ఏపీ బీజేపీలో ఒంటరి పోరాటానికే మొగ్గు కనిపిస్తోందనే టాక్ నడుస్తోంది. రాష్ట్రంలో కమలం వికసించాలంటే సింగిల్‌గానే వెళ్లాలని పాత బీజేపీలంతా పట్టుపడుతున్నరట. కానీ చంద్రబాబు డైరెక్షన్‌లో బీజేపీలో చేరిన టీడీపీ వారు మాత్రం టీడీపీ, జనసేన పార్టీలతో పొత్తు కోరుకుంటున్నారు. బీజేపీలోని చంద్రబాబు మద్దతుదారులు పొత్తు కోసం ఢిల్లీలో పైరవీ చేస్తున్నా.. ఢిల్లీ పెద్దలు మాత్రం అంగీకరించడంలేదట. ఇంతకీ పొత్తుల కోసం పాటుపడుతున్న ఆ నలుగురు ఎవరు?
ఆంధ్రప్రదేశ్ బీజేపీలో ఎన్నికల పొత్తులపై ఏకాభిప్రాయం కుదరడం లేదు. గత నెలలో రెండు రోజుల పాటు జరిగిన కీలక సమావేశాలలో రాబోయే ఎన్నికలు, కార్యాచరణ, పొత్తులపై చర్చించారు. మెజార్టీ నేతలు ఏపీలో బీజేపీలో ఒంటరిగానే పోటీచేయాలని అభిప్రాయపడ్డారు. అదే సమయంలో రహస్యంగా లిఖితపూర్వక అభిప్రాయాలు కోరిన సందర్బంలో అధిష్టానానికి సైతం ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. కానీ ఆ నలుగురు నేతలు మాత్రం టీడీపీతో పొత్తుకోసం తహతహలాడిపోతున్నారట. టీడీపీ, జనసేనతో పొత్తు ఉంటేనే పార్టీకి సీట్లు వస్తాయంటూ లెక్కలతో ఢిల్లీ పెద్దలకు వివరిస్తున్నారట. ఇంతకీ ఆ నలుగురు ఎవరా అని చూస్తే బీజేపీలోకి వలసవచ్చిన పక్షులే కావడం విశేషం.
తెలుగుదేశం పార్టీలో ఉండి బీజేపీలో చేరిన సిఎం రమేష్, సుజనా చౌదరి, ఆదినారాయణరెడ్డి ప్రధానంగా పొత్తు కోసం వెంపర్లాడుతున్నారట. బీజేపీలో చేరినప్పటికీ వీరు చంద్రబాబు ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నారని ఏపీ బీజేపీ నేతలు చెబుతుంటారు. అందుకోసమే ఇపుడు చంద్రబాబు డైరక్టన్ లోనే బీజేపీ వైపు నుంచి పొత్తు కోసం ప్రతిపాదన వచ్చేలా పైరవీలు ప్రారంభించారు. వీరితో పాటు కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరి ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా ఉన్న పురందేశ్వరి సైతం పొత్తు కోసమే ప్రయత్నిస్తున్నారనే టాక్ నడుస్తోంది.
విజయవాడ ఎంపీ సీటుపై కన్నేసిన సుజనాచౌదరి ఇటీవలే ఆ విషయాన్ని బయటకు చెప్పారు. టీడీపీ, జనసేనతో కలిసి పోటీ చేస్తే విజయవాడ ఎంపీ స్దానంలో తనకు ఆ రెండు పార్టీల నుంచి మద్దతు లభిస్తుందని సుజనా చౌదరి భావిస్తున్నారట. ఇందులో భాగంగానే ఆయన ఈ విషయాన్ని టీడీపీ అధినేత చంద్రబాబుతోనూ చర్చించి సీటుపై స్ఫష్టమైన హామీ పొందారంటున్నారు. దీంతో పాటు కృష్ణా జిల్లా వ్యాప్తంగా టీడీపీ అసెంబ్లీ అభ్యర్ధులందరికీ ఆర్దిక వనరులు సమకూర్చడానికి కూడా సుజన్ చౌదరి హామీ ఇచ్చారట. తన సీటు కోసమే సుజనా చౌదరి ఢిల్లీలో పొత్తులకోసం బీజేపీ పెద్దలపై ఒత్తిడి తీసుకొచ్చే పనిలో బిజీగా ఉన్నారట. సుజనా కోసమే అన్నదమ్ముల మధ్య చిచ్చు పెట్టి టీడీపీలో ఉన్న సిట్టింగ్ ఎంపీ కేశినేని నానిని బయటకి వెళ్లగొట్టారనే ప్రచారం జరుగుతోంది.
ఇక టీడీపీలో రాజ్యసభ సభ్యుడిగా ఉంటూ బీజేపీలో చేరిన సిఎం రమేష్ సైతం సుజనాతో కలిసి ఇదే ప్రయత్నాలు చేస్తున్నారు. సిఎం రమేష్ కడప పార్లమెంట్ స్ధానం నుంచి పోటీ చేయాలని ఉవ్విళ్లూరుతున్నారు. టీడీపీ, జనసేన మద్దతుంటే తన స్ధానానికి ఢోకా ఉండదని ఆయన భావిస్తున్నారట. గతంలో టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన ఆదినారాయణ రెడ్డి బీజేపీ తరపున జమ్మలమడుగు అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయడానికి రంగం సిద్దం చేసుకుంటున్నారు. ఇక ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి అటు విశాఖపట్టణం..ఇటు విజయవాడ రెండు ఎంపీ సీట్లపైనా కన్నేసారు. గతంలో విశాఖ నుంచి గెలుపొందిన నేపధ్యంలో విశాఖ సేఫ్ సీటుగా భావిస్తున్నారు. అయితే బీజేపీ రాజ్యసభ సభ్యులు జివిఎల్ నరసింహరావు గత రెండేళ్లగా విశాఖలోనే ఉంటూ గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ విశాఖ టిక్కెట్ పై ఆశలు పెట్టుకున్నారు.
విశాఖ లేదా విజయవాడలో ఏదీ దక్కకపోతే చివరగా నర్సారావుపేట నుంచైనా పోటీకి సిద్దపడుతున్నారు. ఈ మూడు స్ధానాలలో ఎక్కడ నుంచి పోటీ చేయాలన్నా కూడా తనకి తన మరిది పార్టీ టీడీపీ నుంచి మద్దతు ఉండాలని పురందేశ్వరి భావిస్తున్నారట. అందుకోసమే టీడీపీ, జనసేన పార్టీలతో బీజేపీ కూడా చేరాలనే అభిప్రాయంతో పురందేశ్వరి ఉన్నారంటున్నారు. ఇక జాతీయ కార్యదర్శిగా ఉన్న సత్యకుమార్ కూడా రాజంపేట పార్లమెంట్ సీటుకు పోటీ చేయాలని ఆశ పడుతున్నారు. పొత్తులు ఉంటేనే టీడీపీ, జనసేన మద్దతుతో బీజేపీ తరపున రాజంపేట ఎంపి స్ధానానికి పోటీ చేయాలని అనుకుంటున్నారట. ఇలా వీరందరి సొంత ప్రయోజనాల కోసమే పార్టీని పొత్తుల్లోకి దింపాలని భావిస్తున్నారట. ఇందుకోసమే అదిష్టానంపై వీరంతా ఒత్తిడి తీసుకొస్తున్నారని సమాచారం.
వాస్తవానికి బీజేపీ అగ్ర నేతలెవరికీ కూడా టీడీపీతో జట్టుకట్టడం ఇష్టం లేదు. పార్టీలో మొదటి నుంచి ఉన్న నేతలంతా ఇదే విషయాన్ని ఇటీవల జరిగిన సమావేశాలలో స్పష్టం చేశారు. గతంలో చంద్రబాబు పొత్తుల పేరుతో బీజేపీని వాడుకుని ఏ విధంగా అధికారంలోకి వచ్చింది..పార్టీ ఓటు బ్యాంకు ఏ విధంగా నష్టపోయిందనేది ఒరిజినల్ బీజేపీ నేతలకు తెలుసు. ఇపుడు కూడా పొత్తులతో ముందుకు వెళ్తే ఎప్పటికీ ఏపీలో ఓటు బ్యాంక్ పెంచుకోలేమనేది బీజేపీ నేతల మాట. పొత్తు పెట్టుకుంటే బీజేపీ ద్వారా టీడీపీ లాభపడుతుంది తప్పితే బీజేపీకి వచ్చే లాభమేమి ఉండదనేది వారి అభిప్రాయం. అదే సమయంలో చంద్రబాబుకు మద్దతిచ్చే ఆ నలుగురు తమ గెలుపు అవకాశాల కోసమే పొత్తులపై ఒత్తిడి తెస్తున్నారు తప్పితే బీజేపీని బలోపేతం చేయడం కోసం కాదని చెబుతున్నారు. అసలు ఈ నలుగురు ద్వారా కధ నడిపించేది టీడీపీ అధినేత చంద్రబాబేనని కూడా బీజేపీ అగ్రనేతలు అనుమానిస్తున్నారు.
చంద్రబాబుకి ఏ విధంగానూ నష్టం కలగకుండా ఈ నలుగురే బీజేపీ నుంచి ప్రయత్నిస్తుంటారని అంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో టీడీపీకి ఏదైనా ప్రయోజనం కలగాలంటే బీజేపీతో పొత్తు అనివార్యమని వారు భావిస్తున్నారు. చంద్రబాబు మార్కు రాజకీయాలు అన్నీ తెలిసిన బీజేపీ అధిష్టానం పొత్తులపై ఆచితూచి అడుగులు వేస్తోందని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment