జిల్లా అంతా ఒకే ‘గాలి’
ఎన్నికల వేళ హడావుడి చేస్తున్న ప్రశాంత్‌ని సముదాయించబోయిన పార్వతమ్మతో ‘ మాటల్లేవ్.. మాట్లాడుకోవటాల్లేవ్’ అంటూ గాల్లో చూపుడు వేలు తిప్పుతూ సమాధానం చెప్పకనే చెప్పాడు ఆ కుర్రాడు. 19 ఏళ్ల అతనికి ఇటీవలే ఓటు హక్కు వచ్చింది.పదిమంది డ్వాక్రా మహిళలు ఓ చోట చేరారు. ఈ సారి ఎవరికి ఓటేయాలబ్బా అనుకున్నారు. అంతలో అక్కడున్న మూడేళ్ల బుడతడు ‘ ఫ్యాన్ గుర్తుకు ఓటెయ్యండి.. దుమ్ముదులపండి’ అనే యాడ్‌ను పలికాడు. అంతే అక్కడున్న డ్వాక్రా మహిళలు డిసైడయ్యారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వస్తే రుణాలన్నీ మాఫీ అవుతాయన్న నిజాన్ని గ్రహించారు.
ఇలా జిల్లాలో ఎటు చూసినా.. ఏవర్గాన్ని పలకరించినా ఒకే మాట.. ఒకే గాలి. 12 అసెంబ్లీ నియోజకవర్గాలు.. ఆయా పరిధిలో ఉన్న ఒంగోలు.. బాపట్ల పార్లమెంటు ఓటర్లు కూడా ప్రజాభిమానం సంపాదించుకున్న వైఎస్సార్ సీపీ గురించే తీవ్రంగా చర్చించుకుంటున్నారు. దీనికి ఎన్నో కారణాలు ఉదాహ రణ గా నిలుస్తున్నాయి. ఆ పార్టీ స్థాపన నుంచి అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజా సమస్యలపై ఎన్నో దీక్షలు చేయడం.. సమైక్యాంధ్ర ఉద్యమంలో జైలులో ఉండి కూడా నిరవధిక నిరాహార దీక్ష చేయడం.. ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, కుమార్తె షర్మిల కూడా ఉమ్మడి రాష్ర్టం కోసం పోరాడటాన్ని జిల్లా ప్రజానీకం గుర్తు చేసుకుంటోంది.
ఇక వైఎస్ రాష్ట్రానికి చేసిన సేవలను ప్రతి ఒక్కరూ జ్ఞప్తికి తెచ్చుకుంటున్నారు. ప్రజా సంక్షేమం కోసం ఆయన ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ, పావలా వడ్డీ వంటి ఎన్నో పథకాల వల్ల ఎంతోమంది జిల్లా వాసులు లబ్ధిపొందారు. ఆయన తర్వాత వైఎస్ కుటుంబంపై కాంగ్రెస్, టీడీపీలు పన్నిన కుట్రలకు చలించారు. అందుకే ఇప్పుడు సమాధానం చెప్పేందుకు సన్నద్ధులయ్యారు. దీనికి తోడు జగన్‌మోహన్‌రెడ్డి రూపొందించిన మేనిఫెస్టో ప్రతి ఒక్కరికీ ఉపయోగపడేలా ఉండటంపై ప్రజలు ఆలోచిస్తున్నారు. ఐదు సంతకాలతో పాటు.. ఇతర ముఖ్యమైన పనులను కూడా వెంటనే చేస్తానంటూ జగన్ హామీ ఇవ్వడంతో ఆ పార్టీని బలపరిచేందుకు సిద్ధమవుతున్నారు.
పవన్ పర్యటించినా.. టీడీపీలో నిరుత్సాహం
చావుతప్పి కన్నులొట్టపోయిన విధంగా తయారైన టీడీపీ జిల్లాలో తన ఉనికి కోసం సినీనటుడు పవన్ కల్యాణ్‌ను ప్రచారం కోసం ఒంగోలు తె ప్పించినా.. ఆ పార్టీ క్యాడర్‌లో ఉత్సాహం ఏమాత్రం రాలేదు. పసలేని పవన్ ప్రసంగాలు.. జిల్లాలో వేధిస్తున్న ఆధిపత్య పోరాటాలు కార్యకర్తలను ఇంకా గందరగోళంలోనే ఉంచాయి. బాబు హయాంలో జిల్లాలోని రైతులు, ఉద్యోగులు, నిరుద్యోగులు, డ్వాక్రా మహిళలు, విద్యార్థులు పడిన కష్టాన్ని ఇంకా ఎవరూ మరచిపోలేదు. రెండెకరాల పొలంతో జీవితాన్ని ప్రారంభించిన చంద్రబాబుకు కోట్ల ఆస్తులు, స్విస్‌బ్యాంకు ఖాతాలు, హెరిటేజ్ వంటి సంస్థలు ఎక్కడ్నుంచి వచ్చాయని రైతులు ప్రశ్నిస్తున్నారు.
రాష్ట్ర విభజనకు సై అనడం.. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాపాడటం వంటి కారణాల వల్ల ఇటీవల దర్శి, పర్చూరు, మార్కాపురం, గిద్దలూరులోని టీడీపీ బహిరంగ సభలు బోసిపోయాయని ప్రజలు చర్చించుకుంటున్నారు. కందుకూరు, కనిగిరి, మార్కాపురం, ఒంగోలు, అద్దంకి తదితర చోట్ల అధికంగా ఉన్న బీసీలతో పాటు కాపు సామాజికవర్గంలోని మెజార్టీ ప్రజలు పవన్‌కల్యాణ్ ప్రసంగంపై మండిపడ్డారు. టీడీపీకి కంచుకోటగా ఉన్న గ్రామాల్లోనూ ఈసారి వైఎస్‌ఆర్ సీపీ జెండాలు రెపరెపలాడుతుండటం విశేషం. టీడీపీ నేతలు ఇళ్లకే పరిమితమై.. తమ అనుచరులతో డబ్బు, మద్యం భారీగా పంపిణీ చేసినప్పటీకీ ఓటర్లు మాత్రం ‘ఫ్యాన్’కే తమ మద్దతని బహిరంగంగా చెబుతున్నారు.
- సాక్షి, ఒంగోలు