సీమాంధ్ర ప్రచార కర్తలకు స్పెషల్ అవార్డులు....
సీమాంధ్ర ప్రచార కర్తలకు స్పెషల్ అవార్డులు....
Published Tue, May 6 2014 12:30 PM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM
ప్రచార పర్వం ముగిసింది. ప్రసంగాల హడావిడి ముగిసింది. ఈ సారి ప్రచారంలో ఎన్నో పదనిసలున్నాయి. ఎన్నెన్నో స్పెషాలిటీలున్నాయి. అయితే కొందరు మాత్రం ఈ సారి ప్రచారంలో అవార్డులు పొందేంత క్రెడిట్ కొట్టేశారు. కొన్ని ప్రత్యేక అవార్డులు ఇదిగో ....
పప్పులో కాలు అవార్డు - ఇంకెవరికి... నారా లోకేశ్ కే. తెలుగుదేశం పార్టీకి ఓటేస్తే ఉరేసుకున్నట్టే అని పార్టీ కార్యకర్తలందరి ముందూ చెప్పినందుకు... చెప్పి చప్పట్లు కొట్టించుకున్నందుకు....ఈ అవార్డు ఆయనకే.
చెప్పులో పాలు అవార్డు - ఇది కూడా జూనియర్ నారా వారికే. ఆయన మాత్రమే తన సొంత పార్టీని మతపిచ్చి, కుల పిచ్చి బంధుప్రీతి ఉన్న పార్టీ ఏదైనా ఉంటే అది తెలుగుదేశమే అని ఢంకాబజాయించి చెప్పగలరు.
ఛాతీబాదుడు అవార్డు - ఇదో ప్రత్యేక అవార్డు. ప్రసంగిస్తూ బల్ల గుద్దడమే మనకు తెలుసు. ఛాతీ బాదుకోవడం అనే ప్రత్యేక లక్షణాన్ని ప్రదర్శించిన పవన్ కళ్యాణ్ కోసమే ఈ అవార్డు. (ఛాతీ బాదుడు చింపాంజీలే చేస్తాయని ఇన్నాళ్లూ అనుకునేవాళ్లం.)
యెల్లో ఫెల్లో అవార్డ్ అఫ్ ది ఇయర్ - కొత్త మతం పుచ్చుకుంటె గుర్తులెక్కువ అంటారు. కుతూహలమ్మను చూస్తే ఈ సామెత ఖచ్చితంగా గుర్తుకు వస్తుంది. టీడీపీ మహిళా నేతలు చాలా మంది పసుపు చీరలు కట్టుకోవడం మానేశారు. కొత్తగా పార్టీ మారిన కుతూహలమ్మ మాత్రం దట్టమైన పసుపు చీర కట్టి ఈ అవార్డుకు తనకు పోటీ లేనేలేదని నిరూపించుకున్నారు.
చంద్రబాబు అవార్డ్ - ఈ అవార్డ్ కేవలం చంద్రబాబుకే. సీమాంధ్ర రాజధానిని హైదరాబాద్ లా, సీమాంధ్రను సింగపూర్ లా చేయగలగడం ఎవరికి సాధ్యం? హైదరాబాద్ లో సగం ఉండే సింగపూర్ లాంటి రాష్ట్రానికి సింగపూర్ కి డబుల్ ఉండే రాజధానిని ఇంకెవరు ఇవ్వగలరు? మరో మాట... కృష్ణా, గోదావరి, తుంగభద్ర, పెన్నలు ప్రవహించే సీమాంధ్ర ను సింగపూర్ గా చేసి సింగపూర్ లా నీరు కూడా కొనుక్కునే పరిస్థితి తేవడం ఇంకెవరికి సాధ్యం? కాబట్టి ఈ అవార్డు ఖచ్చితంగా చంద్రబాబుకే.
భరత అవార్డు - అలనాడు భరతుడు చెప్పులు మోశాడు. ఈ రోజు కిరణ్ గారు చెప్పులు మోస్తున్నారు. అయితే ఆ చెప్పులు టీడీపీ - బీజేపీ కూటమివి అని గిట్టని వాళ్లంటున్నారు. చెప్పులకు ఇంత ప్రచారం కల్పించిన ఆయనకే ఈ అవార్డు.
(ఇదంతా సరదాగా నవ్వుకోవడానికే.)
Advertisement