group clash
-
రణరంగంగా నాని వర్సెస్ చిన్ని.. జనసైనిక్స్ ఆగ్రహం!
ఎన్టీఆర్, సాక్షి: అన్నదమ్ముల మధ్య వర్గపోరు మరోసారి బహిరంగంగానే తీవ్రస్థాయిలో బయటపడింది. బుధవారం తిరువూరులో టీడీపీ సమన్వయ భేటీ సాక్షిగా కేశినేని నాని-కేశినేని చిన్ని వర్గీయులు బాహాబాహీకి దిగారు. చిన్నిని లోపలికి వెళ్లనీయకుండా నాని వర్గీయులు అడ్డుకోవడంతో పార్టీ ఆఫీస్ ప్రాంగణం రణరంగంగా మారింది. ఈ క్రమంలో.. అదుపు చేసేందుకు యత్నించిన పోలీసులపైనా దాడికి దిగారు. ఈ పరస్సర దాడిలో ఎస్సై సతీష్‌కు గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. ఈ నెల 7వ తేదీన తిరువూరులో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన ఉంది. ఈ ఏర్పాట్లను స్థానిక నేతలతో విడివిడిగా భేటీ అవుతూ ఆ అన్నదమ్ములిద్దరూ వేర్వేరుగానే పర్యవేక్షిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో ఇవాళ సమన్వయ భేటీ జరగ్గా.. దానికి జనసేన కార్యకర్తలు సైతం హజరయ్యారు. అయితే అక్కడ కేశినేని నాని ఫ్లెక్సీ లేకపోవడంతో ఆయన వర్గీయులు ఆగ్రహానికి గురయ్యారు. అక్కడే ఉన్న చిన్ని ఫ్లెక్సీని చించేశారు. అయితే అందులో పవన్ కల్యాణ్ ఫొటో కూడా ఉండడంతో జనసైనికులు నొచ్చుకున్నారు. తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆ సమావేశం బహిష్కరిస్తూ వెళ్లిపోయారు. అదే సమయంలో తిరువూరు ఇన్‌ఛార్జి దత్తుపై నాని వర్గీయుల దాడి చేశారు. చిన్నిని లోపలికి రానివ్వబోమంటూ అడ్డుగా బైఠాయించారు. ఇక.. ఈ పరిణామం గురించి తెలుసుకుని టీడీపీ కార్యాలయానికి చేరుకున్నారు కేశినేని చిన్ని. ఆయన్ని అడ్డుకునేందుకు నాని వర్గం ప్రయత్నించగా.. ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. దీంతో టీడీపీ నేతలు సర్దిచెప్పే యత్నం చేశారు. అయినా పరిస్థితి సర్దుమణగలేదు. చివరకు ఎస్సై తలకు గాయం కావడంతో.. విస్తృతస్థాయి సమావేశం నిర్వహించుకుండానే టీడీపీ ముఖ్యనేతలు అక్కడి నుంచి జారుకున్నారు. -
వేమూరు టీడీపీలో గ్రూపుల మధ్య ఘర్షణ
వేమూరు: గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీలో గ్రూపు విభేదాలు బహిర్గతమయ్యాయి. ఒకే సామాజికవర్గానికి చెందిన ఇద్దరు ప్రధాన నాయకుల అనుచరులు ఘర్షణ పడ్డారు. పలువురు కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. వేమూరు మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ జొన్నలగడ్డ విజయబాబు, కొల్లూరు మాజీ ఎంపీపీ కనగాల మధుసూదనరావు గ్రూపుల మధ్య విభేదాలున్నాయి. ఈ నేపథ్యంలో వేమూరు నియోజకవర్గంలో టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం, సోషల్ మీడియా బాధ్యతలు జొన్నలగడ్డ విజయబాబు అనుచరుడు కోగంటి గోపికి అప్పగించారు. ఈ క్రమంలో కనగాల మధుసూదనరావు గోపికి ఫోన్ చేసి కొల్లూరు గ్రామంలో సభ్యత్వ నమోదుకు గూగుల్ షీటు ఇవ్వాలని కోరడంతోపాటు దుర్భాషలాడాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో కొల్లూరు గ్రామానికి చెందిన 40 మంది, వేమూరు గ్రామానికి చెందిన 40 మంది టీడీపీ కార్యకర్తలు శుక్రవారం అర్థరాత్రి వేమూరులోని జొన్నలగడ్డ విజయబాబు ఇంటి వద్దకు చేరుకున్నారు. ఇరువర్గాల వారు కర్రలు, రాడ్డులతో ఇష్టారాజ్యంగా కొట్టుకున్నారు. కనగాలకు చెందిన కార్ల అద్దాలు పగులకొట్టి దగ్ధం చేశారు. విజయబాబు, మధుసూదనరావు వర్గానికి చెందిన పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు వచ్చి ఇరు వర్గాలను చెదరగొట్టారు. ఇరువర్గాల మధ్య ఘర్షణలు చోటుచేసుకోకుండా పోలీసులు వేమూరులోని జొన్నలగడ్డ విజయబాబు ఇంటి వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. -
ఫ్లెక్సీలు చించుకున్న తెలుగు తమ్ముళ్లు
అనంతపురం జిల్లా టీడీపీ నాయకుల మధ్య మాటల యుద్ధం చివరికి ఫ్లెక్సీలు చించుకునే వరకు వెళ్లింది. మొదట మంత్రి పరిటాల సునీత ఫ్లెక్సీలను ధర్మవరం ఎమ్మెల్యే వరదాపురం సూరి వర్గీయులు చించేయడంతో సునీత వర్గీయులు ఆగ్రహించారు. వరదాపురం సూరి ఫ్లెక్సీలకు బురద అంటించి వాటిని చించేయడంతో వివాదం చెలరేగింది. చివరికి ఈ వివాదం ఇరువర్గాలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకునే వరకు వెళ్లింది. -
ఇరువర్గాల మధ్య ఘర్షణ, 20 మందికి గాయాలు
అనంతపురం : అనంతపురం జిల్లాలో ఓ ఉత్సవం సందర్భంగా ఉద్రిక్తత నెలకొంది. పెద్దవడగూరు మండలం కిష్టపాడులో బుధవారం ఉదయం ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకోవటంతో పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. దాంతో పోలీసులపై దుండగులు రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో ముగ్గురు కానిస్టేబుళ్ల సహా 20మంది గాయపడ్డారు. ఈ నేపథ్యంలో పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపారు. మరోవైపు ఘటనా స్థలానికి డీఎస్పీ, సీఐ, ఎస్ఐ చేరుకోగా, వారిని గ్రామస్తులు అడ్డుకున్నట్లు సమాచారం. ఈ ఘటనలో పోలీస్ జీపు ధ్వంసం అయ్యింది. పరిస్థితి అదుపులోకి తెచ్చేందుకు అదనపు బలగాలను రప్పిస్తున్నారు.