అది చంద్రబాబు మనస్తత్వం: మంత్రి అంబటి ఫైర్‌ | Ambati Rambabu Comments On Chandrababu Over Rajini Office Attack | Sakshi
Sakshi News home page

అది చంద్రబాబు మనస్తత్వం.. వాళ్ల అరాచకం ఇలాగే ఉంటుంది: మంత్రి అంబటి ఫైర్‌

Published Mon, Jan 1 2024 8:03 PM | Last Updated on Sun, Jan 28 2024 1:36 PM

Ambati Rambabu Comments On Chandrababu Over Rajini Office Attack - Sakshi

విజయవాడ, సాక్షి: ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ జనసేన కలిస్తే అరాచకం ఎలా ఉంటోందో ఇప్పుడు తెలిసొచ్చిందని ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. మంత్రి విడదల రజిని కార్యాలయంపై జరిగిన దాడిని ఖండించిన అంబటి.. అరాచకవాదులుగా టీడీపీ శ్రేణులు  తయారయ్యాయంటూ మండిపడ్డారు. 

మంత్రి రజినీ ఆఫీస్‌పై పక్కా ప్రణాళికతోనే దాడి చేశారని మంత్రి అంబటి మండిపడ్డారు. రజినినీ ఓడించలేకే దాడులకు పాల్పడుతున్నారన్నారు. దాడులు చేయడమే టీడీపీ లక్ష్యంగా చేసుకుందని.. ఈ క్రమంలోనే టీడీపీ కార్యకర్తలు అరాచకవాదులుగా తయారయ్యారన్నారు. ఎర్ర పుస్తకాల్లో(లోకేష్‌ రెడ్‌ బుక్‌ను ప్రస్తావిస్తూ..) పేర్లు రాసుకుని బెదిరిస్తారా? అని అంబటి ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఒక మహిళా మంత్రిపై.. అందునా బీసీ నేతపై దాడి మంచిది కాదని అంబటి హితవు పలికారు. రాష్ట్రంలో టీడీపీ జనసేన కలిస్తే అరాచకం ఎలా ఉంటోందో ఇప్పుడు తెలిసిందని చెప్పారు. కుప్పంలో చంద్రబాబు గెలిచే పరిస్థితి లేదని ఎద్దేవా చేశారు. ఓటమి భయంతోనే ఇలాంటి దాడులకు దిగుతున్నారన్నారు.

ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలన్నీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేశారని మంత్రి అంబటి రాంబాబు ఉద్ఘాటించారు. గతంలో రుణమాఫీ చేస్తానని చంద్రబాబు  రైతులను మోసం చేశాడు. రావణుడికి పది తలలు ఉన్నట్లే.. చంద్రబాబుకి పవన్‌ ఒక తలగా ఉంటుండని ఎద్దేవా చేశారు. సీఎం అయితేనే అసెంబ్లీకి వస్తాననే మనస్తత్వం చంద్రబాబుదని.. పదవిపై చంద్రబాబుకి ఎందుకంత వ్యామోహమే అర్థం కావట్లేదన్నారు మంత్రి అంబటి. అయితే.. వందమంది కలిసివచ్చినా సీఎం జగన్‌ను ఓడించలేరని.. వచ్చే ఎన్నికల కోసమే 175 మంది సభ్యుల టీమ్‌ను సిద్ధం చేస్తున్నారని అంబటి చెప్పారు.

ఇంకా మంత్రి అంబటి రాంబాబు ఏమన్నారంటే...
– అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.
– ఈ సందర్భాన నూతన సంవత్సరం మొదటి రోజునే వృద్ధాప్య, వితంతు పింఛన్లను రూ.3వేలకు పెంచి ఇవ్వడం జరుగుతోంది.
– ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమానికి రాజకీయంగా కూడా ఒక ప్రాముఖ్యత ఉంది.
– అదేమంటే, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికల ప్రచారంలో తెలుగుదేశం ప్రభుత్వం ఇస్తున్న రూ.వెయ్యి పింఛన్‌ను అధికారంలోకి రాగానే రూ.2వేలు చేస్తానని హమీ ఇవ్వడం జరిగింది. ఆ సందర్భంలో ఆయన ఇంకో మాట కూడా అన్నారు. నేను రూ.వెయ్యి పింఛన్‌ను రూ.2వేలు చేస్తానంటున్నాను.. చంద్రబాబు ఇంకా మరో రెండు మాసాలు అధికారంలోనే ఉంటారు కనుక నా మాటను కాపీ కొట్టి ఆయన రూ.2వేలు చేస్తారేమో.. అదే జరిగితే, నేను అధికారంలోకి రాగానే రూ.3వేల వరకు పెంచుకుంటూ పోతానన్నారు.
– ఆ ప్రకారంగానే ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.2,250 నుంచి పెంచుకుంటూ ఈరోజుకు రూ.3వేల పింఛన్‌ను అందిస్తోన్నారు.
– ఈనెల మూడోతేదీ నుంచి ప్రతీ వాలంటీర్‌ ఇంటింటికీ వెళ్లి రూ.3వేల చొప్పున పింఛన్‌ను అందించడంతో .. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న దమ్మున్న ముఖ్యమంత్రిగా శ్రీ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజలకు చేరువ కాబోతున్నారు.

బాబు, పవన్‌ల ప్రగల్భాలకు రెస్పాన్స్‌ నిల్‌.. 
– ప్రజలంతా ఒకసారి ఆలోచించాలి. ఇచ్చిన ప్రతీ మాటను నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గారు. అదే, ఇచ్చిన ప్రతీ వాగ్దానాన్ని బుట్టదాఖలా చేసింది చంద్రబాబు నాయుడు.
– ఈ వ్యత్యాసాన్ని గమనించిన ప్రజలు రేపటి ఎన్నికల్లో మళ్లీ చంద్రబాబును తుక్కుతుక్కుగా ఓడించేందుకు సిద్ధంగా ఉన్నారు.
– ఇదే విషయాన్ని తెలుసుకున్న చంద్రబాబు ఎవరు దొరికితే వాళ్లతో సయోధ్య చేసుకోవాలని వెంపర్లాడుతున్నాడు.
– దాన్లో భాగంగానే జనసేనతో కలిసి పనిచేయాలనుకున్నాడు. ఆ రెండు పార్టీలు పొత్తు పెట్టుకుని ఓట్లు చీలకుండా జగన్‌ గారిని అధికారంలో నుంచి దించేస్తామని ప్రగల్భాలు పలుకుతున్నాడు.

దాడులకు తెగబడుతున్న తెలుగుదేశం పార్టీ
 – చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌ కలయికలో రాష్ట్రంలో రాజకీయాలు మారతాయని ఆశపడ్డారు. అయితే, వారిద్దరి పొత్తుపై ఏ విధమైన రెస్పాన్స్‌ ప్రజల్లో లేదని గమనించాక.. ఇక, లాభం లేదనుకుని వైఎస్‌ఆర్‌సీపీ పైన దాడులకు తెగబడుతున్నారు.
– నిన్న గుంటూరులో జరిగిన ఒక ఘటనకు కారణమిదే. చిలకలూరిపేట శాసనసభ్యురాలు, రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రిగా ఉన్న శ్రీమతి విడదల రజినీని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ వైఎస్‌ఆర్‌సీపీ పార్టీ ఇంచార్జిగా నియమించారు. నూతన సంవత్సరం మొదటి రోజు నుంచి ఆమె ఇక్కడ ఆఫీసు నుంచి పనిచేయడానికి సర్వం సిద్ధమైన క్రమంలో రాత్రి 12 గంటల సమయంలో పార్టీ ఆఫీసుపై దాడులకు పాల్పడ్డారు.
– ఆఫీసును పూర్తిగా ధ్వంసం చేయడానికి ప్రయత్నించారు. రాళ్లు వేశారు. బ్యానర్లు చించేశారు.
– స్పాట్‌లోనే పోలీసులొచ్చి ఆ దాడి చేస్తున్న ఒక గుంపును పట్టుకున్నారు. ఆ గుంపులో ఎవరున్నారంటే, అందరూ తెలుగుదేశం పార్టీ వాళ్లే.
– తెలుగుదేశం పార్టీ మనుషులు ప్రీప్లాన్డ్‌గా మంత్రి రజినీ గారి ఆఫీసు మీద దాడిచేసి హింసాత్మకంగా అరాచకాలను సృష్టించడం చాలా దురదృష్టకరం.

ఉగ్రవాదులు, అరాచకశక్తులు వారు
 – ఒక బీసీ మహిళ అయిన విడదల రజినీ గుంటూరులో పోటీ చేస్తుంటే.. మీకెందుకంత కడుపు మంట..?
– దమ్ముంటే, ఆమెను ఢీకొట్టి గెలవాలి. మీరు గెలిచి ఆమెను ఓడించే పరిస్థితి లేదని తెలుసుకున్నారు గనుకే వారి పార్టీ ఆఫీసుపై దాడి చేశారు. ఇది ఎంతవరకు సబబు..? – తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఒక ఉగ్రవాదులుగా, హింసావాదులు, అరాచకశక్తులుగా తయారయ్యారు. అధికారమెటూ రాదని .. అరాచకానికి పూనుకున్నారా..?
– ఎప్పుడైతే, తెలుగుదేశం పార్టీ జనసేనతో జతకట్టిందో..ఈ రాష్ట్రంలో ఒక అరాచకాన్ని సృష్టించేందుకు వారు కంకణం కట్టుకున్నారు.
– వారి పొత్తుపై ఎటూ ప్రజల్లో స్పందన కనిపించడం లేదు గనుక .. అధికారంలోకి ఎటూ రాలేము కనుక.. రాష్ట్రంలో ఒక అరాచకాన్ని సృష్టించి వైఎస్‌ఆర్‌సీపీపై దాడులు చేసి, పోలీసువారిపైనా దాడులకు పాల్పడి ఏదో సాధించాలనే మీ తాపత్రయం చాలా దురదృష్టకరం.

రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేందుకు కుట్ర
 – ఇదే సందర్భంలో నేనొక సంఘటనను గుర్తుచేస్తున్నాను. ఖమ్మంలో ఓ పెళ్లి కార్యక్రమానికి హాజరయ్యేందుకు నేనెళితే.. నా మీద కూడా దాడి చేయడానికి తెలుగుదేశం పార్టీ వాళ్లే ప్రయత్నించారు.
– వారంతా ఒకే సామాజికవర్గానికి చెందిన వారు. ఆరోజు నామీద దాడి చేసి నన్ను అల్లరిపాల్జేయాలని చూశారు.
– ఈ విధంగా ఎక్కడబడితే అక్కడ దాడులకు పూనుకుని.. రాష్ట్రంలో అలజడులు, అరాచకం కలిగిస్తున్నారు.
– తెలుగుదేశం పార్టీకి జనసేన పార్టీ తోడైంది కాబట్టి మేం రాష్ట్రంలో ఎన్ని దాడులు చేసినా.. ఎంత అరాచకం సృష్టించినా అడ్డుకునేవారు లేరని భావిస్తున్నారు వారు. అందుకే, తెలుగుదేశం పార్టీ మనుషులు విచ్చలవిడిగా దాడులకు తెగబడుతున్నారు.
– ఆ రెండు పార్టీల కలయికతో జరుగుతున్న దాడుల కారణంగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి వారు సిద్ధపడ్డారనేది కనిపిస్తోంది.

పవన్‌కళ్యాణ్‌ పెద్ద అరాచకశక్తి
 – జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్‌ అందరూ చూస్తుండగా.. కాలి చెప్పు తీసి కొడతానంటాడు. ఇదెక్కడి విడ్డూరం. ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడైన వ్యక్తి అలా చేస్తాడా..?
– రెండుచోట్ల పోటీచేసి ఓడిపోయిన వ్యక్తి అతడు. తాను ముఖ్యమంత్రి కావాలని కోరుకోకపోయినా.. ఆయన్ను అభిమానించే వ్యక్తులు మాత్రం అలా కోరుకోవడం సహజం.
– అలాంటి వ్యక్తి తాను ఒక పార్టీకి అధ్యక్షుడినని మరిచి బూతులు తిడుతూ.. కాలి చెప్పు చేతబట్టుకుని వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేల్ని కొడతాననడం.. పెద్ద అరాచకం కాదా..? ఆయనో పెద్ద అరాచక శక్తి కాదా..?
– అలాంటి అరాచక శక్తితో కలిసి చంద్రబాబు రాష్ట్రంలో అరాచకాల్ని సృష్టించేందుకు ప్రయత్నించడం చాలా దురదృష్టకరం.

దుర్మార్గుల్లా తండ్రీకొడుకుల బెదిరింపులు
– చంద్రబాబు ఆ వయసులో కూడా పోలీసుల మీదికి తన పార్టీ మనుషుల్ని దాడి చేయమని ఉసిగొల్పుతాడా..? తరమండి.. కొట్టండి అంటూ బహిరంగంగా రెచ్చగొట్టి పంపుతాడు. ఏంటి ఈ దౌర్భాగ్యం..?
– ఇంత అరాచకానికి కారణమేంటి..? ఎందుకంత మీకు ఫ్రస్టేషన్‌..?
– మీరు అధికారంలోకి రాలేమనే కదా.. ఈ విధమైన దాడులు, రెచ్చగొట్టడాలు చేస్తుందని ప్రశ్నిస్తున్నా..
– ఇక, ఆయన కొడుకుల్లో దత్తపుత్రుడు కాకుండా సొంతపుత్రుడు లోకేశ్‌ ఒక ఎర్రబుక్కులో తాను టార్గెట్‌ చేసిన వారి పేర్లు రాశాడంట. అధికారంలోకి రాగానే వారి తాట తీస్తాడంట. అది ఎర్రబుక్కో... ఎర్రిబుక్కునో తెలియదు గానీ ఏంటి మీ బెదిరింపులు..?
– చంద్రబాబు, లోకేశ్, పవన్‌కళ్యాణ్‌ ఇలాంటి దుర్మార్గమైన పరిస్థితులకు దిగజారిపోయారు.
– మీరంతా అధికారుల్ని బెదిరించాలనుకున్నా.. ప్రజల్ని భయపడాలని కోరుకుంటున్నా.. ఇక్కడ వణికేవారెవరూ లేరన్నది సంగతిని మీరు గ్రహించాలి.

ఆ రెండుపార్టీలకు అధికారం కలే
– ఈ రాష్ట్రంలో ఎన్ని అరాచకాలు సృష్టించినా.. దాడులకు పాల్పడి ఎంతమందిని భయపెట్టినా.. తెలుగుదేశం పార్టీ, జనసేన పొత్తు కూటమి అధికారంలోకి రాలేదు.. రాదు.
– ఈ విషయం అందరికన్నా ముందు గ్రహించిన వారు ఆ రెండు పార్టీల నేతలే. కుప్పంలోనే చంద్రబాబు గెలిచే పరిస్థితి లేదు.

నాన్‌లోకల్‌ నేతలు మీరు
– మొన్న కుప్పంలో ఆయన మాట్లాడుతూ.. తనను మళ్లీ గెలిపిస్తే కుప్పంను ప్రపంచానికి అనుసంధానం చేస్తానంటున్నాడు. అక్కడ ఎయిర్‌పోర్టు పెట్టి కూరగాయలు ఎగుమతి చేస్తాడంట.
– ఏమయ్యా చంద్రబాబూ.. నువ్వేమైనా కొత్తగా రాజకీయాల్లో కొస్తున్నావా..? కొత్తగా ఎన్నికల్లో నిలబడుతున్నావా..? కొత్తగా ముఖ్యమంత్రి కావాలని అనుకుంటున్నావా..?
– 14 ఏళ్లపాటు నువ్వు ముఖ్యమంత్రిగా పనిచేశావే.. మరి, అప్పుడు కుప్పం నియోజకవర్గానికి ఏం చేశావు..? అప్పుడు చేయనివాడివి.. ఇప్పుడు చేస్తానంటే నమ్మడానికి కుప్పం ప్రజలేమైనా అమాయకులా..?
– నువ్వు అధికారంలో ఉన్నప్పుడు కనీసం, కుప్పంకు రెవెన్యూ డివిజన్‌ను తీసుకురాలేకపోయావు. ఇది ఎంత హాస్యాస్పద విషయం.
– కనీసం, కుప్పంను మున్సిపాల్టీ కూడా చేసుకోలేకపోయావు. ఆ నియోజకవర్గంలో అదీఇదీ చేస్తానన్న పెద్దమనిషివి..మరి, కనీసం అక్కడ నువ్వు సొంత కొంప కట్టుకున్నావా..?
– కుప్పం వస్తే గెస్టుహౌస్‌లో ఉంటున్నావు. హైదరాబాద్‌ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు వస్తే కరకట్టమీదనున్న లింగమనేని వారి గెస్టుహౌస్‌లో ఉండాల్నా..?
– అదే పవన్‌కళ్యాణ్‌ ఈ రాష్ట్రానికొస్తే నోవాటెల్‌ హోటల్‌లో ఉండాలి. సొంత ఇళ్లులేని నేతలు మీరు. ఇంతకంటే, ప్రజలు మీ గురించి చర్చించుకోవాల్సిన దౌర్భాగ్యం మరొకటి ఉంటుందా..? నాన్‌లోకల్‌ నేతలు మీరు.
– అలాంటి మీరు ఈ రాష్ట్రాన్ని ఏదో ఉద్దరిస్తామంటే.. కుప్పం ప్రజలే కాదు. ఈ రాష్ట్రంలో ఏ ఒక్కరూ నమ్మరు గాక నమ్మరని మీరు గమనించండి.

పది తలల చంద్రబాబుకు ఒక తల పవన్‌కళ్యాణ్
 – చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌ పార్టీల కలయిక ఆరోగ్యకరం కాదు. పది తలల రావణాసురుడు చంద్రబాబు అయితే.. ఆయనకున్న ఒక తల పవన్‌కళ్యాణ్‌.
– కనుకే, బాబు నోట వినిపించని మాటల్ని పవన్‌కళ్యాణ్‌ చేత చెప్పిస్తుంటాడు.
– హౌసింగ్‌లో అవినీతి జరిగిందని.. సీబీఐతో ఎంక్వైరీ చేయించాలని కేంద్రానికి పవన్‌కళ్యాణ్‌ లేఖ రాయడం కూడా అందులో భాగమేనని ప్రజలు అర్ధం చేసుకోవాలి.
– వీరి ఇద్దరి కలయికతో ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడమే తప్ప వారివల్ల ఈ రాష్ట్రానికి ఏమీ ప్రయోజనం ఉండదని ప్రజలు గమనించాలని కోరుతున్నాను.

అరాచకశక్తుల్ని ఉక్కుపాదంతో అణచివేస్తాం
– రాజకీయ కుట్రలు, వ్యూహాలు పన్ని వైఎస్‌ఆర్‌సీపీ మీద, మా పార్టీ నాయకులపైన దాడులు చేస్తామంటే ఇక్కడెవరూ భయపడేది లేదు.
– మీరు ఒక బీసీ మహిళ ఆఫీసుపై దాడిచేస్తారా.? చట్టం ఊరుకుంటుందనుకుంటున్నారా..? మిమ్మల్ని ఉక్కుపాదంతో అణచివేస్తాం.. జాగ్రత్త
– అరాచకశక్తులకు ఈ రాష్ట్రంలో తావులేదని హెచ్చరిస్తున్నా.
– చంద్రబాబు, పవన్‌కళ్యాణ్, లోకేశ్‌తో పాటు నిన్న మంత్రి గారి ఆఫీసుపైన రాళ్లేసిన వెధవలైనా .. ఎవరైనా గానీ అరాచకం సృష్టించాలనుకుంటు.. చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదు. పట్టుకుంటాం. అరెస్టులు చేస్తాం.. చట్టపరంగా తగిన శిక్ష విధించే వరకు పోరాడతామని హెచ్చరిస్తున్నాను. ప్రభుత్వం, చట్టం తన పని తాను చేసుకుంటూ ముందుకెళ్తుంది.
– కనుక, ఇప్పటికైనా తెలుగుదేశం పార్టీ, జనసేన కలిసి ఏదో నాలుగు సీట్లల్లో గెలిచేందుకు పనిచేయండి గానీ.. మీరిద్దరూ ఈ రాష్ట్రంలో అరాచకాలు చేయడానికి పనిచేస్తామంటే ప్రజలు మిమ్మల్ని తరిమి తరిమి కొడతారని హెచ్చరిస్తున్నాను.
చదవండి: మంత్రి రజిని ఆఫీస్‌పై దాడి.. 30 మంది అరెస్ట్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement