దేవినేని ఉమా అసంతృప్తి !
సాక్షి, విజయవాడ : టీడీపీ విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జి కేశినేని శ్రీనివాస్(నాని) తనపై దుష్ర్పచారం చేస్తూన్నారంటూ ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు దేవినేని ఉమా పార్టీ పరిశీలకుడు సుజానాచౌదరి వద్ద ఆదివారం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారని సమాచారం. విశ్వసనీయ సమాచారం ప్రకారం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జరిగిన రిపబ్లిక్‌డే ఉత్సవాలతో పాటు పార్టీకి సంబంధించి ఇతర కార్యక్రమాల్లో పాల్గొనడానికి వచ్చిన సుజానా చౌదరి ఆదివారం మధ్యాహ్నం బందరురోడ్డులోని ఒక హోటల్‌లో బస చేసినప్పుడు దేవినేని ఉమా వ్యక్తిగతంగా కలిసి తన నిరసన తెలియజేశారు.
కేశినేని నాని తన ప్రతిష్ట దెబ్బతినే విధంగా జిల్లాలోని పార్టీ ముఖ్యనేతల వద్ద మాట్లాడుతున్నారని ఫిర్యాదు చేశారు. ఇదే పరిస్థితి కొనసాగితే తన ప్రతిష్టే కాకుండా పార్టీ ప్రతిష్ట దెబ్బతింటుదని చెప్పారు.ఈ అంశాన్ని తాను చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లతానని చెప్పగా, సుజనా చౌదరి వారించి పరిస్థితిని ఇక్కడే చక్కదిద్దుకుందామని సర్థి చెప్పినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
పార్టీ శ్రేణులకు తలనొప్పి....
ఇప్పటికే కేశినేని, దేవినేని మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరుకు పార్టీ శ్రేణులు నలిగిపోతున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ పోరు తారాస్థాయికి చేరుతుండటం పార్టీకి తలనొప్పిగా మారింది. ఇప్పటికే జి ల్లాలో పార్టీ తీరు అంతంత మాత్రంగా ఉండగా... ఇ ప్పుడు ఇరువురు ముఖ్యనేతలు నువ్వా-నేనా అన్న ట్లు తలపడుతూ ఉండటం కలవరపాటుకు గురిచేస్తుంది.
చంద్రబాబు వద్దకు జిల్లా ముఖ్యులు....
నగరంలోని ఒక సామాజిక వర్గానికి చెందిన వ్యాపారవేత్తలు సినీనటుడు అక్కినేని నాగేశ్వరరావు పార్ధీవశరీరాన్ని చూడడానికి హైదరాబాద్ వెళ్లారు. అక్కినేని మృతదేహాన్ని సందర్శించిన అనంతరం వారంతా వెళ్లి చంద్రబాబునాయుడ్ని కలిశారు. అదే సమయంలో జిల్లాలో పార్టీ పరిస్థితి గురించి చర్చకు రాగా కేశినేని-దేవినేని మధ్య విభేదాలు, ఇటీవల కాళేశ్వరీ రవీ ప్లెక్సీల వివాదం గురించి వివరించినట్లు తెలిసింది. దీంతో పరిస్థితి చక్కదిద్దుతామని చంద్రబాబు హామీ ఇచ్చి వారిని పంపారని సమాచారం.