ఆ యాత్ర ఓ చరిత్ర | First Modern Indian Traveler Enugula Veeraswamy Kasi Yatra | Sakshi
Sakshi News home page

Enugula Veeraswamy: ఆ యాత్ర ఓ చరిత్ర

Published Wed, May 18 2022 12:27 PM | Last Updated on Wed, May 18 2022 2:52 PM

First Modern Indian Traveler Enugula Veeraswamy Kasi Yatra - Sakshi

ఏమాత్రం ఆధునిక ప్రయాణ సాధనాలు లేని రోజుల్లో ‘కాశీ యాత్ర’ చేసినవాడు ఏనుగుల వీరాస్వామి. తన యాత్రానుభవాలను గ్రంథస్థం చేసిన మొదటి ఆధునిక భారతీయ యాత్రికుడూ ఆయనే! వీరాస్వామి పదహారణాల తెలుగువాడు. ఈయన 1780లో చెన్నైలో జన్మించారు. పూర్వీకులు ఒంగోలు ప్రాంతీయులు. మద్రాస్‌ సుప్రీం కోర్టులో ‘ఇంటర్‌ ప్రిటర్‌’ ఉద్యోగం చేస్తూ పదవీ విరమణ చేసిన తర్వాత కాశీయాత్ర చేప ట్టారు. ‘రెగినాల్డ్‌ బిషప్‌ హెబార్డ్‌’ అనే తూర్పు ఇండియా కంపెనీ మతాధికారి 1824 – 1826లో భారతదేశ యాత్ర చేసి ‘బిషప్‌ హెబార్డ్‌ జర్నల్‌’ అనే పేరుతో ఓ గ్రంథం రాశారు. ఇదే వీరా స్వామి ‘కాశీ యాత్ర చరిత్ర’ గ్రంథానికి స్ఫూర్తి.

వీరాస్వామి ‘కాశీ యాత్ర’ 1830 మే 18వ తేదీ మంగళవారం రాత్రి 9 గంటలకు చెన్నైలోని తండయారువీడు లోని సొంత ఇంటి నుంచి ప్రారంభమైంది. తల్లి, భార్యతో సహా 100 మందితో బయలుదేరివెళ్లిన ఆయన... 1831 సెప్టెంబర్‌  3వ తేదీన మరలా ఇంటికి చేరుకోవడంతో యాత్ర సుఖాంతమైంది. సుమారు 4 వేల కిలోమీటర్ల దూరం 15 నెలల, 15 రోజులు కొనసాగింది. (చదవండి: అక్షర యోధుడు అదృష్టదీపుడు)

1830, మే 22వ తేదీన ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశించి... 33 రోజుల అనంతరం జూన్‌ 24వ తేదీన తెలంగాణాలో ప్రవేశించి ఆగస్టు 6వ తేదీ వరకు కొనసాగింది. ఆగస్టు 6వ తేదీన మహారాష్ట్రలో ప్రవే శించారు. తరువాత మధ్యప్రదేశ్‌ గుండా ఉత్తరప్రదేశ్‌ లోకి ప్రవేశించి కాశీ చేరుకున్నారు. ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత తన యాత్రానుభ వాలను ‘కాశీ యాత్రా చరిత్రగా’ గ్రంథస్థం చేసి నాటి కాలమాన పరిస్థితులను ముందు తరాలకు అందించారు. వీరాస్వామి కాశీ యాత్ర చేపట్టిన మే 18వ తేదీని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పర్యాటక దినోత్సవంగా జరుపుకోవడం సముచితంగా ఉంటుంది.
 
– కోరాడ శ్రీనివాసరావు
సాలూరు మండలం, పార్వతీపురం మన్యం జిల్లా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement