్రకటిస్తుందో అనే ఆందోళనతో పవన కల్యాణ్‌ను కలిసేందుకు సిద్దమవుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment