టీడీపీ హామీలు నెరవే ర్చే పూచీ నాది:పవన్ కల్యాణ్
* జనసేన పార్టీ తరఫున ఆ హామీలన్నీ నెరవేరుస్తాం
* అనంతపురం సభలో పవన్ కల్యాణ్
అనంతపురం టౌన్, న్యూస్‌లైన్ : టీడీపీ అధికారంలోకొచ్చి.. మేనిఫెస్టోలో పేర్కొన్న హామీలను గనుక నెరవేర్చకపోతే తనను అడగాలని జనసేన అధ్యక్షుడు పవన్ క ల్యాణ్ సూచించారు. ఆ హామీలను జనసేన తరఫున తాను నెరవేరుస్తానని చెప్పారు. అనంతపురం ఆర్‌ట్స కళాశాల ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో సోమవారం నిర్వహించిన టీడీపీ ఎన్నికల బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. రాయలసీమ ప్రాంతం కక్షలతో కాకుండా పంట పొలాలతో పచ్చగా ఉండాలనేదే తన కోరిక అని, ఇందులో భాగంగానే తాను నరేంద్ర మోడీకి మద్దతు ఇవ్వాల్సి వచ్చిందని తెలిపారు.
మోడీ, చంద్రబాబు తనకు బంధువులు కారని స్పష్టం చేశారు. వారి తరఫున తాను బాధ్యత తీసుకుని పోరాటం చేస్తానని, ఇచ్చిన హామీలన్నీ నేరువేరుస్తానని చెప్పారు. సీమాంధ్ర ఇప్పుడు కష్టాల్లో ఉందని, కష్టాల్లో ఉన్న వారి వైపు నిలబడితే ఆ కిక్కే వేరప్పా అంటూ సినీ డైలాగు వల్లించారు. తనకు పదవులపై ఆశ లేదని, ప్రజారాజ్యం పార్టీ మాదిరిగా తాను జనసేన పార్టీ నుంచి అభ్యర్థులను పోటీలో నిలబెట్టలేదని వివరించారు. సీమాంధ్ర ఆత్మగౌరవం కాపాడే వారికే ఓట్లు వేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అనంతపురం ఎంపీ అభ్యర్థి జేసీ దివాకర్‌రెడ్డి, అనంతపురం, శింగనమల అసెంబ్లీ అభ్యర్థులు ప్రభాకర్ చౌదరి, యామినిబాల పాల్గొన్నారు.