KK line
-
అరకు అందాల రైలు.. మళ్లీ వచ్చింది!
ఎత్తైన కొండకోనలు దాటుకుంటూ ప్రకృతి అందాల నడుమ సాగే కేకేలైన్ రైలు ప్రయాణం అంటే దేశవ్యాప్తంగా పర్యాటకులు మొగ్గు చూపుతుంటారు. కొండకోనల మధ్యలో నిర్మించిన రైల్వేమార్గంలోని ప్రయాణం వింత అనుభూతి కలిగిస్తుంది. గుహలు, జలపాతాలను ఆనుకుని రైలుప్రయాణం ఆహ్లాదంగా సాగుతుంది. కోవిడ్ నేపథ్యంలో తొమ్మిది నెలల సుదీర్ఘ విరామానంతరం శుక్రవారం కేకేలైన్‌లో ప్రత్యేక రైలు కూత పెడుతూ రావడంతో పర్యాటకులు ఆనందానికి అవధి లేకుండా పోయింది. మొదటిరోజు పర్యాటకులు భారీ సంఖ్యలోనే బొర్రా రైల్వేస్టేషన్లో దిగారు. అనంతగిరి/అరకులోయ రూరల్: కొత్తవలస–కిరండూల్ (కేకే లైన్) ప్రత్యేక రైలు రాకతో బొర్రా, అరకు రైల్వే స్టేషన్ మొదటిరోజు కళకళలాడాయి. కరోనా నేపథ్యంలో పర్యాటక ప్రాంతాలు మూసివేయడంతో పాసింజర్ రైలును కూడా రద్దు చేశారు. గత రెండు నెలల క్రితం కోవిడ్ నిబంధనలను పాటిస్తూ తగు జాగ్రత్తలు నేపథ్యంలోని పలు పర్యాటక ప్రాంతాలు తెరుచుకున్నాయి. పర్యాటక ప్రాంతాలు తెరచుకున్నప్పటికీ కేకేలైన్‌లోని ప్రత్యేక రైలు మాత్రం అందుబాటులోకి రాలేదు. దీంతో పర్యాటకులు రోడ్డు మార్గంలో ప్రయాణించి పర్యాటక ప్రాంతాలైన బొర్రా, అరకు అందాలను తిలకిస్తున్నారు. పర్యాటకులు, ప్రయాణికులను దృష్టిలో పెట్టుకుని రైల్వేశాఖ శుక్రవారం నుంచి కేకేలైన్‌లో పాసింజర్ రైలు నడపడం ప్రారంభించింది. ప్రత్యేక రైలులో మొదటిరోజు పర్యాటకులు భారీ సంఖ్యలోని తరలివచ్చారు. పర్యాటకులతో బొర్రా రైల్వేస్టేషన్ కిటకిటలాడింది. అరకు 11 గంటలకు చేరుకుంది. మొదటిరోజు స్లీపర్‌కోచ్ సదుపాయం కల్పించారు. కరోనా నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు మాస్క్ లు ధరించి ప్రయాణం సాగించాలని రెవెన్యూ శాఖ అధికారులు పేర్కొన్నారు. చాలానెలల తరువాత రైలు రావడంతో స్థానిక ట్యాక్సీ, ఆటో డ్రైవర్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నేటి నుంచి విస్టాడోమ్ కోచ్ తాటిచెట్లపాలెం (విశాఖ ఉత్తర): అరకు రైలుకు విస్టాడోమ్ కోచ్ శనివారం నుంచి అందుబాటులోకి వస్తుంది. ఆంధ్రా ఊటీ అరకు అందాలను చూపించే అద్దాల కోచ్ (విస్టాడోమ్)లో ప్రయాణించాలనుకునే ప్రయాణికులు ఈ కోచ్‌కు రిజర్వేషన్ చేసుకోవాలి. ప్రస్తుతం నడుస్తున్న విశాఖపట్నం–కిరండూల్– విశాఖపట్నం స్పెషల్ రైలు నెంబరుతో కాకుండా ఈ కోచ్‌కు మాత్రం విశాఖపట్నం నుంచి అరకు వెళ్లే వారు 08504, అరకు నుంచి విశాఖపట్నం వచ్చేవారు 08503 నెంబరుతో రిజర్వేషన్ చేసుకోవాలని రైల్వే అధికారులు తెలిపారు. రిజర్వేషన్ బుకింగ్‌లో కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఈ మార్పు చేసినట్లు తెలిపారు. ఓ మంచి అనుభూతినిచ్చింది కేకేలైన్ ప్రయాణం చేయాలని చాలా రోజులు నుంచి ఎదురుచూస్తున్నాం. రైలు ప్రయాణంలో ఎతైన కొండల నడుమ సాగుతున్న ప్రయాణం ఓ మంచి అనుభూతి ఇస్తుందని, పలువురు చెబితే విన్నాం. ఈ రోజు కళ్లారా చూశాం. చాల సంతోషంగా అనిపించింది. కుటుంబంతో బొర్రాగుహలు, కటికి, తదితర పర్యాటక ప్రాంతాలను చూసేందుకు విశాఖపట్నం నుంచి కిరండూల్ రైలులో బొర్రాగుహలకు చేరుకున్నాం. – కిరణ్, శ్రీదేవి పర్యాటకురాలు టెక్కలి ప్రయాణం అద్భుతం అరకులోయ అందాలను తిలకించేందుకు చాల రోజులుగా రావాలని కోరిక ఉండేది. కేకేలైన్‌లోని శుక్రవారం నుంచి రైలు అందుబాటులోకి వస్తోందని తెలిసి సంతోషం అని్పంచింది. ప్రయాణం చేస్తున్నంతసేపు కొత్త అనుభూతి పొందాను. గుహల లోపల నుంచి రైలు ప్రయాణం చేస్తున్నప్పుడు సరదా అనిపించింది. ఈ ప్రయాణం నాకు ఓ ప్రత్యేకం. – బెంగళూర్‌కు చెందిన పర్యాటకుడు స్నేహితులందరం కలిసి వచ్చాం కేకేలైన్‌లోని రైలు ప్రయాణం అందుబాటులోకి వస్తుందని తెలిసి స్నేహితులందరం కలిసి గురువారం విశాఖపట్నం చేరుకుని శుక్రవారం ఉదయం విశాఖపట్నం నుంచి బొర్రాగుహలకు చేరుకున్నాం. కొండకోనలు లోయల మధ్యలోని ప్రయాణం చాల ఆనందంగా ఉంది. చాలా సరదగా గడిపాం. రైలు ప్రయాణానికి పర్యాటకులు అసక్తి ఎందుకు చూపిస్తారో అర్థం అయింది. – శివ, అశోక్ హైదరాబాద్ -
కేకే.. రాయగడకే!
సాక్షి, విశాఖపట్నం : వాల్తేరు డివిజన్ కొనసాగుతుందన్న ఆశలు క్రమంగా ఆవిరైపోతున్నాయి. డివిజన్ విభజన దాదాపు ఖరారైంది. ఉద్యోగ కార్మిక సంఘాలు ఉద్యమాలు చేస్తున్నా.. రాజకీయ ఒత్తిళ్లు తీసుకొస్తున్నా.. రైల్వేబోర్డు మాత్రం విభజన దిశగా ఒక్కో అడుగు వేస్తూ అడ్డగోలు నిర్ణయాలు తీసుకుంటోంది. 126 ఏళ్ల చరిత్ర కలిగిన వాల్తేరు డివిజన్‌ను ముక్కలు చేసి రాయగడ డివిజన్ ఏర్పాటు, నిర్వహణకు తగిన విధివిధానాలు రూపొందించాలని రైల్వే బోర్డు గత నెలలో ఆదేశించడం.. ఆ మేరకు ఈస్ట్ కోస్ట్ జోన్ ఉన్నతాధికారులు నోడల్ అధికారిని నియమించడం తెలిసిందే. ఈ నెల 31 నాటికి దీనిపై నివేదిక ఇవ్వాల్సి ఉన్న నేపథ్యంలో రాయగడ కేంద్రంగా కొత్త డివిజన్‌కు సరిహద్దులు దాదాపు ఖరారు చేశారని తెలుస్తోంది. రాయగడకు బంగారు బాతు.. ఇప్పుడున్న తూర్పుకోస్తా జోన్‌కు వాల్తేరు డివిజన్ అత్యధిక ఆదాయం ఇచ్చే బంగారు బాతుగుడ్డు లాంటిది. ఏటా మూడున్నర కోట్ల మంది ప్రయాణికుల రాకపోకలు సాగిస్తున్నారు. తూర్పుకోస్తా జోన్ సరకు రవాణా, ఇతరత్రా ఆదాయం ఏటా దాదాపు రూ.15 వేల కోట్లు కాగా, ఇందులో రూ.7 వేల కోట్లు వాల్తేరు డివిజన్ నుంచే వస్తోంది. సాధారణ టిక్కెట్ల ద్వారా రోజుకు రూ.25 లక్షలు వస్తోంది. ఇది భువనేశ్వర్ (రూ.12–14 లక్షలు) కంటే ఎక్కువ. దేశంలోనే 260 డీజిల్ ఇంజిన్లున్న అతిపెద్ద లోకోషెడ్, 160 ఇంజిన్లుండే భారీ ఎలక్ట్రికల్ లోకోషెడ్, విశాలమైన మార్షలింగ్ యార్డు కూడా ఇక్కడే ఉన్నాయి. తూర్పు కోస్తాలోనే ఎక్కువ ప్యాసింజర్, సరకు రవాణా వ్యాగన్ ట్రాఫిక్ కలిగిన డివిజన్ విశాఖ. ఇందులో సింహభాగం ఆదాయం ఐరెన్ ఓర్ రవాణా జరిగే కేకే లైన్, మొదలైన ప్రధాన మార్గాల ద్వారానే వస్తుంటుంది. ఇదంతా రాయగడ డివిజన్‌కు సొంతం కాబోతోంది. శివలింగపురం వరకు సరిహద్దు.. అధికార వర్గాల సమాచారం ప్రకారం విభజనకు సంబంధించి సరిహద్దు మ్యాపులు ఖరారయ్యాయి. పర్యాటక మణిహారంగా చెప్పుకునే అరకు లైన్ రాయగడ డివిజన్‌లోకి వెళ్లినట్లు సమాచారం. అరకు వరకు రాయగడ డివిజన్ సరిహద్దుగా.. దాని కంటే నాలుగు స్టేషన్లు ఆవల ఉన్న శివలింగాపురం ప్రాంతం విజయవాడ డివిజన్ సరిహద్దుగా నిర్ణయించారని తెలుస్తోంది. కిరండూల్, కొరాపుట్ ..ఇవన్నీ రాయగడ డివిజన్‌లోకి వెళ్లిపోతాయి. పార్వతీపురం, శ్రీకాకుళం, విజయనగరం, నౌపడ జంక్షన్ వరకు విజయవాడ డివిజన్లో ఉంచినట్లు సమాచారం. ఇవే సరిహద్దులు ఖరారైతే అతి పెద్ద డివిజన్‌గా రాయగడ, అత్యల్ప ప్రాధాన్యమున్న డివిజన్‌గా విజయవాడ మిగిలిపోనున్నాయి. యూనియన్లపై ఉద్యోగుల మండిపాటు.. వాల్తేరు విభజన్ ఏర్పాట్లు ఒక్కొక్కటిగా పూర్తి అవుతుండటంతో ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది. డివిజన్‌ను విభజిస్తే ఆదాయం కోల్పోవడమే కాకుండా ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. 126 సంవత్సరాల చరిత్ర ఉన్న వాల్తేరు డివిజన్లో 17,600 మందికి పైగా ఉద్యోగులు ఏ చిన్న పనికోసమైనా డివిజన్ కేంద్రమైన విజయవాడకు పరుగులు తీయాల్సిందేనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డివిజన్‌ను కొనసాగించాలని యూనియన్లు ఉద్యమాలు నిర్వహించినా.. ఉద్యోగులు మాత్రం యూనియన్లపై మండిపడుతున్నారు. దక్షిణ కోస్తా జోన్ ప్రకటన ఫిబ్రవరి 27న వచ్చినప్పుడే వాల్తేరు డివిజన్ విభజన చేస్తున్నట్లు ప్రకటించారు. అప్పుడే యూనియన్లన్నీ ఢిల్లీ పెద్దలపై ఒత్తిడి తీసుకొచ్చి ఉంటే.. పరిస్థితి ఇంతదాకా వచ్చేది కాదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా కేంద్రంపైనా, రైల్వే బోర్డుపైనా యూనియన్లతో పాటు రాజకీయ ప్రతినిధులు తీవ్ర స్థాయిలో ఒత్తిడి తీసుకొచ్చి వాల్తేరు డివిజన్‌ను కాపాడాలని కోరుతున్నారు. -
అరకు అందాలు 'డబ్లింగ్'
రైల్లో అరకు ప్రయాణం.. ఓ అందమైన అనుభవం. కొండలెక్కుతూ.. గుహల్లోంచి సాగిపోతూ.. ఒంపులు తిరిగి ప్రయాణించే కిరండూల్ పాసింజర్ ఎన్నో అనుభూతుల కలబోత. అయితే కేకే లైన్లో రోజుకు ఒక్క రైలే తిరుగుతుంది. ఆ రైలు మిస్సయితే మళ్లీ మర్నాడు ఉదయం వరకు ఆగాల్సిందే. ఐదు రాష్ట్రాల మీదుగా ప్రయాణించే ఈ రైల్లో వివిధ పనుల మీద విశాఖ వచ్చే ప్రయాణికులూ ఎక్కువే. ఈ లైన్ మీదుగా సాగే రవాణాయే ప్రధాన ఆదాయ వనరన్న సంగతి తెలిసిందే. అందుకే మరిన్ని రైళ్లు తిరిగేందుకు వీలుగా మరో లైన్ నిర్మించాలన్నది చిరకాల డిమాండ్. ఈ కలను నిజం చేస్తూ కేంద్ర ఆర్థిక వ్యవహారాల కమిటీ రెండో రైల్వే లైన్‌కు ఆమోదముద్ర వేసింది. కేకే రైల్వే మార్గంలో రెండో లైన్ వేసేందుకు ఆమోదం పెరగనున్న రవాణా సదుపాయం.. పర్యాటకానికి ఊతం విస్టాడూమ్ బోగీ వచ్చే మార్చిలో.. విశాఖపట్నం : కొత్తవలస-కిరండూల్ రైల్వే మార్గానికి మహర్దశ పట్టనుంది. ఇప్పటి వరకు వెళ్లే రైలు.. వచ్చే రైలు మాత్రమే ప్రయాణించే ఈ మార్గంలో డబ్లింగ్ పనులకు కేంద్రం బుధవారం పచ్చజెండా ఊపడంతో రైల్వే ట్రాఫిక్ ఇకపై ఈ మార్గంలోనూ పెరగనుంది. ఇప్పుడున్న ఒకే ఒక్క ప్యాసింజర్ స్థానంలో రానున్న రోజుల్లో మరిన్ని రైళ్లు నడిపే అవకాశాలున్నాయి. ప్రకృతి ప్రేమికుల కోసం విస్టా డూమ్ బోగీని ఈ మార్గంలో నడుస్తున్న అరకు ప్యాసింజర్‌కు జత చేసేందుకు ఇప్పటికే తూర్పు కోస్తా రైల్వే ఆమోద ముద్ర వేసింది. ప్రస్తుతం ఈ అధునాతన పర్యాటక బోగీ వచ్చే మార్చినాటికి రానుందని అధికారిక వర్గాలు తెలిపాయి. ఆ బోగీ ఒక్కటే కాదు. డబ్లింగ్ పనులు వచ్చే ఏడేళ్లలో పూర్తయితే మరిన్ని రైళ్లు అరకు, కోరాపుట్, జగదల్పూర్ వరకు నడిచే అవకాశాలున్నాయి. ఛత్తీస్‌గఢ్, ఒడిశా, ఆంధ్రా రాష్ట్రాలకు చెందిన మారుమూల గిరిజన గ్రామాల నుంచి విశాఖ వచ్చే ప్రజలకు ఈ కొత్త రైళ్లు ఎంతో ఉపయోగపడతాయి. విద్య, వైద్యం కోసం అక్కడి నుంచి వచ్చే వారెందరో ఉన్నారు. దక్షిణాదిన ప్రకృతి సౌందర్యరాశిగా ప్రఖ్యాతిగాంచిన అరకు అందాలను తనివితీరా చూడాలనుకునే రైల్వే మార్గమిది. ఎత్తయిన కొండలను చీల్చుకుంటూ...కొండ గుహల్లోంచి దుముకుతూ... కాల్వలు, సెలయేళ్లు, నదులను అమాంతంగా దాటేస్తూ... పిల్ల పర్వతాల నుంచి తల్లి పర్వతాల మీదకు ఎగబాకుతూ చూపరులను కట్టి పడేసే దృశ్యాలతో ఈ మార్గం ఆద్యంతం ఆకట్టుకుంటుంది. సాధారణంగా 100 కిలోమీటర్ల దూరాన్ని రెండు గంటల్లోనే రైళ్లు చేరుకుంటుంటే ఈ మార్గంలో మాత్రం నాలుగు గంటలైనా ప్రయాణికులు ఏ మాత్రం విసుగు చెందరు. సముద్ర మట్టానికి వేల అడుగుల ఎత్తులోంచి ప్రయాణించే ఈ రైలులోంచి అంతా ఎంతో ఆసక్తితో చూస్తుంటారు. ప్రకృతి ప్రేమికులు కెమెరా పట్టుకుని, సెల్ఫోన్లో సెల్ఫీలు దిగుతూ గుహల్లోంచి రైలు దూసుకుపోయే ప్రతిసారీ అరుపులతో సందడి చేస్తుంటారు. ఈ రైల్వే మార్గాన్ని 1974-76 మధ్య కాలంలో ప్రారంభించారు. అరకు అందాలను రైల్లోంచే చూసేందుకు పర్యాటకులు ఇష్టపడుతుంటారు. ఈ రైల్వే లైన్ బంగారు బాతు కొత్తవలస-కిరండూల్ రైల్వే లైన్ అంటే తూర్పు కోస్తా రైల్వేకి బంగారు బాతులాంటిది. పెద్దగా ఖర్చు పెట్టకుండానే ఏటా రూ. 5 వేల కోట్ల ఆదాయాన్నిచ్చే ఈ మార్గం అంటే భారతీయ రైల్వేకి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ప్యాసింజర్ రైలు ఒక్కటే రోజుకు రాకపోకలు సాగిస్తుంది. మిగిలిన రోజంతా ఈ మార్గంలో సరకు రవాణా రైళ్లే తిరుగుతుంటాయి. దాదాపు 463 కిలోమీటర్ల మేర సింగిల్ ట్రాక్‌తోనే భారీ ఎత్తున ఆదాయం సమకూరుస్తున్న ఈ మార్గంలో భారీ వర్షాలు కురిసినప్పుడు రైల్వే ట్రాఫిక్ నిలిచిపోతుంది. ఒకే ట్రాక్ కావడంతో ఈ సమస్య ఉంది. అందుకే ఎప్పటి నుంచో డబ్లింగ్ చేయాలని వాల్తేరు రైల్వే, తూర్పు కోస్తా రైల్వేలు ప్రభుత్వానికి నివేదిస్తున్నాయి. ఎట్టకేలకు ఈ నివేదికలకు మోక్షం కలిగింది. డబ్లింగ్‌కు రూ.7,178 కోట్లు కొత్తవలస-కిరండూల్ రైల్వే మార్గాన్ని (కేకే లైన్) డబ్లింగ్ చేసేందుకు కేంద్ర ఆర్థిక వ్యవహారాల కమిటీ బుధవారం ఆమోదముద్ర వేసింది. గత రైల్వే బడ్జెట్లో ప్రకటించిన ఈ రైల్వే లైన్ ఆధునికీకరణకు ఆర్థిక వ్యవహారాల మంత్రి త్వ శాఖ పచ్చజెండా ఊపడంతో సుదీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న ఈ మార్గం డబ్లింగ్ అయ్యే అవకాశాలున్నాయి. ఆంధ్రా, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న ఈ రైల్వే మార్గం ఆధునికీకరణకు రూ.7,178.40 కోట్ల మొత్తా న్ని కేంద్రం ప్రకటించింది. కిరండూల్-జగదల్పూర్ మధ్య కొన్ని కిలోమీటర్ల మేర డబ్లింగ్ పనులు పూర్తయిన నేపథ్యంలో జగదల్పూర్ నుంచి కొత్తవలస మధ్య నూతన రైల్వే మార్గాన్ని అదనంగా నిర్మించాల్సి ఉంది. దాదాపు 463 కిలోమీటర్ల మేర కొత్త మార్గాన్ని నిర్మించనున్నారు. ప్రస్తుతం ఈ మార్గంలో ఒకే ఒక్క ప్యాసింజర్ రైలు (1వీకే/2వీకే) రోజుకు నడుస్తుండగా సరకు రవాణా రైళ్లు మా త్రం 12 వరకు నడుస్తున్నాయి. ప్రధానంగా ఈ మార్గం ద్వారా ఐరన్ ఓర్, బొగ్గు రవాణా చేస్తుంటాయి. వచ్చే ఏడేళ్లలో ప్రాజెక్టును పూర్తి చేయాలని కేంద్రం నిర్ణయించింది. కేకే లైన్ విశేషాలు జగదల్పూర్-కోరాపుట్ మధ్య 110 కిలోమీటర్ల మేర రైల్వే లైన్ నిర్మించడానికి రూ.1,839 కోట్లు కేటాయించారు. ఈ మార్గం పూర్తిగా ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లోనే ఉంది. ఐరన్ ఓర్, బొగ్గు రవాణా ప్రధాన ఆదాయ మార్గం. కోరాపుట్-సింగపూర్ మధ్య 164 కిలోమీటర్ల రైల్వే లైన్ నిర్మించడానికి రూ.2,361 కోట్లు కేటాయించారు. ఈ ప్రాజెక్టు వల్ల ఒడిశాలోని కోరాపుట్, రాయగడ జిల్లాలకు ప్రయోజనం ఉంటుందని అంచనా వేశారు. ఈ మార్గంలో మినరల్స్ అండ్ మైన్స్ ఎగుమతికి అవకాశాలుంటాయని ప్రభుత్వం గుర్తించింది. కోరాపుట్-కొత్తవలస మధ్య 189 కిలోమీటర్ల మేర కొత్త రైల్వే లైన్ నిర్మాణానికి రూ. 2977 కోట్లు కేటాయించారు. ఈ మార్గం నిర్మించడం వల్ల ఒడిశాలోని కోరాపుట్ జిల్లాతోపాటు ఆంధ్రాలోని విజయనగరం, విశాఖ జిల్లాలకు ప్రయోజనం ఉంటుందని అంచనా వేశారు. ఈ మొత్తం ప్రాజెక్టులు పూర్తి కావడానికి ఏడేళ్ల సమయం పడుతుందని, అందుకు 12, 13 ఆర్థిక ప్రణాళికల నుంచి నిధులు కేటాయిస్తున్నట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది.