
సాక్షి, అమరావతి : బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షాపై జనసేనాని పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అమిత్ షా రాసిన లేఖను పట్టించుకోవాల్సిన అవసరం జనసేనకు లేదని ఆయన అన్నారు. సోమవారం ఏపీ వామపక్ష నేతలు మధు, రామకృష్ణలతో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా ఓ విలేఖరి.. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడికి అమిత్ షా రాసిన లేఖపై పవన్ స్పందన కోరాడు. ‘ఆయన ఓ పార్టీ ప్రెసిడెంట్. భారత దేశ ప్రభుత్వ ప్రతినిధి కాదు. దానికి ఆయనకు సంబంధం లేదు. ఓ పార్టీ ప్రతినిధి ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధి గురించి ఎలా మాట్లాడగలరు?. దానిని ఏ ప్రామాణికంలో తీసుకోవాలి. దానిని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం మాకుగానీ, వామపక్ష పార్టీలకుగానీ లేదు. కేంద్ర ప్రభుత్వం, ప్రధాని కార్యాలయం లాంటి కేంద్ర ప్రభుత్వ విభాగాల నుంచి లిఖిత పూర్వకంగా లేఖలు వస్తే స్పందిస్తాం. అంతేగానీ, ఆయన లాంటి వాళ్లు రాసే లేఖను పట్టించుకోం’ అని పవన్ స్పష్టం చేశారు.
‘ఆయన వస్తానంటే ఆహ్వానిస్తా’
కాగా, గత కొద్ది రోజులుగా మాజీ ఐపీఎస్ అధికారి లక్ష్మీ నారాయణ జనసేనలోకి వెళ్తారన్న కథనాలు గత కొద్దిరోజులుగా చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో మీడియాతో నిర్వహించిన చిట్ చాట్‌లో పవన్ ఆ అంశంపై స్పందించారు. ‘మా పార్టీ లోకి లక్ష్మీ నారాయణ వస్తారని ప్రచారం జరుగుతోంది. గతంలో ఒక్కసారి మాత్రమే అయన నేను కలిశాను. మొన్న కూడా ఆవిర్భావ సభకు ముందు కూడా ఆల్ ది బెస్ట్ చెబుతూ నాకు ఆయన మెసేజ్ పెట్టారు. అంతే.. కానీ, ఆయన మా పార్టీ లోకి వస్తానంటే తప్పకుండా ఆహ్వానిస్తా’ అని పవన్ తెలిపారు.