పూజల్లో మాజీ మంత్రులు ఉమా, రవీంద్ర(ఫైల్)
సాక్షి ప్రతినిధి, విజయవాడ: సార్వత్రిక ఎన్నికల్లో సీట్ల కోసం టీడీపీ నేతలు నానాపాట్లు పడుతున్నారు. ఆ పార్టీ ఉనికి కోసం నేతలు ఫీట్లు చేస్తున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఎంపీ, ఎమ్మెల్యే టికెట్ల కోసం ఆ పార్టీ నేతలు కొందరు పూజలు చేస్తుంటే, మరికొందరు వివాదాస్పద వ్యాఖ్యలతో చర్చనీయాంశమవుతున్నారు. టీడీపీతో పొత్తులో ఉన్న జనసేన నేతలు కూడా టికెట్ తమకేనంటూ నియోజకవర్గంలో తిరుగుతున్నారు. ప్రతి ఒక్కరూ టికెట్ కోసం పాట్లు పడుతున్నారు.
పశ్చిమలో మూడు ముక్కలాట
ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పశ్చిమ నియోజక వర్గంలో సీటు కోసం టీడీపీలో మూడు ముక్కలాట నడుస్తోంది. ఆ పార్టీ ఆవిర్భావ సమయంలో తప్ప ఈ నియోజక వర్గంలో టీడీపీ గెలిచిన దాఖలాలు లేవు. నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ బలంగా ఉంది. పార్టీ ఆవిర్భావం నుంచి వైఎస్సార్ సీపీ అభ్యర్థులే విజయబావుటా ఎగరేస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అమలుచేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు నియోజక వర్గ ప్రజల్లో విశేష ఆదరణ పొందాయి. దీంతో పార్టీ నేతలు జోష్‌లో ఉన్నారు. భారీ మెజార్టీతో గెలుపే లక్ష్యంగా వైఎస్సార్ సీపీ ‘పశ్చిమ’ ఇన్‌చార్జి ఆసిఫ్, స్థానిక నేతలను కలుపుకొని ప్రభుత్వ, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ దూసుకుపోతున్నారు.
టీడీపీలో ఎవరి గోల వారిదే..
పశ్చిమ నియోజక వర్గంలో పార్టీకి బలం లేదని తెలిసినా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, లోకేష్ వద్ద మెప్పు కోసం ఇక్కడ టీడీపీ నాయకులు హడావుడి చేస్తున్నారు. ఎటూ సీటురాదు, వచ్చినా గెలిచే అవకాశం లేదని స్పష్టంగా తెలిసినా పేపరు పులిగా పేరొందిన బుద్దా వెంకన్న తమకు సీటు కేటాయించాలని ర్యాలీ చేసి హడావుడి చేస్తున్నారు. ఇటీవల కొంత మంది ముస్లిం నేతలు, తమ సామాజిక వర్గానికే సీటు కేటాయించాలని హంగామా చేస్తున్నారు. విజయవాడ టికెట్ తనదేనని టీడీపీ నేత జలీల్‌ఖాన్ ప్రకటించుకున్నారు.
‘అందరు టికెట్టు అడుగుతారుకానీ గెలిచే స్థోమత ఉండాలి. మంచి విలువలు ఉండాలి. నాకు సీటు ఇవ్వకపోతే ముస్లిం మైనార్టీలు ఉరి వేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు.’ అని జలీల్‌ఖాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమైంది. మరో ముస్లిం మైనార్టీ నేత ఎంఎస్ బేగ్ తనదే టికెట్ అని ప్రచారం చేసుకుంటున్నారు. మరోవైపు జనసేన నేత పోతిన మహేష్ పొత్తులో భాగంగా తమకే టికెట్ కేటాయిస్తారని ధీమాగా నియోజక వర్గంలో తిరుగుతున్నారు. పశ్చిమలో టీడీపీ, జనసేనలో ఎవరికివారే తమదే సీటు అని చెప్పుకొని నాయకులు తిరుగుతుంటే, అరకొరగా ఉన్న పార్టీ నేతలు, క్యాడర్ అయోమయానికి గురవుతున్నారు.
సీనియర్ నేతలు కూడా..
టీడీపీలో సీనియర్ నేతలమంటూ గొప్పలు చెప్పుకొనే కొంత మంది, తమ నియోజక వర్గంలో వ్యక్తమవుతున్న తీవ్ర అసంతృప్తికి తోడు, పట్టుకోల్పోయి, టికెట్ మీద ఆశలు సన్నగిల్లి పూజలు చేస్తున్నారు. మాజీ మంత్రి దేవినేని ఉమా ఇటీవల కృష్ణా తీరంలో చేసిన పూజలే నిదర్శనం. ఇది టీడీపీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పూజలపై రకరకాల ఊహాగానాలు వినిపించాయి. పేరుకు మాత్రం చంద్రబాబును సీఎం చేయడానికి పూజలు చేస్తున్నామని కలరింగ్ ఇస్తున్నా నియోజకవర్గంలో తమకు సీటుతోపాటు, గెలుస్తామనే నమ్మకం లేకనే, పూజలు చేసుకుంటూ కాలం వెళ్లబుచ్చుతున్నారనే విమర్శలు ఉన్నాయి.
మచిలీపట్నంలో..
కృష్ణా జిల్లాలోని మచిలీపట్నంలో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర పూజలు చేయడం దానికి దేవినేని ఉమా సైతం హాజరయ్యారు. ఇటీవల విజయవాడ గురునానక్ కాలనీ సమీపంలో మూడు రోజులపాటు టీడీపీ నేత కేశినేని చిన్ని సైతం యాగం చేశారు. ప్రజల్లో విశ్వాసం కోల్పోయిన వీరు, చివరి ప్రయత్నంగా పలు కార్యక్రమాలు చేస్తూ గట్టెక్కాలని తాపత్రయ పడుతున్నారు. పార్టీ శ్రేణులను సమాయత్తం చేసి, నియోజక వర్గంలో తిరుగుతూ కార్యకర్తల్లో ధైర్యం నింపకుండా కాల హరణం చేస్తున్నారని టీడీపీలో కొందరు నేతలు విమర్శిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment