ఉత్తమ రాజకీయాలకు దారేది? | devulapalli amar write article on pawan kalyan politics | Sakshi
Sakshi News home page

ఉత్తమ రాజకీయాలకు దారేది?

Published Wed, Jan 31 2018 1:11 AM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM

devulapalli amar write article on pawan kalyan politics - Sakshi

డేట్‌లైన్‌ హైదరాబాద్‌
పవన్‌ కల్యాణ్‌ తెలంగాణలో తిరగడాన్ని కూడా ఎవరూ అభ్యంతర పెట్టాల్సిన పనిలేదు. ఎవరికయినా స్వేచ్ఛ ఉంది. కానీ పవన్‌ మాట్లాడుతున్నదేమిటి? కేసీఆర్‌ తాట తీస్తానన్న నోటితోనే, ‘ఆయన అంటే నాకు మొదటి నుంచి చాలా అభిమానం’ అంటున్నారు. విభజన బాధతో పదకొండు రోజులు పస్తు ఉన్నానన్న నోటితోనే జై తెలంగాణ నినాదం వందేమాతరం అంత పవిత్రమయిందని కూడా అంటున్నారు. ఆయన మాటల్ని తెలంగాణ ప్రజలు నమ్మాలా? అభిప్రాయాలు ఎప్పుడూ ఒకేవిధంగా ఉండాల్సిన అవసరంలేదు, మారవచ్చు.

సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డి ఈ మధ్య ఒక సభలో మాట్లాడినప్పుడు ‘రాగ్‌ దర్బారీ’ అనే ఒక రాగం గురించి ప్రస్తావించారు. వెనకటికి మహారాజును పొగడటానికి ప్రత్యేకంగా కొంత మందిని నియమించేవాళ్లట. వారికి రకరకాల పేర్లు. వందిమాగధులనీ, విదూషకులనీ ఉండేవారు. ఆస్థానకవుల పనీ దాదాపు అదే. కానీ రాజరిక వ్యవస్థ అంతరించింది. ప్రజాస్వామ్యం వచ్చింది. అయినా ఈ ప్రభువులను పొగిడే జాతి మాత్రం వేర్వేరు రూపాల్లో కొనసాగుతూనే ఉన్నది. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు నడుస్తున్నది కూడా రాగ్‌ దర్బారీయే అంటే అతిశయోక్తి కాదు. 

ఆధునిక యుగపు ప్రభువులను కీర్తించడానికి కొత్తగా ఒక విదూషకుడు రాగ్‌ దర్బారీ ఆలపిస్తూబయలుదేరాడు. పైగా రాజాస్థానానికే పరిమితం కాకుండా రాజ్యం అంతటా తిరిగి ప్రభువు కీర్తి ప్రతిష్టలను ప్రజల ముందు వేనోళ్ల నోరారా పొగిడే పని భుజాన వేసుకున్నాడు ఈ కొత్త విదూషకుడు. అంతేకాదు రాజును విమర్శించే వాళ్లను దండించడానికి ఆ కాలంలో కొరడాలు వాడితే, ఇప్పుడు చట్టాలకు కొత్త పదును పెట్టి పరుష పదజాలాలు వాడితే కారాగార వాసం తప్పదని హుకుంనామాలు జారీ చేసేశారు. ఎంతసేపు ఈ డొంక తిరుగుడు? నేరుగా విషయానికి రావచ్చు కదా అని విసుక్కునే వాళ్లకోసం ఇక విషయానికి వచ్చేద్దాం!

పరిహాసమవుతున్న ప్రజాస్వామ్యం
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావును ‘తెలంగాణ గాంధీ’ అని కీర్తిస్తున్న వాళ్లు ఉన్నారు. ఆయన ఫొటోలకు పాలాభిషేకాలు చేస్తున్న వాళ్లూ ఉన్నారు. ఆయనను స్తుతిస్తున్న వాళ్లూ అనేక మంది ఉన్నారు తెలంగాణ సమాజంలో. పదమూడు సంవత్సరాల సుదీర్ఘ మలిదశ శాంతియుత పోరాటం తరువాత ప్రత్యేక రాష్ట్రం సాధించిన తెలంగాణ రాష్ట్ర సమితి అగ్రనేతగా చంద్రశేఖరరావు సర్వదా, సదా అభినందనీయుడే. అయితే ముఖ్యమంత్రిగా ఆయన నాయకత్వంలో నడుస్తున్న ప్రభుత్వాన్ని పల్లెత్తు మాట అనడానికి వీల్లేదు అంటేనే చిక్కంతా. తనను ఎవరూ విమర్శించడానికి వీల్లేదని మహాత్ముడు ఎన్నడూ అనలేదు. తెలంగాణ సాధన కోసం జరిగిన పోరాటంలో భాగం అయినవాళ్లూ, కాని వాళ్లూ ఎవరయినా సరే ప్రభుత్వ పనితీరు పట్ల ఒక అభిప్రాయం కలిగి ఉండే, ఆ అభిప్రాయాన్ని వ్యక్తం చేసే స్వేచ్ఛ, విమర్శించే హక్కు ప్రజాస్వామ్యంలో మన రాజ్యాంగం పౌరులందరికీ ఇచ్చింది. ఆ స్వేచ్ఛ ఒకరికి ఒక రకంగా, ఇంకొకరికి మరో రకంగా ఉండదు. 

అధికారంలో ఉన్నాను కాబట్టి నేను ఎవరినయినా ‘సన్నాసులు’, ‘పనికిమాలి నోళ్లు’ అంటాను. కానీ నన్ను ఎవరూ ఏమీ అనకూడదు అంటే కుదరదు. 2001లో తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటుకూ, మలిదశ ఉద్యమానికీ స్ఫూర్తిదాయకంగా నిలిచినది 1998 వరంగల్‌ డిక్లరేషన్‌. ఆ ఘట్టానికి 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా తలపెట్టిన ఊరేగింపు మీద ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. ఆరోజు వరంగల్‌ పట్టణంలో తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద గుమిగూడిన తెలంగాణ వాదుల మీద ఆడా మగా అని చూడకుండా పోలీసులు విచక్షణా రహితంగా దాడి చేసి నిర్బంధించారు. తెలంగాణ ఉద్యమకాలంలో తమ పోరాటానికి విశ్వసనీయతను జత చేసిన సంస్థ జేఏసీ. 

కొలువుల కోసం కొట్లాడుతానని జేఏసీ కోర్టు అనుమతి తెచ్చుకున్న కూడా ఎక్కడివాళ్లను అక్కడ అరెస్ట్‌ చేసి సభను భగ్నం చేసేందుకు ప్రయత్నం చేశారు. ఆ మధ్య వరంగల్‌ పట్టణంలో ఒక మహిళా సంఘం వాళ్లు హాల్‌ మీటింగ్‌ పెట్టుకుంటామంటే కూడా అక్కడి పోలీస్‌ కమిషనర్‌ అనుమతి ఇవ్వకుండా చేయడంలో హైదరాబాద్‌ నుంచి ఆదేశాలు ఉన్నాయన్న విషయం ఇక్కడ గుర్తు చేసుకోవాలి. ఇట్లా అనేకం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఆటా పాటా మాట మీద విరుచుకుపడుతున్న నిర్బంధానికి పరాకాష్ట– ధర్నా చౌక్‌ ఎత్తివేత. 1985–89 మధ్యకాలంలో ఎన్టీ రామారావు పరిపాలన నాటి పరిస్థితులను గుర్తు చేస్తున్నారు ఈనాటి పాలకులు. అప్పుడు కూడా తెలంగాణలో ఆటా మాటా పాటా బంద్‌ అయ్యాయి.

ఇదేం ధోరణి?
తన 25వ సినిమా విజయం సాధించలేకపోవడంతో ఇక పూర్తి స్థాయిలో రాజకీయాలనే వృత్తిగా చేసుకునే ఆలోచనకు వచ్చారు నటుడు పవన్‌ కల్యాణ్‌. తెలంగాణలోని కరీంనగర్‌ జిల్లా కొండగట్టు నుంచి యాత్ర ప్రారంభించారాయన. ఆ పర్యటనకు రాష్ట్ర ప్రభుత్వం భద్రతా ఏర్పాట్లు చేయడాన్ని ఎవరయినా ఎట్లా అర్థం చేసుకోవాలి? ఈ ప్రశ్న ఎందుకు వేయవలసి వచ్చిందం టే– సమైక్య రాష్ట్రానికి మద్దతు ఇస్తూ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ఆనాటి ఎంపీ జగన్‌మోహన్‌రెడ్డి పార్లమెంట్‌లో ప్లకార్డ్‌ పట్టుకున్నారు. దానిని కారణంగా చూపించి, ఓదార్పు యాత్రలో భాగంగా ఆయన మానుకోటకు బయలుదేరితే రచ్చ రచ్చ చేసి తీవ్ర ఉద్రిక్తతలకు కారకులయ్యారు కొందరు. వారే ఈరోజు అధికారంలో ఉండి పవన్‌కల్యాణ్‌కు ఎర్రతివాచీ పరచడం వెనుక మతలబు ఏమిటి? పవన్‌కల్యాణ్‌∙కేసీఆర్‌ తాట తీస్తానన్నారు. రాష్ట్రాన్ని విడగొట్టినందుకు భరించలేని దుఃఖంతో పదకొండురోజులు అన్నపానాలు మానేసి బాధపడ్డానన్నారు. 

జగన్‌మోహన్‌రెడ్డి తెలంగాణ ఉద్యమాన్ని కించపరుస్తూ ఒక్క పరుష పదప్రయోగం అయినా చేశారా? మరెం దుకు ఈ తేడా? అప్పుడు పరిస్థితి వేరు అంటారేమో! అప్పుడయినా ఇప్పుడయినా భావ ప్రకటనా స్వేచ్ఛకు అర్థం మాత్రం ఒకటే. ఇప్పుడు పవన్‌ కల్యాణ్‌ తెలంగాణలో తిరగడాన్ని కూడా ఎవరూ అభ్యంతర పెట్టాల్సిన పనిలేదు. ఎవరికయినా స్వేచ్ఛ ఉంది. కానీ పవన్‌ మాట్లాడుతున్నదేమిటి? కేసీఆర్‌ తాట తీస్తానన్న నోటితోనే, ‘ఆయన అంటే నాకు మొదటి నుండి చాలా అభిమానం’ అంటున్నారు. విభజన బాధతో పదకొండు రోజులు పస్తు ఉన్నానన్న నోటితోనే జై తెలంగాణ నినాదం వందేమాతరం అంత పవిత్రమయిందని కూడా అంటున్నారు. ఆయన మాటల్ని తెలంగాణ ప్రజలు నమ్మాలా? అభిప్రాయాలు ఎప్పుడూ ఒకేవిధంగా ఉండాల్సిన అవసరంలేదు, మారవచ్చు. 

అది ముందు చెప్పాలి. అప్పుడు నేను మాట్లాడిన మాటలు పొరపాటు, చెంపలు వేసుకుంటున్నాను, నా అభిప్రాయం తప్పు అని ప్రజల ముందుకు రావాలి. ఆయన ఆ పని చెయ్యలేదే! రాజకీయ పార్టీ పెట్టానంటున్న పెద్దమనిషి ప్రభుత్వాలను విమర్శించను అంటున్నాడంటే ఆయనను ఎట్లా అర్థం చేసుకోవాలి? రాజకీయ అవినీతికీ, దివాలాకోరుతనానికీ నిదర్శనంగా నిలిచిన ఓటుకు కోట్లు కేసు గురించి మాట్లాడను అని చెబుతున్న ఈ నాయకుడు ఈ దేశానికే నీతిపాఠాలు చెబుతానంటూ బయలుదేరాడు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఆయనకే ఎర్రతివాచీలు పరుస్తున్నాయి.

నిజం చెప్పాలంటే పవన్‌ కల్యాణ్‌ది అక్కడా ఇక్కడా కూడా రాగ్‌ దర్బారీయే. ఉద్యమ విజయశక్తిని నరనరాన నింపుకున్న తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులూ, శ్రేణులూ తమ అధినేత తాట తీస్తానన్న మాటకు క్షమాపణ చెప్పి, నిరాహారంగా పడుకుని బాధ పడ్డానంటూ తెలంగాణను అవమానించినందుకు ఆ తప్పును కూడా ఒప్పుకుని తెలంగాణ వీధుల్లో కదులు అని పవన్‌ కల్యాణ్‌ను ఎందుకు నిలదీయలేక పోయారు? పైగా సమర్థనలకు పూనుకోవడం వెనుక ఉన్న ఎజెండా ఏమిటి?

జగన్‌ యాత్రను హైజాక్‌ చేయడానికే!
వెయ్యి మందికి పైగా విద్యార్ధులు, యువకులు ఆత్మాహుతి చేసుకున్న తరువాత సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం కోసం ఇప్పుడు రక్తం ధారపోస్తాను అని ప్రకటించిన పవన్‌ కల్యాణ్‌ ఆపై ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశించాడు. అక్కడ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, యువ రాజకీయవేత్త జగన్‌మోహన్‌ రెడ్డి పాదయాత్ర సాగుతున్నది. జనం నుంచి ఆయనకు అద్భుతమయిన ఆదరణ లభిస్తున్నది. ఆయన పాదయాత్ర దారిలోనే పవన్‌ కల్యాణ్‌ను ప్రవేశపెట్టింది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం. ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు. ఆయన ప«థక రచనలో భాగంగానే ఈ పర్యటన సాగుతున్నది. జగన్‌మోహన్‌రెడ్డి శాసనసభలో ప్రతిపక్షనేత, ఆ కారణం వల్ల ఆయనది కేబినెట్‌ హోదా. శాసనసభలో ప్రతిపక్షాన్ని ‘గవర్నమెంట్‌ ఇన్‌ వెయిటింగ్‌’ అంటారు. 

2014 ఎన్నికల్లో అధికార పక్షానికీ, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌కూ వచ్చిన ఓట్ల తేడా రెండు శాతం కంటే తక్కువ. అంతటి ప్రజాదరణ కలిగిన నాయకుడు జగన్‌మోహన్‌రెడ్డి. ఆయన ఆ మధ్య అధికార పక్షానికి చెందిన ఒక ఎంపీ నడిపే బస్‌ ప్రమాదానికి గురైనప్పుడు, ఘటన స్థలాన్ని సందర్శించి మృతదేహాలను పోస్ట్‌ మార్టం చెయ్యకుండా ఎందుకు తరలించారని జిల్లా కలెక్టర్‌ను నిలదీసినందుకు ఆయన మీద కేసు పెట్టారు. ఏ హోదా లేని సినిమా నటుడు పవన్‌ కల్యాణ్‌ పర్యటిస్తుంటే మాత్రం అనంతపురం జిల్లాలో మంత్రి, ప్రజా ప్రతినిధులూ, అధికారులూ ఆయన ఆదేశిస్తే ఫైళ్లు చంకన పెట్టుకుని వెళ్లి సమీక్షలు జరిపారు. పవన్‌ కల్యాణ్‌ పార్టీకి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కనీసం ఒక్క వార్డ్‌ మెంబర్‌ కూడా లేడు. జగన్‌మోహన్‌రెడ్డికి లభి స్తున్న ప్రజాదరణను దారి మళ్లించే ప్రయత్నంలో భాగంగా ఈ ఎత్తు వేస్తున్నట్టు కనిపిస్తుంది. పార్ట్‌టైం రాజకీయాలను ప్రజలు ఎప్పుడూ ఆదరించిన దాఖలాలు చరిత్రలో లేవు.

అటు తెలంగాణలో అయినా, ఇటు ఆంధ్రప్రదేశ్‌లో అయినా పవన్‌ కల్యాణ్‌ విషయంలో జరుగుతున్నది ఒకే విధంగా కనిపిస్తున్నది. 2019 లోనో, ఇంకొంచెం ముందుగానో వచ్చే ఎన్నికల్లో ఓటమి భయం రెండు రాష్ట్రాల అధిపతులను పట్టి పీడిస్తున్న కారణంగానే పవన్‌ కల్యాణ్‌ అడుగులకు మడుగులు ఒత్తుతున్నట్టు అర్థం అవుతున్నది. మరి పవన్‌కల్యాణ్‌ ఎందుకు అక్కడా ఇక్కడా ‘రాగ్‌ దర్బారీ’ అందుకున్నారు? ఏది ఏమయినా అభిమానుల పేరిట ఉన్మాద మూకలను వెంటేసుకుని తిరిగే సినిమా నటుడు రాజకీయాల్లో తమకు ఉపయోగపడతాడని రెండు రాష్ట్రాల అధికారపక్షాలు భావిస్తూ ఉంటే పొరపాటు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నాయకులు ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలో పడేసే ఈ వికృత క్రీడకు తెర తీయడం ఆందోళన కలిగించే విషయమే. దీని గురించి రెండు రాష్ట్రాల ప్రజలూ ఆలోచించుకోవాల్సిందే.

దేవులపల్లి అమర్‌
datelinehyderabad@gmail.com

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement