ఇలాంటి ఎగ్జిట్‌ పోల్స్‌ జిమ్మిక్కు ఇదే తొలిసారి! | Ksr Comments On TDP And YSRCP's Victory Predictions In AP Elections | Sakshi
Sakshi News home page

ఏపీ: ఇలాంటి ఎగ్జిట్‌ పోల్స్‌ జిమ్మిక్కు ఇదే తొలిసారి!

Published Mon, Jun 3 2024 12:23 PM | Last Updated on Mon, Jun 3 2024 1:41 PM

Ksr Comments On TDP And YSRCP's Victory Predictions In AP Elections

దేశం అంతటా పోస్ట్ పోల్ సర్వే ఫలితాలు ఒక ఎత్తుగా ఉంటే, ఆంధ్రప్రదేశ్ లో మాత్రం మరో ఎత్తుగా ఉన్నాయి. దేశంలోని దాదాపు అన్ని సర్వే సంస్థలు కేంద్రంలో తిరిగి బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీయే అధికారంలోకి వస్తుందని తేల్చాయి. ఆంధ్రప్రదేశ్ కు వచ్చేసరికి మెజార్టీ సర్వే సంస్థలు వైఎస్సార్‌సీపీ తిరిగి అధికారంలోకి వస్తుందని చెప్పినా, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వ్యూహాత్మకంగా పోటీగా పలు సర్వే సంస్థలను రంగంలో దించి మొత్తం పరిస్థితిని గందరగోళం చేయడానికి యత్నించారు. దీనివల్ల ఎంత ప్రయోజనం కలుగుతుందన్నది వేరే విషయం. కౌంటింగ్ రోజుకు కేడర్‌ నిరాశకు లోను కాకుండా ఉండడానికి ఇదొక వ్యూహంగా భావిస్తారు.

రెండు పార్టీలు ఈ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటాయి. కానీ టీడీపీ మాత్రం ఏదో కుట్ర ఆలోచనతో పనిచేస్తోందా? అనే సందేహాన్ని వైఎస్సార్‌సీపీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. కౌంటింగ్ హాల్ లో వివాదాలు సృష్టించడం, ఏదో రకంగా వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను ఇబ్బంది పెట్టి బయటకు పంపిస్తే, ఆ తర్వాత తాము కోరుకున్న విధంగా కౌంటింగ్ జరుపుకోవచ్చేమోనని టీడీపీ ఆలోచన చేస్తున్నట్లుగా సోషల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఇలాంటి మేనేజ్మెంట్ స్కిల్స్ చంద్రబాబుకు ఉన్నట్లుగా దేశంలోనే మరెవ్వరికి ఉండకపోవచ్చు.

పోస్ట్ పోల్ సర్వేలలో ఆరా మస్తాన్, ఆత్మసాక్షి, ఫస్ట్ స్టెప్ సొల్యుషన్స్, రేస్, సీపీఎస్ మొదలైన సంస్థలు 2019 ఎన్నికల సమయంలో కూడా ప్రముఖంగా తమ సర్వేలను వెల్లడించాయి. అవి అన్నీ దాదాపు సక్సెస్ అయ్యాయి. ఇప్పుడు కూడా ఈ సంస్థలు వైఎస్సార్‌సీపీకి 95 నుంచి 110 సీట్ల వరకు రావచ్చని లెక్కగడుతున్నాయి. వీరు వైఎస్సార్‌సీపీకి వచ్చే స్థానాలను బాగా తగ్గించి అంటే కన్జర్వేటివ్ గా ఈ అంకెలు చెప్పారన్నమాట. ప్రత్యేకించి ఆరా మస్తాన్ సర్వేకి విశేష ప్రాధాన్యం వచ్చింది. ఆయన 2018 తెలంగాణ శాసనసభ ఎన్నికలు, తదుపరి జరిగిన కొన్ని ఉప ఎన్నికలలో, 2019 ఏపీ ఎన్నికలలో కానీ, 2023 తెలంగాణ శాసనసభ ఎన్నికలలో  కానీ చెప్పిన ఫలితాలు నిజం అవడంతో విశ్వసనీయత వచ్చింది. దాంతో ఆయన ఏమి చెబుతారా? అని చాలామంది ఎదురు చూశారు.

ఆయన తొలుత టీడీపీ, జనసేనలకు పాజిటివ్ గా ఉన్న పాయింట్లు చెప్పి, తదుపరి వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వస్తుందని తమ సంస్థ సర్వేలో తేలిందని వెల్లడించారు. మస్తాన్ సర్వే వైఎస్సార్‌సీపీకి అనుకూలంగా ఉందన్న ముందస్తు సమాచారంతో కొందరు టీడీపీ మేనేజర్లు ఆయనను రకరకాల రూపాలలో బెదిరంచారన్న ప్రచారం ఉంది. తీవ్రమైన ఒత్తిడి రావడంతో ఆరా మస్తాన్ తన మీడియా సమావేశంలో ఆందోళనతోనే కనిపించారు. అంతేకాక ఆయన ఇంకా అనేక వివరాలు వెల్లడిద్దామని భావించినా, ఈ బెదిరంపులు భరించలేక కొంతమేరే వెల్లడించి వదలివేశారు. ఈ సందర్భంగా ఆయా టీవీలతో మాట్లాడి తన సర్వే ప్రాతిపదిక, వైఎస్సార్‌సీపీ గెలుపు అవకాశాలు మొదలైనవాటిని వివరించారు.

ఇదీ చదవండి:  నాలుక్కర్చుకున్న ఇండియాటుడే– యాక్సిస్‌ మై ఇండియా 

ఈ సందర్భంలో ఒక ప్రతినిధి ఆయనను ఈ సర్వే షలితాలు వాస్తవం కాకపోతే.. అని ప్రశ్నించినప్పుడు ఆయన నిర్మొహమాటంగా తన సంస్థ కనుమరుగు అవుతుందని స్పష్టంగా చెప్పడం విశేషం. అంటే అంత నమ్మకంతో ఆయన ఆ మాట చెప్పారన్నమాట. కొన్ని జాతీయ సంస్థల సర్వేలలో వైఎస్సార్‌సీపీకి వ్యతిరేకంగా ఫలితాలు వస్తే, మరికొన్నిటిలో అనుకూలంగా వచ్చాయి. ఉదాహరణకు టైమ్స్ నౌ సర్వే చాలా క్లారిటీతో వైఎస్సార్‌సీపీకి ప్రజలు పట్టం కడతారని చెప్పింది. ఒక సంస్థ వైఎస్సార్‌సీపీకి అసలు పార్లమెంటు సీట్లే రావంటూ ఇచ్చిన సర్వే చూసి జనం నవ్వుకున్నారు. టీడీపీ కొన్ని ఫేక్ సర్వేలను ప్రచారంలోకి గట్టిగానే తెచ్చినట్లు అనిపిస్తుంది. ఉదాహరణకు టీడీపీకి అనుకూలం అంటూ ఒక ఇరవై చిన్నా, చితక సంస్థలు ఇచ్చిన సర్వేలలో చివరిలో ఏడెనిమిది సంస్థలు టీడీపీకి అసెంబ్లీ ఎన్నికలలో 152 సీట్లు వస్తాయంటూ ఒకే అంకెను ఫోకస్ చేయడం ఆశ్చర్యం కలిగించింది.

అంతేకాక వీరిచ్చిన లెక్కల ప్రకారం ఏపీ అసెంబ్లీలో 200 సీట్లు ఉండాలి. అంత అద్వానంగా ఈ బోగస్ సర్వేలు వచ్చాయన్నమాట. వైఎస్సార్‌సీపీ గెలుస్తుందన్న భావన ప్రజలలోకి వెళ్లకుండా గందరగోళం సృష్టించడానికి ఈ సర్వేలను ఏవేవో పేర్లతో ప్రవేశపెట్టారన్నమాట. ఇలాంటి వాటిలో చంద్రబాబుకు చాలా నైపుణ్యం ఉంది. 2004 లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందన్న అంచనాలు ఉండగా, ఒక ప్రముఖ సెఫాలిజిస్ట్ ను ప్రత్యేకంగా హైదరాబాద్ పిలిపించి మీడియా సమావేశం పెట్టించి టీడీపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని చెప్పించారు. ఆ వివరాలను అప్పట్లో ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి టీడీపీ పత్రికలు ప్రముఖంగా ప్రచురించాయి. కానీ టీడీపీ ఓడిపోయింది. అలా ప్రతి ఎన్నికలోనూ ఏదో ఒక జిమ్మిక్కు చేస్తుంటారు.

ఈసారి కూటమి కట్టిన నేపథ్యంలో కొంత విశ్వాసం పెంచుకున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో పేద వర్గాల మద్దతు రావడం లేదన్న సంగతిని చంద్రబాబు, తదితర కూటమి పెద్దలు గమనించకపోలేదు. అందుకే కొన్ని నకిలీ సర్వేలతో పాటు, పోస్టల్ బాలెట్ లలో అటెష్టేషన్ అధికారి వివరాలు లేకపోయినా అవి చెల్లుబాటు అయ్యేలా తమ పలుకుబడిని ఉపయోగించి సీఈఓ ద్వారా ఆదేశాలు ఇప్పించుకోగలిగారు. దురదృష్టవశాత్తు న్యాయ వ్యవస్థ కూడా దీనిని సరిచేయలేకపోయింది. ఈసీ రూల్స్ ను ఈసీనే బ్రేక్ చేసేలా పరిస్థితి ఏర్పడిందంటే, ప్రజాస్వామ్యాన్ని కాపాడవలసిన వ్యవస్థలు ఎలా ఒత్తిళ్లకు లొంగిపోతున్నాయో అర్థం చేసుకోవచ్చు.

చావో, రేవో అన్నట్లుగా రాజకీయ వాతావరణం ఏర్పడిన నేపథ్యంలో టీడీపీ కౌంటింగ్ లో గొడవలకు దిగుతుందన్న అనుమానాలు వస్తున్నాయి. ఒక పరిశీలకుడు అయితే పరిస్థితి టైట్ గా ఉందనుకుంటే ఒక పది, పన్నెండు నియోజకవర్గాలలో ఓట్లను తారుమారు చేయడానికి కూడా టీడీపీ యత్నించవచ్చని వ్యాఖ్యానించారు. బీజేపీతో టీడీపీ పెట్టుకున్నది ఈ ప్రయోజనానన్ని ఆశించేనని ఎక్కువ మంది నమ్ముతారు. ఇంతవరకు జరిగిన తీరు ఎలా ఉన్నా ఈసీ ఏపీలో కౌంటింగ్ నైనా సజావుగా జరిపించాలని ప్రజలు కోరుకుంటున్నారు. అలా చేయకపోతే ప్రజాస్వామ్యంపై ప్రజలకు నమ్మకం పోతుంది.

ఈ ఎన్నికలలో వైఎస్సార్‌సీపీ గెలవడానికే ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రత్యేకించి అన్ని కులాలలోని పేద వర్గాలు పెద్ద ఎత్తున ఓటింగ్ లో పాల్గొని వైఎస్సార్‌సీపీకి ఓట్లు వేసినట్లుగా సర్వేలు చెబుతున్నాయి. ఎన్నికలలో వైఎస్సార్‌సీపీకి స్వీప్ వస్తే వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పాలనకు ఓట్లు వేసినట్లు అవుతుంది. ఒక వేళ టైట్ గా పరిస్థితి ఏర్పడి 95,100 సీట్లను సాధించి అధికారంలోకి వస్తే ఆయన విధానాలు కరెక్టేనా కాదా అన్నది ఆలోచించుకోవల్సి ఉంటుంది. కాస్త దూరం అయిన కొన్ని ఇతర వర్గాలను మళ్లీ కలుపుకునే యత్నం చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వపరంగా జరిగిన లోటుపాట్లను సమీక్షించుకుని పునరుత్సాహంతో రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టాలి. 

ఏపీలో జరిగిన ప్రయోగాలను దేశం అంతా ఆసక్తిగా చూస్తోంది. వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సఫలం అయితే ఆయా రాష్ట్రాలు అదేబాటలో వెళ్లే యత్నం చేస్తాయి. అలాకానీ పక్షంలో వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి మాదిరి హామీలు అమలు చేయనవసరం లేదని,  అలాకాకుండా ప్రజలను ఏమార్చితే, మోసం చేస్తే సరిపోతుందన్న సంకేతం వెళుతుంది. టీడీపీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ ఇచ్చిన సూపర్ సిక్స్, తదితర హామీలు అమలు చేయడం అసాధ్యం అవుతుంది. దాంతో వారు ఆ విషయాలను పక్కనబెట్టి ఇతర అంశాలపైకి ప్రజల దృష్టిని మళ్లించే యత్నం చేస్తారు. దీనిని గుర్తుంచుకునే జనం టీడీపీని కాకుండా వైఎస్సార్‌సీపీనే మళ్లీ ఆదరించారన్నది ఎక్కువ మంది భావనగా ఉంది.

వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి గెలిస్తే జనం గెలిచినట్లు. నిజం గెలిచినట్లు. ఆయన చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు గెలిచినట్లు. పేదలు విజయం సాధించినట్లు. పెత్తందార్ల ఒత్తిళ్లకు పేదలు లొంగలేదని రుజువైనట్లు. అదే టీడీపీ కూటమి గెలిస్తే అబద్దం గెలిచినట్లు. ఎందుకంటే అనేక అబద్దాలను కూటమి నేతలు ప్రచారం చేశారు. ఉదాహరణకు లేని టైటిలింగ్ చట్టంతో వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి భూములను లాక్కొంటారని దారుణమైన ప్రచారం చేశారు. అలాంటి అసత్యాలను నమ్మి జనం ఓట్లు వేసినట్లు అవుతుంది. అంతేకాక ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి ఎల్లో మీడియా చేసిన విష ప్రచారానికి కొంత ప్రభావం అయినట్లు అవుతుంది.

బహుశా దేశ చరిత్రలోనే కొన్ని మీడియా సంస్థలు కూటమి కట్టి, కొన్ని రాజకీయ పార్టీలతో కుమ్మక్కై, ఒక ప్రభుత్వంపై, ఒక రాజకీయ పార్టీపై కుట్రలు చేయడం ఏపీలో మాత్రమే జరిగి ఉంటుంది. టీడీపీ కూటమి గెలిస్తే ఎల్లో మీడియానే పాలన చేస్తుంది. వారు ఆడింది ఆట, పాడింది పాటగా సాగుతుందని వేరే చెప్పనవసరం లేదు. కూటమి గెలిస్తే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన మీడియాకు జనం మద్దతు ఇచ్చినట్లు అవుతుంది. కూటమి ఓడిపోతే కుట్రల మీడియా పరాజయం చెందినట్లు అవుతుంది. కొన్ని గంట్లలో జరగబోయే ఓట్ల లెక్కింపులో పేదలు గెలుస్తారా? పెత్తందార్లు నెగ్గుతారా? అన్నది తేలిపోతుంది. దుష్ట మీడియా కుట్రలు, అసత్యాలు గెలుస్తాయా? లేక ప్రజలు వాటిని తిప్పి కొడతారా అన్నది కూడా నిర్దారణ అవుతుంది. ప్రజాస్వామ్యాన్ని తాము చెరబట్టగలమని, తాము శాసించగలమని, ప్రజాభిప్రాయాన్ని మార్చగలమని, ప్రజాస్వామ్యంలో కృత్రిమ వ్యతిరేకతను సృష్టించగలమనుకున్నవారికి ఈ ఎన్నికల ఫలితాలు కనువిప్పు కలిగిస్తాయని ఆశిద్దాం.


– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement