విజయవాడ, సాక్షి: టీడీపీ సీనియర్ నేత బుద్ధా వెంకన్న తీరుపై మిత్రపక్షం జనసేన తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. విజయవాడ పశ్చిమలో జనసేన తరఫున అభ్యర్థిని నిలబెట్టాలని ఆ పార్టీ నేతలు బలంగా ప్రయత్నిస్తుండగా.. ఆ ప్రయత్నాలకు బుద్ధా వెంకన్న గండికొడుతూ వస్తున్నారు. ఈ క్రమంలో ఇవాళ బలప్రదర్శన పేరిట నిర్వహించిన హడావిడిపై జనసేన నేతలు మండిపడుతున్నారు.
విజయవాడ వెస్ట్ టిక్కెట్ తనకే ఇవ్వాలంటూ గురువారం బుద్ధా వెంకన్న దుర్గగుడి వరకు ర్యాలీ చేపట్టారు. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడికి ఇవ్వబోయే దరఖాస్తును అమ్మవారి పాదాల వద్ద ఉంచి పూజలు చేశారు. తనకే బాబు టికెట్ ఇప్పించేలా అమ్మవారి ఆశీర్వదించారంటూ బయటకు వచ్చి హడావిడి చేశారు. ‘‘చంద్రబాబుకిచ్చే అప్లికేషన్ ముందుగా కనకదుర్గమ్మకు ఇచ్చా. విజయవాడ వెస్ట్ లేదా అనకాపల్లి ఎంపీగా నాకు అవకాశం ఇవ్వాలని అప్లికేషన్ ఇచ్చా.
.. చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకున్నా శిరసావహిస్తా. అలాగని టిక్కెట్ రాలేదని ఎవరైనా చంద్రబాబుని విమర్శించినా తాట తీస్తా. నాకు టిక్కెట్ కేటాయించాలని చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఇద్దర్నీ కోరుతున్నా’’ అని అన్నారాయన. అయితే.. ఈ తతంగం అంతా చూస్తున్న జనసేన నేతలకు మండిపోతోంది.
పశ్చిమ టిక్కెట్ తమకే కేటాయించాలంటూ జనసేన నేత పోతిన మహేష్ చాలాకాలంగా డిమాండ్ చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో.. ఇప్పుడు బుద్ధా చేసిన హడావిడిని జనసేన నేతలు తట్టుకోలేకపోతున్నారు. ఎక్కడ చంద్రబాబు ఏకపక్షంగా ఈ సీటును కూడా ప్రకటిస్తారేమోనని ఆందోళన చెందుతున్నారు. ఇలా పదే పదే పొత్తు ధర్మాన్ని ఉల్లంఘిస్తూ సీట్లు ప్రకటించుకోవడంపై పార్టీ అధినేత పవన్‌ను కలిసి నిలదీసే యోచనలో జనసేన నేతలు ఉన్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment