'పవన్‌కు ఉన్నదంతా లెక్కలేనంత తిక్క'
గుంటూరు : సినీనటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పవన్కు ఉన్నదంతా లెక్కలేనంత తిక్క మాత్రమేనని ఆమె వ్యాఖ్యానించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా షర్మిల గురువారం గుంటూరు జిల్లా క్రోసూరులో ప్రసంగించారు. ఈ సందర్భంగా చిరంజీవి, పవన్ కల్యాణ్లకు పలు ప్రశ్నలు సంధించారు.
చిరంజీవి, పవన్ కల్యాణ్ కలిసి 70 కోట్లకు ప్రజారాజ్యం పార్టీని అమ్ముకున్నారని షర్మిల విమర్శించారు. చిరంజీవి కూతురి ఇంట్లో మంచం కింద ఆ 70 కోట్లు పట్టుబడితే కేసులు లేకుండా చేసుకున్నారన్నారు. కాంగ్రెస్కు వ్యతిరేకంగా పెట్టిన ప్రజారాజ్యాన్ని అన్న కాంగ్రెస్లో కలిపేస్తుంటే పవన్ ఎందుకు నోరు మెదపలేదన్నారు. సేవ పేరిట పవన్ కల్యాణ్ కోట్ల కొద్దీ విరాళాలు సేకరించాడని, కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఎక్కడని షర్మిల ప్రశ్నించారు. ఆ విరాళాలతో పవన్ ఏం చేశాడో ఎక్కడైనా చెప్పాడా అన్నారు.
ఎంతమంది ప్రజలకు సేవ చేశాడో పవన్ ఎప్పుడైనా చెప్పాడా అని అడిగారు. తన సంస్థ బతికుందో లేదో పవన్ ఎన్నడైనా చెప్పాడా అన్నారు. ప్రశ్నించడమే పనిగా పెట్టుకున్న పవన్ తొలుత తన అన్నను ప్రశ్నించాలని షర్మిల డిమాండ్ చేశారు. ప్రజారాజ్యాన్ని ఎందుకు అమ్మేసుకున్నాడో చిరంజీవిని ప్రశ్నించాలని సూచించారు. ఎన్నికల ముందు పవన్కు ప్రజలు గుర్తొచ్చారా అని ఎద్దేవా చేశారు. విలువలు, విశ్వసనీయత లేని వ్యక్తి పవన్ అని అన్నారు.
సీమాంధ్రను సింగపూర్ చేస్తానంటున్న చంద్రబాబు నాయుడు తొమ్మిదేళ్ల పాలనలో కుప్పం నియోజకవర్గాన్ని మున్సిపాలిటీ కూడా చేయలేకపోయారన్నారు. అలాంటి చంద్రబాబు మాటలను నమ్మితే అధోగతేనని షర్మిల అన్నారు. ఇక సొంత నియోజకవర్గంలో వార్డు మెంబర్ను కూడా గెలిపించుకోలేని వ్యక్తి వెంకయ్య నాయుడు అని ఆమె ధ్వజమెత్తారు. తెలుగు రాష్ట్రంలో ఉనికి కోల్పోయిన వెంకయ్య వేరే రాష్ట్రానికి వెళ్లిపోయారని ఎద్దేవా చేశారు. జగనన్న ప్రభంజనాన్ని చూసి తట్టుకోలేక వెంకయ్య తలాతోక లేకుండా మాట్లాడుతున్నాడని మండిపడ్డారు.