ఓటెత్తారు
స్వల్ప ఘర్షణలు మినహా పోలింగ్ ప్రశాంతం
- వెల్లువెత్తిన ప్రజా చైతన్యం
- పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరిన ఓటర్లు
- సగటు పోలింగ్ 82.81 శాతంగా నమోదు
- పోలింగ్ సరళిని పరిశీలించిన జిల్లా కలెక్టర్ విజయకుమార్
- దాడులకు తెగబడిన టీడీపీ
- మొరాయించిన ఈవీఎంలు
- 16న ఓట్ల లెక్కింపు, ఫలితాలు
సాక్షి, ఒంగోలు, జిల్లాలో సార్వత్రిక సంగ్రామం బుధవారం చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది. మూడు లోక్‌సభ, 12 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఓటుహక్కు వినియోగంపై ఎన్నికల సంఘం, స్వచ్ఛందసంస్థలు పెద్ద ఎత్తున ప్రచారం సాగించడంతో ఓటర్లలో అవగాహన పెరిగింది. ఫలితంగా, ఓటర్లు పెద్దసంఖ్యలో ఓటుహక్కు వినియోగించుకున్నారు. 2009లో 76.11 శాతం పోలింగ్ నమోదుకాగా.. ఈసారి 82.81 శాతం నమోదైంది. అంటే దాదాపు ఐదు శాతం పెరిగింది.
మధ్యాహ్నం తరువాత ఎండ తీవ్రత తక్కువగా ఉండటం కూడా పోలింగ్ శాతం పెరగడానికి ఒక కారణంగా చెప్పవచ్చు. ఉదయం ఏడు గంటల నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. ఒంగోలులోని రెడ్‌క్రాస్‌కు సమీపంలో ఉన్న వీఎన్‌జీ స్కూల్ పోలింగ్ కేంద్రం వద్ద జిల్లా కలెక్టర్ విజయ్‌కుమార్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటుహక్కు వినియోగించుకున్నారు.
జాయింట్ కలెక్టర్ కూడా ఇదే పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. వైఎస్సార్ సీపీ ఒంగోలు ఎంపీ అభ్యర్థి వైవీ సుబ్బారెడ్డి, ఒంగోలు అసెంబ్లీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి స్థానిక లాయరుపేటలోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేయగా..బాపట్ల ఎంపీ అభ్యర్థి వరికూటి అమృతపాణి చీరాలలో ఓటుహక్కు వినియోగించుకున్నారు.జిల్లాలో ఈవీఎంలు మొరాయించడంతో 46 కేంద్రాల్లో ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైంది. వాటిని సరిచేసేందుకు ప్రభుత్వ అధికారులు ఉరుకులుపరుగులు పెట్టారు. దీంతో ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్దనే పడిగాపులు కాశారు. పలుచోట్ల కేంద్రాల్లో ఓట్లు గల్లంతవడంతో ఓటర్లు ఆందోళనకు దిగారు.
పోలింగ్ సరళి..
ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం 12 గంటల వరకు ఉధృతంగా సాగింది. తర్వాత మూడుగంటలు మందకొడిగా సాగింది. మళ్లీ సాయంత్రం ఊపందుకుంది. పోలింగ్ సమయం ముగిసేలోపు పోలింగ్ కేంద్రాల్లోకి వచ్చిన ఓటర్లకు స్లిప్పులు పంపిణీ చేసి, ఓటుహక్కును వినియోగించుకునే అవ కాశం కల్పించారు.
- మొదటి గంటలో 6.91 శాతం పోలింగ్ నమోదైంది. ఉదయం 9గంటల వరకు 14 శాతం, 11 గంటలకు 34 శాతం, మధ్యాహ్నం ఒంటిగంటకు 54 శాతం, మూడు గంటల వరకు 62 శాతం, ఐదు గంటల వరకు 73.50 శాతం, ఆరుగంటల వరకు 81.1 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు.
- అన్ని నియోజకవర్గాల్లో సాయంత్రం ఆరుగంటల వరకూ పోలింగ్ కొనసాగింది.
- పలుచోట్ల పోలింగ్ కేంద్రాల అధికారులు సరైన సదుపాయాలు కల్పించకపోవడంతో ఓటర్లు ఇబ్బందులు పడ్డారు. కొన్ని కేంద్రాల వద్ద ఆరుబయట షామియానా (టెంట్)లు ఏర్పాటు చేయకపోవడంతో ఓటర్లు మండుటెండలోనే క్యూలైన్‌లలో నిలబడాల్సి వచ్చింది. మరికొన్నిచోట్ల మంచినీరు అందుబాటులో ఉంచకపోవడంతో వృద్ధులు, మహిళలు ఇబ్బందులు పడ్డారు.
ఈవీఎంలలో అభ్యర్థుల భవితవ్యం..
ఓటర్ల తీర్పును నిక్షిప్తం చేసుకున్న ఈవీఎంలను స్ట్రాంగ్‌రూమ్‌ల్లో భద్రపరిచారు. జిల్లా కేంద్రంలోని పేస్ ఇంజినీరింగ్ కళాశాలలో యర్రగొండపాలెం, కందుకూరు, కనిగిరి నియోజకవర్గాల ఈవీఎంలను భద్రపరిచారు. రైజ్ ఇంజినీరింగ్ కళాశాలలో దర్శి, చీరాల, ఒంగోలు, కొండపి, మార్కాపురం, గిద్దలూరు నియోజకవర్గాల ఈవీఎంలను, క్విస్ ఇంజినీరింగ్ కళాశాలలో పర్చూరు, సంతనూతలపాడు నియోజకవర్గాల ఈవీఎంలను భద్రపరిచారు. ఈ నెల 16న ఓట్లు లెక్కించి అదే రోజు ఫలితాలు వెల్లడిస్తారు.
దాడులకు తెగబడిన టీడీపీ శ్రేణులు..
పోలింగ్ సందర్భంగా పలుచోట్ల చెదురుమదురు ఘటనలు చోటుచేసుకున్నాయి. తీవ్రవాద ప్రభావిత గ్రామాల్లో అదనపు పోలీసు బలగాలు కవాతు నిర్వహించాయి. జిల్లా ఉన్నతాధికారులు పోలింగ్ సరళిని ఎప్పటికప్పుడు పరిశీలించారు. కలెక్టర్ విజయ్‌కుమార్ జిల్లాలోని పలు కేంద్రాలను సందర్శించారు.
= దర్శి నియోజకవర్గంలోని గంగదొనకొండలో ఆరుఓట్లు వేసిన తర్వాత ఈవీఎం మొరాయించడంతో పోలింగ్ గంటకు పైగా ఆలస్యమైంది. మార్కాపురం మండలం, వేములకోటలో కూడా ఈవీఎం మొరాయించగా, చీమకుర్తి మండలం పులికొండలో పోలింగ్ కేంద్రంలో ఓటేయడానికొచ్చిన ఒక వృద్ధుడు కాలుతగిలి ఈవీఎం యంత్రం కిందపడి ధ్వంసమైంది.
= సంతమాగులూరు మండలం గల్లాలచెరువు గ్రామంలో ముస్లిం ఓటర్లను టీడీపీ కార్యకర్తలు అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.
= తాళ్లూరు మండలం, వెలుగువారిపాలెం ఎస్సీకాలనీ వాసులను కూడా టీడీపీ శ్రేణులు పోలింగ్‌కేంద్రం వైపునకు వెళ్లకుండా అడ్డుకోవడం వివాదానికి దారితీసింది.
= కారంచేడు మండలం స్వర్ణలో పోలింగ్ కేంద్రం సమీపాన ఇంటిముందు వున్న గర్భిణిని విధుల్లో ఉన్న ఎస్‌ఐ చేయి చేసుకోవడంతో నిరసనగా స్థానిక మహిళలు ఆందోళన చేపట్టి ఓటింగ్‌ను బహిష్కరించారు.
= పర్చూరు నియోజకవర్గంలో మార్టూరు, యద్దనపూడి, ఇసుకదర్శిలోనూ టీడీపీ కార్యకర్తలు ఓటమిభయంతో దాడులకు తెగబడ్డారు. ఈఘటనల్లో వైఎస్‌ఆర్ సీపీ కార్యకర్తలకు తలలు పగిలాయి.
= బల్లికురవ మండలం నక్కబొక్కలపాడులోనూ టీడీపీ, వైఎస్‌ఆర్ సీపీ వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుని కొద్దిసేపు పోలింగ్ ఆగిపోయింది.
= అద్దంకి మండలం రామాయపాలెంలో ఒక వృద్ధ ఓటరుపై టీడీపీ ఏజెంట్ దౌర్జన్యంకు దిగడం వివాదానికి దారితీసింది. అదే మండలం, తిమ్మారెడ్డిపాలెం, సింగరకొండపాలెం, కట్టకింద పాలెంలోనూ ఇరువర్గాల ఘర్షణలో పలువురికి గాయాలయ్యాయి. అద్దంకి మండలం కాకానిపాలెం పోలింగ్ కేంద్రం వద్ద విధుల్లో ఉన్న బీఎల్‌వో టీడీపీకి అనుకూలంగా ప్రచారం చేయడంతో ఓటర్లు ఆందోళనకు దిగారు. కొటికలపూడి కేంద్రం వద్ద టీడీపీ సీనియర్ నేత కరణం బలరాం హల్‌చల్ చేసి ఓటర్లను భయభ్రాంతులకు గురిచేయడంపై స్థానిక మహిళలు ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు రంగప్రవేశించి ఆయన్ను అక్కడ్నుంచి పంపారు.
= సంతనూతలపాడు నియోజకవర్గంలోని నాగులుప్పలపాడు, చీమకుర్తిలో స్పల్పఘర్షణలు చోటుచేసుకున్నాయి. యర్రగొండపాలెం మండలం అమానిగుడిపాలెంలో ఏజెంట్ల మధ్య వివాదం ఇరువర్గాల ఘర్షణకు దారితీసింది.
= కనిగిరి నియోజకవర్గం, పామూరు మండలం వీరభద్రాపురం కేంద్రంలో రిగ్గింగ్‌కు పాల్పడుతున్న టీడీపీ శ్రేణులను వైఎస్‌ఆర్ సీపీ నేతలు ఎదుర్కొన్నారు. అదేమండలం మోపాడు, మోపాడుబంగ్లా పోలింగ్ కేంద్రాల వద్ద కూడా ఇరువర్గాల మధ్య స్వల్పఘర్షణ చోటుచేసుకుంది.
= కొత్తపట్నం మండలం రంగాయపాలెం, పాదర్తిలో, ఒంగోలు నగరం సెయింట్ థెరిస్సా స్కూలు పోలింగ్ కేంద్రం వద్ద ఇరువర్గాలను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జి చేయాల్సివచ్చింది.