
వేమూరులో పోలీసు బందోబస్తు
వేమూరు: గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీలో గ్రూపు విభేదాలు బహిర్గతమయ్యాయి. ఒకే సామాజికవర్గానికి చెందిన ఇద్దరు ప్రధాన నాయకుల అనుచరులు ఘర్షణ పడ్డారు. పలువురు కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. వేమూరు మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ జొన్నలగడ్డ విజయబాబు, కొల్లూరు మాజీ ఎంపీపీ కనగాల మధుసూదనరావు గ్రూపుల మధ్య విభేదాలున్నాయి.
ఈ నేపథ్యంలో వేమూరు నియోజకవర్గంలో టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం, సోషల్ మీడియా బాధ్యతలు జొన్నలగడ్డ విజయబాబు అనుచరుడు కోగంటి గోపికి అప్పగించారు. ఈ క్రమంలో కనగాల మధుసూదనరావు గోపికి ఫోన్ చేసి కొల్లూరు గ్రామంలో సభ్యత్వ నమోదుకు గూగుల్ షీటు ఇవ్వాలని కోరడంతోపాటు దుర్భాషలాడాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
ఈ నేపథ్యంలో కొల్లూరు గ్రామానికి చెందిన 40 మంది, వేమూరు గ్రామానికి చెందిన 40 మంది టీడీపీ కార్యకర్తలు శుక్రవారం అర్థరాత్రి వేమూరులోని జొన్నలగడ్డ విజయబాబు ఇంటి వద్దకు చేరుకున్నారు. ఇరువర్గాల వారు కర్రలు, రాడ్డులతో ఇష్టారాజ్యంగా కొట్టుకున్నారు. కనగాలకు చెందిన కార్ల అద్దాలు పగులకొట్టి దగ్ధం చేశారు.
విజయబాబు, మధుసూదనరావు వర్గానికి చెందిన పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు వచ్చి ఇరు వర్గాలను చెదరగొట్టారు. ఇరువర్గాల మధ్య ఘర్షణలు చోటుచేసుకోకుండా పోలీసులు వేమూరులోని జొన్నలగడ్డ విజయబాబు ఇంటి వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.