ఎన్టీఆర్, సాక్షి: పార్టీ పొలిట్‌బ్యూరోలో ఉన్న ఓ వ్యక్తి తనను గొట్టంగాడని అన్నా భరించానని, పార్టీ కోసమే ఓపికపడుతున్నానని విజయవాడ ఎంపీ కేశినేని నాని అన్నారు. గతంలోనూ తాను చాలా అవమానాలు పడ్డానన్నారు. తిరువూరు నియోజకవర్గంలో బుధవారం టీడీపీ సమన్వయ సమావేశంలో గొడవ తర్వాత నాని అక్కడి నుంచి వెళ్లిపోయారు. అనంతరం టీడీపీ మీటింగ్ జరిగిన ప్రదేశాన్ని ఆ పార్టీ నాయకులు పసుపు నీళ్లతో సంప్రోక్షణ చేశారు. ఈ ఘటనపై మీడియాతో మాట్లాడుతూ నాని ఆవేదన వ్యక్తం చేశారు.
‘విజయవాడ కార్పొరేషన్ ఎన్నికలప్పుడు ఒక వ్యక్తి ప్రెస్ మీట్ పెట్టి నన్ను చెప్పుతీసుకుని కొడతా అన్నాడు. క్యారెక్టర్ లెస్ ఫెలో అన్న ఆ వ్యక్తి మాటలపైనా పార్టీ నుంచి కనీసం ఎవరూ స్పందించలేదు. నన్ను అవమానించినా పార్టీ కోసం భరించా. నేను ఏరోజూ పార్టీలో వర్గాలను ప్రోత్సహించలేదు. ఏడాదిన్నర నుంచి పార్టీలో కుంపటి నడుస్తోంది...ఎక్కడో చోట పుల్ స్టాప్ పెట్టాలి. ఇలాంటి సంఘర్షణలు జరుగుతాయనే నేను పార్టీ కార్యకమాలకు దూరంగా ఉంటున్నా.
తిరువూరు టీడీపీ ఇంఛార్జ్ శావల దేవదత్ పూజకు పనికిరాని పువ్వు. గతంలోనే చంద్రబాబుకు ఈ విషయాన్ని చెప్పా. కేశినేని చిన్నికి పార్టీకి ఏం సంబంధం. అతనేమైనా పార్టీలో ఎంపీనా... ఎమ్మెల్యేనా. తిరువూరు ఇంఛార్జ్ పార్టీలో క్యాడర్ మనోభావాలు దెబ్బతీసేలా వ్యవహరించారు. అందుకే మా క్యాడర్ నుంచి రియాక్షన్ వచ్చింది.
కొంతమంది వ్యక్తులు తమకు బాధ్యతలు అప్పగించారని అబద్ధపు ప్రచారం చేసుకుంటున్నారు. నేను రెండు సార్లు ఎంపీగా గెలిచా. రతన్ టాటా స్థాయి వ్యక్తిని నేను. బెజవాడ పేరు చెడగొట్టకూడదనే ఓపిక పట్టా. రాబోయే పరిణామాలు దేవుడు ..ప్రజలే చూసుకుంటారు’అని నాని అన్నారు.
స్పందించిన చిన్ని
తిరువూరు ఘటనపై కేశినేని చిన్ని స్పందించారు. తిరువూరు ప్రజలకు క్షమాపణలు చెబుతూ.. ఇలాంటి ఘటనలు పునరావృతం కావని హామీ ఇస్తున్నట్లు తెలిపారు. అలాగే.. ఇవాళ జరిగిన తిరువూరు గొడవను అధిష్టానం చూసుకుంటుందని అన్నారాయన.
Comments
Please login to add a commentAdd a comment