మీటింగ్ హాల్‌లో జనసేన కార్యకర్తలు, అభిమానుల మధ్య తోపులాట
గుంతకల్లు టౌన్ : ప్రశ్నించడమే ధ్యేయంగా సినీనటుడు పవన్‌కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ గుంతకల్లు నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశం శనివారం జగడంగా మారింది. పార్టీబలోపేతానికి ఏర్పాటు చేసిన సమావేశంలో ఒక్కసారిగా వర్గ విభేదాలు బహిర్గతమయ్యాయి. ఆదిలోనే జనసేన సైన్యం ఆధిపత్యం కోసం ఆగ్రహంతో ఊగిపోయారు. ఒకరినొకరు తోపులాడుకున్నారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పవన్ ఫ్యాన్స్ నాయకులతో జనసేన రాష్ట్ర స్థాయి నాయకులు చర్చలు జరపడంతో శాంతించారు.
గుంతకల్లు నియోజకవర్గంలో పోలింగ్ బూత్‌లు, అడహక్ కమిటీల ఏర్పాటు, పార్టీ సిద్ధాంతాలు, భవిష్యత్ కార్యక్రమాల గురించి దిశానిర్దేశం చేయడానికి జనసేన నాయకుడు టైలర్ పవన్ ఆధ్వర్యంలో స్థానిక రాఘవేంద్ర ఫంక్షన్ హాల్‌లో నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. సమావేశానికి పార్టీ కేంద్ర కమిటీ ఉపాధ్యక్షుడు బి.మహేంద్రరెడ్డి , జిల్లా పరిశీలకుడు ప్రభాకర్, జిల్లా నేత టి.జె.వరుణ్ హాజరయ్యారు. అంతలోనే పవన్ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీరాములు, నాయకులు బద్రీ, అబ్దుల్‌బాసిద్, మెగా ఫ్యాన్స్ అధ్యక్షుడు గోపి నేతృత్వంలో అభిమానులు సమావేశ హాలులోకి చేరుకొని నినాదాలు చేశారు.
ఎన్నో ఏళ్లుగా తమ అభిమాన నటుడు పవన్‌కళ్యాణ్ కోసం అనేక సేవాకార్యక్రమాలు చేస్తున్న అభిమానులను సమావేశాలు, పార్టీ కార్యక్రమాలకు ఆహ్వానించలేదని ఆగ్రహంతో ఊగిపోయారు. కుర్చీలు, ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. దీంతో తోపులాట జరిగింది. ప్రారంభంలో వేదికపై ప్రసంగిస్తున్న పార్టీ ఉపాధ్యక్షుడు మహేందర్ రెడ్డిని అడ్డుకుని నినాదాలు చేశారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. పవన్‌ఫ్యాన్స్ నాయకులతో పార్టీ రాష్ట్ర నాయకులు ప్రత్యేకంగా చర్చలు జరిపి, పార్టీలో ప్రాధాన్యత కల్పిస్తామని భరోసా ఇచ్చారు.
దీంతో అభిమానులు, కార్యకర్తలు శాంతించారు. ఇప్పటివరకు ఏ ఒక్కరికీ పదవులు ఇవ్వలేదని,వర్గవిభేదాలు వీడి అందరూ కలిసిగట్టుగా పనిచేసి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని మహేందర్ రెడ్డి అందరికీ నచ్చజెప్పారు. త్వరలో అడ్‌హక్, పోలింగ్‌బూత్ కమిటీలను ఏర్పాటు చేస్తామని ప్రకటించి, సమావేశం ముగించారు. అనుమతి లేకుండా సభలు, సమావేశాలు ఎలా నిర్వహిస్తారని టూటౌన్ ఎస్‌ఐ చాంద్‌బాషా నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశం చివరి వరకు పోలీసులు భద్రతా చర్యలు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment