guntakal constituency
-
జనసేన పార్టీలో జగడం
గుంతకల్లు టౌన్ : ప్రశ్నించడమే ధ్యేయంగా సినీనటుడు పవన్‌కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ గుంతకల్లు నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశం శనివారం జగడంగా మారింది. పార్టీబలోపేతానికి ఏర్పాటు చేసిన సమావేశంలో ఒక్కసారిగా వర్గ విభేదాలు బహిర్గతమయ్యాయి. ఆదిలోనే జనసేన సైన్యం ఆధిపత్యం కోసం ఆగ్రహంతో ఊగిపోయారు. ఒకరినొకరు తోపులాడుకున్నారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పవన్ ఫ్యాన్స్ నాయకులతో జనసేన రాష్ట్ర స్థాయి నాయకులు చర్చలు జరపడంతో శాంతించారు. గుంతకల్లు నియోజకవర్గంలో పోలింగ్ బూత్‌లు, అడహక్ కమిటీల ఏర్పాటు, పార్టీ సిద్ధాంతాలు, భవిష్యత్ కార్యక్రమాల గురించి దిశానిర్దేశం చేయడానికి జనసేన నాయకుడు టైలర్ పవన్ ఆధ్వర్యంలో స్థానిక రాఘవేంద్ర ఫంక్షన్ హాల్లో నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. సమావేశానికి పార్టీ కేంద్ర కమిటీ ఉపాధ్యక్షుడు బి.మహేంద్రరెడ్డి , జిల్లా పరిశీలకుడు ప్రభాకర్, జిల్లా నేత టి.జె.వరుణ్ హాజరయ్యారు. అంతలోనే పవన్ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీరాములు, నాయకులు బద్రీ, అబ్దుల్‌బాసిద్, మెగా ఫ్యాన్స్ అధ్యక్షుడు గోపి నేతృత్వంలో అభిమానులు సమావేశ హాలులోకి చేరుకొని నినాదాలు చేశారు. ఎన్నో ఏళ్లుగా తమ అభిమాన నటుడు పవన్‌కళ్యాణ్ కోసం అనేక సేవాకార్యక్రమాలు చేస్తున్న అభిమానులను సమావేశాలు, పార్టీ కార్యక్రమాలకు ఆహ్వానించలేదని ఆగ్రహంతో ఊగిపోయారు. కుర్చీలు, ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. దీంతో తోపులాట జరిగింది. ప్రారంభంలో వేదికపై ప్రసంగిస్తున్న పార్టీ ఉపాధ్యక్షుడు మహేందర్ రెడ్డిని అడ్డుకుని నినాదాలు చేశారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. పవన్‌ఫ్యాన్స్ నాయకులతో పార్టీ రాష్ట్ర నాయకులు ప్రత్యేకంగా చర్చలు జరిపి, పార్టీలో ప్రాధాన్యత కల్పిస్తామని భరోసా ఇచ్చారు. దీంతో అభిమానులు, కార్యకర్తలు శాంతించారు. ఇప్పటివరకు ఏ ఒక్కరికీ పదవులు ఇవ్వలేదని,వర్గవిభేదాలు వీడి అందరూ కలిసిగట్టుగా పనిచేసి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని మహేందర్ రెడ్డి అందరికీ నచ్చజెప్పారు. త్వరలో అడ్‌హక్, పోలింగ్‌బూత్ కమిటీలను ఏర్పాటు చేస్తామని ప్రకటించి, సమావేశం ముగించారు. అనుమతి లేకుండా సభలు, సమావేశాలు ఎలా నిర్వహిస్తారని టూటౌన్ ఎస్ఐ చాంద్‌బాషా నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశం చివరి వరకు పోలీసులు భద్రతా చర్యలు చేపట్టారు. -
కార్యకర్తలకు అండగా ఉంటా
వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త వై వెంకట్రామిరెడ్డి గుంతకల్లుటౌన్: పార్టీ కార్యకర్తలకు ఎల్లవేళలా అండగా ఉంటానని వైఎస్సార్ సీపీ గుంతకల్లు నియోజకవర్గ సమన్వయకర్త వై వెంకట్రామిరెడ్డి భరోసా ఇచ్చారు. సోమవారం స్థానిక పార్టీ కార్యాలయంలో కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ ఎన్నికల్లో విజయం సాధించి పార్టీ అధికారంలోకి వస్తే నాలుగేళ్లు తన వెంట ఉన్న వారికి న్యాయం చేయాలని భావించానని, అయితే దురదృష్టవశాత్తు ఓడిపోయామన్నారు. కేవలం 1.9 శాతం ఓట్ల తేడాతో పార్టీ ఓటమిపాలైందన్నారు. అంతేగాకుండా టీడీపీ తప్పుడు వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిందని చెప్పారు. ఇప్పటినుంచి తాను కూడ కార్యకర్తల్లో ఒకడిగా పార్టీ అభివృద్ధికి పాటుపడతానని, అధికారపార్టీ చేసే తప్పులపై ప్రజల తరఫున పోరాడతానన్నారు. కార్యకర్తలు కూడ అందుకు సిద్ధంగా ఉండాలని కోరారు. స్థానిక ఎమ్మెల్యే కక్ష సాధింపు చర్యలు మానుకుని నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడాలని సూచించారు. మునిసిపల్ ఎన్నికల్లో గెలిచిన వారికి శుభాకాంక్షలు తెలిపారు. సమావేశంలో పార్టీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు యుగంధర్‌రెడ్డి, మైనుద్దీన్, పట్టణ క న్వీనర్లు సుధాకర్, ఎద్దుల శంకర్, నాయకులు జింకల రామాంజనేయులు, గోపా జగదీష్, ఫ్లయింగ్ మాబు, మల్లికార్జున శాస్త్రి, త్యాగరాజు, బావన్న, రమేష్, తదితరులు పాల్గొన్నారు. -
'నామినేషన్ వెనక్కా... తీసుకోను గాక తీసుకోను'
అనంతపురం జిల్లా గుంతకల్లులో బీజేపీకి టీడీపీ బుధవారం ఝలక్ ఇచ్చింది. గుంతకల్లులో స్థానిక టీడీపీ నేత జితేంద్రగౌడ్‌ను నామినేషన్ వేయాలని ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆదేశించారు. అంతే బాబు ఆదేశాలతో ఎగిరి గంతేసిన జితేంద్ర ఆగమేఘాల మీద నామినేషన్ వేశారు. అయితే గుంతకల్ స్థానాన్ని పొత్తులో భాగంగా బీజేపీకి చంద్రబాబు కేటాయించారు. అందులోభాగంగా బీజేపీకి చెందిన అభ్యర్థి నామినేషన్ దాఖలు చేయాలి. అలాగే బీజేపీ అభ్యర్థి నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ ఉపసంహరణ గడువు నేటితో ముగియనుండటంతో వేసిన నామినేషన్ ఉపసంహరించాలని జితేంద్రగౌడ్‌ను స్థానిక బీజేపీ నాయకులు కోరారు. అందుకు సదరు టీడీపీ నేత నిరాకరించి... పార్టీ అధినేత చంద్రబాబే నాకు స్వయంగా ఆదేశించినప్పుడు నేను ఎలా నామినేషన్ వెనక్కి తీసుకుంటా అంటూ బీజేపీ నేతలకు ఝలక్ ఇచ్చారు. దాంతో చంద్రబాబుపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీతో పొత్తు ఎందుకు పెట్టుకున్నామురా బాబు అంటు జుట్టు పీక్కుంటున్నారు.