ఏ పార్టీ కనిపిస్తే ఆ పార్టీతో పొత్తుకు సిద్ధమవుతున్న టీడీపీ అధినేత చంద్రబాబుకు సొంత పార్టీలో తలనొప్పులు ఎక్కువవుతున్నాయి. గెలిచేది లేకపోయినా..టిక్కెట్ కోసం మాత్రం పోటీ ఎక్కువవుతోంది. ఈ మధ్యలో జనసేన నేతలు సీన్‌లోకి ఎంటరై పొత్తులో భాగంగా ఈ సీటు మాదే అంటున్నారు. ఇప్పుడు బెజవాడ వెస్ట్ నియోజకవర్గంలో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఏం చేయాలో తెలియక చంద్రబాబు తల పట్టుకుంటున్నారని టాక్. ఆఖరు నిమిషం వరకు టిక్కెట్ల విషయం తేల్చే అలవాటు చంద్రబాబుకు లేదని అందరికీ తెలుసు.
అందుకే బెజవాడ వెస్ట్ తమ్ముళ్ళు చివరి వరకు మేము ఆగలేమని..వెంటనే తేల్చాలని పార్టీ అధినేతను డిమాండ్ చేస్తున్నారని సమాచారం. టీడీపీ ఆవిర్భవించాక 1983లో ఒకే ఒక్కసారి ఇక్కడ పచ్చ జెండా ఎగిరింది. ఈ నలభై ఏళ్ళ కాలంలో మళ్ళీ అక్కడ టీడీపీ జెండా ఎగిరింది లేదు. కాని ఈసారి ఎలాగైనా గెలవాల్సిందే అని చంద్రబాబు అక్కడి నేతలకు హుకుం జారీ చేశారట. ఇప్పుడు బుద్ధా వెంకన్న, జలీల్‌ఖాన్‌లు టిక్కెట్ కోసం పట్టుబడుతున్నారు.
తమ మనసులో మాట అప్పుడప్పుడు అధిష్టానానికి వినిపించే ప్రయత్నం చేసిన బుద్ధా వెంకన్న , జలీల్ ఖాన్ ఇప్పుడు టిక్కెట్ కోసం నేరుగా పంచాయతీ పెట్టేస్తున్నారట. తాజాగా బుద్ధా వెంకన్న వెస్ట్ నియోజకవర్గంలో తనకు ఉన్న బలం చంద్రబాబుకు తెలియచేసేందుకు ఓ ర్యాలీ నిర్వహించారు. పశ్చిమ టీడీపీ టిక్కెట్ కోసం తాను పెట్టుకున్న అప్లికేషన్ ను ర్యాలీగా వెళ్లి బెజవాడ దుర్గమ్మ సన్నిధిలో ఉంచి మరీ పూజలు చేయించాడట. తెలుగుదేశం పార్టీ, అధినేత చంద్రబాబు, ఆయన కుటుంబంపై ఈగ వాలకుండా చూసుకుంటున్న తనకే టిక్కెట్ అడిగే హక్కు ఉందని బుద్ధా వెంకన్న అంటున్నారు.
తనకే టిక్కెట్ ఇచ్చి తీరాలంటూ పబ్లిక్‌గానే తన డిమాండ్ ను చంద్రబాబు ముందు ఉంచారట. ఒకవేళ పొత్తులో భాగంగా వెస్ట్ టిక్కెట్ ఇవ్వడానికి కుదరకపోతే అనకాపల్లి ఎంపీ టిక్కెట్ ఇవ్వాలని తన డిమాండ్ల చిట్టాను చంద్రబాబుకు వినిపించారట. గతంలో ఒకసారి తనకు టిక్కెట్టివ్వకపోతే ఎక్కడ స్విచ్ వేస్తే.. ఎక్కడ బల్బు వెలుగుతుందో తనకు తెలుసని బెదిరించిన బుద్ధా తాజాగా చేసిన వ్యాఖ్యలు బెజవాడ టీడీపీలో రచ్చకు దారి తీసాయి.
ఇదిలా ఉంటే నాకేం తక్కువ అంటూ మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ టిక్కెట్ రేస్ లోకి దూసుకొచ్చారు. బుద్ధా వెంకన్న ర్యాలీ నిర్వహించాడని తెలియగానే... నేనే లోకల్...నాకే టిక్కెట్టివ్వాలంటూ జలీల్ ఖాన్ పార్టీ నాయకత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఎవడు పడితే వాడు టిక్కెట్ అంటే కుదరదు...టీడీపీ కూడా పశ్చిమ టిక్కెట్ ను మైనార్టీలకు కేటాయించాలి...ఆ టిక్కెట్ తనకే ఇవ్వాలి అని చంద్రబాబును నిలదీస్తున్నారట. తనకు బెజవాడ వెస్ట్ టిక్కెట్ ఇవ్వకపోతే ఉరేసుకుంటానని జలీల్‌ఖాన్ బెదిరిస్తున్నారట.
టీడీపీ నాయకత్వాన్ని డిమాండ్ చేయడంతో పాటుగా.. పవన్ కళ్యాణ్‌ను కూడా అర్థిస్తున్నారట. వెస్ట్ టిక్కెట్ కోసం జనసేన పట్టుపట్టవద్దని తనకే మద్దతుగా నిలవాలని పవన్‌ను ప్రత్యేకంగా కలిసి విజ్ఞప్తి చేశారట. తనకు టిక్కెట్ ఇవ్వకపోతే పరిణామాలు వేరేలా ఉంటాయని చంద్రబాబును జలీల్‌ఖాన్ వార్నింగ్ ఇస్తున్నాడట. ఇలా ఓ వైపు బుద్ధా వెంకన్న...మరోవైపు జలీల్ ఖాన్ టిక్కెట్ కోసం కుస్తీ పడుతుంటే..పశ్చిమ నియోజకవర్గం జనసేన శ్రేణుల్లో కలవరం మొదలైందని టాక్.
పొత్తులో భాగంగా పశ్చిమ టిక్కెట్ జనసేనకు వస్తుందని నియోజకవర్గ జనసేన సమన్వయకర్త పోతిన మహేష్ గంపెడాశతో ఉన్నారు. ఇప్పుడు తెలుగు తమ్ముళ్లు టిక్కెట్ కోసం కొట్లాడుకోవడంతో తనకు దక్కకుండా పోతుందనే ఆందోళన పోతిన మహేష్‌కు పెరిగిపోతోందట. అందరితోనూ పొత్తులు పెట్టుకుంటూ సంతోషపడుతున్న చంద్రబాబుకు టిక్కెట్ల విషయంలో సొంత పార్టీ నేతలతోనే తలనొప్పులు ఎదురవ్వడంతో దిక్కు తోచడంలేదని చెబుతున్నారు. మరి బెజవాడ వెస్ట్‌లో ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment