బాధ్యతగల నేతలు నోరు పారేసుకోకూడదు
కేసీఆర్‌ను ఉద్దేశించి పవన్ వ్యాఖ్యలు
బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షాతో భేటీ
సాక్షి, హైదరాబాద్: బీజే పీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాతో జనసేన వ్యవస్థాపకుడు, సినీ నటుడు పవన్‌కల్యాణ్ గురువారం రాత్రి భేటీ అయ్యారు. ఇరువురూ రాష్ట్ర, జాతీయ రాజకీయాలపై చర్చించారు. షా బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తరువాత తొలిసారి హైదరాబాద్ వచ్చిన సందర్భంగా ఇద్దరం మర్యాదపూర్వకంగా కలుసుకున్నామని పవన్ ఆ తర్వాత మీడియాకు వివరించారు. అమిత్ షాతో రెండు, మూడు అంశాలపై చర్చించామన్నారు. రాష్ట్ర అభివృద్ధికి ఏం చేస్తే బాగుంటుందో అడిగారనిని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సమగ్ర సర్వేలో తాను హైదరాబాద్‌లో లేకపోవటం వల్ల పాల్గొనలేదని, అదే సమయంలో కోర్టు కూడా వివరాలు తప్పనిసరిగా అందచేయాల్సిన అవసరం లేదని చెప్పింది కాబట్టి పాల్గొనలేదని పవన్ మరొక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
బాధ్యత కలిగిన నేతలు నోరు పారేసుకోవటం మంచిది కాదని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావును ఉద్దేశించి వ్యాఖ్యానించారు. పదే పదే విద్వేషాలు రెచ్చగొడితే అశాంతి నెలకొంటుం దని.. నోరు మంచిదైతే ఊరు మంచిదౌతుందని పేర్కొన్నారు. త్వరలో జరిగే గ్రేటర్ ఎన్నికల్లో పార్టీ పోటీ చేయా లా లేదా అనే అంశంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని పవన్ చెప్పారు. తనకు అవకాశం ఉన్నంత వరకూ చేయగలిగినంత చేస్తానని, తరువాత బీజేపీతో కలిసి పనిచేస్తానన్నారు. కాగా, ఇక నుంచి తమ పార్టీ బలోపేతం కోసం పని చేయాలని పవన్ వద్ద అమిత్‌షా ప్రతిపాదించినట్లు సమాచారం.