సాక్షి, విశాఖపట్నం : ప్రకృతి అందాలతో అలరారే విశాఖ పర్యాటకంగా కూడా గత రెండు దశాబ్ధాలుగా గణనీయంగా అభివృద్ధి చెందింది. ఒకవైపు సాగర సోయగాలు.. మరోవైపు ఎత్తైన తూర్పు కనుమల అందాలు ప్రపంచ పర్యాటకులను కట్టిపడేస్తున్నాయి. కొండ కోనలను చూసినా.. ప్రకృతి ఒడిలో సేదతీరుతున్న మన్యంలో అడుగు పెట్టినా.. అలల సవ్వడితో.. హొయలొలుకుతున్న సాగర తీరంలో అడుగులు వేస్తున్నా.. ఆధ్యాత్మిక శోభతో ఆహ్లాదపరిచే దేవాలయాలు.. ఏ చోటకు వెళ్లినా.. భూతల స్వర్గమంటే ఇదేనేమోనన్న అనుభూతిని అందిస్తుంది.
2004 తరువాత నుంచి పర్యాటకంగా విశాఖ రూపురేఖలు మారిపోయాయి. ప్రపంచ పర్యాటకులను ఆకర్షించే విధంగా నగరంలోనే కాకుండా గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో కూడా సరికొత్త పర్యాటక ప్రాజెక్టులు అందుబాటులోకి వచ్చాయి. జిల్లాలో ముఖ్యమైన పర్యాటక ప్రాంతాలు ఎక్కడ ఉన్నాయో జాతీయ పర్యాటక దినోత్సవం సందర్భంగా ఓసారి చూసొద్దాం రండి...
మదిదోచే కైలాసగిరి
ఆర్‌కే బీచ్ నుంచి 5 కిలోమీటర్ల దూరంలో కైలాసగిరి ఉంది. పచ్చని పార్కులు, ఆహ్లాద వాతావరణం, బీచ్ వ్యూ ఇక్కడ మంచి అనుభూతినిస్తాయి. కొండ కింద నుంచి రోప్ వే, రోడ్డు, మెట్ల మార్గాల ద్వారా పైకి చేరుకోవచ్చు. విశాఖ వచ్చే ప్రతి పది మంది పర్యాటకుల్లో 8 మంది కైలాసగిరి వెళ్తుంటారు.
చదవండి: Lambasingi: లంబసింగికి చలో చలో
భీమిలి.. అందాల లోగిలి..
ఆర్‌కే బీచ్ రోడ్డు నుంచి 30 కిలోమీటర్ల దూరంలో భీమిలి ఉంది. తూర్పు తీరంలో పురాతన ఓడ రేవుల్లో ఒకటిగా పిలుస్తారు. గోస్తనీనది ఇక్కడ సముద్రంలో కలుస్తుంది. డచ్ పాలకుల సమాధులు, లైట్ హౌస్‌లు, బౌద్ధ మత ఆనవాళ్లు ఇక్కడ అనేకం. దీని ముందున్న రుషికొండ బీచ్ కూడా అద్భుతంగా ఉంటుంది. ఈ బీచ్‌కు బ్లూ ఫ్లాగ్ గుర్తింపు రావడం విశేషం.
జలజల జలపాతాలు..
విశాఖ మన్యంలోకి వెళ్తే.. అడుగడుగునా జలపాతాలు హొయలుపోతూ కనిపిస్తుంటాయి. కటిక, చాపరాయి, సరయు, డుడుమ, కొత్తపల్లి, సీలేరు ఐసుగెడ్డ, పిట్టలబొర్ర, బొంగుదారి జలపాతాలతో పాటు చిన్న చిన్న జలపాతాలు పర్యాటకులకు సరికొత్త అనుభూతిని అందిస్తున్నాయి.
ఆంధ్రా ఊటీ.. అరకు..
విశాఖ మన్యం పేరు చెబితే.. పర్యాటకులు పులకరించిపోతారు. సముద్ర మట్టానికి 910 మీటర్ల ఎత్తులో ఉన్న అరకు వ్యాలీని సందర్శించేందుకు పర్యాటకులు ఉవ్విళ్లూరుతుంటారు. ఇది జలపాతాలు, క్రిస్టల్ క్లియర్ స్ట్రీమ్స్ , పచ్చని తోటలతో కళకళలాడుతుంటుంది. మంచు మేఘాల వంజంగి మేఘాలలో తేలిపొమ్మన్నది అంటూ టూరిస్టులు ఎంజాయ్ చేసే ప్రాంతం వంజంగి. పాడేరు మండలంలో ఉన్న వంజంగి కొండపైకి ఎక్కితే మేఘాలను తాకుతున్నట్లు అనుభూతిని పొందొచ్చు.
బుద్ధం.. శరణం.. గచ్ఛామి...
ఆర్‌కే బీచ్ నుంచి 16 కిలోమీటర్ల దూరంలో ప్రాచీన బౌద్ధ క్షేత్రాలు తొట్లకొండ, బావికొండ ఉన్నాయి. తొట్లకొండ తదితర ప్రాంతాలు నిత్యం పర్యాటకులను అలరిస్తున్నాయి.
జంతు ప్రపంచం పిలుస్తోంది...
ఆర్‌కే బీచ్ నుంచి 9 కిలోమీటర్ల దూరంలో జూపార్క్ ఉంది. ఎన్నో అరుదైన జంతువులు, వన్యప్రాణులు ఇక్కడ మనకు కనిపిస్తాయి. జూ ఎదురుగా ఉండే కంబాలకొండలో వన్యప్రాణులతో పాటు సాహస క్రీడలు, బోటింగ్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది.
భలే మంచు ఊరు
డిసెంబర్..జనవరి మాసాల్లో వాతావరణం సుమారుగా 0 డిగ్రీలకు పడిపోతూ.. ఆంధ్రా కాశ్మీరంగా పేరొందిన లంబసింగికి చలికాలంలో పర్యాటకులు క్యూ కడతారు. సముద్ర మట్టానికి ఈ ప్రాంతం 3600 మీటర్ల ఎత్తులో ఉంది. విశాఖ నగరానికి 101 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఉదయం 10 గంటలైనా మంచు వీడకుండా శీతల గాలులు వీస్తు పర్యాటకులకు ఎంతో ఆహ్లాదకరంగా కనిపిస్తుంది.
వీఎంఆర్‌డీఏ పార్క్
ఆర్‌కే బీచ్ వ్యూను చూస్తూ పర్యాటకులు కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి పిక్నిక్‌లు జరుపుకునేందుకు, ఆహ్లాదాన్ని పొందేందుకు అనువైన ప్రదేశం. ఇటీవలే రూ.35 కోట్లతో పార్క్‌ను అత్యాధునికంగా అభివృద్ధి చేశారు.
అటు కురుసుర.. ఇటు టీయూ 142
ఆర్‌కే బీచ్‌లో విహరించి కాస్తా ముందుకు వెళ్తే.. పర్యాటకులను ఆకట్టుకునే కురుసుర సబ్ మెరైన్ మ్యూజియం ఉంటుంది. దాని ఎదురుగానే టీయూ– 142 యుద్ధ విమాన మ్యూజియం. ఇప్పుడు వీటి సరసన... సీ హారియర్ మ్యూజియం సిద్ధమవుతోంది. ఇంకాస్త ముందకెళితే విక్టరీఎట్ సీ దర్శనమిస్తుంది.
పురాతన బొర్రా గుహలు..
మీరు చరిత్ర ప్రేమికులైతే, బొర్రా గుహలు ఉత్తమ పర్యాటక ఆకర్షణలలో ఒకటిగా నిలుస్తాయి. అరకులోయలోని అనంతగిరి కొండల మధ్య ఉన్న ఈ గుహలు వేల సంవత్సరాల పురాతనమైనవే కాదు.. దేశంలో కనిపించే అన్ని గుహలలో అతిపెద్దవి. పూర్తిగా సహజ సున్నపురాయితో తయారైన ఈ గుహలు ప్రకృతిలో కాలిడోస్కోపిక్, జలపాతాలతో పాటు రాళ్లపై పడే కాంతి చాలా రంగురంగులుగా దర్శనమిస్తుంటాయి. ప్రతి ఏడాది సుమారు 3 లక్షల మంది పర్యాటకులు ఈ గుహలను సందర్శిస్తుంటారు.
చరిత్ర చెప్పే మ్యూజియం
వీటన్నింటినీ సందర్శించి.. ఇంకొంచెం ముందుకెళ్తే.. విశాఖ మ్యూజియం కనిపిస్తుంది. దాని ఎదురుగానే.. భారత నౌకాదళానికి చెందిన మొట్టమొదటి సబ్‌మెరైన్ కల్వరి çహాల్ కనిపిస్తుంది. విశాఖ మ్యూజియంలో భారత దేశ చరిత్రకు సంబంధించిన ఆనవాళ్లు ప్రదర్శిస్తుంటారు.
అల ఆర్‌కే బీచ్‌లో..
వైజాగ్ వచ్చే ప్రతి ఒక్కరూ బీచ్‌కు వెళ్లి తీరాల్సిందే. అందుకే వీకెండ్స్ అయితే ఇసకేస్తే రాలనంత జనం బీచ్‌లో వాలిపోతారు. షాపింగ్ మొదలుకొని స్టే, డిన్నర్ వరకూ సకల సౌకర్యాలు పర్యాటకులకు ఇక్కడ లభిస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment