రక్తసంబంధాల మధ్య రాజకీయ చిచ్చు! | political friction between blood relation | Sakshi
Sakshi News home page

రక్తసంబంధాల మధ్య రాజకీయ చిచ్చు!

Published Mon, Apr 28 2014 4:00 PM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM

రక్తసంబంధాల మధ్య రాజకీయ చిచ్చు! - Sakshi

రక్తసంబంధాల మధ్య రాజకీయ చిచ్చు!

రాజకీయాల ముందు రక్తసంబంధాలు కూడా పనిచేయవు. కుటుంబాలు కుటుంబాలనే  రాజకీయాలు చీల్చేస్తాయి. అయితే కొందరు  సిద్ధాంతపరంగా విడిపోతుంటారు. వారికి రాజకీయ అవగాహన ఉంటుంది. అటువంటి వారిని తప్పుపట్టవలసిన అవసరం ఉండదు. కొందరికి రాజకీయ అవగాహన ఉండదు. స్వార్థం, అధికార దాహం, తాత్కాలిక ప్రయోజనం... వంటి వాటికోసం  విడిపోతుంటారు. మన సమాజంలో రక్తసంబంధాలకు విలువ ఎక్కువ. అటువంటి సంబంధాలను కూడా రాజకీయాలు పటాపంచలు చేస్తాయి.  దశాబ్దాల అనుబంధాలు పుటుక్కున తెంపేస్తారు.  చటుక్కున ఇతరులతో కలిసిపోతారు. అన్నాలేదు-తమ్ముడూ లేదు, తండ్రీలేదు-కొడుకూ లేదు, అక్కాలేదు-తమ్ముడూ లేదు, బావలేదు-బావమరిది లేదు, మావలేదు-అల్లుడూ లేదు.. రాజకీయ లబ్ది కోసం ఎవరికైనా వెన్నుపోటు పొడిచేస్తారు. అదే రాజకీయం! ఇదంతా ఒక ఎత్తైతే, కుటుంబంలో ఎవరో ఒకరు అధికారంలో ఉండటం కోసం కొందరు కుటుంబ సభ్యులు చాలా తెలివిగా తలా ఒక పార్టీలో ఉంటారు. అది వీటన్నిటికీ మించిన తెలివైన రాజకీయం. సిద్దాంతం కోసం వేరువేరు పార్టీలలో ఉండేవారికంటే ఇటువంటి వారే ఎక్కువగా ఉంటారు.

రాజకీయాల కారణంగా విడిపోయిన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. చోటీ రాజకీయ నాయకుల నుంచి పెద్దపెద్ద నేతల వరకు ఈ కోవకు చెందినవారు న్నారు. ప్రధానంగా చెప్పుకోవాలంటే మన రాష్ట్రంలో ఎన్టీఆర్ కుటుంబం నుంచి నేటి ప్రధాని  మన్మోహన్‌ సింగ్ కుటుంబం వరకు చాలా మంది రాజకీయాల కోసం రక్త సంబంధాలనే కాదనుకున్నారు.  మన్మోహన్‌ సింగ్ సవతి సోదరుడు  దల్జీత్‌సింగ్ కోహ్లీ ఇటీవలే బీజేపీలో చేరారు.  నిన్నా మొన్నటి వరకు అన్న కుటుంబంతో పాటుగా కాంగ్రెస్‌ పార్టీలోనే కొనసాగిన దల్జీత్‌సింగ్ ఉన్నట్లుండి కమల దళంలో చేరిపోయారు. సహజంగానే ఈ పరిణామం ప్రధాని కుటుంబాన్ని షాక్‌కు గురి చేసింది. దశాబ్దాలుగా తమ కుటుంబం కాంగ్రెస్‌తోనే ఉందని, ఇకపై కూడా అలాగే ఉంటుందని ప్రధాని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.దల్జీత్‌సింగ్‌ తీరుపై ఆవేదన వ్యక్తం చేశారు. మన్మోహన్ సింగ్ అయితే షాక్కు గురయ్యారు.  తమ్ముడి వైఖరికి కలత చెందారు.  అందరూ పెద్దవాళ్లైపోయారని, వారిపై తనకెలాంటి నియంత్రణ లేదని నిర్వేదం వ్యక్తం చేశారు.

తమిళ రాజకీయాల్లోకి వెళితే డిఎంకె అధినేత కరుణానిధి కుటుంబంలో రేగిన రాజకీయ చిచ్చు ఇంకా సెగలు కక్కుతూనే ఉంది. కరుణానిధి తమిళ రాజకీయాల్లో ఓ కొత్త ఒరవడిన సృష్టించారు.   అటువంటి నేత కుటుంబం కూడా రాజకీయ రగడలో చిక్కుకుంది. అన్నాదమ్ములు అళగిరి, స్టాలిన్ ఒకరిపై ఒకరు కత్తులు నూరుకునే పరిస్థితి నెలకొంది. పార్టీపై పట్టు, తండ్రి రాజకీయ వారసత్వం కోసం సాగుతున్న పోరులో అన్న అళగిరి మీద స్టాలిన్  పైచేయి సాధించారు. అళగిరిని పార్టీ నుంచి వెళ్లగొట్టడంతో  విజయం సాధించారు.

ఇక మహానటుడు ఎన్టీఆర్ కుటుంబంలోని కలహాల కథ అందరికీ తెలిసిందే. నాన్నకు వెన్నుపోటు పొడిచిన బావ చంద్రబాబు నాయుడుతో బాలకృష్ణ  తరలిపోయారు.  అక్క పురందేశ్వరి  తన దారి తాను చూసుకుంది. మామ నుంచి చంద్రబాబు పార్టీ లాక్కున్నారు. అటువంటి వ్యక్తి చెంతన బాలయ్య మహా ఇష్టంగా చేరిపోయారు. అంతే కాకుండా పిల్లను కూడి ఇచ్చి బంధుత్వాన్ని పెంచుకున్నారు. రాజకీయంగా మరింత పటిష్టమయ్యారు. తమ్ముడి తీరు నచ్చని అక్క పురందేశ్వరి ఏ పార్టీకి వ్యతిరేకంగానైతే తండ్రి పోరాడారో అదే పార్టీలో చేరి పదేళ్లు పదవి అనుభవించారు. ఇప్పుడు కాంగ్రెస్‌కు కష్టకాలమొచ్చేసరికి ఆ పార్టీకి టాటా చెప్పి కమలం గూటిలో ఒదిగిపోయారు.  

ఇక రాష్ట్ర రాజకీయాల్లో మరో తాజా కలకలం... కొణిదెల కుటుంబంలో కయ్యాలు. నటుడుగా తెలుగువారి మనసులు కొల్లగొట్టి మెగాస్టార్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్న చిరంజీవి కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా సామాజిక న్యాయం పేరుతో ప్రజారాజ్యం పార్టీ పెట్టారు. మెగాస్టార్‌కు తోడుగా పవర్ స్టార్‌ యువరాజ్యం నడిపి కాంగ్రెస్ నేతల పంచెలూడగొట్టాలని పిలుపు ఇచ్చారు. అయితే పార్టీని నడపడం చేతగాని చిరంజీవి లక్షల మంది అభిమానుల ఆశలను మొగ్గలోనే తుంచేశారు. ఎంతో మంది తనపై పెట్టుకున్న ఆశలను వమ్ము చేశారు.  ఏ పార్టీనైతే పాపాల పుట్టగా అభివర్ణించి ఎన్నికలలో నిలిచారో,  అదే కాంగ్రెస్ పార్టీని గంగలా భావించి మునిగిపోయారు. తనతో పాటు 18 మంది ఎమ్మెల్యేలను కూడా అందులో ముంచేశారు. ఈ కలయికపై తమ్ముడు పవన్ కళ్యాణ్ అప్పట్లో నోరుమెదపలేదు. ఆ తరువాత తెలంగాణ ఉద్యమం ఉధృతమైంది. ఒక్క మాట మాట్లాడలేదు.  హఠాత్తుగా ఇప్పుడే నిద్రలో నుంచి మేల్కొన్నట్లు జనసేన పేరుతో పార్టీని ఏర్పాటు చేశారు.  కాంగ్రెస్ హఠావో నినాదం అందుకున్నారు. అన్నాదమ్ముల్లో అన్న కాంగ్రెస్‌లో కలిసిపోగా, తమ్ముడు కమలంలో ఇమిడిపోతున్నారు. రాష్ట్రం విడదీసిన తీరు నచ్చలేదు - ఓట్లు విడిపోకూడదని పోటీ చేయడంలేదు - తెలుగుదేశం పార్టీపై నాకు ఎలాంటి ప్రేమ లేదు - మోడీ కోసం ప్రచారం - అన్నపై అభిమానం ఉంది - కాంగ్రెస్ను తరిమి కొట్టండి ..... అని ఇలా రోజుకో పొంతనలేని మాటలు మాట్లాడుతున్నారు. అటు అన్న చూస్తే తమ అన్నదమ్ముల లక్ష్యం ఒక్కటే అంటారు.

ఇంతకీ ఈ నేతలందరిదీ సిద్దాంతం కోసం పోరాటమా? లేక అధికారం కోసం ఆరాటమా? అనేది అర్ధం కావడంలేదు. కుటుంబసభ్యుల్లో ఎవరో ఒకరు అధికారం వైపు ఉండటం మంచిదన్నది వారి  అభిప్రాయమా? ఇవేవీ కాకుండా వీరంతా ప్రజల కోసం బంధుత్వాన్నీ, అనుబంధాలనూ వదులుకుంటున్నారా? లేక అందరూ ఉత్తుత్తి నాటకాలు ఆడుతున్నారా? ఇవన్నీ జనం మదిలో మెదిలో ప్రశ్నలు. ఈ ప్రశ్నలకు సమాధానాలు దొరకడం కష్టం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement