ఎత్తైన కొండకోనలు దాటుకుంటూ ప్రకృతి అందాల నడుమ సాగే కేకేలైన్ రైలు ప్రయాణం అంటే దేశవ్యాప్తంగా పర్యాటకులు మొగ్గు చూపుతుంటారు. కొండకోనల మధ్యలో నిర్మించిన రైల్వేమార్గంలోని ప్రయాణం వింత అనుభూతి కలిగిస్తుంది. గుహలు, జలపాతాలను ఆనుకుని రైలుప్రయాణం ఆహ్లాదంగా సాగుతుంది. కోవిడ్ నేపథ్యంలో తొమ్మిది నెలల సుదీర్ఘ విరామానంతరం శుక్రవారం కేకేలైన్‌లో ప్రత్యేక రైలు కూత పెడుతూ రావడంతో పర్యాటకులు ఆనందానికి అవధి లేకుండా పోయింది. మొదటిరోజు పర్యాటకులు భారీ సంఖ్యలోనే బొర్రా రైల్వేస్టేషన్‌లో దిగారు.
అనంతగిరి/అరకులోయ రూరల్: కొత్తవలస–కిరండూల్ (కేకే లైన్) ప్రత్యేక రైలు రాకతో బొర్రా, అరకు రైల్వే స్టేషన్ మొదటిరోజు కళకళలాడాయి. కరోనా నేపథ్యంలో పర్యాటక ప్రాంతాలు మూసివేయడంతో పాసింజర్ రైలును కూడా రద్దు చేశారు. గత రెండు నెలల క్రితం కోవిడ్ నిబంధనలను పాటిస్తూ తగు జాగ్రత్తలు నేపథ్యంలోని పలు పర్యాటక ప్రాంతాలు తెరుచుకున్నాయి. పర్యాటక ప్రాంతాలు తెరచుకున్నప్పటికీ కేకేలైన్‌లోని ప్రత్యేక రైలు మాత్రం అందుబాటులోకి రాలేదు. దీంతో పర్యాటకులు రోడ్డు మార్గంలో ప్రయాణించి పర్యాటక ప్రాంతాలైన బొర్రా, అరకు అందాలను తిలకిస్తున్నారు. పర్యాటకులు, ప్రయాణికులను దృష్టిలో పెట్టుకుని రైల్వేశాఖ శుక్రవారం నుంచి కేకేలైన్‌లో పాసింజర్ రైలు నడపడం ప్రారంభించింది. ప్రత్యేక రైలులో మొదటిరోజు పర్యాటకులు భారీ సంఖ్యలోని తరలివచ్చారు. పర్యాటకులతో బొర్రా రైల్వేస్టేషన్ కిటకిటలాడింది. అరకు 11 గంటలకు చేరుకుంది. మొదటిరోజు స్లీపర్‌కోచ్ సదుపాయం కల్పించారు. కరోనా నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు మాస్క్ లు ధరించి ప్రయాణం సాగించాలని రెవెన్యూ శాఖ అధికారులు పేర్కొన్నారు. చాలానెలల తరువాత రైలు రావడంతో స్థానిక ట్యాక్సీ, ఆటో డ్రైవర్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
నేటి నుంచి విస్టాడోమ్ కోచ్
తాటిచెట్లపాలెం (విశాఖ ఉత్తర): అరకు రైలుకు విస్టాడోమ్ కోచ్ శనివారం నుంచి అందుబాటులోకి వస్తుంది. ఆంధ్రా ఊటీ అరకు అందాలను చూపించే అద్దాల కోచ్ (విస్టాడోమ్)లో ప్రయాణించాలనుకునే ప్రయాణికులు ఈ కోచ్‌కు రిజర్వేషన్ చేసుకోవాలి. ప్రస్తుతం నడుస్తున్న విశాఖపట్నం–కిరండూల్– విశాఖపట్నం స్పెషల్ రైలు నెంబరుతో కాకుండా ఈ కోచ్‌కు మాత్రం విశాఖపట్నం నుంచి అరకు వెళ్లే వారు 08504, అరకు నుంచి విశాఖపట్నం వచ్చేవారు 08503 నెంబరుతో రిజర్వేషన్ చేసుకోవాలని రైల్వే అధికారులు తెలిపారు. రిజర్వేషన్ బుకింగ్‌లో కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఈ మార్పు చేసినట్లు తెలిపారు.
ఓ మంచి అనుభూతినిచ్చింది
కేకేలైన్ ప్రయాణం చేయాలని చాలా రోజులు నుంచి ఎదురుచూస్తున్నాం. రైలు ప్రయాణంలో ఎతైన కొండల నడుమ సాగుతున్న ప్రయాణం ఓ మంచి అనుభూతి ఇస్తుందని, పలువురు చెబితే విన్నాం. ఈ రోజు కళ్లారా చూశాం. చాల సంతోషంగా అనిపించింది. కుటుంబంతో బొర్రాగుహలు, కటికి, తదితర పర్యాటక ప్రాంతాలను చూసేందుకు విశాఖపట్నం నుంచి కిరండూల్ రైలులో బొర్రాగుహలకు చేరుకున్నాం.
– కిరణ్, శ్రీదేవి పర్యాటకురాలు టెక్కలి
ప్రయాణం అద్భుతం
అరకులోయ అందాలను తిలకించేందుకు చాల రోజులుగా రావాలని కోరిక ఉండేది. కేకేలైన్‌లోని శుక్రవారం నుంచి రైలు అందుబాటులోకి వస్తోందని తెలిసి సంతోషం అని్పంచింది. ప్రయాణం చేస్తున్నంతసేపు కొత్త అనుభూతి పొందాను. గుహల లోపల నుంచి రైలు ప్రయాణం చేస్తున్నప్పుడు సరదా అనిపించింది. ఈ ప్రయాణం నాకు ఓ ప్రత్యేకం.
– బెంగళూర్‌కు చెందిన పర్యాటకుడు
స్నేహితులందరం కలిసి వచ్చాం
కేకేలైన్‌లోని రైలు ప్రయాణం అందుబాటులోకి వస్తుందని తెలిసి స్నేహితులందరం కలిసి గురువారం విశాఖపట్నం చేరుకుని శుక్రవారం ఉదయం విశాఖపట్నం నుంచి బొర్రాగుహలకు చేరుకున్నాం. కొండకోనలు లోయల మధ్యలోని ప్రయాణం చాల ఆనందంగా ఉంది. చాలా సరదగా గడిపాం. రైలు ప్రయాణానికి పర్యాటకులు అసక్తి ఎందుకు చూపిస్తారో అర్థం అయింది.
– శివ, అశోక్ హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment