తెలుగు తమ్ముళ్ల బాహాబాహీ.. | A Fight Between TDP Political Leaders In Tiruvuru Constituency - Sakshi
Sakshi News home page

Kesineni Brothers War: తెలుగు తమ్ముళ్ల బాహాబాహీ..

Published Thu, Jan 4 2024 8:11 AM | Last Updated on Mon, Jan 29 2024 4:16 PM

A Fight Between TDP Political Leaders - Sakshi

పార్టీ ఆఫీసులో నాని, ఎంపీ వర్గీయుల రణరంగం

తిరువూరు: టీడీపీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. తిరువూరు నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో బుధవారం విజయవాడ ఎంపీ కేశినేని నాని, ఆయన సోదరుడు చిన్ని వర్గీయులు బాహాబాహీకి దిగారు. ఈ నెల 7న టీడీపీ అధినేత చంద్రబాబు తిరువూరు రానున్న సందర్భంగా ఏర్పాట్ల పరిశీలనకు విచ్చేసిన నాయకుల నడుమ ప్లెక్సీ వివాదం ఘర్షణకు దారితీసింది.  జిల్లా పార్టీ అధ్యక్షుడు నెట్టెం రఘురాం, ఎమ్మెల్యే గద్దె రాంమోహన్, మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణ, టీడీపీ నేత  నాగుల్‌మీరాలతో కలిసి కేశినేని నాని పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. ఈలోగా పార్టీ కార్యాలయం వద్ద నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జి దేవదత్‌ ఏర్పాటు చేసిన ప్లెక్సీలలో ఎంపీ నాని ఫొటో లేదంటూ ఆయన వర్గీయులు ఆందోళనకు దిగారు.

ఉద్దేశపూర్వకంగానే ఎంపీ ఫొటో ప్లెక్సీలో లేకుండా చేశారని ఆరోపిస్తూ కార్యాలయం బయట నాని వర్గం బైఠాయించింది. ఇందుకు నియోజకవర్గ ఇన్‌చార్జి దేవదత్‌ కారణమని ఆరోపిస్తూ ఆయనపై దాడికి యత్నించారు. స్థానిక నేతలు దేవదత్‌ను ఒక గదిలో ఉంచి తలుపులు వేశారు. బహిరంగ సభాస్థలిని పరిశీలించిన అనంతరం నాని సోదరుడు చిన్ని కూడా  పార్టీ కార్యాలయానికి విచ్చేశారు. చిన్నీ గో బ్యాక్‌ అంటూ నాని వర్గం గేటు వద్ద బైఠాయించగా, పోలీసులు చిన్నీని కార్యాలయంలోకి తీసుకెళ్ళారు. ఏర్పాట్లపై సమీక్ష జరిపే అవకాశం లేకుండా ఇరు వర్గాల కార్యకర్తలు టీడీపీ కార్యాలయ ఆవరణలో కుర్చీలు విసురుకుంటూ దాడులకు పాల్పడుతూ గందరగోళం సృష్టించారు.  జిందాబాద్, గో బ్యాక్‌ నినాదాలతో  సుమారు రెండు గంటల పాటు కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.

టీడీపీ ఆఫీసులో కుర్చీలు విసురుకుంటున్న కార్యకర్తలు 

ఎస్‌ఐపై కార్యకర్తల దాడి.. 
టీడీపీ వర్గవిబేధాల నేపథ్యంలో బుధవారం తిరువూరు పార్టీ కార్యాలయంలో ఘర్షణ పడిన కార్యకర్తలు పోలీసులపైనే దాడులకు పాల్పడ్డారు. రణరంగాన్ని తలపించే రీతిలో కార్యాలయంలో ఎంపీ కేశినేని నాని, ఆయన సోదరుడు చిన్నిల వర్గీయులు దాడికి తెగపడి కుర్చీలు విసురుకున్నారు. పరిస్థితి అదుపు చేయడానికి, శాంతిభద్రతల పరిరక్షణకు సీఐ అబ్దుల్‌ నబీ ఆధ్వర్యంలో పోలీసులు ఇరువర్గాలను చెదర గొట్టినప్పటికీ రెచ్చగొట్టే ధోరణిలో నాని, చిన్నీల అనుచరులు బీభత్సం సృష్టించారు. చేతికందిన వస్తువుల్ని విసురుకుంటూ కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న ఇరువర్గాలను పోలీసులు శాంతింపజేసే యత్నం చేసినా ప్రయోజనం లేకపోయింది.

గాయ‌ప‌డిన ఎస్ఐ స‌తీష్‌

తిరువూరు, గంపలగూడెం, ఎ.కొండూరు, విస్సన్నపేట మండలాల నుంచి నియోజకవర్గ స్థాయి సమావేశానికి వచ్చిన పార్టీ నేతలు, కార్యకర్తలు ఈ సంఘటనతో భయాందోళనలకు గురై పరుగులు తీశారు. దాడులకు పాల్పడవద్దని, శాంతియుతంగా వ్యవహరించాలని పదే పదే కోరినా ఫలితం లేకపోవడంతో లాఠీఛార్జీ చేసి అల్లరిమూకలను చెదరగొట్టేందుకు యత్నించిన పోలీసులపై కొందరు కుర్చీలు విసిరారు. ఈ దాడిలో తిరువూరు ఎస్‌ఐ సతీష్‌ తలకు బలమైన గాయమైంది. ఎట్టకేలకు ఏసీపీ రమేష్‌ ఆధ్వర్యంలో పోలీసులు ఇరువర్గాలను చెదర­గొట్టి పరిస్థితి అదుపులోకి తెచ్చారు. ఎస్‌ఐ సతీష్‌ను ఆసుపత్రికి తరలించారు. 

కవ్వింపు చర్యలకు పాల్పడిన ఇరువర్గాలు..
పార్టీ కార్యాలయంలో పరిస్థితి చేయి దాటుతున్నప్పటికీ ఎంపీ నాని, చిన్ని ఏమాత్రం వెనక్కు తగ్గకుండా మీడియాతో మాట్లాడేందుకు అత్యుత్సాహం ప్రదర్శించడంతో పోలీసులు సైతం అదుపు చేయలేకపోయారు. తోపులాటలో ఒక మహిళా కార్యకర్తకు సైతం గాయా­లయ్యాయి. చంద్రబాబు పర్యటన గురించి ఏమాత్రం సమీక్షించకుండానే గద్దె రామ్మోహన్, తిరువూరు మాజీ ఎమ్మెల్యే స్వామిదాసు తదితరులు వెళ్ళిపోయారు.

దళితుడిని కాబట్టి షటప్, గెటవుట్‌ అంటారా..
‘నేనొక దళిత నాయకుడిని. నన్ను షటప్, గెటవుట్‌ అంటారా. నాలుగు గోడల మధ్య మీరు అంటే సరిపోయిందా. బయటకు వచ్చి అందరి ముందు ఇవే మాటలు అనండ’ని తిరువూరు టీడీపీ నియోజకవర్గ ఇంఛార్జి ఎస్‌.దేవదత్తు విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్‌ (నాని)ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. కేశినేని నాని, ఆయన వర్గీయులు తాను ఏర్పాటు చేసుకున్న టీడీపీ కార్యాలయానికి వచ్చి పరుష పదజాలంతో దూషించారని ఆవేదన వ్యక్తం చేశారు. కేశినేని చిన్ని తన వర్గీయులతో కలిసి పక్కనే ఉండగా దేవదత్తు మాట్లాడిన అంశం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ఆయన మాటల్లోనే.. ‘దళితుడినైన నేను ఉన్నత విద్యను అభ్యసించి, 15 సంవత్సరాలు వివిధ దేశాల్లో పనిచేసి జ్ఞానం పొందా. నేనేదో సమావేశంలో మాట్లాడబోతుంటే నా ఆఫీసుకే వచ్చి నన్ను షటప్, గెటవుట్‌ అని కేశినేని నాని అంటారా.. నా ఆఫీసులో నాకు మాట్లాడే హక్కు లేదా? రెండు సార్లు గెలిచిన మీకే హక్కు ఉందా? మీరేనా నియోజకవర్గ నాయకులు. మేము కాదా. మాకు అవకాశం లేదా. మాకు చెప్పుకునే అర్హత లేదా. ఇంకా ఎంతకాలం మీరు దళితులపై ఇలా హీనంగా మాట్లాడతారు. ఏడు నియోజకవర్గాలను గెలిపిస్తామంటున్నారు. ఎక్కడ గెలిపించారు. మీరు మాత్రమే గెలిచారు. తక్కినవి ఓడిపోయారు’.

దాడి సంఘటనపై కేసు నమోదు 
స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తిరువూరు ఎస్‌ఐ సతీష్‌పై దాడికి పాల్పడిన సంఘటనపై కేసు నమోదు చేసినట్లు ఏసీపీ రమేష్‌ తెలిపారు. తిరువూరు పోలీసుస్టేషన్లో బుధవారం రాత్రి ఆయన విలేకరులతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలో ఇరువర్గాలు దాడికి పాల్పడుతుండగా అదుపు చేయడానికి యత్నించిన ఎస్‌ఐ సతీష్‌కు తీవ్ర గాయాలయ్యాయని తెలిపారు. ఎస్‌ఐపై దాడికి పాల్పడిన నిందితులను గుర్తించి అరెస్టు చేస్తామన్నారు.

నిందితులను అరెస్టు చేస్తాం..
తిరువూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద ఎస్‌ఐ సతీష్‌పై దాడికి పాల్పడిన సంఘటనపై కేసు నమోదు చేశాం. నిందితులు ఎంతటి వారైనా కఠిన చర్యలు తప్పవు. శాంతిభద్రతలు కాపాడటానికి యత్నించిన పోలీసులపై విచక్షణా రహితంగా దాడి చేయడం శోచనీయం. సమగ్ర దర్యాప్తు జరిపి నిందితులను గుర్తించి అరెస్టు చేస్తాం. – కాంతి రాణా టాటా, ఎన్టీఆర్‌ జిల్లా పోలీస్‌ కమిషనర్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement