ఎన్టీఆర్, సాక్షి: అన్నదమ్ముల మధ్య వర్గపోరు మరోసారి బహిరంగంగానే తీవ్రస్థాయిలో బయటపడింది. బుధవారం తిరువూరులో టీడీపీ సమన్వయ భేటీ సాక్షిగా కేశినేని నాని-కేశినేని చిన్ని వర్గీయులు బాహాబాహీకి దిగారు. చిన్నిని లోపలికి వెళ్లనీయకుండా నాని వర్గీయులు అడ్డుకోవడంతో పార్టీ ఆఫీస్ ప్రాంగణం రణరంగంగా మారింది. ఈ క్రమంలో.. అదుపు చేసేందుకు యత్నించిన పోలీసులపైనా దాడికి దిగారు. ఈ పరస్సర దాడిలో ఎస్సై సతీష్‌కు గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు.
ఈ నెల 7వ తేదీన తిరువూరులో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన ఉంది. ఈ ఏర్పాట్లను స్థానిక నేతలతో విడివిడిగా భేటీ అవుతూ ఆ అన్నదమ్ములిద్దరూ వేర్వేరుగానే పర్యవేక్షిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో ఇవాళ సమన్వయ భేటీ జరగ్గా.. దానికి జనసేన కార్యకర్తలు సైతం హజరయ్యారు. అయితే అక్కడ కేశినేని నాని ఫ్లెక్సీ లేకపోవడంతో ఆయన వర్గీయులు ఆగ్రహానికి గురయ్యారు. అక్కడే ఉన్న చిన్ని ఫ్లెక్సీని చించేశారు.
అయితే అందులో పవన్ కల్యాణ్ ఫొటో కూడా ఉండడంతో జనసైనికులు నొచ్చుకున్నారు. తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆ సమావేశం బహిష్కరిస్తూ వెళ్లిపోయారు. అదే సమయంలో తిరువూరు ఇన్‌ఛార్జి దత్తుపై నాని వర్గీయుల దాడి చేశారు. చిన్నిని లోపలికి రానివ్వబోమంటూ అడ్డుగా బైఠాయించారు.
ఇక.. ఈ పరిణామం గురించి తెలుసుకుని టీడీపీ కార్యాలయానికి చేరుకున్నారు కేశినేని చిన్ని. ఆయన్ని అడ్డుకునేందుకు నాని వర్గం ప్రయత్నించగా.. ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. దీంతో టీడీపీ నేతలు సర్దిచెప్పే యత్నం చేశారు. అయినా పరిస్థితి సర్దుమణగలేదు. చివరకు ఎస్సై తలకు గాయం కావడంతో.. విస్తృతస్థాయి సమావేశం నిర్వహించుకుండానే టీడీపీ ముఖ్యనేతలు అక్కడి నుంచి జారుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment