పవన్ కల్యాణ్కు గోద్రా నరమేధంలో మోడీ పాత్ర గురించి అవగాహన ఉందో లేదో అని చిరంజీవి అనుమానం వ్యక్తం చేశారు. కానీ, చిరు అసలు రాజకీయ అజ్ఞాని అంటూ మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు.
తమ్ముడు లౌకికవాది అనుకున్నానని, కానీ.. మతతత్వవాది అయిన నరేంద్ర మోడీని కలవడం తనను ఆశ్చర్యానికి గురిచేసిందని కేంద్ర మంత్రి చిరంజీవి వ్యాఖ్యానించారు. బహుశా తమ్ముడు పవన్ కల్యాణ్కు గోద్రా నరమేధంలో మోడీ పాత్ర గురించి అవగాహన ఉందో లేదో అని అనుమానం వ్యక్తం చేశారు.
అయితే, అసలు రాజకీయాల గురించి చిరంజీవికి ఏమాత్రం అవగాహన లేదని, ఆయన ఓ రాజకీయ అజ్ఞాని అంటూ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. 2010లో తాను ముఖ్యమంత్రిగా ఉన్నట్లు ఓ సందర్భంలో చిరంజీవి వ్యాఖ్యానించారని, కానీ అప్పటికి రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్నారని.. ఇలాంటి కనీస విషయాలు కూడా తెలియకుండానే చిరంజీవి రాజకీయాలు చేసేస్తున్నారని కిరణ్ విమర్శించారు. ఆయన రాజకీయాల్లో ఓనమాలు తెలియకుండా ఏదో నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని అన్నారు.
ఇదంతా చూస్తుంటే రాజకీయాల్లోకి కొత్తగా అడుగుపెడుతున్న పవన్ కల్యాణ్కు అవగాహన లేదనుకోవాలా.. ఐదేళ్ల క్రితం రాజకీయాల్లోకి వచ్చి, సొంతంగా పార్టీ పెట్టి, దాన్ని మళ్లీ కాంగ్రెస్ పార్టీలో కలిపేసి, రాష్ట్ర విభజనకు ఇతోధికంగా సహకరించిన ఆయన అన్నయ్య చిరంజీవికి అవగాహన లేదనుకోవాలా అని జనం నోళ్లు నొక్కుకుంటున్నారు.