Tourism Day
-
National Tourism Day: అందమైన, అద్భుతమైన ద్వీపాలు!
# National Tourism Day 2024 పర్యాటక ప్రాముఖ్యత గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు జనవరి 25న భారతదేశంలో జాతీయ పర్యాటక దినోత్సవాన్ని జరుపు కుంటారు. దేశ ఆర్థిక వ్యవస్థకుభారీ ఊతమిచ్చే పర్యాటక ప్రాముఖ్యత గురించి అవగాహన, చైతన్యం పెంచే ఉద్దేశంతో ఈరోజును భారత ప్రభుత్వం ప్రకటించింది. 2022లో, భారత ప్రభుత్వ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో జాతీయ పర్యాటక దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సదస్సులు, సాంస్కృతిక కార్యక్రమాలు, ఇతర కార్యక్రమాలు నిర్వహిస్తారు. మరోవైపు, అనేక రాష్ట్రాలు తమ ప్రాంతంలో పర్యాటకాన్ని ప్రోత్సహించేలా పలు కార్యక్రమాలను కూడా నిర్వహిస్తాయి. థీమ్: ప్రతి సంవత్సరం, జాతీయ పర్యాటక దినోత్సవాన్ని విభిన్న థీమ్‌తో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా జరుపుకుంటారు. 'సుస్థిర ప్రయాణాలు, కలకాలంనిలిచిపోయే జ్ఞాపకాలు అనేది ఈ ఏడాది థీమ్‌గా నిర్ణయించారు. ఔత్సాహికులైన పర్యాటకులకోసం ఇండియాలో అద్భుతమైన ప్రాంతాలు చాలా ఉన్నాయి. ఇటీవల మాల్దీవులతో వివాదం నేపధ్యంలో లక్షద్వీప్ ఒక్కసారిగా ప్రాచుర్యంలోకి వచ్చింది. అలాంటి ఇతర ద్వీపాలు కొన్నింటిని చూద్దాం. అండమాన్ అండ్ నికోబార్ దీవులు: దేశంలోనే అతిపెద్ద ద్వీప సమూదాయం. బంగాళాఖాతంలోని 572 దీవుల సమూహం. ఈ సమూహంలోని కొన్ని ప్రధాన ద్వీపాలలో పోర్ట్ బ్లెయిర్, హేవ్‌లాక్ ద్వీపం, నీల్ ద్వీపం ,బరాటాంగ్ ద్వీపం పర్యాటకులను రారమ్మని ఆహ్వానిస్తూ ఉంటాయి. హనీమూన్, ఇతర వెకేషన్లకు అద్భుతమైన డెస్టినేషన్. బ్లూ వాటర్ బీచెస్, కోరల్స్ దీవులు చాలా అందంగా కన్పిస్తాయి. లక్షద్వీప్ దీవులు: అరేబియా సముద్రంలో ఉన్న లక్షద్వీప్ భారతదేశంలోని మరొక కేంద్ర పాలిత ప్రాంతం. ఈ సమూహంలోని కొన్ని ప్రధాన ద్వీపాలు కవరత్తి, అగట్టి, మినీకాయ్ . మజులి ద్వీపం: అస్సాంలోని బ్రహ్మపుత్ర నది మధ్యలో ఉన్న మజులి ప్రపంచంలోని అతిపెద్ద నదీ ద్వీపాలలో ఒకటి. జోర్హాట్ జిల్లాలో ఉన్న ఈ ద్వీపం అద్భుత అందాలతో అలరారుతూ ఉంటుంది. అందుకే ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులు ఇక్కడికీ క్యూ కడతారు. రామేశ్వరం ద్వీపం రామేశ్వరం, తమిళనాడు తమిళనాడులో ఉన్న . దీన్నే పంబన్ ద్వీపమని కూడా అంటారు. రామనాథ్ స్వామి మందిరం, ధనుష్కోడి, పంబన్ బ్రిడ్జ్, పంచముఖి హనుమాన్ మందిరం, కలామ్ హౌస్, కలామ్ మెమోరియల్, విలుండి తీర్ధమ్ వంటి ప్రసిద్ధ పర్యాటక కేంద్రాలున్నాయి. సెయింట్ మేరీస్ ఐల్యాండ్స్: కర్ణాటకలోని సెయింట్ మేరీస్ ఐల్యాండ్ వాస్తవానికి 4 చిన్న చిన్న ద్వీపాల సమూహం. ఇది కర్ణాటక ఉడుపి సమీపంలో అరేబియా సముద్రంలో ఉంది. ఇక్కడి రాక్ ఫార్మేషన్, క్లియర్ బ్లూ వాటర్ పర్యాటకుల్ని అబ్బురపరుస్తాయి. ఎలిఫెంటా ద్వీపం: ముంబై హార్బర్లో ఉంది, ఇది ఎలిఫెంటా గుహలకు ప్రసిద్ధి చెందింది, ఇది యునెస్కో ప్రపంచ వారసత్వ గుర్తింపు పొందిన ప్రదేశం, రాతితో చేసిన శివాలయాలకు ప్రసిద్ధి చెందింది. దివార్ ద్వీపం: ఇది గోవాలో మండోవి నదిలో ఉంది. సుందరమైన , పాత పోర్చుగీస్-శైలి గృహాలకు ప్రసిద్ధి చెందింది. దీన్ని ఐలాండ్ ఆఫ్ ప్యారడైజ్‌గా పిలుస్తారు. సుందర్ బన్స్: సాంప్రదాయ ద్వీపాలు కానప్పటికీ, సుందర్బన్స్ పశ్చిమ బెంగాల్ , బంగ్లాదేశ్‌లోని విస్తారమైన డెల్టా ప్రాంతం. ఇక్కడి ప్రకృతి, జలమార్గాలు, ద్వీపాలు మడ అడవులు ప్రకృతి అందాలకు ప్రసిద్ధి. -
గోదావరి అందాలు.. ఒక్కసారి చూస్తే మైమరిచిపోవాల్సిందే!
కోనసీమ అందాల సీమ. బంగాళాఖాతం తీరాన్ని ఆనుకుని.. సప్త నదీపాయల మధ్య కొలువైన సీమ. పచ్చని తివాచీ పరిచినట్టు ఉండే చేలు, కొబ్బరితోపులు, గోదావరి నదీపాయలు, వంపులు తిరుగుతూ పారే పంట కాలువలు, తెరచాప పడవలు, ప్రసిద్ధి చెందిన దేవాలయాలు, చారిత్రక కట్టడాలు, మడ అడవులు, గోదావరి మధ్య లంక గ్రామాలు, మండువా లోగిళ్లు, రైతుల మకాంలు.. వీటన్నింటికీ మించి ఆత్మీయత, మమకారంతో కలిసిన ఆతిథ్యం ఇలా చెప్పుకుంటూ పోతే కోనసీమ పర్యాటకులకు స్వర్గధామం. రైతులు, కూలీలు, మత్స్యకారులు, మహిళల జీవనం విధానం, కట్టూబొట్టూ, పండగలు, పబ్బాలు, జాతరలు.. ఇలా ఇక్కడ అన్నింటా ఒక ప్రత్యేక ముద్ర. ఇటీవల కాలంలో గోదావరి, సముద్ర తీరంలో వెలుస్తున్న రిసార్ట్స్, రైతుల పొలాల వద్ద ఫామ్ హౌస్‌లు, పర్యాటక రంగానికి ప్రభుత్వ ప్రోత్సాహం వంటి చర్యల కారణంగా కోనసీమకు వచ్చే పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ‘సప్త’వర్ణాల కోనసీమ.. పర్యాటకంగా కూడా ‘సప్త’రకాలుగా ఆకట్టుకుంటోంది. సెప్టెంబరు 27 ‘ప్రపంచ పర్యాటక దినోత్సవం’ సందర్భంగా కథనం. ఆధ్యాత్మికంగా.. ఆధ్యాత్మిక రంగంలో కోనసీమ జిల్లాకు ప్రముఖ స్థానం ఉంది. లెక్కలేనన్ని ఆలయాలు, పురాణ ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రాలు కోనసీమ సొంతం. వాడపల్లి వెంకటేశ్వరస్వామి ఆలయానికి ప్రత్యేక విమానాలలో భక్తులు వస్తున్నారు. వీటితోపాటు అంతర్వేది లక్ష్మీ నర్శింహస్వామి, మందపల్లి శనీశ్వర స్వామి, అయినవిల్లి శ్రీ విఘేశ్వరస్వామి, అప్పనపల్లి బాలబాలాజీ, ద్రాక్షారామం భీమేశ్వరస్వామి వంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలకు వచ్చే వారి సంఖ్య ఏటేటా పెరుగుతోంది. బౌద్ధులు.. రాజుల చారిత్రక ఆనవాళ్లు చారిత్రాత్మక ప్రదేశాలలో పర్యాటకానికి వస్తే రామచంద్రపురంలో 17వ శతాబ్ధం నాటి కోట ఉంది. మామిడికుదురు మండలం ఆదుర్రులో క్రీస్తు పూర్వం రెండవ శతాబ్ధం నాటి పురాతన బౌద్ధ స్థూపాలున్నాయి. కపిలేశ్వరపురం జమీందార్ల పురాతన భవనాలు, రాజుల కోటలను తలపించే మండువా లోగిళ్ల ఇళ్లు పర్యాటకులకు ముచ్చటగొల్పుతాయి. అగ్రి టూరిజం పర్యాటకంలో ఇటీవల కాలంలో మంచి ఆదరణ లభిస్తోంది అగ్రి టూరిజానికే. దేశంలో కేరళలో మొదలైన ఈ పర్యాటకం విస్తరిస్తోంది. పట్టణ ప్రాంతాల్లోని ఐటీ వంటి రంగాల్లో ఉన్నత ఉద్యోగాలు చేసేవారు ఒత్తిడి నుంచి బయటపడేందుకు అగ్రి టూరిజం బాట పడుతున్నారు. ఇటువంటి వారికి కోనసీమ అగ్రి టూరిజం ఒక అద్భుతం. పచ్చని తివాచీ పరచినట్టు ఉండే వరిచేలు, కొబ్బరి, అరటి తోటలు, లంక గ్రామాల్లో పలు రకాల పంటలు, పాడి, ఆక్వా చెరువులు, తోటల్లోని రైతుల మకాం (వ్యవసాయ శాలలు) విశేషంగా ఆకర్షిస్తాయి. గోదావరి హొయలు గోదావరి నదీ అందాల గురించి ఎంత వర్ణించినా తక్కువే. నది మధ్యలో లంక గ్రామాలు, వాటిలో సాగయ్యే పంటలు, ఇసుక తిన్నెలు, చెంగుచెంగున ఎగిరే కృష్ణ జింకలు, తెరచాప పడవలు, పంటులు, హౌస్బోట్లపై సాగే ప్రయాణం, నదీపాయలపై వంతెనలు.. గోదావరి కాలువలకు లాకులు,ఇలా చెప్పుకుంటూ పోతే గోదావరి హొయలు జాతీయ, అంతర్జాతీయ పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటాయి. మైమరపించే మడ అడవులు ఐ.పోలవరం మండలం భైరవపాలెం నుంచి అంతర్వేది సముద్ర తీరం వరకు నదీపాయలతోపాటు, మురుగునీటి కాలువలు సముద్రంలో కలిసే ప్రాంతాలలో ఉన్న మడ అడవులలో పర్యాటకం అద్భుతమనే చెప్పాలి. నదీ, కాలువ పాయల మధ్య మడ అడవులు మీదుగా సాగే ప్రయాణం మధురానుభూతిని పంచుతుంది. ఆతిథ్యం అద్భుతం అతిథి మర్యాదంటేనే గోదావరి జిల్లాలు. మరీ ముఖ్యంగా కోనసీమ ఆహారం.. అతిథ్యానికి ఫిదా అవ్వాల్సిందే. పర్యాటకుల జిహ్వ చాపల్యాన్ని తీర్చే రకరకాల స్వీట్లు, హాట్లు, టిఫిన్లు, బిర్యానీలు, మాంసహార కూరలు ఎన్నో.. ఎన్నెన్నో. ఆత్రేయపురం పూతరేకులు.. అవిడి పాలకోవా, మినప రొట్టి, చెరుకుపానకం, పెసరెట్టు ఉప్మా, పనస పొట్టు కూర, ముద్దపప్పు.. గుమ్మడి పులుసు, ఉల్లి గారెలు... నాటు కోడి కూర, చుక్కపీత ఇగురు.. పులసల పులుసు ఇలా ఎన్నో రకాల వంటకాలు పర్యాటకులను లోట్టలు వేయిస్తాయి. -
తెలంగాణ పల్లెకు పట్టం
సాక్షి, న్యూఢిల్లీ/చిన్నకోడూరు(సిద్దిపేట): రెండు తెలంగాణ గ్రామాలను ఉత్తమ పర్యాటక గ్రామాలుగా కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. కాకతీయుల కాలం నుంచీ హస్తకళలకు ప్రసిద్ధి చెందిన జనగామ జిల్లా పెంబర్తితోపాటు సిద్దిపేట జిల్లా చంద్లాపూర్ గ్రామం ఈ అవార్డులను దక్కించుకున్నాయి. ఈ నెల 27న ఢిల్లీలో జరగనున్న అంతర్జాతీయ పర్యాటక దినోత్సవం సందర్భంగా ఈ పురస్కారాలను అందించనున్నారు. చంద్లాపూర్ జాతీయ స్థాయికి ఎంపిక కావడం పట్ల మంత్రి హరీశ్‌రావు గ్రామ ప్రజలకు అభినందనలు తెలిపారు. హరీశ్‌రావు అందించిన తోడ్పాటుకు ఈ గుర్తింపు అని జెడ్పీ చైర్పర్సన్ రోజాశర్మ అన్నారు. పెంబర్తి... చేతివృత్తుల నైపుణ్యానికి ప్రతీక ఇత్తడి, కంచు లోహాలతో పెంబర్తి గ్రామంలో చేసే కళాకృతులకు ఉన్న డిమాండ్ దృష్ట్యా వీటిని పెద్దమొత్తంలో అమెరికా, జర్మనీ, బెల్జియం, జపాన్ తదితర దేశాలు దిగుమతి చేసుకుంటున్నాయి. సంస్కృతీ సంప్రదాయాలను, ఆచార వ్యవహారాలను ప్రతిబింబించే కళాకృతులు, దేవతల విగ్రహాలు, కళాఖండాలు, గృహాలంకరణ వస్తువులెన్నో ఇక్కడి కళాకారుల చేతివృత్తుల నైపుణ్యానికి ప్రతీకగా నిలుస్తాయి. దీనికితోడు ఏటా 25 వేల మంది పర్యాటకులు ఈ గ్రామాన్ని సందర్శిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. తెలంగాణ సంస్కృతిని ప్రోత్సహించే విషయంలో ఇక్కడి కార్మికులు చేస్తున్న కృషి ద్వారా జరుగుతున్న ఆర్థిక కార్యకలాపాలు తదితర అంశాలను దృష్టిలో ఉంచుకుని.. పెంబర్తిని ఉత్తమ పర్యాటక గ్రామంగా కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. పెంబర్తి ఉత్పత్తులకు జీఐ (జియోగ్రాఫికల్ ఇండికేషన్) ట్యాగ్ గుర్తింపు విషయంలోనూ కేంద్రం చొరవతీసుకుంది. చంద్లాపూర్.. కళాత్మకత, చేనేతల కలబోత రంగనాయక స్వామి ఆలయం, రంగనాయక కొండలు, ఇక్కడి ప్రకృతి.. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబిస్తే.. ఈ ప్రాంతంలో నేసే ‘గొల్లభామ’ చీరలు తెలంగాణ కళాసంస్కృతికి ప్రతిబింబాలుగా నిలుస్తున్నాయి. గొల్లభా మ చీర.. తెలంగాణ నేతన్నల కళా నైపుణ్యా నికి నిలువుటద్దం. కళాత్మకత, చేనేతల కలబో తకు నిదర్శనం. నెత్తిన చల్లకుండ, చేతిలో పె రుగు గురిగి, కాళ్లకు గజ్జెలు, నెత్తిన కొప్పుతో కళకళలాడే యాదవ మహిళల వైభవం ఈ చీర ల్లో ఇమిడిపోయి కనిపిస్తుంది. రంగనాయక స్వామి ఆలయం, పరిసర ప్రాంతాలు గ్రామీ ణ పర్యాటకానికి ప్రసిద్ధి చెందిన నేపథ్యంతో పాటు గొల్లభామల చీరలకున్న ప్రత్యేకత కార ణంగా ఈ ప్రాంతాన్ని ఉత్తమ పర్యాటక గ్రామంగా ఎంపిక చేశారు. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావుల చొరవతో చంద్లాపూర్ లోని రంగనాయకసాగర్ రిజర్వాయర్ గొప్ప పర్యాటక ప్రాంతంగా విరాజిల్లుతోంది. -
ఆ యాత్ర ఓ చరిత్ర
ఏమాత్రం ఆధునిక ప్రయాణ సాధనాలు లేని రోజుల్లో ‘కాశీ యాత్ర’ చేసినవాడు ఏనుగుల వీరాస్వామి. తన యాత్రానుభవాలను గ్రంథస్థం చేసిన మొదటి ఆధునిక భారతీయ యాత్రికుడూ ఆయనే! వీరాస్వామి పదహారణాల తెలుగువాడు. ఈయన 1780లో చెన్నైలో జన్మించారు. పూర్వీకులు ఒంగోలు ప్రాంతీయులు. మద్రాస్ సుప్రీం కోర్టులో ‘ఇంటర్ ప్రిటర్’ ఉద్యోగం చేస్తూ పదవీ విరమణ చేసిన తర్వాత కాశీయాత్ర చేప ట్టారు. ‘రెగినాల్డ్ బిషప్ హెబార్డ్’ అనే తూర్పు ఇండియా కంపెనీ మతాధికారి 1824 – 1826లో భారతదేశ యాత్ర చేసి ‘బిషప్ హెబార్డ్ జర్నల్’ అనే పేరుతో ఓ గ్రంథం రాశారు. ఇదే వీరా స్వామి ‘కాశీ యాత్ర చరిత్ర’ గ్రంథానికి స్ఫూర్తి. వీరాస్వామి ‘కాశీ యాత్ర’ 1830 మే 18వ తేదీ మంగళవారం రాత్రి 9 గంటలకు చెన్నైలోని తండయారువీడు లోని సొంత ఇంటి నుంచి ప్రారంభమైంది. తల్లి, భార్యతో సహా 100 మందితో బయలుదేరివెళ్లిన ఆయన... 1831 సెప్టెంబర్ 3వ తేదీన మరలా ఇంటికి చేరుకోవడంతో యాత్ర సుఖాంతమైంది. సుమారు 4 వేల కిలోమీటర్ల దూరం 15 నెలల, 15 రోజులు కొనసాగింది. (చదవండి: అక్షర యోధుడు అదృష్టదీపుడు) 1830, మే 22వ తేదీన ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశించి... 33 రోజుల అనంతరం జూన్ 24వ తేదీన తెలంగాణాలో ప్రవేశించి ఆగస్టు 6వ తేదీ వరకు కొనసాగింది. ఆగస్టు 6వ తేదీన మహారాష్ట్రలో ప్రవే శించారు. తరువాత మధ్యప్రదేశ్ గుండా ఉత్తరప్రదేశ్ లోకి ప్రవేశించి కాశీ చేరుకున్నారు. ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత తన యాత్రానుభ వాలను ‘కాశీ యాత్రా చరిత్రగా’ గ్రంథస్థం చేసి నాటి కాలమాన పరిస్థితులను ముందు తరాలకు అందించారు. వీరాస్వామి కాశీ యాత్ర చేపట్టిన మే 18వ తేదీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక దినోత్సవంగా జరుపుకోవడం సముచితంగా ఉంటుంది. – కోరాడ శ్రీనివాసరావు సాలూరు మండలం, పార్వతీపురం మన్యం జిల్లా -
Famous Tourist Places Vizag: వహ్ వైజాగ్! ఒకటా రెండా.. ఎన్నెన్ని అందాలో
సాక్షి, విశాఖపట్నం : ప్రకృతి అందాలతో అలరారే విశాఖ పర్యాటకంగా కూడా గత రెండు దశాబ్ధాలుగా గణనీయంగా అభివృద్ధి చెందింది. ఒకవైపు సాగర సోయగాలు.. మరోవైపు ఎత్తైన తూర్పు కనుమల అందాలు ప్రపంచ పర్యాటకులను కట్టిపడేస్తున్నాయి. కొండ కోనలను చూసినా.. ప్రకృతి ఒడిలో సేదతీరుతున్న మన్యంలో అడుగు పెట్టినా.. అలల సవ్వడితో.. హొయలొలుకుతున్న సాగర తీరంలో అడుగులు వేస్తున్నా.. ఆధ్యాత్మిక శోభతో ఆహ్లాదపరిచే దేవాలయాలు.. ఏ చోటకు వెళ్లినా.. భూతల స్వర్గమంటే ఇదేనేమోనన్న అనుభూతిని అందిస్తుంది. 2004 తరువాత నుంచి పర్యాటకంగా విశాఖ రూపురేఖలు మారిపోయాయి. ప్రపంచ పర్యాటకులను ఆకర్షించే విధంగా నగరంలోనే కాకుండా గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో కూడా సరికొత్త పర్యాటక ప్రాజెక్టులు అందుబాటులోకి వచ్చాయి. జిల్లాలో ముఖ్యమైన పర్యాటక ప్రాంతాలు ఎక్కడ ఉన్నాయో జాతీయ పర్యాటక దినోత్సవం సందర్భంగా ఓసారి చూసొద్దాం రండి... మదిదోచే కైలాసగిరి ఆర్కే బీచ్ నుంచి 5 కిలోమీటర్ల దూరంలో కైలాసగిరి ఉంది. పచ్చని పార్కులు, ఆహ్లాద వాతావరణం, బీచ్ వ్యూ ఇక్కడ మంచి అనుభూతినిస్తాయి. కొండ కింద నుంచి రోప్ వే, రోడ్డు, మెట్ల మార్గాల ద్వారా పైకి చేరుకోవచ్చు. విశాఖ వచ్చే ప్రతి పది మంది పర్యాటకుల్లో 8 మంది కైలాసగిరి వెళ్తుంటారు. చదవండి: Lambasingi: లంబసింగికి చలో చలో భీమిలి.. అందాల లోగిలి.. ఆర్కే బీచ్ రోడ్డు నుంచి 30 కిలోమీటర్ల దూరంలో భీమిలి ఉంది. తూర్పు తీరంలో పురాతన ఓడ రేవుల్లో ఒకటిగా పిలుస్తారు. గోస్తనీనది ఇక్కడ సముద్రంలో కలుస్తుంది. డచ్ పాలకుల సమాధులు, లైట్ హౌస్‌లు, బౌద్ధ మత ఆనవాళ్లు ఇక్కడ అనేకం. దీని ముందున్న రుషికొండ బీచ్ కూడా అద్భుతంగా ఉంటుంది. ఈ బీచ్‌కు బ్లూ ఫ్లాగ్ గుర్తింపు రావడం విశేషం. జలజల జలపాతాలు.. విశాఖ మన్యంలోకి వెళ్తే.. అడుగడుగునా జలపాతాలు హొయలుపోతూ కనిపిస్తుంటాయి. కటిక, చాపరాయి, సరయు, డుడుమ, కొత్తపల్లి, సీలేరు ఐసుగెడ్డ, పిట్టలబొర్ర, బొంగుదారి జలపాతాలతో పాటు చిన్న చిన్న జలపాతాలు పర్యాటకులకు సరికొత్త అనుభూతిని అందిస్తున్నాయి. ఆంధ్రా ఊటీ.. అరకు.. విశాఖ మన్యం పేరు చెబితే.. పర్యాటకులు పులకరించిపోతారు. సముద్ర మట్టానికి 910 మీటర్ల ఎత్తులో ఉన్న అరకు వ్యాలీని సందర్శించేందుకు పర్యాటకులు ఉవ్విళ్లూరుతుంటారు. ఇది జలపాతాలు, క్రిస్టల్ క్లియర్ స్ట్రీమ్స్ , పచ్చని తోటలతో కళకళలాడుతుంటుంది. మంచు మేఘాల వంజంగి మేఘాలలో తేలిపొమ్మన్నది అంటూ టూరిస్టులు ఎంజాయ్ చేసే ప్రాంతం వంజంగి. పాడేరు మండలంలో ఉన్న వంజంగి కొండపైకి ఎక్కితే మేఘాలను తాకుతున్నట్లు అనుభూతిని పొందొచ్చు. బుద్ధం.. శరణం.. గచ్ఛామి... ఆర్కే బీచ్ నుంచి 16 కిలోమీటర్ల దూరంలో ప్రాచీన బౌద్ధ క్షేత్రాలు తొట్లకొండ, బావికొండ ఉన్నాయి. తొట్లకొండ తదితర ప్రాంతాలు నిత్యం పర్యాటకులను అలరిస్తున్నాయి. జంతు ప్రపంచం పిలుస్తోంది... ఆర్కే బీచ్ నుంచి 9 కిలోమీటర్ల దూరంలో జూపార్క్ ఉంది. ఎన్నో అరుదైన జంతువులు, వన్యప్రాణులు ఇక్కడ మనకు కనిపిస్తాయి. జూ ఎదురుగా ఉండే కంబాలకొండలో వన్యప్రాణులతో పాటు సాహస క్రీడలు, బోటింగ్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. భలే మంచు ఊరు డిసెంబర్..జనవరి మాసాల్లో వాతావరణం సుమారుగా 0 డిగ్రీలకు పడిపోతూ.. ఆంధ్రా కాశ్మీరంగా పేరొందిన లంబసింగికి చలికాలంలో పర్యాటకులు క్యూ కడతారు. సముద్ర మట్టానికి ఈ ప్రాంతం 3600 మీటర్ల ఎత్తులో ఉంది. విశాఖ నగరానికి 101 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఉదయం 10 గంటలైనా మంచు వీడకుండా శీతల గాలులు వీస్తు పర్యాటకులకు ఎంతో ఆహ్లాదకరంగా కనిపిస్తుంది. వీఎంఆర్డీఏ పార్క్ ఆర్కే బీచ్ వ్యూను చూస్తూ పర్యాటకులు కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి పిక్నిక్లు జరుపుకునేందుకు, ఆహ్లాదాన్ని పొందేందుకు అనువైన ప్రదేశం. ఇటీవలే రూ.35 కోట్లతో పార్క్‌ను అత్యాధునికంగా అభివృద్ధి చేశారు. అటు కురుసుర.. ఇటు టీయూ 142 ఆర్కే బీచ్‌లో విహరించి కాస్తా ముందుకు వెళ్తే.. పర్యాటకులను ఆకట్టుకునే కురుసుర సబ్ మెరైన్ మ్యూజియం ఉంటుంది. దాని ఎదురుగానే టీయూ– 142 యుద్ధ విమాన మ్యూజియం. ఇప్పుడు వీటి సరసన... సీ హారియర్ మ్యూజియం సిద్ధమవుతోంది. ఇంకాస్త ముందకెళితే విక్టరీఎట్ సీ దర్శనమిస్తుంది. పురాతన బొర్రా గుహలు.. మీరు చరిత్ర ప్రేమికులైతే, బొర్రా గుహలు ఉత్తమ పర్యాటక ఆకర్షణలలో ఒకటిగా నిలుస్తాయి. అరకులోయలోని అనంతగిరి కొండల మధ్య ఉన్న ఈ గుహలు వేల సంవత్సరాల పురాతనమైనవే కాదు.. దేశంలో కనిపించే అన్ని గుహలలో అతిపెద్దవి. పూర్తిగా సహజ సున్నపురాయితో తయారైన ఈ గుహలు ప్రకృతిలో కాలిడోస్కోపిక్, జలపాతాలతో పాటు రాళ్లపై పడే కాంతి చాలా రంగురంగులుగా దర్శనమిస్తుంటాయి. ప్రతి ఏడాది సుమారు 3 లక్షల మంది పర్యాటకులు ఈ గుహలను సందర్శిస్తుంటారు. చరిత్ర చెప్పే మ్యూజియం వీటన్నింటినీ సందర్శించి.. ఇంకొంచెం ముందుకెళ్తే.. విశాఖ మ్యూజియం కనిపిస్తుంది. దాని ఎదురుగానే.. భారత నౌకాదళానికి చెందిన మొట్టమొదటి సబ్‌మెరైన్ కల్వరి çహాల్ కనిపిస్తుంది. విశాఖ మ్యూజియంలో భారత దేశ చరిత్రకు సంబంధించిన ఆనవాళ్లు ప్రదర్శిస్తుంటారు. అల ఆర్కే బీచ్‌లో.. వైజాగ్ వచ్చే ప్రతి ఒక్కరూ బీచ్‌కు వెళ్లి తీరాల్సిందే. అందుకే వీకెండ్స్ అయితే ఇసకేస్తే రాలనంత జనం బీచ్‌లో వాలిపోతారు. షాపింగ్ మొదలుకొని స్టే, డిన్నర్ వరకూ సకల సౌకర్యాలు పర్యాటకులకు ఇక్కడ లభిస్తాయి. -
కోస్టల్ బ్యూటీ.. విశాఖ అందాలపై ప్రత్యేక కథనం
కొండకోనల్ని చూసినా.. అందాల మన్యంలో అడుగు పెట్టినా.. అలల సవ్వడితో హొయలొలుకుతున్న సాగర తీరంలో విహరిస్తున్నా.. ఆధ్యాత్మిక శోభతో ఆహ్లాదపరిచే దేవాలయాల్లో అర్చన చేసినా... ఏ చోటకు వెళ్లినా భూతల స్వర్గమంటే ఇదేనేమో అన్న అనుభూతిని అందిస్తుంది విహార విశాల విశాఖ. ప్రపంచంలోని అందాలన్నీ ఓచోట చేరిస్తే బహుశా దానినే విశాఖ అంటారేమో. రాష్ట్రంలో ఏడాదికి కోటికి పైగా పర్యాటకులు వస్తున్న జిల్లా ఏదైనా ఉందంటే అది విశాఖపట్నమే. జాతీయ, అంతర్జాతీయ పర్యాటకులు ఇక్కడి సహజసిద్ధమైన అందాలకు ఫిదా అవుతుంటారు. సందర్శకుల మనసు దోచేలా ఈ సౌందర్యసీమను పర్యాటకంలో అగ్రభాగాన నిలిపేందుకు కొత్త ప్రాజెక్టులెన్నో పట్టాలెక్కనున్నాయి. పర్యాటక దినోత్సవం సందర్భంగా విశాఖ అందాలపై ప్రత్యేక కథనం.. సాక్షి, విశాఖపట్నం: భారత్‌లో అడుగుపెట్టే ప్రతి పది మంది విదేశీ పర్యాటకుల్లో ముగ్గురు విశాఖని సందర్శించేందుకు ఎంపిక చేసుకుంటున్నారు. ఎందుకంటే అద్భుత పర్యాటక ప్రాంతాలు విశాఖ సొంతం. అందుకే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా జిల్లాలో ఉన్న అపార అవకాశాల్ని మెరుగు పరుచుకొని పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి రూపకల్పన జరుగుతోంది. విశాఖ జిల్లానూ పర్యాటక ఖిల్లాగా మార్చే దిశగా టూరిజం ప్రాజెక్టులకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని ప్రాజెక్టులు గ్రౌండింగ్ అవ్వగా, మరికొన్ని పనులు ప్రారంభానికి సన్నద్ధం చేస్తున్నారు. ఇంకొన్నింటికి డీపీఆర్‌లు తయారవుతున్నాయి. చదవండి: (ఏపీ రొయ్య.. మీసం మెలేసింది!) సర్క్యూట్లు పూర్తయితే.. సూపర్ రాష్ట్రంలో టూరిజం సర్క్యూట్లు అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రణాళికలు సిద్ధం చేసింది. అరకు టూరిజం సర్క్యూట్‌కి కేంద్రం ప్రభుత్వం నుంచి అనుమతులు రావాల్సి ఉండగా.. మిగిలిన సర్క్యూట్లు కూడా కొత్త పాలసీ వచ్చాక ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే రూ.156 కోట్లతో అరకు ఎకో టూరిజం సర్క్యూట్, రూ.49 కోట్లతో భీమిలిలో పాసింజర్ జెట్టీ సర్క్యూట్ ప్రాజెక్టులకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) సిద్ధమైంది. ఈ డీపీఆర్ కేంద్ర ప్రభుత్వం వద్ద ఉండటంతో ఇటీవలే మంత్రి ముత్తంశెట్టి సంబంధిత అధికారులతో పాటు కేంద్ర మంత్రులతో భేటీ అయి.. ప్రాజెక్టు పట్టాలెక్కించేందుకు అనుమతులు కోరారు. అదే విధంగా బౌద్ధ కేంద్రాలైన బొజ్జనకొండ, తొట్లకొండ, బావికొండలను రూ.20.70 కోట్లతో బుద్ధిస్ట్ సర్క్యూట్ పేరిట అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఈ సర్క్యూట్లు సిద్ధమైతే.. పర్యాటకానికి మరిన్ని సొబగులు చేకూరనున్నాయి. 10 బీచ్‌ల అభివృద్ధితో కొత్త సోయగాలు విశాఖలోని బీచ్‌లంటే అందరికీ ఇష్టమే. ఆర్కే బీచ్‌కు రోజూ లక్షల మంది వస్తుంటారు. అందుకే కైలాసగిరి నుంచి భోగాపురం వరకు 10 బీచ్‌లు అభివృద్ధి చేయనున్నారు. సాగర్‌నగర్, తిమ్మాపురం, మంగమూరిపేట, చేపలుప్పాడ, ఐఎన్ఎస్ కళింగ, ఎర్రమట్టి దిబ్బలు, భీమునిపట్నం, నాగాయంపాలెం, అన్నవరం, కంచేరుపాలెం బీచ్‌లు కొత్త రూపు సంతరించుకోనున్నాయి. ఆయా బీచ్‌లలో పర్యాటకులకు అవసరమైన వాష్‌రూమ్‌లు, ఛేంజింగ్‌రూమ్స్, తాగునీటి సౌకర్యం, ఫుడ్ కోర్టులు, ఫస్ట్‌ఎయిడ్, సీసీటీవీ కంట్రోల్ రూమ్, సిట్టింగ్ బెంచీలు, సిట్ అవుట్ అంబ్రెల్లాలు, రిక్‌లైయినర్స్, చిల్డ్రన్‌పార్కులు, ఫిట్నెస్ ఎక్విప్మెంట్, జాగింగ్ ట్రాక్, పార్కింగ్ సౌకర్యం మొదలైన మౌలిక సదుపాయాలు ఏర్పాటు కానున్నాయి. వీటికి తోడుగా సేఫ్ స్విమ్మింగ్ జోన్లు అభివృద్ధి చెయ్యడంతో పాటు బీచ్ స్పోర్ట్స్, వాచ్ టవర్, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ కూడా రానున్నాయి. చదవండి: (అందరి చూపు ‘ఆంధ్రా’వైపే) రుషికొండలో పారాసెయిలింగ్ సరికొత్త సాహస క్రీడకు విశాఖనే వేదికగా మార్చాలని పర్యాటక శాఖ భావిస్తోంది. ఇప్పటికే ఓ ప్రైవేట్ సంస్థ నగర పరిసర ప్రాంతాల్లో ఉన్న పలు బీచ్‌లను పరిశీలన చేసింది. రుషికొండలో పారాసెయిలింగ్ నిర్వహణకు అనుకూలంగా ఉందనీ, అక్కడ సీ స్పోర్ట్స్ కార్యకలాపాలు నిర్వహించేందుకు ఏపీ టూరిజంతో ఒప్పందానికి సిద్ధంగా ఉన్నట్లు లేఖ రాసింది. త్వరలోనే రుషికొండలో పర్యాటకులకు పారాసెయిలింగ్ చేసే అవకాశం కలగనుంది. లంబసింగిలో ఎకో టూరిజం అటవీ ప్రాంతాల్లో అద్భుతమైన పర్యాటక ప్రపంచాన్ని ప్రజలకు పరిచయం చేసేందుకు టూరిజం శాఖ సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా ఆంధ్రా ఊటీగా పిలిచే లంబసింగిలో ఎకో టూరిజం అభివృద్ధి చేయనున్నారు. హైఎండ్ టూరిజం రిసార్టులు నిర్మించనున్నారు. పర్యాటకులకు మన్యంలో అధునాతన సౌకర్యాలు అందించేలా రిసార్టులు రూపుదిద్దుకోనున్నాయి. దీనికి సంబంధించిన డీపీఆర్ త్వరలోనే పూర్తికానుంది. రెస్టారెంట్‌గా ఎంవీ మా కార్గోషిప్ తెన్నేటిపార్కు తీరానికి కొట్టుకొచ్చిన బంగ్లాదేశ్ కార్గో షిప్ ఫ్లోటింగ్ రెస్టారెంట్‌గా తీరంలో కనువిందు చేయనుంది. 30 గదులతో పాటు మల్టీకుజిన్ రెస్టారెంట్, బాంక్విట్ హాల్‌కూడా ఏర్పాటు చేస్తారు. చిన్న చిన్న ఫంక్షన్లు చేసుకునేందుకు అనుమతులివ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.10.50 కోట్లుగా నిర్ధారించింది. రూ.1021 కోట్లతో బీచ్ కారిడార్ కైలాసగిరి నుంచి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం వరకూ వరల్డ్ క్లాస్ టూరిజం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కు ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. 30 కిలోమీటర్ల పరిధిలో విభిన్న సమాహారాల కలబోతగా టూరిజం ప్రాజెక్టులు రానున్నాయి. సుమారు 570 ఎకరాల విస్తీర్ణంలో రూ.1021 కోట్లతో బీచ్ కారిడార్ రూపుదిద్దుకోనుంది. సాగర తీరంలో.. సరికొత్త ప్రయాణం భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి రాచబాట వేస్తున్న ప్రభుత్వం.. కైలాసగిరి నుంచి భోగాపురం వరకు సుమారు 20 కిలోమీటర్ల మేర 6 లైన్లు నిర్మించి భవిష్యత్తులో 8 లైన్లుగా విస్తరించనున్నారు. ఈ రహదారి వెంబడి పర్యాటక శాఖ టూరిజం రిసార్టులు, అడ్వెంచర్ స్పోర్ట్స్ యాక్టివిటీస్, అటవీ శాఖ భూముల్లో ఎకో టూరిజం ప్రాజెక్టులు, ఎకో క్యాంపులు, ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్, అకామిడేషన్ బ్లాక్, గోల్ఫ్ కోర్సు నిర్మాణాలు జరగనున్నాయి. నూతన ప్రాజెక్టులు ►ప్రైవేటు పబ్లిక్ భాగస్వామ్యం(పీపీపీ) పద్ధతిలో పలుచోట్ల హోటళ్లు, రిసార్ట్స్, అమ్యూజ్మెంట్ పార్కులను ఏర్పాటు చేయబోతున్నారు. అరకులో రిసార్టులు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. ►అరకులో 5 స్టార్ రిసార్ట్స్ అభివృద్ధికి అవసరమైన భూమిని ఐటీడీఏ నుంచి సేకరించనున్నారు. లంబసింగిలో రోప్ వేలు ఏర్పాటు చేయనున్నారు. ►పర్యాటక శాఖకు సంబంధించి జిల్లాలో మొత్తం 550 ఎకరాల భూములున్నాయి. ఈ స్థలాల్ని లీజుకి ఇచ్చి పీపీపీ పద్ధతిలో అభివృద్ధి చేసేందుకు పర్యాటకాధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ►సందర్శకుల సంఖ్య పెంచేందుకు వివిధ శాఖల సమన్వయంతో పర్యాటక శాఖ ముందుకెళ్తోంది. ఇందులోభాగంగా అరకు, లంబసింగి తదితర ప్రాంతాలను అటవీశాఖతో కలిసి మరింత అభివృద్ధి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ►జాతీయ పర్యాటక అభివృద్ధి ప్రాజెక్టుల్లో భాగంగా ప్రసాద్ పథకం, స్వదేశ్ దర్శన్ పథకం ద్వారా పలు పర్యాటక ప్రాంతాల అభివృద్ధి జరుగుతుంది. ఉపాధి అవకాశాలు కల్పిస్తాం ఈ ఏడాది ‘సమగ్ర వృద్ధి కోసం పర్యాటకం’ అనే అంశంపై పర్యాటక దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నాం. హోటళ్లను పర్యాటకశాఖ సారధ్యంలో అభివృద్ధి చేయడంతో పాటు ఏపీటీడీసీ ద్వారా స్కిల్ డెవలప్మెంట్ వర్క్‌షాప్‌లు నిర్వహించి యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. కొత్త టూరిజం ప్రాజెక్టులు రానున్న నేపథ్యంలో స్థానిక యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో ప్రాధాన్యం లభించనుంది. పర్యాటకాభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది. – ముత్తంశెట్టి శ్రీనివాస్, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి -
ప్రకృతి సోయగం.. అటవీ అందాలు..
సాక్షి, పెంచికల్పేట్: రమణీయమైన ప్రకృతి అందాలకు నెలవు పెంచికల్పేట్ అడువులు.. ఎత్తైన కొండలు, గలగల పారే ప్రాణాహిత, పెద్దవాగులు ఓ వైపు.. పచ్చని అడువులు, పక్షుల కిలకిల రాగాలు, సెలయేటి శబ్దాలు, జాలువారుతున్న జలపాతాలు, జీవ వైవిద్యమైన అడవులు మరో వైపు.. వెరసి ప్రకృతి ప్రేమికులను ఆకర్షిస్తున్నాయి. ప్రకృతి అందాలను చూడటానికి ఇక్కడి వచ్చే వారిని ఇట్టే కట్టిపడేస్తున్నాయి. ఈ ప్రదేశాన్ని చూసేందుకు వచ్చే పర్యాటకులు మంత్రముగ్ధులు అవుతున్నారు. ఈ ప్రాంతంలోని ప్రకృతి అందాలు పర్యాటలను ఆకట్టుకోవడంతో ఇక్కడికి వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారు. రాబంధుల స్థావరం పాలరాపు గుట్ట పాలరాపు గుట్టలో రాబంధులు అంతరించిపోతున్న పొడుగు ముక్కు రాబంధులను పాలరాపు గుట్ట వద్ద గుర్తించి వాటి సంతతి అభివృద్ధికి అధికారులు కృషి చేస్తున్నారు. అధి కారులు చేపట్టిన కృషితో వాటి సంతతి ప్రస్తుతం 30కి చేరింది. రాపుగుట్ట వద్ద రాబంధులకు ఆవా సం అనుకూలంగా ఉండటంతో ఇటీవలే అరుదైన హిమాలియన్ గ్రాఫీన్ రాబంధు, రూఫోస్‌బిల్డ్ ఈగల్‌లను అధికారులు గుర్తించారు. సిద్దేశ్వర గుట్టలు పెంచికల్పేట్ మండల కేంద్రానికి ఆరు కిలో మీటర్ల దూరంలో సిద్దేశ్వర గుట్టలు ఉన్నాయి. ఈ గుట్టల్లో శివలింగం, ఆంజనేయస్వామి విగ్రహాలు ఉండగా గుట్టలో ఏడు సొరంగ మార్గాలు, గుహలు ఉన్నాయి. గుట్టల పరిసర ప్రాంతాల్లో జాలువారే జలపాతాలు పర్యాటకులను అబ్బురపరుస్తున్నాయి. కొండపల్లిలో వృక్ష శిలాజాలు వృక్ష శిలాజాలు పెంచికల్పేట్ మండలం నుంచి సుమారు 12 కిలోమీటర్ల దూరంలో కొండపల్లి అటవీ ప్రాంతంలో ఆరున్నర కోట్ల సంవత్సరాల వృక్షశిలాజాలను అధికారులు గుర్తించారు. సుమారు 20ఎకరాల విస్తీర్ణంలో 9 నుంచి 25 అడుగుల పొడుకలిగిన వివిధ రకాల వృక్షశిలాజాలు ఉన్నాయి. గుండెపల్లి దొద్దులాయి జలపాతం జలపాతాలు గుండెపల్లి అటవీ ప్రాంతంలోని దొద్దులాయి జలపాతం, అగర్‌గూడ అటవీ ప్రాంతంలోని కొండెంగ లొద్ది సీజనల్ జలపాతాలు కనువిందు చేస్తున్నాయి. వర్షాలు కురుస్తుండటంతో ఆయా జలపాతాలు సుమారు 100 అడుగుల ఎత్తు నుంచి జాలువారుతున్నాయి. అడవిలో ఊటల్లో నీరు తాగుతున్న వన్యప్రాణులు వన్యప్రాణులు పెంచికల్పేట్ రేంజ్‌లోని అటవీ ప్రాంతంలో జీవ వైవిధ్యం ఉండడంతో అనేక రకాల జంతువులు ఆవాసంగా మార్చుకున్నాయి. ఈ అడవి ప్రాంతంలో పెద్దపులులు నివాస యోగ్యానికి అనుకూలంగా ఉంది. అటవీ ప్రాంతంలో చిరుతపులులు, హైనాలు, తోడేళ్లు, నక్కలు, సాంబారు, నీలుగాయి, జింకలు, కనుజు, కొండగొర్రె, ముళ్లపందులు, అడవి పందులు సంచరిస్తున్నాయి. ఎల్లూర్ ప్రాజెక్టులో పక్షుల సందడి పక్షుల కిలకిల రాగాలు... ప్రాణాహిత, పెద్దవాగు, ఎల్లూర్ బొక్కివాగు ప్రాజెక్టు, ఉచ్చమల్లవాగు ప్రాజెక్టుల్లో నిరంతం నీరు ప్రవహిస్తుండగా పచ్చని అటవీప్రాంతం, ఎత్తైనన కొండల్లో సమృద్ధిగా ఆహారం లభిస్తుండటంతో పక్షులు అడువులను నివాస యోగ్యంగా మార్చుకున్నాయి. సుమారు 250 రకాల పక్షులు పెంచికల్పేట్ అడువుల్లో ఆవాసాన్ని ఏర్పాటు చేసుకున్నాయి. అగర్‌గూడ అడవిలో ఉబికివస్తున్న నీటి ఊటలు పొడుగు ముక్కు రాబంధులు ప్రాణాహిత,పెద్దవాగు సంగమమం -
మా పైసలు మాకు ఇస్తలేరు..
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్రం నాలుగైదు రాష్ట్రాలను సాకుతోందని, తాము కేంద్రానికి తెలంగాణ చెల్లిస్తున్న పన్నుల్లో కనీసం 60 నుంచి 70 శాతమైనా వెనక్కివ్వాలని పర్యాటక శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. అంతర్జాతీయ టూరిజం డే సందర్భంగా కేంద్ర పర్యాటక శాఖ జాతీయ పర్యాటక అవార్డులను అందజేయగా వాటిలో 2 తెలంగాణ అందుకుంది. తెలంగాణకు రెండు అవార్డులు అంతర్జాతీయ పర్యాటక దినోత్సవం సందర్భంగా కేంద్ర పర్యాటక శాఖ అందజేసిన జాతీయ పర్యాటక అవార్డుల్లో రెండింటిని తెలంగాణ అందుకుంది. టూరిస్టులకు పర్యాటక ప్రదేశాలకు సంబంధించి విస్తృత సమాచారం అందించడం కోసం తెలంగాణ ప్రభుత్వ పర్యాటక శాఖ రూపొందించిన మొబైల్ యాప్ ‘ఐ ఎక్స్ప్లోర్ తెలంగాణ’కు వెబ్సైట్ కేటగిరీలో అవార్డు లభించింది. ఇక ఉత్తమ వైద్య పర్యాటక సౌకర్యం కేటగిరీలో అపోలో ఆస్పత్రికి అవార్డు లభించింది. ఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో జరిగిన ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకల్లో ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు చేతుల మీదుగా మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సి.పార్థసారథి, పర్యాటక శాఖ కమిషనర్ సునీతా ఎం.భగవత్, తెలంగాణ స్టేట్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ బి.మనోహర్, అపోలో ఆస్పత్రి ప్రతినిధులు ఈ అవార్డులు అందుకున్నారు. పర్యాటక రంగం సమగ్రాభివృద్ధి’ విభాగంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ఉత్తమ రాష్ట్రంగా నిలిచినందుకు గాను ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు, కేంద్ర పర్యాటక శాఖ సహాయ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పాటిల్ నుంచి ఏపీ పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అవార్డు స్వీకరించారు. పర్యాటక విభాగంలో చేస్తున్న కృషికి గుర్తింపుగా ఆంధ్రప్రదేశ్ 4 అవార్డులను దక్కించుకుంది. -
పర్యాటక నగరి!
సాక్షి, సిటీబ్యూరో: నాలుగు శతాబ్దాల వారసత్వ హారం..మన భాగ్యనగరం. ఇక్కడి చరిత్ర, సంస్కతి, చారిత్రక కట్టడాలను చూసి మురిసిపోనివారుండరు. అందుకే సందర్శకులు సైతం బతుకమ్మ ఆటతో మమేకమవుతారు. బోనం నెత్తిన పెట్టుకుని పోతురాజుతో పోటీపడి నృత్యం చేస్తారు. గణపతి రూపాలు చూసి మురిసిపోతారు. రంజాన్ మాసంలో హలీంను లొట్టలేసుకుని ఆరగిస్తారు. ఇలా పురాతన కట్టడాలనే కాకుండా..సంప్రదాయ ఉత్సవాలను ఆస్వాదించేందుకూ ఇక్కడకు వచ్చేవారి సంఖ్య ఏటికేడాది పెరుగుతోంది. ఈ నెల 25న జాతీయ పర్యాటక దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ నగర పర్యాటక ప్రాశస్త్యంపై ప్రత్యేక కథనం... చారిత్రక కట్టడాలు ఠి కుతుబ్‌షాహీలు, ఆసఫ్‌జాహీల కాలం నాటి చారిత్రక కట్టడాలు నగరానికి వచ్చే పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. చార్మినార్, మక్కామసీదు, గోల్కొండ, చౌమహల్లా ప్యాలెస్, ఫలక్‌నుమా ప్యాలెస్ నగర చారిత్రక వైభవానికి దర్పణంగా నిలుస్తున్నాయి. ఠి లుంబినీ పార్క్, కేబీఆర్ పార్కు, సంజీవయ్య పార్కు, ఎన్టీఆర్ గార్డెన్, సాలార్జంగ్ మ్యూజియం, స్టేట్ మ్యూజియం, జీఎస్ఐ వంటి సంగ్రహశాలలు, జూ పార్కు నగర ప్రత్యేకతను చాటుతున్నాయి. ఠి చౌమొహల్లా ప్యాలెస్ శిల్పకళ అద్భుతం. అరణ్యంలో సంచరించే అనుభవం కలిగించే జూపార్కు, నిజాంల రాజప్రసాదం మ్యూజియంలకు సందర్శకులు ఎప్పటికప్పుడు పెరుగుతున్నారు. హుస్సేన్ సాగర్‌లో బోటు షికారు... ట్యాంక్‌బండ్, నెక్లెస్ రోడ్డు ఇలా అంతా మనోహరమే. ఠి నగరానికి వచ్చిన స్వదేశీ, విదేశీ యాత్రికులకు గోల్కొండ కోట చూడందే పర్యాటక దాహం తీరదు. రోజంతా తనివి తీరా చూసి మురిసిపోతారు. గైడ్లు ఇక్కడి అందాలను వివరించిన తీరుకు మంత్రముగ్ధులవుతారు. బోటు షికారు ... టీఎస్‌టీడీసీ ఇటీవల లుంబినీ పార్కులో ప్రవేశపెట్టిన బోట్లు పర్యాటకులను విశేçషంగా ఆకర్షిస్తున్నాయి. వారాంతల్లో బోట్ షికారు చేసే వారి సంఖ్య పెరుగుతోంది. కొత్త బోట్లు వచ్చిన తర్వాత ఆదాయం ఆరవై శాతం పెరిగింది. టీఎస్‌టీడీసీ పరిధిలోని హరిత హోటల్స్ కూడా లాభాల బాటలో పయనిస్తున్నాయి. శోభాయమానంగా దుర్గం చెరువు... చుట్టూ కొండలు, మధ్యలో చెరువు.. ఇదీ దుర్గం చెరువు ప్రత్యేకత. దీని అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టిసారించి అందంగా తీర్చిదిద్దింది. సుమారు రూ. 20 కోట్లతో దుర్గం చెరువును ఆధునికీకరించారు. త్వరలో చెరువు ఆవరణలో ఆంఫీ థియేటర్‌ను ఏర్పాటు చేయనున్నారు. కాగా ప్రపంచంలో చూడదగ్గ ప్రదేశాల్లో హైదరాబాద్‌ది రెండో స్థానం. ఈ స్ఫూర్తితో నగరంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలను అభివృద్ధి చేసి ప్రపంచ పర్యాటకుల ఆకట్టుకోవడానికి తెలంగాణ పర్యాటక శాఖ ఆవిరళ కృషి చేస్తోంది. ఎంతో ప్రత్యేకంమెదక్ కోట...చర్చి కాకతీయ చక్రవర్తి ప్రతాపరుద్రుడి కాలంలో నిర్మించిన మెదక్ కోట కాకతీయుల నిర్మాణ కౌశలానికి ప్రతీక. రాజధాని నగరానికి అత్యంత సమీపంలో గల మెదక్ జిల్లాలలో ఆసియాలోనే అతి పెద్దదైన చర్చి పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. పూర్తికావాల్సినవి ఇవీ.. ఇక కొన్ని కొత్త ప్రాజెక్టులు కూడా చేపడుతున్నారు. వీటి పనులు మాత్రం నత్తనడకన సాగుతున్నాయి. నగర శివారులోని బుద్వేల్‌లో 30 ఎకరాల విస్తీర్ణంలో జల, క్రీడల పార్కు, గగతలం నుంచి భాగ్యనగరం అందాలను వీక్షించేందుకు హెలీ టూరిజం – జాయ్ రైడ్స్ ప్రాజెక్టు దాదాపుగా ఆటకెక్కింది. సీ–ప్లేన్ ప్రాజెక్టు కూడా మూలనపడింది. సుదూర ప్రాంతాల నుంచి ప్రయాణం సాగించే ప్రజలు తమ వాహనాలు నిలిపి.. కొన్ని గంటలు సేదదీరేందుకు వీలుగా పర్యాటక విడిది కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం తలంచింది. జడ్చర్ల కేంద్రంగా జాతీయ రహదారిపై దీన్ని నిర్మించనున్నట్లు రెండేళ్ల క్రితం ప్రకటించారు. ఆ ప్రతిపాదలన గురించి ఇప్పుడు అధికారులను అడిగితే తమకు తెలియదని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఆటవీ శాఖసరికొత్త ప్యాకేజీలు ... ఈ నెల 25న జాతీయ పర్యాటక దినోత్సవం పురస్కరించుకొని ఫారెస్ట్ శాఖ వారు నగర ప్రజలను దృష్టిలో పెట్టుకొని జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఎకో టూరిజం ఈవెంట్స్‌ను ప్రకటించారు. ఆసక్తిగల నగర పర్యాటకులు 73826 19363 నంబర్‌కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. ఏటూరు నాగారం వన్యప్రాణుల అభయారణ్యం టూర్ ఏర్పాటు చేశారు. దీనికి రూ. 2 వేలు, లక్నవరం ఫెస్టివల్‌కు రూ.2 వేలు, పాండవుల గుహలకి రూ. 500 చెల్లించాల్సి ఉంటుంది. -
హార్సిలీహిల్స్‌లో 2 కె రన్
హార్సిలీహిల్స్‌లో 2 కె రన్ బి.కొత్తకోట: ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా మంగళవారం మండలంలోని పర్యాట కేం ద్రం హార్సిలీహిల్స్‌లో వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. టూరి జం మేనేజర్ మురళి ఆధ్వర్యంలో టూరిజం, రెవెన్యూ, అటవీ, రైల్వే, పోలీసుశాఖలకు చెందిన అధికారు లు, సిబ్బంది 2కె రన్లో పాల్గొన్నా రు. గవర్నర్ బంగ్లా ప్రవేశ ద్వారం వద్ద కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వశాఖకు చెంది న సిబ్బంది, అధికారులతో ప్రైవేటు హోటళ్లు, అతిథి గృహాల నిర్వాహకులు, సిబ్బంది పాల్గొన్నారు. -
అందరికి పర్యాటకం..
– అదే ఈ ఏడాది మన నినాదం – ప్రపంచ పర్యాటక దినోత్సవ కార్యక్రమంలో వక్తలు – ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు కర్నూలు(అగ్రికల్చర్): జిల్లాలోని పర్యాటక ప్రాంతాలను సంరక్షించుకోవడం అందరి బాధ్యతని కేంద్ర పురావస్తుశాఖ కర్నూలు రీజియన్ పరిరక్షకులు కృష్ణచైతన్య అన్నారు. మంగళవారం ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలు నగరంలోని లలిత కళాసమితిలో ఘనంగా జరిగాయి. ఏకో టూరిజం, అగ్రీ టూరిజం, హెల్త్ టూరిజం, కల్చరల్ టూరిజం, టెంపుల్ టూరిజం అవకాశాలను, విశిష్టతలను ఈ సందర్భంగా వ్యక్తలు వివరించారు. ఈ సందర్భంగా కృష్ణచైతన్య మాట్లాడుతూ... ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురష్కరించుకొని ఈ ఏడాది నినాదం అందరికీ పర్యాటకం పేరుతో ప్రజల్లోకి తీసుకెళ్తున్నట్లు వివరించారు. జిల్లా పర్యాటక సంస్థ డీవీఎం సుదర్శన్‌రావు మాట్లాడుతూ...రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ పర్యాటక ప్రాంతాలను అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తోందని వివరించారు. జిల్లా పర్యాటక అధికారి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ జిల్లాలో పర్యాటక ప్రాంతాలను మరింత అభివృద్ధి చేసేందుకు ఎప్పటికప్పుడు ప్రతిపాదనలు పంపుతున్నట్లు వివరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.ఉస్మానియా, కేవీఆర్, టౌన్ మోడల్, హజీర కళాశాలల విద్యార్థులకు పోస్టర్ పెయింటింగ్, క్విజ్ పోటీలు, పేపర్ ప్రజెంటేషన్, ఫొటోగ్రఫీ వంటి వాటిపై పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో రెవెన్యూ ఉద్యోగుల సంఘం జిల్లా మాజీ అధ్యక్షుడు కిష్టన్న, నగర ప్రముఖులు చంద్రశేఖర్ కల్కూర, మద్దయ్య, రచయిత సంఘం నేత వేణుగోపాల్ రావు, ప్రోగ్రామ్ కో ఆర్డీనేటర్ ఆదిశేషులు తదితరులు పాల్గొన్నారు. -
'పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేయాలి'
హైదరాబాద్: తెలంగాణ ప్రజలకు పర్యాటక కేంద్రాలను పరిచయం చేసి, అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని శాసనమండలి చైర్మన్ కె. స్వామిగౌడ్ తెలిపారు. మంగళవారం ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురష్కరించుకుని నగరంలోని రవీంద్రభారతిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్వామిగౌడ్ మాట్లాడారు. రాష్ట్ర ప్రజలకు, పిల్లలకు బయటి ప్రాంత విశేషాలు, వాటి గొప్పతనం తెలియజె ప్పాలని సూచించారు. రెండేళ్లలోనే రాష్ట్ర ప్రభుత్వం రూ.500 కోట్లతో పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేపట్టిందని తెలిపారు. పర్యాటక శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ మాట్లాడుతూ పర్యాటక ప్రాంతాల సందర్శనకు వెళ్లే పాఠశాల విద్యార్థులకు సబ్సిడీ ఇచ్చే విషయం పరిశీలిస్తున్నామన్నారు. పర్యాటక దినోత్సవం సందర్భంగా వివిధ అంశాల్లో తెలంగాణ రాష్ట్ర స్థాయిలో టూరిజం ఎక్సలెన్సీ అవార్డులను మంత్రి, శాసనమండలి చైర్మన్ అందజేశారు. -
27 నుంచి పర్యాటక ఉత్సవాలు
సాక్షి, విజయవాడ : పర్యాటక దినోత్సవం సందర్భంగా 27 నుంచి 30వ తేదీ వరకు నగరంలోని హరిత బెర్మ్ పార్కులో నిర్వహించనున్న పర్యాటక ఉత్సవాలను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభిస్తారని శిల్పారామం ప్రాజెక్టు ప్రత్యేకాధికారి జీఎన్ రావు తెలిపారు. మంగళవారం స్థానిక 27 నుంచి పర్యాటక ఉత్సవాలు బెర్మ్ పార్కులో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతి ఏటా హైదరాబాద్‌లో రాష్ట్రస్థాయిలో నిర్వహించే ఈ ఉత్సవాలను రాష్ట్రం విడిపోవడంతో నూతన రాజధాని విజయవాడలో నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఏపీటీడీసీ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ అమరేంద్ర మాట్లాడుతూ తమ సంస్థ ఆధ్వర్యంలో ఈ ఏడాది ప్రత్యేకంగా కృష్ణహారతి కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. అదే కాకుండా దాండియా డాన్స్, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. 27వ తేదీ ఉదయం జలక్రీడలు, బోట్‌రేస్ నిర్వహిస్తామని, సాయంత్రం ముఖ్యమంత్రి ఉత్సవాలను ప్రారంభిస్తారని తెలిపారు. 28వ తేదీ షాపింగ్ ఫెస్టివల్, పెయింటింగ్ పోటీలు దాండియా డాన్స్ ఉంటుందన్నారు. 29వ తేదీ వంటలు పోటీలు, పిల్లలు పెద్దలతో దసరా మేళా నిర్వహిస్తామన్నారు. భారతీయ ఆచార సంప్రదాయ దుస్తుల ప్రదర్శన, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారని, 30వ తేదీ అవార్డుల బహూకరణ, స్త్రీలకు మెహంది అలంకరణ, పెయింటింగ్ పోటీలు, ఫోటోగ్రఫీ పోటీలు ఉంటాయన్నారు. కలెక్టర్ రఘునందన్‌రావు, జాయింట్ కలెక్టర్ మురళీ, సబ్‌కలెక్టర్ నాగలక్ష్మి, హోటల్ మేనేజ్మెంట్ అసోసియేషన్ అధ్యక్షుడు పట్టాబి, పారిశ్రామిక వేత్త ఎం.రాజయ్య పాల్గొన్నారు. -
ఈ ఏడాదీ అరకు ఉత్సవ్
సాక్షి, విశాఖపట్నం : పర్యాటక దినోత్సవానికి ముందే విశాఖ జిల్లాకు ఆ శోభ వచ్చినట్టుంది. ఏటా సెప్టెంబర్ 27న టూరిజం డే నిర్వహిస్తున్న ప్రభుత్వం ఈ సారి విశాఖ పరిధిలో పలు ప్రాజెక్టులు, అభివృద్ధి పనులకు సంకల్పించింది. విశాఖ పర్యటనకు వచ్చిన ఆ శాఖ ముఖ్య కార్యదర్శి చందనఖాన్ బుధవారం జిల్లాకు పలు వరాలు కురిపించారు. అరకు ఉత్సవ్‌ను ఈ ఏడాది కూడా నిర్వహిస్తామని స్పష్టం చేశారు. విశాఖ, అరకు అందాలు సందర్శకుల్ని ఆకట్టుకుంటాయని, మధురానుభూతికి లోనవుతుంటారని కొనియాడారు. ఇక్కడి సుందర దృశ్యాలను ప్రపంచం మొత్తానికి తెలిపేందుకు సోషల్ మీడియా, ఎయిర్‌పోర్టుల్లో వివరాల్ని పొందుపరుస్తామన్నారు. విశాఖలో ఏడాదిలోగా ఏర్పాటు కానున్న హెల్త్‌సిటీ, కన్వెంక్షన్ హాలు, వాటర్ అక్వేరియం తదితర ప్రాజెక్టులు సందర్శకుల్ని అలరిస్తాయన్నారు. విశాఖ ఉత్సవ్ నిర్వహణకు పుష్కలంగా అవకాశాలున్నా ఏటా ఏవేవో అడ్డంకులతో వాయిదా వేయాల్సివస్తోందన్నారు.మూన్ల్యాండ్ ప్రాజెక్టును పరిశీలిస్తున్నామన్నారు. డిజైన్, లొకేషన్ సరిగా లేని కారణంగా డచ్ విలేజ్ ప్రాజెక్టు రద్దుకు నిర్ణయించామన్నారు. అరకు ట్రైన్, తిరుపతి విమానం సందర్శకులు మరింత అనుభూతికి లోనయ్యేలా విశాఖ-అరకు ప్రత్యేక రైలు ప్రాజెక్టు అనుమతుల కోసం ఎదురు చూస్తున్నామని చందనఖాన్ తెలిపారు. టూరిజం ఆధ్వర్యంలో డిమాండ్‌కు తగ్గట్టుగా విశాఖ-తిరుపతి విమాన సర్వీసుకు ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు. రాజధానిలో ఈ తరహా ప్రాజెక్టుకు మంచి స్పందనే ఉందని, అయితే స్పైస్‌జెట్ సంస్థతో సంప్రదింపులు జరపాల్సి ఉంటుందన్నారు. హైదరాబాద్ తరహాలో విశాఖలోనూ టూరిజం పోలీసులను నియమిస్తున్నామన్నారు. పర్యాటక ప్రాజెక్టులు, కార్యలయాలు, అతిథి గృహాల వద్ద భద్రత సిబ్బంది ఉంటారన్నారు. ఉత్తరాంధ్రలోనే కీలకమైన శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో వచ్చే ఏడాది జనవరి నాటికి పలు ప్రాజెక్టులు ప్రారంభమయ్యే అవకాశాలున్నాయన్నారు. ఏజెన్సీలో సుమారు రూ.80కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టనున్నట్టు ఐఎల్ఎఫ్ఎస్ కన్సల్టెన్సీ ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ తెలిపారు. ప్రైవేట్ పెట్టుబడులు రావాలి పబ్లిక్/ప్రైవేట్ భాగస్వామ్యంలో పెట్టుబడులు వస్తే పర్యాటకాభివృద్ధి పనులు వేగవంతమవుతాయని చందనఖాన్ అభిప్రాయపడ్డారు. కొన్ని ప్రాజెక్టులకు సంబంధించి లోపాలుంటున్నాయని విలేకరులు అడిగిన ప్రశ్నలకు శ్రీనివాస్ కూడా సమాధానమిచ్చారు. ఇకపై ఎంపవర్ కమిటీ సూచనల మేరకు పనులు చేపడతామన్నారు. భూముల ధరలు విపరీతంగా పెరగడంతో ప్రాజెక్టుపై నివేదిక పంపించే సమయానికి, పనులు ప్రారంభమయ్యేనాటికి మధ్య వ్యత్యాసం కనిపిస్తోందన్నారు. ప్రాజెక్టులు ప్రారంభమైతే లబ్ధి చేకూరుతుందని, అయితే విశాఖలో కొన్ని ప్రాజెక్టులకు సంబంధించి 28మంది పెట్టుబడిదారులు ముందుకు వచ్చారని, బ్యాంకు గ్యారెంటీతో లీజ్‌కు సిద్ధమైతే పనులు ప్రారంభించడమే తరువాయి అని చెప్పారు. కొన్ని టూరిజం ప్రాజెక్టుల వద్ద పార్కింగ్ ఫీజు వసూలు చేయక తప్పదన్నారు. చందనఖాన్ వెంట ఓఎస్డీ వి. మధుసూధన్, జిల్లా కలెక్టర్ ఆరోఖ్యరాజ్, జీవీఎంసీ కమిషనర్ ఎం.వి.సత్యనారాయణ, వుడా వీసీ డా. యువరాజ్, అదనపు కమిషనర్ జానకి, బీచ్‌కారిడార్ ప్రత్యేక అధికారి భీమశంకర్రావు, టూరిజం విభాగం అధికారులు, సిబ్బంది ఉన్నారు.