సాక్షి ప్రతినిధి, విజయవాడ: విజయవాడ ఎంపీ కేశినేని నాని తన పార్టీ కార్యాలయంలో ఆదివారం టీడీపీ జెండాలను పీకేసినట్లు స్వయంగా ఆయనే తెలిపారు. దీంతో ఆయన టీడీపీతో పూర్తిగా తెగతెంపులు చేసుకొన్నట్లుగా అర్థం అవుతోంది. టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ శనివారం రాత్రి కేశినేని నానితో సమావేశమై బుజ్జగించే ప్రయత్నం చేశారు. తిరువూరు సభకు రావాలని అధిష్టానం దూతగా కోరినట్లు తెలిసింది. అయితే ఆయన ససేమిరా అంటూ తిరస్కరించారని సమాచారం. ఆదివారం సైతం తన రాజీనామాపై స్పందించారు. రాజీనామా చేస్తామని చెప్పాక కచ్చితంగా చేసేస్తానని స్పష్టం చేశారు.
సాంకేతిక సమస్యతో రాజీనామా ఆలస్యం అవుతుందని, దానిపై ఇక చర్చించేది ఏమీ ఉండదని తేల్చి చెప్పారు. దీనిని బట్టి ఎంపీ కేశినేని నాని పూర్తిగా టీడీపీ నుంచి వెళ్లిపోవటానికి, తన ఎంపీ పదవికి రాజీనామా చేయటానికి నిర్ణయించుకున్నట్టు స్పష్టమవుతోంది. విజయవాడ ఎంపీగానే పోటీ చేస్తానని ఆయన మరోసారి స్పష్టం చేశారు.
ఎంపీ ఆదివారం తన కార్యాలయంలో అనుచరులతో మంతనాలు జరిపారు. తిరువూరులో జరిగిన రా కదిలిరా సభకు ఎంపీ కేశినేని నాని అనుచరులు మాజీ ఎమ్మెల్యే స్వామిదాస్, రామసుబ్బారావు, వాసన్ మునెయ్య, చెరుకూరి రాజేశ్వరరావు, దేవభక్తుని సీతారాం ప్రసాద్, జక్కె వెంకటేశ్వరరావుతో తదితరులు దూరంగా ఉన్నారు.
తిరువూరు సభలో సీటు కేటాయించినా..
తిరువూరు సభలో టీడీపీ నేతలు వేసిన ఎత్తుగడ బెడిసి కొట్టింది. తిరువూరు సభలో ముందు వరుసలో ఎంపీ కేశినేని నానికి సీటు కేటాయించారు. అక్కడ ఏర్పాటు చేసిన ప్లెక్సీల్లో సైతం ప్రొటోకాల్ ప్రకారం ఎంపీ ఫొటోలు వేశారు. ఈ విషయం ఎంపీ కేశినేని నాని దృష్టికి మీడియా తీసుకెళ్తే.. ‘నాకు ప్రొటోకాల్ ఇచ్చామని, పాటిస్తున్నామని చెప్పుకోవటానికి బ్యానర్లలో ఫొటోలు వేశారు. గతంలో ప్రొటోకాల్ పాటించలేదే’ అని ప్రశ్నించారు.
అన్ని పద్ధతులూ పాటిస్తున్నామని చెప్పుకోవటానికే ఇదంతా అని అన్నారు. ఇదేదో తనమీద, ప్రేమ, గౌరవంతో చేసిన విషయం కాదని తేల్చి చెప్పారు. తమ తప్పు లేదని విజయవాడలో మీడియాకు చెప్పుకోవటానికి గిమ్మిక్కు చేశారని ఎద్దేవా చేశారు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీగా గెలిచాక, తనకు పలు అవకాశాలు వచ్చాయన్నారు. అయితే అప్పట్లో టీడీపీని వీడాలనేది తన ఉద్దేశం కాదని కేశినేని నాని అన్నారు.
కష్టాల్లో ఉన్న అధినేత చంద్రబాబుకు అండగా ఉండాలని ఆయన వెంటే నడిచానన్నారు. ఇప్పుడేమో తన వద్దకు దూతలను పంపి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండమని, పట్టించుకోవద్దని చెబుతున్నారని ఆరోపించారు. అధినేత ఆదేశాలను శిరసావహిస్తున్నా, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదని వ్యంగ్యంగా అన్నారు. ఎంపీ హోదాలో అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటానని స్పష్టం చేశారు.
అనుచరులతో చర్చించి
విజయవాడ పార్లమెంటు పరిధిలో తన అనుచరులుగా ఉన్న ఎంకే బేగ్, బొమ్మసాని సుబ్బారావు, స్వామిదాస్, మరికొంత మంది పరిస్థితి ఏమిటని విలేకర్లు అడిగిన ప్రశ్నకు ‘వేచి చూడండి’ అని నాని బదులిచ్చారు. ప్రజాస్వామంలో డిసైడ్ చేసేది ప్రజలే. తనను నమ్ముకొని విజయవాడ పార్లమెంట్ పరిధిలో కొన్ని వేల మంది అనుచరులు, శ్రేయోభిలాషులు ఉన్నారని పేర్కొన్నారు. వారి మనోభావాలను దృష్టిలో పెట్టుకొని, తన ఒక్కడి నిర్ణయం కాకుండా, వారి ఆలోచనలకు అనుగుణంగా కలిసికట్టుగా నిర్ణయం తీసుకొంటామని స్పష్టం చేశారు. విజయవాడ ఎంపీగానే పోటీ చేస్తానని, మూడో సారి తానే గెలుస్తాననే ధీమా వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment