borra caves
-
బొర్రా గుహలకు మహర్దశ
అనంతగిరి (అల్లూరి సీతారామరాజు జిల్లా): విశ్వఖ్యాతి పొందిన బొర్రా గుహలను అతి సుందరంగా తీర్చిదిద్దాలని కేంద్ర ప్రభుత్వం సంకల్పించింది. అందుకోసం రూ. 29.88 కోట్లను మంజూరు చేసింది. గురువారం ఈ పనులకు ప్రధాని మోదీ జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్‌నుంచి వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. కాగా, 1807లో విలియం కింగ్ గుర్తించిన ఈ గుహల్లో సున్నపురాయి ఖనిజంతో ఏర్పాటయిన మానవమెదడు, శివలింగం, డైనోసార్, మొసలి, శివపార్వతి, తల్లీబిడ్డ, రుషి, సాయిబాబా, తేనెపట్టులాంటి వివిధ ఆకృతులు చూపరులను కనువిందు చేస్తున్నాయి. 1995 ముందు వరకు స్థానిక గిరిజనులు కాగడాలతో బొర్రాగుహలను నిర్వహించేవారు. తరువాత పర్యాటకశాఖ విద్యుత్ సౌకర్యం కల్పించి, లైట్లను ఏర్పాటు చేసింది. స్థానిక గిరిజనులకు టికెట్‌పై కమిషన్ ఇచ్చి నడిపేవారు. 2000 నుంచి పర్యాటకశాఖ నిర్వహిస్తోంది. వచ్చే ఆదాయంలో కొంతమేర గుహల అభివృద్ధికి కేటాయించింది. మూడు విభాగాల్లో.. కేంద్ర ప్రభుత్వం స్వదేశీ సందర్శన్ పథకంలో భాగంగా మంజూరు చేసిన రూ.29.88 కోట్లతో మూడు విభాగాల్లో అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. మొదటి విభాగంలో రైల్వేస్టేషన్ నుంచి కొండప్రాంతంలోని పార్కింగ్ ప్రదేశం వరకు రోడ్డుమార్గంలోని దారిపొడవునా వీధి లైట్లు ఏర్పాటు చేస్తారు. పార్కింగ్ ప్రదేశాన్ని సుందరంగా అభివృద్ధి చేయడంతో పాటుగా పచ్చదనంతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతారు. రెండో విభాగంలో బొర్రాగుహలు ముఖద్వారం వద్ద తాత్కాలికంగా షాపింగ్ స్ట్రీట్ ఏర్పాటు చేస్తారు. మూడో విభాగంలో బొర్రా ముఖద్వారం వద్ద పర్యాటకుల సౌకర్యార్థం క్యాష్ లెస్ టికెట్ విధానంలో అమలు చేస్తారు. సందర్శన టికెట్లు ఆన్లైన్, పేటీఎం ద్వారా బుక్ చేసుకునే సౌకర్యం ఉంటుంది. ఇప్పటివరకు బొర్రా గుహల్లో 40 వరకు బెల్జియం లైట్లు ఉండగా, మరో 60 అదనంగా ఏర్పాటు చేయనున్నారు. పర్యాటకశాఖ ఈఈ రమణ మాట్లాడుతూ బొర్రాగుహల అభివృద్ధి పనులకు సంబంధించి, టెండర్ పూర్తి కాగానే పనులు మొదలు పెడతామని చెప్పారు. -
విశాఖ జిల్లాకు ఆయువుపట్టుగా మారిన పర్యాటకం
-
పర్యాటక ప్రాంతాలు కళకళ.. భారీగా ఆదాయం
కరోనా దెబ్బకు కుదేలైన పర్యాటక రంగం అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఇప్పుడు పూర్తిస్థాయిలో పుంజుకుంది. దేశవిదేశాల నుంచి పర్యాటకులు అధిక సంఖ్యలో వస్తున్నారు. అనంతగిరి మండలంలో బొర్రా గుహలు, డముకు వ్యూ పాయింట్, కటికి, తాటిగుడ జలపాతాలు, అరకులోయలో పద్మాపురం గార్డెన్, గిరిజన మ్యూజియం, కాఫీ హౌస్, డుంబ్రిగుడలోని చాపరాయి, పాడేరు మండలంలో వంజంగి హిల్స్‌కు పర్యాటకులు భారీగా తరలివస్తున్నారు. అనంతగిరి/అరకులోయ: కరోనా కారణంగా మన్యంలో మూతపడిన పర్యాటక ప్రాంతాలు పునఃప్రారంభమైన తరువాత మండలంలోని బొర్రా గుహలతో పాటు మిగతా వాటికి సందర్శకులు తాకిడి పెరిగింది. గత రెండేళ్ల కన్నా ఈ ఏడాది గుహలను సందర్శించిన వారి సంఖ్య భారీగా పెరిగింది. పెద్ద ఎత్తున ఆదాయం సమకూరింది. 2020 సంవత్సరంలో సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు 1,80,260 మంది సందర్శించగా రూ.131.35 లక్షల ఆదాయం లభించింది. 2021 సంవత్సరంలో సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు 2,61,000 మంది సందర్శించగా రూ.187 లక్షల ఆదాయం సమకూరింది. 2021 సంవత్సరం కంటే ఈ ఏడాది గుహలను సందర్శించిన వారి సంఖ్య సుమారు 80 వేలు అధికంగా ఉంది. గత ఏడాది జనవరి నుంచి జూలై వరకు 2,22,653 మంది సందర్శించగా రూ.161.21 లక్షల ఆదాయం లభించింది. ఈ ఏడాది జనవరి నుంచి జూలై వరకు సుమారు మూడు లక్షల మంది సందర్శించగా సుమారు రూ.200 లక్షలు ఆదాయం లభించింది. అరకులోయలో... గత ఏడాది అక్టోబర్ నెల నుంచి అరకులోయకు పర్యాటకుల తాకిడి పెరిగింది. పద్మాపురం గార్డెన్, గిరిజన మ్యూజియంతో పాటు చాపరాయి జలపాతం ప్రాంతాలకు పర్యాటకులు అధికంగా తరలివస్తున్నారు. గత 12నెలల్లో అరకులోయ గిరిజన మ్యూజియాన్ని 3 లక్షల మంది, పద్మాపురం గార్డెన్‌ను సుమారు 2.50 లక్షల మంది సందర్శించారు. సుమారు రూ.2 కోట్ల ఆదాయం లభించింది. చాపరాయి జలపాతం, పాడేరు మండలంలోని వంజంగి హిల్స్‌ను పర్యాటకులు అధిక సంఖ్యలో సందర్శిస్తున్నారు. జిల్లాలోని పర్యాటక ప్రాంతాలకు సందర్శకుల సంఖ్య పెరగడంతో టూరిజంశాఖకు చెందిన రిసార్టులు, రెస్టారెంట్ల ఆదాయం భారీగా సమకూరుతోంది. (క్లిక్: వజ్రాల వేట.. అత్యంత ఖరీదైన కోహినూర్ వజ్రం కూడా అక్కడే..) పెరిగిన పర్యాటకులు బొర్రా గుహలను సందర్శించే వారి సంఖ్య పెరిగింది. బొర్రాలోని సదుపాయలు కల్పనకు చర్యలు చేపడుతున్నాం. ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నాం. – బాబుజీ డీవీఎం పర్యాటకశాఖ -
బొర్రా గుహలకు మెట్రో గేటు
అనంతగిరి: ప్రముఖ పర్యాటక కేంద్రం, సహజ సిద్ధంగా ఏర్పడిన బొర్రా గుహలకు సరికొత్తగా సాంకేతిక సొబగులు అద్దుకుంటున్నాయి. ఇక్కడికి దేశ విదేశాలతోపాటు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున పర్యాటకులు తరలివస్తుంటారు. వీరికి ఎటువంటి ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతో పర్యాటక శాఖ అధునాతన సౌకర్యాల కల్పనకు చర్యలు చేపట్టింది. ప్రస్తుతం ఆన్లైన్ ఈ–పోస్ టికెట్ల ద్వారా గుహలు లోపలికి అనుమతిస్తున్నారు. ఈ నేపథ్యంలో పర్యాటకుల రద్దీ పెరిగే కొద్దీ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దాంతో గుహలు ముఖద్వారం వద్ద కొత్తగా మెట్రో గేట్లను ఏర్పాటు చేస్తున్నారు. లోపలకు వెళ్లేందుకు మూడు, బయటకు వచ్చేటప్పుడు మూడు గేట్లు చొప్పున అమర్చేందుకు చర్యలు చేపడుతోంది. ఇందుకోసం రూ. 12 లక్షల వరకు వెచ్చిస్తోంది. తాజాగా టెక్నీషియన్లు వచ్చి ఇన్స్టాలేషన్ చేస్తున్నారు. ప్లాట్‌ఫాం నిర్మించిన వెంటనే మెట్రో గేట్లను ఏర్పాటు చేస్తారు. గుహలను తిలకించేందుకు వెళ్లే పర్యాటకుల్లో పెద్దలకు రూ. 70, చిన్నపిల్లలకు రూ. 50 చెల్లిస్తే మాగ్నెటిక్స్ కాయిన్స్ ఇస్తారు. వీటిని చూపించగానే గేటు తెరుచుకుంటుంది. గుహలను తిలకించి తిరిగి బయటకు వచ్చేందుకు మరోసారి చూపించాలి. త్వరలోనే ఈ సౌకర్యం అందుబాటులోకి రానుంది. దీంతో పర్యాటకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికి పాత టికెట్ల ధరలు అమలులో ఉన్నట్లు పర్యాటక శాఖ సిబ్బంది తెలిపారు. (చదవండి: విశాఖ పోర్టుకు రికార్డు స్థాయిలో క్రూడాయిల్) -
Famous Tourist Places Vizag: వహ్ వైజాగ్! ఒకటా రెండా.. ఎన్నెన్ని అందాలో
సాక్షి, విశాఖపట్నం : ప్రకృతి అందాలతో అలరారే విశాఖ పర్యాటకంగా కూడా గత రెండు దశాబ్ధాలుగా గణనీయంగా అభివృద్ధి చెందింది. ఒకవైపు సాగర సోయగాలు.. మరోవైపు ఎత్తైన తూర్పు కనుమల అందాలు ప్రపంచ పర్యాటకులను కట్టిపడేస్తున్నాయి. కొండ కోనలను చూసినా.. ప్రకృతి ఒడిలో సేదతీరుతున్న మన్యంలో అడుగు పెట్టినా.. అలల సవ్వడితో.. హొయలొలుకుతున్న సాగర తీరంలో అడుగులు వేస్తున్నా.. ఆధ్యాత్మిక శోభతో ఆహ్లాదపరిచే దేవాలయాలు.. ఏ చోటకు వెళ్లినా.. భూతల స్వర్గమంటే ఇదేనేమోనన్న అనుభూతిని అందిస్తుంది. 2004 తరువాత నుంచి పర్యాటకంగా విశాఖ రూపురేఖలు మారిపోయాయి. ప్రపంచ పర్యాటకులను ఆకర్షించే విధంగా నగరంలోనే కాకుండా గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో కూడా సరికొత్త పర్యాటక ప్రాజెక్టులు అందుబాటులోకి వచ్చాయి. జిల్లాలో ముఖ్యమైన పర్యాటక ప్రాంతాలు ఎక్కడ ఉన్నాయో జాతీయ పర్యాటక దినోత్సవం సందర్భంగా ఓసారి చూసొద్దాం రండి... మదిదోచే కైలాసగిరి ఆర్కే బీచ్ నుంచి 5 కిలోమీటర్ల దూరంలో కైలాసగిరి ఉంది. పచ్చని పార్కులు, ఆహ్లాద వాతావరణం, బీచ్ వ్యూ ఇక్కడ మంచి అనుభూతినిస్తాయి. కొండ కింద నుంచి రోప్ వే, రోడ్డు, మెట్ల మార్గాల ద్వారా పైకి చేరుకోవచ్చు. విశాఖ వచ్చే ప్రతి పది మంది పర్యాటకుల్లో 8 మంది కైలాసగిరి వెళ్తుంటారు. చదవండి: Lambasingi: లంబసింగికి చలో చలో భీమిలి.. అందాల లోగిలి.. ఆర్కే బీచ్ రోడ్డు నుంచి 30 కిలోమీటర్ల దూరంలో భీమిలి ఉంది. తూర్పు తీరంలో పురాతన ఓడ రేవుల్లో ఒకటిగా పిలుస్తారు. గోస్తనీనది ఇక్కడ సముద్రంలో కలుస్తుంది. డచ్ పాలకుల సమాధులు, లైట్ హౌస్‌లు, బౌద్ధ మత ఆనవాళ్లు ఇక్కడ అనేకం. దీని ముందున్న రుషికొండ బీచ్ కూడా అద్భుతంగా ఉంటుంది. ఈ బీచ్‌కు బ్లూ ఫ్లాగ్ గుర్తింపు రావడం విశేషం. జలజల జలపాతాలు.. విశాఖ మన్యంలోకి వెళ్తే.. అడుగడుగునా జలపాతాలు హొయలుపోతూ కనిపిస్తుంటాయి. కటిక, చాపరాయి, సరయు, డుడుమ, కొత్తపల్లి, సీలేరు ఐసుగెడ్డ, పిట్టలబొర్ర, బొంగుదారి జలపాతాలతో పాటు చిన్న చిన్న జలపాతాలు పర్యాటకులకు సరికొత్త అనుభూతిని అందిస్తున్నాయి. ఆంధ్రా ఊటీ.. అరకు.. విశాఖ మన్యం పేరు చెబితే.. పర్యాటకులు పులకరించిపోతారు. సముద్ర మట్టానికి 910 మీటర్ల ఎత్తులో ఉన్న అరకు వ్యాలీని సందర్శించేందుకు పర్యాటకులు ఉవ్విళ్లూరుతుంటారు. ఇది జలపాతాలు, క్రిస్టల్ క్లియర్ స్ట్రీమ్స్ , పచ్చని తోటలతో కళకళలాడుతుంటుంది. మంచు మేఘాల వంజంగి మేఘాలలో తేలిపొమ్మన్నది అంటూ టూరిస్టులు ఎంజాయ్ చేసే ప్రాంతం వంజంగి. పాడేరు మండలంలో ఉన్న వంజంగి కొండపైకి ఎక్కితే మేఘాలను తాకుతున్నట్లు అనుభూతిని పొందొచ్చు. బుద్ధం.. శరణం.. గచ్ఛామి... ఆర్కే బీచ్ నుంచి 16 కిలోమీటర్ల దూరంలో ప్రాచీన బౌద్ధ క్షేత్రాలు తొట్లకొండ, బావికొండ ఉన్నాయి. తొట్లకొండ తదితర ప్రాంతాలు నిత్యం పర్యాటకులను అలరిస్తున్నాయి. జంతు ప్రపంచం పిలుస్తోంది... ఆర్కే బీచ్ నుంచి 9 కిలోమీటర్ల దూరంలో జూపార్క్ ఉంది. ఎన్నో అరుదైన జంతువులు, వన్యప్రాణులు ఇక్కడ మనకు కనిపిస్తాయి. జూ ఎదురుగా ఉండే కంబాలకొండలో వన్యప్రాణులతో పాటు సాహస క్రీడలు, బోటింగ్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. భలే మంచు ఊరు డిసెంబర్..జనవరి మాసాల్లో వాతావరణం సుమారుగా 0 డిగ్రీలకు పడిపోతూ.. ఆంధ్రా కాశ్మీరంగా పేరొందిన లంబసింగికి చలికాలంలో పర్యాటకులు క్యూ కడతారు. సముద్ర మట్టానికి ఈ ప్రాంతం 3600 మీటర్ల ఎత్తులో ఉంది. విశాఖ నగరానికి 101 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఉదయం 10 గంటలైనా మంచు వీడకుండా శీతల గాలులు వీస్తు పర్యాటకులకు ఎంతో ఆహ్లాదకరంగా కనిపిస్తుంది. వీఎంఆర్డీఏ పార్క్ ఆర్కే బీచ్ వ్యూను చూస్తూ పర్యాటకులు కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి పిక్నిక్లు జరుపుకునేందుకు, ఆహ్లాదాన్ని పొందేందుకు అనువైన ప్రదేశం. ఇటీవలే రూ.35 కోట్లతో పార్క్‌ను అత్యాధునికంగా అభివృద్ధి చేశారు. అటు కురుసుర.. ఇటు టీయూ 142 ఆర్కే బీచ్‌లో విహరించి కాస్తా ముందుకు వెళ్తే.. పర్యాటకులను ఆకట్టుకునే కురుసుర సబ్ మెరైన్ మ్యూజియం ఉంటుంది. దాని ఎదురుగానే టీయూ– 142 యుద్ధ విమాన మ్యూజియం. ఇప్పుడు వీటి సరసన... సీ హారియర్ మ్యూజియం సిద్ధమవుతోంది. ఇంకాస్త ముందకెళితే విక్టరీఎట్ సీ దర్శనమిస్తుంది. పురాతన బొర్రా గుహలు.. మీరు చరిత్ర ప్రేమికులైతే, బొర్రా గుహలు ఉత్తమ పర్యాటక ఆకర్షణలలో ఒకటిగా నిలుస్తాయి. అరకులోయలోని అనంతగిరి కొండల మధ్య ఉన్న ఈ గుహలు వేల సంవత్సరాల పురాతనమైనవే కాదు.. దేశంలో కనిపించే అన్ని గుహలలో అతిపెద్దవి. పూర్తిగా సహజ సున్నపురాయితో తయారైన ఈ గుహలు ప్రకృతిలో కాలిడోస్కోపిక్, జలపాతాలతో పాటు రాళ్లపై పడే కాంతి చాలా రంగురంగులుగా దర్శనమిస్తుంటాయి. ప్రతి ఏడాది సుమారు 3 లక్షల మంది పర్యాటకులు ఈ గుహలను సందర్శిస్తుంటారు. చరిత్ర చెప్పే మ్యూజియం వీటన్నింటినీ సందర్శించి.. ఇంకొంచెం ముందుకెళ్తే.. విశాఖ మ్యూజియం కనిపిస్తుంది. దాని ఎదురుగానే.. భారత నౌకాదళానికి చెందిన మొట్టమొదటి సబ్‌మెరైన్ కల్వరి çహాల్ కనిపిస్తుంది. విశాఖ మ్యూజియంలో భారత దేశ చరిత్రకు సంబంధించిన ఆనవాళ్లు ప్రదర్శిస్తుంటారు. అల ఆర్కే బీచ్‌లో.. వైజాగ్ వచ్చే ప్రతి ఒక్కరూ బీచ్‌కు వెళ్లి తీరాల్సిందే. అందుకే వీకెండ్స్ అయితే ఇసకేస్తే రాలనంత జనం బీచ్‌లో వాలిపోతారు. షాపింగ్ మొదలుకొని స్టే, డిన్నర్ వరకూ సకల సౌకర్యాలు పర్యాటకులకు ఇక్కడ లభిస్తాయి. -
అరకు అందాల రైలు.. మళ్లీ వచ్చింది!
ఎత్తైన కొండకోనలు దాటుకుంటూ ప్రకృతి అందాల నడుమ సాగే కేకేలైన్ రైలు ప్రయాణం అంటే దేశవ్యాప్తంగా పర్యాటకులు మొగ్గు చూపుతుంటారు. కొండకోనల మధ్యలో నిర్మించిన రైల్వేమార్గంలోని ప్రయాణం వింత అనుభూతి కలిగిస్తుంది. గుహలు, జలపాతాలను ఆనుకుని రైలుప్రయాణం ఆహ్లాదంగా సాగుతుంది. కోవిడ్ నేపథ్యంలో తొమ్మిది నెలల సుదీర్ఘ విరామానంతరం శుక్రవారం కేకేలైన్‌లో ప్రత్యేక రైలు కూత పెడుతూ రావడంతో పర్యాటకులు ఆనందానికి అవధి లేకుండా పోయింది. మొదటిరోజు పర్యాటకులు భారీ సంఖ్యలోనే బొర్రా రైల్వేస్టేషన్లో దిగారు. అనంతగిరి/అరకులోయ రూరల్: కొత్తవలస–కిరండూల్ (కేకే లైన్) ప్రత్యేక రైలు రాకతో బొర్రా, అరకు రైల్వే స్టేషన్ మొదటిరోజు కళకళలాడాయి. కరోనా నేపథ్యంలో పర్యాటక ప్రాంతాలు మూసివేయడంతో పాసింజర్ రైలును కూడా రద్దు చేశారు. గత రెండు నెలల క్రితం కోవిడ్ నిబంధనలను పాటిస్తూ తగు జాగ్రత్తలు నేపథ్యంలోని పలు పర్యాటక ప్రాంతాలు తెరుచుకున్నాయి. పర్యాటక ప్రాంతాలు తెరచుకున్నప్పటికీ కేకేలైన్‌లోని ప్రత్యేక రైలు మాత్రం అందుబాటులోకి రాలేదు. దీంతో పర్యాటకులు రోడ్డు మార్గంలో ప్రయాణించి పర్యాటక ప్రాంతాలైన బొర్రా, అరకు అందాలను తిలకిస్తున్నారు. పర్యాటకులు, ప్రయాణికులను దృష్టిలో పెట్టుకుని రైల్వేశాఖ శుక్రవారం నుంచి కేకేలైన్‌లో పాసింజర్ రైలు నడపడం ప్రారంభించింది. ప్రత్యేక రైలులో మొదటిరోజు పర్యాటకులు భారీ సంఖ్యలోని తరలివచ్చారు. పర్యాటకులతో బొర్రా రైల్వేస్టేషన్ కిటకిటలాడింది. అరకు 11 గంటలకు చేరుకుంది. మొదటిరోజు స్లీపర్‌కోచ్ సదుపాయం కల్పించారు. కరోనా నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు మాస్క్ లు ధరించి ప్రయాణం సాగించాలని రెవెన్యూ శాఖ అధికారులు పేర్కొన్నారు. చాలానెలల తరువాత రైలు రావడంతో స్థానిక ట్యాక్సీ, ఆటో డ్రైవర్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నేటి నుంచి విస్టాడోమ్ కోచ్ తాటిచెట్లపాలెం (విశాఖ ఉత్తర): అరకు రైలుకు విస్టాడోమ్ కోచ్ శనివారం నుంచి అందుబాటులోకి వస్తుంది. ఆంధ్రా ఊటీ అరకు అందాలను చూపించే అద్దాల కోచ్ (విస్టాడోమ్)లో ప్రయాణించాలనుకునే ప్రయాణికులు ఈ కోచ్‌కు రిజర్వేషన్ చేసుకోవాలి. ప్రస్తుతం నడుస్తున్న విశాఖపట్నం–కిరండూల్– విశాఖపట్నం స్పెషల్ రైలు నెంబరుతో కాకుండా ఈ కోచ్‌కు మాత్రం విశాఖపట్నం నుంచి అరకు వెళ్లే వారు 08504, అరకు నుంచి విశాఖపట్నం వచ్చేవారు 08503 నెంబరుతో రిజర్వేషన్ చేసుకోవాలని రైల్వే అధికారులు తెలిపారు. రిజర్వేషన్ బుకింగ్‌లో కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఈ మార్పు చేసినట్లు తెలిపారు. ఓ మంచి అనుభూతినిచ్చింది కేకేలైన్ ప్రయాణం చేయాలని చాలా రోజులు నుంచి ఎదురుచూస్తున్నాం. రైలు ప్రయాణంలో ఎతైన కొండల నడుమ సాగుతున్న ప్రయాణం ఓ మంచి అనుభూతి ఇస్తుందని, పలువురు చెబితే విన్నాం. ఈ రోజు కళ్లారా చూశాం. చాల సంతోషంగా అనిపించింది. కుటుంబంతో బొర్రాగుహలు, కటికి, తదితర పర్యాటక ప్రాంతాలను చూసేందుకు విశాఖపట్నం నుంచి కిరండూల్ రైలులో బొర్రాగుహలకు చేరుకున్నాం. – కిరణ్, శ్రీదేవి పర్యాటకురాలు టెక్కలి ప్రయాణం అద్భుతం అరకులోయ అందాలను తిలకించేందుకు చాల రోజులుగా రావాలని కోరిక ఉండేది. కేకేలైన్‌లోని శుక్రవారం నుంచి రైలు అందుబాటులోకి వస్తోందని తెలిసి సంతోషం అని్పంచింది. ప్రయాణం చేస్తున్నంతసేపు కొత్త అనుభూతి పొందాను. గుహల లోపల నుంచి రైలు ప్రయాణం చేస్తున్నప్పుడు సరదా అనిపించింది. ఈ ప్రయాణం నాకు ఓ ప్రత్యేకం. – బెంగళూర్‌కు చెందిన పర్యాటకుడు స్నేహితులందరం కలిసి వచ్చాం కేకేలైన్‌లోని రైలు ప్రయాణం అందుబాటులోకి వస్తుందని తెలిసి స్నేహితులందరం కలిసి గురువారం విశాఖపట్నం చేరుకుని శుక్రవారం ఉదయం విశాఖపట్నం నుంచి బొర్రాగుహలకు చేరుకున్నాం. కొండకోనలు లోయల మధ్యలోని ప్రయాణం చాల ఆనందంగా ఉంది. చాలా సరదగా గడిపాం. రైలు ప్రయాణానికి పర్యాటకులు అసక్తి ఎందుకు చూపిస్తారో అర్థం అయింది. – శివ, అశోక్ హైదరాబాద్ -
బొర్రా టిక్కెట్ల ధరల్లో స్వల్ప మార్పు
అనంతగిరి(అరకులోయ): మండలంలోని ప్రముఖ పర్యాటక కేంద్రం బొర్రాగుహలకు ప్రవేశాల టికెట్ ధరల్లో పర్యాటక శాఖ స్వల్ప మార్పులు చేసింది. ప్రస్తుతం అమలవుతున్న ధరల కాస్త మార్చుతూ బుధవారం నుంచి నూతన ధరలను అందుబాటులోకి తేనుంది. ప్రసుత్తం పెద్దలకు రూ.60, చిన్న పిల్లలకు రూ.45, వీడియో కెమెరాకు రూ.100, సెల్‌ఫోన్‌కు రూ.25 టిక్కెట్ ధర ఉండేది. వీటిని మారుస్తూ పెద్దలకు రూ.70, పిల్లలకు రూ. 50 చేశారు. వీడియె కెమెరాకు గతంలో ఉన్న రూ.100 నే ఉంచగా, సెల్‌ఫోన్‌కు టికెట్ ధర రద్దుచేస్తూ పర్యాటకశాఖ నిర్ణయం తీసుకుంది. ఈ నూతన ధరలు 23 నుంచి అమలవుతున్నట్లు అధికారులు తెలిపారు. -
ఆంధ్రా ఊటీకి పర్యాటకుల తాకిడి
అరకులోయ: ఆంధ్రా ఊటీగా గుర్తింపు పొందిన అరకులోయ ప్రాంతానికి ఆదివారం పర్యాటకులు తాకిడి పెరిగింది. గతంలో కన్న పర్యాటకుల సంఖ్య తగ్గినప్పటికీ మధ్యాహ్నం నుంచి పద్మాపురం గార్డెన్, గిరిజన మ్యూజియం,ఘాట్‌లో గాలికొండ వ్యూపాయింట్, సుంకరమెట్ట కాఫీ తోటల ప్రాంతాలలో పర్యాటకులు సందడి చేశారు. వాతావరణం చల్లగా ఉండడంతో పర్యాటకులు అరకు అందాలను చూసి పరవశించారు. చాపరాయి జలపాతంలో నీటి నిల్వలు తగ్గడంతో పర్యాటకులు నిరుత్సాహపడ్డారు, కొద్దిపాటి జల ప్రవాహంలో స్నానాలు చేశారు. బొర్రాగుహలలో.. అనంతగిరి (అరకులోయ): ప్రముఖ పర్యాటక కేంద్రమైన బొర్రాగుహలకు పర్యాటకుల తాకిడి పెద్దగా లేదు. ³ర్యాటక కేంద్రాలు అయిన తాటిగుడ, కటికి జలపాతాలు, కాఫీ ప్లాంటేషన్, డముకు వ్యూ–పాయింట్ వద్ద ఆదివారం ఇదే పరిస్ధితి. దీంతో ఆదివారం సుమారు 1900 మంది పర్యాటకులు మాత్రమే బొర్రాగుహలను తిలకించారని, రూ. 1.30 లక్షల మేర ఆదాయం వచ్చినట్లు పర్యాటక శాఖ అధికారులు తెలిపారు. -
పోటెత్తిన పర్యాటకులు!
సాక్షి, విశాఖపట్నం: ప్రకృతి రమణీయత, సహజ సౌందర్యం సొంతమైన విశాఖకు పర్యాటకులు పోటెత్తారు. పచ్చదనం, లోయలు, కొండకోనలతో అలరారే మన్యం.. నగర అంచున ఉన్న సుందర సాగరతీరం అందాలను వీక్షించడానికి అసక్తి చూపారు. మునుపటి ఏడాది కన్నా అధికంగా పర్యాటకులు విశాఖను సందర్శించారు. 2017లో 2.12 కోట్ల మంది దేశీ పర్యాటకులు, 92 వేల మంది విదేశీ పర్యాటకులు విశాఖను సందర్శించారు. 2018లో దేశీ పర్యాటకుల సంఖ్య 2.37 కోట్లకు, విదేశీ పర్యాటకుల సంఖ్య 95 వేలకు పైగా చేరింది. అంటే 2017 కంటే 2018లో 12 శాతం మంది టూరిస్టులు అధికంగా విశాఖ వచ్చారన్నమాట! ఏటా సెప్టెంబర్ నుంచి జనవరి వరకు పర్యాటకుల సీజనుగా పరిగణిస్తారు. అలాగే వేసవి సీజను మే నెలలోనూ వీరి తాకిడి అధికంగా ఉంటుంది. 2017 మే నెలలో 18,08,126 మంది రాగా, 2018 మేలో దాదాపు 8 లక్షలు అధికంగా అంటే.. 26,09,703 మంది పర్యాటకులు సందర్శించారు. ఇక దసరా సీజనులోనూ బెంగాల్, ఒడిశా రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో విశాఖ వస్తుంటారు. 2017 నవంబర్‌లో 21,55,168 మంది రాగా 2018 నవంబర్‌లో 23,40,319 మంది టూరిస్టులు వచ్చారు. ఏటా డిసెంబర్లో నిర్వహించే విశాఖ ఉత్సవ్‌కు కూడా టూరిస్టులు పోటెత్తుతుంటారు. 2017 డిసెంబర్లో 28,99,113 మంది విశాఖకు రాగా, 2018లో 12 లక్షల మంది అధికంగా 40,03,164 మంది సందర్శించారు. అయితే ఈ ఏడాది సెప్టెంబర్‌లో అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను మావోయిస్టులు కాల్చి చంపిన నేపథ్యంలో ఆ నెలలో మన్యానికి వచ్చే పర్యాటకులు ఒకింత తగ్గారు. 2017 సెప్టెంబర్‌లో 17,78,761 మంది రాగా 2018 సెప్టెంబర్‌లో 17,16,781 మందికి తగ్గారు. ఏజెన్సీలో పోలీసు బలగాలు మోహరించడంతో పర్యాటకులు అటువైపు వెళ్లడానికి వెనకడుగు వేయడంతో మునుపటి ఏడాదితో పోల్చుకుంటే దాదాపు 62 వేల మంది తక్కువగా విశాఖను సందర్శించారు. అక్టోబర్‌లో తిత్లీ తుపాను ప్రభావంతో ఆశించిన స్థాయిలో టూరిస్టులు రాలేదు. 2017లో ఆ నెలలో 17,06,568 మంది రాగా, 2018లో 18,06,043 మంది వచ్చారు. అయితే నవంబర్‌కల్లా ఏజెన్సీ ప్రాంతంలో పరిస్థితిలో మార్పు రావడంతో మళ్లీ పర్యాటకుల సంఖ్య పుంజుకుంది. 2017 నవంబర్ కంటే 2018 నవంబర్‌లో దాదాపు 2 లక్షల మంది అధికంగా సందర్శకులు విశాఖలో పర్యటించారు. స్వల్పంగా పెరిగిన విదేశీ పర్యాటకులు మరోవైపు విశాఖను సందర్శించిన విదేశీ పర్యాటకుల సంఖ్య స్వల్పంగానే పెరిగింది. 2017లో 92,958 మంది విశాఖలో పర్యటించగా 2018లో 95,759 మంది విదేశీయులు సందర్శించారు. స్వదేశీ పర్యాటకుల పెరుగుదల 12 శాతం ఉండగా విదేశీ పర్యాటకుల వృద్ధి మూడు శాతం మాత్రమే ఉంది. 2018లో విశాఖ ఏజెన్సీలో మావోయిస్టుల దుశ్చర్య, తిత్లీ తుపాను ప్రభావం వల్ల విశాఖ వచ్చే పర్యాటకుల సంఖ్య తగ్గిందని, లేనిపక్షంతో మునుపటి ఏడాదితో పోల్చుకుంటే 15 శాతానికి పైగా పర్యాటకుల పెరుగుదల ఉండేదని పర్యాటకశాఖ అధికారులు ‘సాక్షి’తో చెప్పారు. -
‘బొర్రా’లో నిఫా అలెర్ట్
సాక్షి, విశాఖపట్నం: బొర్రాగుహలు పర్యాటకుల గుండెల్లో టెర్రర్ పుట్టిస్తున్నాయి. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఈ బొర్రా గుహల్లో వేల సంఖ్యలో గబ్బిలాలు ఆవాసాలు ఏర్పరుచుకున్నాయి. దక్షిణాది రాష్ట్రాలను వణికిస్తున్న ప్రాణాంతక నిపా వైరస్‌కు గబ్బిలాలే కారణమని శాస్త్రవేత్తలు తేల్చిన నేపథ్యంలో ఇప్పుడు బొర్రాగుహల సందర్శనపై పర్యాటకుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. బొర్రా గుహలకు రోజుకు సగటున నాలుగు వేల మంది పర్యాటకులు వస్తుంటారు. శని, ఆదివారాల్లో అయితే ఆరు వేల మంది వరకు సందర్శిస్తుంటారు. బొర్రా గుహలకు దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచే కాదు... విదేశీయుల తాకిడి కూడా అధికంగా ఉంటుంది. బొర్రా గుహలను సందర్శించే వారిలో కేరళ వాసులు కూడా ఉన్నారు. నిపా వైరస్‌తో కేరళ రాష్ట్రంలో ఇప్పటికే 12 మందికి పైగా మృత్యువాత పడ్డారు. మరెందరో ఈ వ్యాధికి గురై ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటిదాకా ఈ వైరస్‌కు మందు కనిపెట్టలేదు. బొర్రా గుహల్లో వేలాది గబ్బిలాలు ఒక్కసారి ఈ వైరస్ సోకినట్టయితే ఆ వ్యక్తికి మరణం ఖాయమని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇంతటి ప్రమాదకర వైరస్‌కు గబ్బిలాలే మూలమని స్పష్టం కావడంతో అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు ఎంతో అప్రమత్తంగా ఉంటున్నాయి. మన రాష్ట్రంలోని అన్ని జిల్లాల యంత్రాంగాలు దీనిపై అలెర్టయ్యాయి. ఈ గబ్బిలాలు గుహలు, మర్రిచెట్లు, రావిచెట్లు, చీకటి ప్రాంతాల్లో జనానికి దూరంగా నివసిస్తాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు అందరి కళ్లూ బొర్రా గుహలపైనే పడ్డాయి. ఎంతో విశాలంగా ఉండే బొర్రా గుహల్లో వేలకొద్దీ గబ్బిలాలు వేలాడుతూ ఉంటాయి. పగటి పూట వీటికి కళ్లు కనిపించవు. అందువల్ల రాత్రి వేళ బయటకు వెళ్లి పండ్లను తింటూ పగటి పూట ఈ గుహల్లో సేదతీరుతాయి. పర్యాటకులు బొర్రా గుహల్లోకి వెళ్లినప్పుడు ఇవి స్పష్టంగా కనిపిస్తుంటాయి. వేల సంఖ్యలో ఉండడం వల్ల ఈ గుహల్లో ఎప్పుడూ గబ్బిలాల విసర్జితాలతో ఒకింత దుర్వాసన కూడా వస్తుంది. అయినప్పటికీ గుహల అందాలను ఆస్వాదించడానికి పర్యాటకులు పోటెత్తుతుంటారు. గుహల ప్రవేశ ప్రాంతంకంటే లోపల మరింతగా చిమ్మచీకటి అలముకుంటుంది. దీంతో గబ్బిలాల ఆవాసానికి ఈ బొర్రాగుహలు ఎంతో అనువుగా ఉంటాయి. పర్యాటకుల్లో అలజడి గబ్బిలాల ద్వారా నిపా వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున ఇప్పుడు బొర్రా గుహల సందర్శనకు వెళ్లే పర్యాటకుల్లో అలజడి రేగుతోంది. గబ్బిలాల జాడ అంతగా లేని ప్రదేశాల్లోనే నిపా వైరస్‌పై యంత్రాంగం అప్రమత్తం చేసింది. అలాంటిది వేల సంఖ్యలో గబ్బిలాలుండే బొర్రాగుహల్లోకి వేలాదిగా పర్యాటకులు వెళ్తుండడమే వీరిలో ఆందోళనకు కారణమవుతోంది. గబ్బిలాలు అరటి, మామిడి, నేరేడు, జామ తదితర పండ్లను తింటాయి. తాటి, ఈత, జీలుగు కల్లును కూడా తాగుతాయి. నిపా వైరస్ కలిగిన గబ్బిలాలు తిన్న పండ్లను, తాగిన కల్లును ఇతరులు తింటే వారికీ ఈ వైరస్ సోకుతుంది. ఈ నేపథ్యంలో బొర్రాగుహల ప్రాంతంలో పక్షులు కొరికిన/గాట్లున్న పండ్లను విక్రయించవద్దని, తినవద్దని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఇప్పటికే స్థానికులకు సూచించారు. అప్రమత్తంగా ఉన్నాం నిపా వైరస్ నేపథ్యంలో బొర్రా గుహల వద్ద వైద్య ఆరోగ్య సిబ్బందిని, ఆశ వర్కర్లను అప్రమత్తం చేశాం. జలుబు, దగ్గు, తలనొప్పి వంటి లక్షణాలున్న వారిని తక్షణమే కేజీహెచ్‌కు తరలించాలని సూచించాం. పక్షులు కొరికిన పండ్లను తినవద్దని, బయట దొరికే పండ్లను నీటితో కడిగి తినాలని పర్యాటకులకు అనంతగిరి మండల వైద్య, ఆరోగ్య సిబ్బందితో చెప్పిస్తున్నాం.– రోణంకి రమేష్, డీఎంహెచ్‌వో మాస్క్‌లు అందజేస్తాం నిపా వైరస్ నేపథ్యంలో బొర్రా గుహలకు వచ్చే పర్యాటకులకు టిక్కెట్‌తో పాటు మాస్క్‌లను అందజేయాలని యోచిస్తున్నాం. నిపా వైరస్‌పై మా శాఖ ఉన్నతాధికారులు సమావేశం నిర్వహించారు. పర్యాటకులకు ఇబ్బంది కలగకుండా అన్ని చర్యలూ తీసుకోవాలని డివిజినల్ మేనేజర్ ప్రసాదరెడ్డి ఆదేశించారు. గుహలు లోపల వేల సంఖ్యలో ఉన్న గబ్బిలాలకు ఇబ్బంది కలగకుండా చూస్తున్నాం. అదే సమయంలో పర్యాటకుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని రోజూ బ్లీచింగ్ చల్లిస్తున్నాం. గబ్బిలాల విసర్జాలను ఎప్పటికప్పుడే క్లీన్ చేయిస్తున్నాం. గుహల్లో విధులు నిర్వహించే సిబ్బందికి ప్రత్యేక మాస్కులు, గ్లౌజులు అందజేస్తున్నాం. – గౌరీశంకర్, మేనేజర్, బొర్రా గుహలు -
బొంగు బిరియానీ భలే టేస్ట్ గురూ!
అనంతగిరి: మండలంలోని ప్రముఖ పర్యాటక కేంద్రామైన బొర్రా వద్ద బొంగు చికెను అందరికి తెలుసు. బొంగు బిరియాని కూడా ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. బొర్రా వద్ద హోటళ్ల నిర్వాహకులు బొంగు బిరియానితో పర్యాటకులను ఆకట్టుకుంటున్నారు. బొర్రా గుహలకు వెళ్లే పర్యాటకుల నుంచి ముందుకు ఆర్డర్ తీసుకుని వారు తిరిగి వచ్చే సమయానికి సిద్ధం చేస్తున్నారు. అరకిలో బొంగు బిర్యానీని రూ.250 నుంచి రూ.300కు విక్రయిస్తున్నట్టు హోటల్ యజమాని దారు తెలిపాడు. -
ఏపీ నుంచి ‘బొర్రా గుహలు’
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధానిలో గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రదర్శించే శకటాల్లో ఏపీ నుంచి ప్రతిపాదించిన పలు శకటాల్లో బొర్రా గుహల నేపథ్య శకటాన్ని కేంద్రం ప్రాథమికంగా ఎంపిక చేసింది. శకటాల ఎంపికకు కేంద్ర రక్షణ శాఖ శుక్రవారం తొలి సమావేశాన్ని నిర్వహించింది. ఏపీ నుంచి కూచిపూడి, బౌద్ధం, చింతల వెంకట రమణ స్వామి ఆర్కిటెక్చర్, కొండపల్లి బొమ్మలు, బొర్రా గుహలు, సాంప్రదాయ గిరిజన నృత్యం తదితర నేపథ్య శకటాలను ప్రతిపాదించగా నిపుణుల కమిటీ బొర్రా గుహల నేపథ్య శకటానికి ప్రాథమిక జాబితాలో చోటు కల్పించింది. మలి విడత ఎంపిక ప్రక్రియలో ఈ శకటం ఎంపికపై తుది నిర్ణయం తీసుకుంటారు. -
లోయలోకి దూసుకెళ్లిన బస్సు: ఒకరు మృతి
విశాఖ జిల్లాలోని బొర్రా గృహల వద్ద ఓ ప్రవేట్ బస్సు ఆదివారం ఉదయం లోయలోకి దూసుకెళ్లింది. ఆ ఘటనలో ఓ ప్రయాణికుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఏడుగురు గాయపడ్డారు. దాంతో స్థానికులు వెంటనే స్పందించి 108కి సమాచారం అందించారు. దీంతో క్షతగాత్రులను ఆ వాహనంలో పాడేరులోని ఆసుపత్రికి తరించారు. అయితే వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు.