కోస్టల్‌ బ్యూటీ.. విశాఖ అందాలపై ప్రత్యేక కథనం | Special Article On Beauty Of Visakhapatnam Occasion Of Tourism Day | Sakshi
Sakshi News home page

కోస్టల్‌ బ్యూటీ.. విశాఖ అందాలపై ప్రత్యేక కథనం

Published Mon, Sep 27 2021 10:36 AM | Last Updated on Mon, Sep 27 2021 11:00 AM

Special Article On Beauty Of Visakhapatnam Occasion Of Tourism Day - Sakshi

కొండకోనల్ని చూసినా.. అందాల మన్యంలో అడుగు పెట్టినా.. అలల సవ్వడితో హొయలొలుకుతున్న సాగర తీరంలో విహరిస్తున్నా.. ఆధ్యాత్మిక శోభతో ఆహ్లాదపరిచే దేవాలయాల్లో అర్చన చేసినా... ఏ చోటకు వెళ్లినా భూతల స్వర్గమంటే ఇదేనేమో అన్న అనుభూతిని అందిస్తుంది విహార విశాల విశాఖ. ప్రపంచంలోని అందాలన్నీ ఓచోట చేరిస్తే బహుశా దానినే విశాఖ అంటారేమో. రాష్ట్రంలో ఏడాదికి కోటికి పైగా పర్యాటకులు వస్తున్న జిల్లా ఏదైనా ఉందంటే అది విశాఖపట్నమే. జాతీయ, అంతర్జాతీయ పర్యాటకులు ఇక్కడి సహజసిద్ధమైన అందాలకు ఫిదా అవుతుంటారు. సందర్శకుల మనసు దోచేలా ఈ సౌందర్యసీమను పర్యాటకంలో అగ్రభాగాన నిలిపేందుకు కొత్త ప్రాజెక్టులెన్నో పట్టాలెక్కనున్నాయి. పర్యాటక దినోత్సవం సందర్భంగా విశాఖ అందాలపై ప్రత్యేక కథనం..

సాక్షి, విశాఖపట్నం: భారత్‌లో అడుగుపెట్టే ప్రతి పది మంది విదేశీ పర్యాటకుల్లో ముగ్గురు విశాఖని సందర్శించేందుకు ఎంపిక చేసుకుంటున్నారు. ఎందుకంటే అద్భుత పర్యాటక ప్రాంతాలు విశాఖ సొంతం. అందుకే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా జిల్లాలో ఉన్న అపార అవకాశాల్ని మెరుగు పరుచుకొని పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి రూపకల్పన జరుగుతోంది. విశాఖ జిల్లానూ పర్యాటక ఖిల్లాగా మార్చే దిశగా టూరిజం ప్రాజెక్టులకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని ప్రాజెక్టులు గ్రౌండింగ్‌ అవ్వగా, మరికొన్ని పనులు ప్రారంభానికి సన్నద్ధం చేస్తున్నారు. ఇంకొన్నింటికి డీపీఆర్‌లు తయారవుతున్నాయి.  చదవండి: (ఏపీ రొయ్య.. మీసం మెలేసింది!)



సర్క్యూట్‌లు పూర్తయితే.. సూపర్‌ 
రాష్ట్రంలో టూరిజం సర్క్యూట్‌లు అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రణాళికలు సిద్ధం చేసింది. అరకు టూరిజం సర్క్యూట్‌కి కేంద్రం ప్రభుత్వం నుంచి అనుమతులు రావాల్సి ఉండగా.. మిగిలిన సర్క్యూట్‌లు కూడా కొత్త పాలసీ వచ్చాక ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే రూ.156 కోట్లతో అరకు ఎకో టూరిజం సర్క్యూట్, రూ.49 కోట్లతో భీమిలిలో పాసింజర్‌ జెట్టీ సర్క్యూట్‌ ప్రాజెక్టులకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌) సిద్ధమైంది. ఈ డీపీఆర్‌ కేంద్ర ప్రభుత్వం వద్ద ఉండటంతో ఇటీవలే మంత్రి ముత్తంశెట్టి సంబంధిత అధికారులతో పాటు కేంద్ర మంత్రులతో భేటీ అయి.. ప్రాజెక్టు పట్టాలెక్కించేందుకు అనుమతులు కోరారు. అదే విధంగా బౌద్ధ కేంద్రాలైన బొజ్జనకొండ, తొట్లకొండ, బావికొండలను రూ.20.70 కోట్లతో బుద్ధిస్ట్‌ సర్క్యూట్‌ పేరిట అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఈ సర్క్యూట్‌లు సిద్ధమైతే.. పర్యాటకానికి మరిన్ని సొబగులు చేకూరనున్నాయి. 



10 బీచ్‌ల అభివృద్ధితో కొత్త సోయగాలు 
విశాఖలోని బీచ్‌లంటే అందరికీ ఇష్టమే. ఆర్‌కే బీచ్‌కు రోజూ లక్షల మంది వస్తుంటారు. అందుకే కైలాసగిరి నుంచి భోగాపురం వరకు 10 బీచ్‌లు అభివృద్ధి చేయనున్నారు. సాగర్‌నగర్, తిమ్మాపురం, మంగమూరిపేట, చేపలుప్పాడ, ఐఎన్‌ఎస్‌ కళింగ, ఎర్రమట్టి దిబ్బలు, భీమునిపట్నం, నాగాయంపాలెం, అన్నవరం, కంచేరుపాలెం బీచ్‌లు కొత్త రూపు సంతరించుకోనున్నాయి. ఆయా బీచ్‌లలో పర్యాటకులకు అవసరమైన వాష్‌రూమ్‌లు, ఛేంజింగ్‌రూమ్స్, తాగునీటి సౌకర్యం, ఫుడ్‌ కోర్టులు, ఫస్ట్‌ఎయిడ్, సీసీటీవీ కంట్రోల్‌ రూమ్, సిట్టింగ్‌ బెంచీలు, సిట్‌ అవుట్‌ అంబ్రెల్లాలు, రిక్‌లైయినర్స్, చిల్డ్రన్‌పార్కులు, ఫిట్‌నెస్‌ ఎక్విప్‌మెంట్, జాగింగ్‌ ట్రాక్, పార్కింగ్‌ సౌకర్యం మొదలైన మౌలిక సదుపాయాలు ఏర్పాటు కానున్నాయి. వీటికి తోడుగా సేఫ్‌ స్విమ్మింగ్‌ జోన్లు అభివృద్ధి చెయ్యడంతో పాటు బీచ్‌ స్పోర్ట్స్, వాచ్‌ టవర్, వాటర్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్స్‌ కూడా రానున్నాయి.   చదవండి: (అందరి చూపు ‘ఆంధ్రా’వైపే)



రుషికొండలో పారాసెయిలింగ్‌ 
సరికొత్త సాహస క్రీడకు విశాఖనే వేదికగా మార్చాలని పర్యాటక శాఖ భావిస్తోంది. ఇప్పటికే ఓ ప్రైవేట్‌ సంస్థ నగర పరిసర ప్రాంతాల్లో ఉన్న పలు బీచ్‌లను పరిశీలన చేసింది. రుషికొండలో పారాసెయిలింగ్‌ నిర్వహణకు అనుకూలంగా ఉందనీ, అక్కడ సీ స్పోర్ట్స్‌ కార్యకలాపాలు నిర్వహించేందుకు ఏపీ టూరిజంతో ఒప్పందానికి సిద్ధంగా ఉన్నట్లు లేఖ రాసింది. త్వరలోనే రుషికొండలో పర్యాటకులకు పారాసెయిలింగ్‌ చేసే అవకాశం కలగనుంది. 



లంబసింగిలో ఎకో టూరిజం 
అటవీ ప్రాంతాల్లో అద్భుతమైన పర్యాటక ప్రపంచాన్ని ప్రజలకు పరిచయం చేసేందుకు టూరిజం శాఖ సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా ఆంధ్రా ఊటీగా పిలిచే లంబసింగిలో ఎకో టూరిజం అభివృద్ధి చేయనున్నారు. హైఎండ్‌ టూరిజం రిసార్టులు నిర్మించనున్నారు. పర్యాటకులకు మన్యంలో అధునాతన సౌకర్యాలు అందించేలా రిసార్టులు రూపుదిద్దుకోనున్నాయి. దీనికి సంబంధించిన డీపీఆర్‌ త్వరలోనే పూర్తికానుంది. రెస్టారెంట్‌గా ఎంవీ మా కార్గోషిప్‌ తెన్నేటిపార్కు తీరానికి కొట్టుకొచ్చిన బంగ్లాదేశ్‌ కార్గో షిప్‌ ఫ్లోటింగ్‌ రెస్టారెంట్‌గా తీరంలో కనువిందు చేయనుంది. 30 గదులతో పాటు మల్టీకుజిన్‌ రెస్టారెంట్, బాంక్విట్‌ హాల్‌కూడా ఏర్పాటు చేస్తారు. చిన్న చిన్న ఫంక్షన్లు చేసుకునేందుకు అనుమతులివ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.10.50 కోట్లుగా నిర్ధారించింది. 



రూ.1021 కోట్లతో బీచ్‌ కారిడార్‌  
కైలాసగిరి నుంచి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం వరకూ వరల్డ్‌ క్లాస్‌ టూరిజం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌కు ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. 30 కిలోమీటర్ల పరిధిలో విభిన్న సమాహారాల కలబోతగా టూరిజం ప్రాజెక్టులు రానున్నాయి. సుమారు 570 ఎకరాల విస్తీర్ణంలో రూ.1021 కోట్లతో బీచ్‌ కారిడార్‌ రూపుదిద్దుకోనుంది. 



సాగర తీరంలో.. సరికొత్త ప్రయాణం 
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి రాచబాట వేస్తున్న ప్రభుత్వం.. కైలాసగిరి నుంచి భోగాపురం వరకు సుమారు 20 కిలోమీటర్ల మేర 6 లైన్లు నిర్మించి భవిష్యత్తులో 8 లైన్లుగా విస్తరించనున్నారు. ఈ రహదారి వెంబడి పర్యాటక శాఖ టూరిజం రిసార్టులు, అడ్వెంచర్‌ స్పోర్ట్స్‌ యాక్టివిటీస్, అటవీ శాఖ భూముల్లో ఎకో టూరిజం ప్రాజెక్టులు, ఎకో క్యాంపులు, ఇంటర్నేషనల్‌ కన్వెన్షన్‌ సెంటర్, అకామిడేషన్‌ బ్లాక్, గోల్ఫ్‌ కోర్సు నిర్మాణాలు జరగనున్నాయి. 

నూతన ప్రాజెక్టులు 
ప్రైవేటు పబ్లిక్‌ భాగస్వామ్యం(పీపీపీ) పద్ధతిలో పలుచోట్ల హోటళ్లు, రిసార్ట్స్, అమ్యూజ్‌మెంట్‌ పార్కులను ఏర్పాటు చేయబోతున్నారు. అరకులో రిసార్టులు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. 
అరకులో 5 స్టార్‌ రిసార్ట్స్‌ అభివృద్ధికి అవసరమైన భూమిని ఐటీడీఏ నుంచి సేకరించనున్నారు. లంబసింగిలో రోప్‌ వేలు ఏర్పాటు చేయనున్నారు.  
పర్యాటక శాఖకు సంబంధించి జిల్లాలో మొత్తం 550 ఎకరాల భూములున్నాయి. ఈ స్థలాల్ని లీజుకి ఇచ్చి పీపీపీ పద్ధతిలో అభివృద్ధి చేసేందుకు పర్యాటకాధికారులు ప్రణాళికలు  సిద్ధం చేస్తున్నారు. 
సందర్శకుల సంఖ్య పెంచేందుకు వివిధ శాఖల సమన్వయంతో పర్యాటక శాఖ ముందుకెళ్తోంది. ఇందులోభాగంగా అరకు, లంబసింగి తదితర ప్రాంతాలను అటవీశాఖతో కలిసి మరింత అభివృద్ధి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. 
జాతీయ పర్యాటక అభివృద్ధి ప్రాజెక్టుల్లో భాగంగా ప్రసాద్‌ పథకం, స్వదేశ్‌ దర్శన్‌ పథకం ద్వారా పలు పర్యాటక ప్రాంతాల అభివృద్ధి జరుగుతుంది. 
ఉపాధి అవకాశాలు కల్పిస్తాం  
ఈ ఏడాది ‘సమగ్ర వృద్ధి కోసం పర్యాటకం’ అనే అంశంపై పర్యాటక దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నాం. హోటళ్లను పర్యాటకశాఖ సారధ్యంలో అభివృద్ధి చేయడంతో పాటు ఏపీటీడీసీ ద్వారా స్కిల్‌ డెవలప్‌మెంట్‌ వర్క్‌షాప్‌లు నిర్వహించి యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. కొత్త టూరిజం ప్రాజెక్టులు రానున్న నేపథ్యంలో స్థానిక యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో ప్రాధాన్యం లభించనుంది. పర్యాటకాభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది.   
ముత్తంశెట్టి శ్రీనివాస్, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement