
జూబ్లీహిల్స్ క్లబ్‌లో చిరంజీవికి చేదు అనుభవం
హైదరాబాద్ : ఓటు వేసేందుకు వచ్చిన కేంద్రమంత్రి చిరంజీవికి బుధవారం ఉదయం జూబ్లీహిల్స్ క్లబ్‌లో చేదు అనుభవం ఎదురైంది. చిరంజీవి వాహనం దిగి నేరుగా పోలింగ్ కేంద్రంలోకి వెళుతుండగా.... లైన్లో రావాలని ఆయనను కార్తీక్ అనే ఎన్నారై ఓటరు ఒకరు నిలదీశారు. తాను ఓటు వేయడానికి లోపలకు వెళ్లట్లేదని చెప్పబోతున్నా, తాము దాదాపు గంట నుంచి క్యూలో నిలబడి ఓటు వేసేందుకు వేచి చూస్తున్నామని, ఇలా వచ్చి, అలా ఓటు వేసి వెళ్లిపోతే తామంతా ఏం కావాలని ఆయన చిరంజీవిని ప్రశ్నించారు.
అప్పటికే ఇద్దరు గన్ మన్ సహా వచ్చిన చిరంజీవి, మీడియా దృష్టి మొత్తం తనమీదే పడిందని గుర్తించి, వాళ్లందరినీ శాంతపరిచి, క్యూలో నిలబడ్డారు. కాసేపు వేచి ఉండి, తన వంతు వచ్చిన తర్వాతే ఓటు వేశారు. ఆయనతో పాటు కుమారుడు రామ్ చరణ్, సతీమణి సురేఖ కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు.