పేరుందో లేదో చూసుకోడానికే వెళ్లా!
జూబ్లీహిల్స్ క్లబ్ పోలింగ్ కేంద్రంలో తాను నేరుగా ఓటేయడానికి లోనికి వెళ్లలేదని, కేవలం అక్కడి జాబితాలో తన పేరు ఉందో లేదో అధికారులను అడిగి తెలుసుకోడానికే వెళ్లానని కేంద్ర మంత్రి చిరంజీవి అన్నారు. తాను నిబంధనలు ఉల్లంఘించలేదని, ఇంతకు ముందు తన ఓటు ఓబుల్రెడ్డి పబ్లిక్ స్కూల్లో ఉండేదని, ఇప్పుడు జూబ్లీహిల్స్ క్లబ్కు మారినందున సరిచూసుకోడానికి వెళ్లానని ఆయన ఓటేసి వచ్చిన తర్వాత మీడియాతో అన్నారు. నేరుగా బూత్లోకి వెళ్లి ఓటు వేయడానికి ప్రయత్నించబోగా ఆ సమయంలో కొందరు ఓటర్లు ఆయనను అడ్డగించి తామంతా గంటల తరబడి క్యూలో వేచి ఉన్నామని, అందువల్ల మీరు కూడా క్యూలోనే రావాలని కోరిన విషయం తెలిసిందే. ఇద్దరు గన్మెన్తో పాటు నేరుగా పోలింగ్ బూత్ గది వరకు వచ్చిన చిరంజీవి, ఆ తర్వాత తప్పనిసరి పరిస్థితులలో క్యూలో నిలబడి తన ఓటుహక్కు వినియోగించుకున్నారు.
అయిఏత, కేంద్ర మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి తన పేరు జాబితాలో ఉందో లేదో పోలింగ్ కేంద్రంలో సరి చూసుకోవడం అనేది హాస్యాస్పదం. ఎన్నికల సిబ్బంది ఇంటింటికీ తిరిగి స్లిప్పులు పంచారు. ఇంటర్నెట్లో చూసుకున్నా అక్కడ పోలింగ్ కేంద్రం పేరు, కేంద్రం నెంబరు, ఓటరు క్రమసంఖ్య కూడా స్పష్టంగానే ఉన్నాయి. పైపెచ్చు, ప్రతి పోలింగ్ కేంద్రానికి వెలుపల ప్రత్యేకంగా స్లిప్పులు ఉంచి వాటిని ఎన్నికల సిబ్బందే ఓటర్లందరికీ పంచారు. ఇంత జరిగినా కూడా చిరంజీవి మాత్రం నేరుగా బూత్లోకి వెళ్లి అక్కడున్న జాబితాలో తన పేరు ఉందో లేదో చూసుకోడానికి వెళ్లానని చెప్పడం కేవలం వీఐపీ సంస్కృతి మాత్రమేనని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. చివరకు ఓటర్లు కోరిన తర్వాత దానికి అంగీకరించి క్యూలోనే వెళ్లి ఓటు వేసి రావడంతో కథ సుఖాంతమైంది.