జగ్గారెడ్డి దారేది..
సాక్షి, సంగారెడ్డి: సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్ రెడ్డి మరోసారి ఎన్నికల బరిలో దిగేందుకు సిద్ధమవుతున్నారా..? అవుననే అంటున్నాయి మారుతున్న రాజకీయ సమీకరణాలు. జనసేన పార్టీ అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్‌ను సోమవారం అతని నివాసంలో జగ్గారెడ్డి కలుసుకోవడం వెనుక ఆంతర్యమిదేనని చర్చ జరుగుతోంది. మెదక్ లోక్‌సభ, గజ్వేల్ అసెంబ్లీ స్థానాల నుంచి గెలుపొందిన టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవిని స్వీకరించేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో ఆయన లోక్‌సభ స్థానానికి ఎన్నికైన నాటి నుంచి 15 రోజుల్లో రాజీనామా సమర్పించాల్సి ఉంటుంది.
ఈ నేపథ్యంలో ఆరు నెలల్లో మెదక్ లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించడం అనివార్యం కానుంది. సంగారెడ్డి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి టీఆర్‌ఎస్ అభ్యర్థి చింత ప్రభాకర్ చేతిలో 29 వేలకు పైచిలుకు ఓట్ల తేడాతో ఓడిపోయిన జగ్గారెడ్డి ఇప్పుడు మెదక్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటున్నట్లు సమాచారం. మెదక్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి కేసీఆర్‌నే ఓడిస్తానని సార్వత్రిక ఎన్నికలకు ముందు జగ్గారెడ్డి పలుమార్లు సవాలు విసిరడం ఈ అంశాన్ని ధ్రువీకరిస్తోం ది.
ఈ క్రమంలోనే ఆయన పవన్ కల్యాణ్ మద్దతును కూడగట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు చర్చ జరుగుతోంది. ఒక వేళ జగ్గారెడ్డి పోటీకి సిద్ధమైతే, ఏ పార్టీ తరఫున బరిలో దిగుతారన్న అంశంపై ఊహగానాలు రేగుతున్నాయి. ఇంకా జనసేన పార్టీ నిర్మాణం పూర్తి కానందున, పవన్ కల్యాణ్ సహాయంతో బీజేపీ టికెట్ సంపాదించేందుకు జగ్గారెడ్డి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం. జగ్గారెడ్డి తెలంగాణకు అవసరమని.. ఆయన సేవలను వినియోగించుకుంటామని ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ పేర్కొనడంతో ఈ ఊహాగానాలకు బలం చేకూరినట్లయింది.
పవన్ అండ లభించేనా..?
బీజేపీ నుంచి రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన జగ్గారెడ్డికి తొలినాళ్లలో ఆ పార్టీ దివంగత నేత ఆలె నరేంద్ర గాడ్ ఫాదర్‌గా ఉండేవారు. బీజేపీ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరాక కూడా నరేంద్ర అండదండలు మెండుగానే ఉండేవి. ఆ తర్వాత కాలంలో కేసీఆర్‌తో విభేదించి కాంగ్రెస్‌లో చేరిన జగ్గారెడ్డి ఆ పార్టీ ముఖ్యమంత్రులందరితో సన్నిహితంగా మెలిగారు. విలక్షణ వ్యవహార శైలి, వివాదస్పద వ్యాఖ్యలు, దుందుడుకు స్వభావంతో ఎప్పుడూ వార్తల్లో ఉండేవారు.
అంతేకాకుండా సీఎంగా ఎవరుంటే వారికి మద్దతుగా ప్రతిపక్షపార్టీల నేతలపై ఆరోపణలు గుప్పించేవారు. అవసరమైతే సొంత పార్టీ వారినిసైతం వదిలేవారు కాదు. దీంతో టీ-కాంగ్రెస్‌లో ఆయన ఒంటరిగా మిగిలారు. కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎం పదవికి రాజీనామా చేసిన తర్వాత జగ్గారెడ్డి తన దూకుడును తగ్గించుకున్నప్పటికీ సొంతపార్టీ నేతల మద్దకు దక్కలేదు. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ అండతో మళ్లీ కొత్తగా జనం ముందుకు వచ్చేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారని చర్చ జరుగుతోంది.