ఎన్టీఆర్, సాక్షి: పొత్తు సంగతి ఏమోగానీ జనసేన నేతల్లో టెన్షన్ పెరిగిపోతోంది. ఒకవైపు టీడీపీ అధినేత చంద్రబాబు సీట్ల పంపకంపై ఎటూ తేల్చకుండానే.. ఏకపక్షంగా అభ్యర్థుల్ని ప్రకటించుకుంటూ పోతున్నారు. మరోవైపు జనసేనాని తన పోటీ విషయంలోనే కాదు.. సీట్ల విషయంలోనూ స్పష్టత లేకుండా పోయారు. ఈ పరిణామాల నడుమ.. ఈ దఫా అసెంబ్లీ ఎన్నికల్లో పట్టుమని పదిహేను స్థానాల్లో కూడా పోటీ చేస్తామో? లేదో? అనే ఆందోళనలో ఉన్నారు. పదేళ్లుగా పార్టీ కోసం కష్టపడ్డందుకు ఫలితం ఇదేనా అని పవన్‌ను నిలదీసేందుకు ‘సిద్ధం’ అవుతున్నారు.
పొత్తు రాజకీయాల్లో మునుపెన్నడూ లేని చిత్రమైన పరిణామాలకు ఏపీ కేంద్రంగా మారింది. ఒక పార్టీ అధినేత అయ్యి ఉండి కూడా పోటీ విషయంలో పవన్ ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. పొత్తు ధర్మం పాటించలేదని బాబుపై అసంతృప్తి మాత్రమే వ్యక్తం చేస్తూ.. ఆ జట్టును వీడేది లేదంటూ పాత పాటే పాడుతున్నారు. అదే సమయంలో టీడీపీ నేతలకు పవన్ అపాయింట్‌మెంట్ ఇస్తుండడం.. తమ టికెట్లకు ఎసరు పెట్టొద్దన్న వాళ్ల(మాగంటి బాబు, వేదవ్యాస్, జలీల్‌ఖాన్‌లాంటి వాళ్లు) విజ్ఞప్తులను పరిశీలిస్తానని చెప్తుండడంపై జనసేన నేతలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.
ఉమ్మడి కృష్ణా జిల్లాలో తమ పోటీకి అనుకూలంగా మొదటి నుంచి భావిస్తున్న సీటు.. విజయవాడ వెస్ట్. అయితే దాని కోసం టీడీపీ నేతలు తన్నుకున్నంత పని చేస్తుండడం.. ఆ పరిణామాలపై చంద్రబాబు మౌనంగా ఉండడం.. వెరసి ఆ సీటు వదులుకోవాల్సి వస్తుందేమో అనే ఆందోళనలో ఉన్నారు.
విజయవాడ వెస్ట్‌కు తెలుగు దేశంలో మామూలు పోటీ లేదు. ఒకవైపు బుద్ధా వెంకన్న ఆ సీటును చంద్రబాబు తనకే ఇస్తారని ఆశతో ఉన్నారు. దుర్గగుడిలో ప్రత్యేక పూజలు బైక్ ర్యాలీతో బలప్రదర్శన నిర్వహించుకున్నారు. అదే సమయంలో మైనారిటీ వర్గాలకే ఆ టికెట్ కేటాయించాలంటూ జలీల్‌ఖాన్ తెరపైకి వచ్చారు. తమ సామాజిక వర్గం తరఫున తనకే టికెట్ దక్కుతుందని ధీమా ప్రకటించారు. బుద్దాకు కౌంటర్‌గా ఇవాళ(శుక్రవారం) వన్‌టౌన్‌లో బలప్రదర్శన పేరిట ర్యాలీ నిర్వహించారు. ఇక ర్యాలీల పర్వం చూస్తున్న జనసేనలో టెన్షన్ పెరిగిపోతోంది.
విజయవాడ వెస్ట్ నుంచి పోతిన వెంకట మహేష్ టికెట్ ఆశిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే చాలాకాలం నుంచి బరిలో తానే నిలవబోయేదని ఇంటర్వ్యూలు ఇస్తూ వస్తున్నారు. అయితే తాజా పరిణామాలు ఆయనకు మింగుడుపడడం లేదు. ఈ విషయంపై పవన్‌ను కలిసి చర్చించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
పోటీ యాత్రలు..
మరోవైపు.. ఇలాగే చూస్తూ ఊరుకుంటే.. విజయవాడ వెస్ట్‌లోనే కాదు ఇంకా చాలా నియోజకవర్గాల్లో ఇలాంటి పరిస్థితులే ఎదురు కావొచ్చని జనసేన నేతలు ఒక అంచనాకి వచ్చారు. జనసేనకు కాస్తో కూస్తో బలం, పేరు ఉన్న చోట్ల కూడా టీడీపీ నేతలు పాదయాత్రలు, బలనిరూపణలు చేసుకుంటూ కొట్లాడుకుంటున్నారు. ఈ క్రమంలో పోటీ యాత్రలకు సిద్దం అవుతున్నారు. ఇప్పటికే పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలంలో జనసేన బొర్రా వెంకట అప్పారావు మహా పాదయాత్రకు సిద్ధం కాగా, గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో బలం చూపించుకోవాలని జనసేన తాపత్రయపడుతోంది. ఎన్నికలకు సమయం సమీపిస్తుండడంతో ఇకనైనా ఈ అంశంపై సీరియస్‌గా దృష్టి సారించాలని.. చంద్రబాబుతో తాడోపేడో తేల్చుకోవాలని.. టీడీపీ నేతల దూకుడుకు కళ్లెం వేయించే దిశగా పవన్‌పై ఒత్తిడి పెంచేందుకు జనసేన నేతలు ‘సిద్ధం’ అవుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment