ఈ లీడర్లకు ఇక 'శుభం' కార్డేనా?
ఈ లీడర్లకు ఇక 'శుభం' కార్డేనా?
Published Fri, May 9 2014 1:02 PM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM
ఎన్నికలైపోయాయి. ప్రజాతీర్పు పెట్టెల్లో భద్రంగా ఉంది. కానీ ఫలితాలు రాకుండానే కొందరి కథ మాత్రం కంచికి వెళ్లిపోయిందన్న విషయం ప్రజలకు తెలిసిపోయింది. రాజకీయంగా వారి కథకి శుభం కార్డు పడిపోయింది. అలాంటి నేతలెవరో ఒక సారి చూద్దాం.
కిరణ్ కుమార్ రెడ్డి - ఆఖరి బంతి ఆడే వరకూ గేమ్ అవదన్న కిరణ్ కుమార్ రెడ్డి ఆట అసలు ఆటకు ముందే అంతమైపోయింది. ఆయన స్వయంగా పోటీ చేయలేదు. అంతే కాదు. ఎన్నికలకు ముందే పార్టీ అభ్యర్థులు టీడీపీకి అనుకూలంగా రంగం నుంచి తప్పుకున్నారు. ఫలితం ఏదైనా, కిరణ్ కుమార్ రెడ్డి రిటైర్మెంట్ ఖాయమన్నదే రాజకీయ పండితుల ఏకాభిప్రాయం.
పవన్ కళ్యాణ్ - పెర్ఫార్మెన్సంతా ఒకే సారి చేసేస్తే వచ్చేసారికి ఏం మిగులుతుంది. పవన్ కళ్యాణ్ పరిస్థితీ అదే. ఈ సారి కాంగ్రెస్ వ్యతిరేకతను సొమ్ము చేసుకున్నారు. తరువాత జరిగే ఎన్నికల్లో ఈ ఆయుధం వాడటానికి వీలుండదు. ఇప్పుడు ఆయన కూరలో కరివేపాకా లేక పప్పచారులో మునక్కాడా ఆయనే డిసైడ్ చేసుకోవాలి.
చిరంజీవి - సీమాంధ్రలో కాంగ్రెస్ అసలు ఖాతా తెరుస్తుందా అన్నది చాలా మందికి ఉన్న పెద్ద అనుమానం. రాజ్యసభ ఎంపీగా కొన్నాళ్లు ఉండొచ్చు. ఆ తరువాత చిరంజీవి సంగతేమిటి? 2019 నాటికి చిరంజీవి అంటే ఎవరు అని అడిగే తరం ఓటు హక్కు సంపాదించుకుంటుంది. ఫేసు టర్నింగ్ ఇచ్చుకొమ్మన్నా, రఫ్ఫాడిస్తానన్నా ఆ తరానికి అర్థం కాదు.
జెపి - అందరికీ శకునం చెప్పే బల్లి కుడితిలో పడటం అంటే ఏమిటో జెపి గారిని చూస్తే అర్థమౌతుంది. అటు ఆమ్ ఆద్మీ పార్టీ ముఖం మీదే తలుపేసింది. ఇటు బిజెపి-టీడీపీ కూటమి కిటికీ కూడా తెరవలేదు. అయినా మోడీ బొమ్మ పెట్టుకుని జెపి ప్రచారం చేశారు. కానీ ఫలితం ఏమౌతుందన్న విషయంలో ఎవరికైనా సందేహాలుండవచ్చునేమో కానీ జేపీకి మాత్రం అస్సలు లేదు.
ఆర్ కృష్ణయ్య - పాపం ఆర్ కృష్ణయ్య రాజకీయ జీవితం భ్రూణ హత్యలా మారిపోయింది. పుట్టకముందే గిట్టింది. ఇన్నేళ్లు బిసిల కోసం ఆయన చేసిన పోరాటాన్ని విజయవంతంగా సమాధిచేశారు నారా వారు. కృష్ణయ్యకి బాకు వెన్నులో గుచ్చుకుందా లేక ఛాతీలో గుచ్చుకుందా అర్థం కావడం లేదు. అసలు వెన్నుపొటు ఎలా జరిగిందన్నది కూడా అయనకు అర్థం కావడం లేదు.
Advertisement