సాక్షి, సిటీబ్యూరో: నాలుగు శతాబ్దాల వారసత్వ హారం..మన భాగ్యనగరం. ఇక్కడి చరిత్ర, సంస్కతి, చారిత్రక కట్టడాలను చూసి మురిసిపోనివారుండరు. అందుకే సందర్శకులు సైతం బతుకమ్మ ఆటతో మమేకమవుతారు. బోనం నెత్తిన పెట్టుకుని పోతురాజుతో పోటీపడి నృత్యం చేస్తారు. గణపతి రూపాలు చూసి మురిసిపోతారు. రంజాన్ మాసంలో హలీంను లొట్టలేసుకుని ఆరగిస్తారు. ఇలా పురాతన కట్టడాలనే కాకుండా..సంప్రదాయ ఉత్సవాలను ఆస్వాదించేందుకూ ఇక్కడకు వచ్చేవారి సంఖ్య ఏటికేడాది పెరుగుతోంది. ఈ నెల 25న జాతీయ పర్యాటక దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ నగర పర్యాటక ప్రాశస్త్యంపై ప్రత్యేక కథనం...
చారిత్రక కట్టడాలు
ఠి కుతుబ్‌షాహీలు, ఆసఫ్‌జాహీల కాలం నాటి చారిత్రక కట్టడాలు నగరానికి వచ్చే పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. చార్మినార్, మక్కామసీదు, గోల్కొండ, చౌమహల్లా ప్యాలెస్, ఫలక్‌నుమా ప్యాలెస్ నగర చారిత్రక వైభవానికి దర్పణంగా నిలుస్తున్నాయి.
ఠి లుంబినీ పార్క్, కేబీఆర్ పార్కు, సంజీవయ్య పార్కు, ఎన్టీఆర్ గార్డెన్, సాలార్జంగ్ మ్యూజియం, స్టేట్ మ్యూజియం, జీఎస్‌ఐ వంటి సంగ్రహశాలలు, జూ పార్కు నగర ప్రత్యేకతను చాటుతున్నాయి.
ఠి చౌమొహల్లా ప్యాలెస్ శిల్పకళ అద్భుతం. అరణ్యంలో సంచరించే అనుభవం కలిగించే జూపార్కు, నిజాంల రాజప్రసాదం మ్యూజియంలకు సందర్శకులు ఎప్పటికప్పుడు పెరుగుతున్నారు. హుస్సేన్ సాగర్‌లో బోటు షికారు... ట్యాంక్‌బండ్, నెక్లెస్ రోడ్డు ఇలా అంతా మనోహరమే.
ఠి నగరానికి వచ్చిన స్వదేశీ, విదేశీ యాత్రికులకు గోల్కొండ కోట చూడందే పర్యాటక దాహం తీరదు. రోజంతా తనివి తీరా చూసి మురిసిపోతారు. గైడ్లు ఇక్కడి అందాలను వివరించిన తీరుకు మంత్రముగ్ధులవుతారు.
బోటు షికారు ...
టీఎస్‌టీడీసీ ఇటీవల లుంబినీ పార్కులో ప్రవేశపెట్టిన బోట్లు పర్యాటకులను విశేçషంగా ఆకర్షిస్తున్నాయి. వారాంతల్లో బోట్ షికారు చేసే వారి సంఖ్య పెరుగుతోంది. కొత్త బోట్లు వచ్చిన తర్వాత ఆదాయం ఆరవై శాతం పెరిగింది. టీఎస్‌టీడీసీ పరిధిలోని హరిత హోటల్స్ కూడా లాభాల బాటలో పయనిస్తున్నాయి.
శోభాయమానంగా దుర్గం చెరువు...
చుట్టూ కొండలు, మధ్యలో చెరువు.. ఇదీ దుర్గం చెరువు ప్రత్యేకత. దీని అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టిసారించి అందంగా తీర్చిదిద్దింది. సుమారు రూ. 20 కోట్లతో దుర్గం చెరువును ఆధునికీకరించారు. త్వరలో చెరువు ఆవరణలో ఆంఫీ థియేటర్‌ను ఏర్పాటు చేయనున్నారు. కాగా ప్రపంచంలో చూడదగ్గ ప్రదేశాల్లో హైదరాబాద్‌ది రెండో స్థానం. ఈ స్ఫూర్తితో నగరంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలను అభివృద్ధి చేసి ప్రపంచ పర్యాటకుల ఆకట్టుకోవడానికి తెలంగాణ పర్యాటక శాఖ ఆవిరళ కృషి చేస్తోంది.
ఎంతో ప్రత్యేకంమెదక్ కోట...చర్చి
కాకతీయ చక్రవర్తి ప్రతాపరుద్రుడి కాలంలో నిర్మించిన మెదక్ కోట కాకతీయుల నిర్మాణ కౌశలానికి ప్రతీక. రాజధాని నగరానికి అత్యంత సమీపంలో గల మెదక్ జిల్లాలలో ఆసియాలోనే అతి పెద్దదైన చర్చి పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.
పూర్తికావాల్సినవి ఇవీ..
ఇక కొన్ని కొత్త ప్రాజెక్టులు కూడా చేపడుతున్నారు. వీటి పనులు మాత్రం నత్తనడకన సాగుతున్నాయి. నగర శివారులోని బుద్వేల్‌లో 30 ఎకరాల విస్తీర్ణంలో జల, క్రీడల పార్కు, గగతలం నుంచి భాగ్యనగరం అందాలను వీక్షించేందుకు హెలీ టూరిజం – జాయ్ రైడ్స్ ప్రాజెక్టు దాదాపుగా ఆటకెక్కింది. సీ–ప్లేన్ ప్రాజెక్టు కూడా మూలనపడింది. సుదూర ప్రాంతాల నుంచి ప్రయాణం సాగించే ప్రజలు తమ వాహనాలు నిలిపి.. కొన్ని గంటలు సేదదీరేందుకు వీలుగా పర్యాటక విడిది కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం తలంచింది. జడ్చర్ల కేంద్రంగా జాతీయ రహదారిపై దీన్ని నిర్మించనున్నట్లు రెండేళ్ల క్రితం ప్రకటించారు. ఆ ప్రతిపాదలన గురించి ఇప్పుడు అధికారులను అడిగితే తమకు తెలియదని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ఆటవీ శాఖసరికొత్త ప్యాకేజీలు ...
ఈ నెల 25న జాతీయ పర్యాటక దినోత్సవం పురస్కరించుకొని ఫారెస్ట్ శాఖ వారు నగర ప్రజలను దృష్టిలో పెట్టుకొని జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఎకో టూరిజం ఈవెంట్స్‌ను ప్రకటించారు. ఆసక్తిగల నగర పర్యాటకులు 73826 19363 నంబర్‌కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. ఏటూరు నాగారం వన్యప్రాణుల అభయారణ్యం టూర్ ఏర్పాటు చేశారు. దీనికి రూ. 2 వేలు, లక్నవరం ఫెస్టివల్‌కు రూ.2 వేలు, పాండవుల గుహలకి రూ. 500 చెల్లించాల్సి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment