కేకే.. రాయగడకే! | KK Line For Rayagada Division | Sakshi
Sakshi News home page

కేకే.. రాయగడకే!

Published Sat, Aug 17 2019 8:19 AM | Last Updated on Sat, Aug 17 2019 8:46 AM

KK Line For Rayagada Division - Sakshi

సాక్షి, విశాఖపట్నం : వాల్తేరు డివిజన్‌ కొనసాగుతుందన్న ఆశలు క్రమంగా ఆవిరైపోతున్నాయి. డివిజన్‌ విభజన దాదాపు ఖరారైంది. ఉద్యోగ కార్మిక సంఘాలు ఉద్యమాలు చేస్తున్నా.. రాజకీయ ఒత్తిళ్లు తీసుకొస్తున్నా.. రైల్వేబోర్డు మాత్రం విభజన దిశగా ఒక్కో అడుగు వేస్తూ అడ్డగోలు నిర్ణయాలు తీసుకుంటోంది. 126 ఏళ్ల చరిత్ర కలిగిన వాల్తేరు డివిజన్‌ను ముక్కలు చేసి రాయగడ డివిజన్‌ ఏర్పాటు, నిర్వహణకు తగిన విధివిధానాలు రూపొందించాలని రైల్వే బోర్డు గత నెలలో ఆదేశించడం.. ఆ మేరకు ఈస్ట్‌ కోస్ట్‌ జోన్‌ ఉన్నతాధికారులు నోడల్‌ అధికారిని నియమించడం తెలిసిందే. ఈ నెల 31 నాటికి దీనిపై నివేదిక ఇవ్వాల్సి ఉన్న నేపథ్యంలో రాయగడ కేంద్రంగా కొత్త డివిజన్‌కు సరిహద్దులు దాదాపు ఖరారు చేశారని తెలుస్తోంది.

రాయగడకు బంగారు బాతు.. 
ఇప్పుడున్న తూర్పుకోస్తా జోన్‌కు వాల్తేరు డివిజన్‌ అత్యధిక ఆదాయం ఇచ్చే బంగారు బాతుగుడ్డు లాంటిది. ఏటా మూడున్నర కోట్ల మంది ప్రయాణికుల రాకపోకలు సాగిస్తున్నారు. తూర్పుకోస్తా జోన్‌ సరకు రవాణా, ఇతరత్రా ఆదాయం ఏటా దాదాపు రూ.15 వేల కోట్లు కాగా,  ఇందులో రూ.7 వేల కోట్లు వాల్తేరు డివిజన్‌ నుంచే వస్తోంది. సాధారణ టిక్కెట్ల ద్వారా రోజుకు రూ.25 లక్షలు వస్తోంది. ఇది భువనేశ్వర్‌ (రూ.12–14 లక్షలు) కంటే ఎక్కువ. దేశంలోనే 260 డీజిల్‌ ఇంజిన్లున్న అతిపెద్ద లోకోషెడ్, 160 ఇంజిన్లుండే భారీ ఎలక్ట్రికల్‌ లోకోషెడ్, విశాలమైన మార్షలింగ్‌ యార్డు కూడా ఇక్కడే ఉన్నాయి. తూర్పు కోస్తాలోనే ఎక్కువ ప్యాసింజర్, సరకు రవాణా వ్యాగన్‌ ట్రాఫిక్‌ కలిగిన డివిజన్‌ విశాఖ. ఇందులో సింహభాగం ఆదాయం ఐరెన్‌ ఓర్‌ రవాణా జరిగే కేకే లైన్, మొదలైన ప్రధాన మార్గాల ద్వారానే వస్తుంటుంది. ఇదంతా రాయగడ డివిజన్‌కు సొంతం కాబోతోంది.

శివలింగపురం వరకు సరిహద్దు..
అధికార వర్గాల సమాచారం ప్రకారం విభజనకు సంబంధించి సరిహద్దు మ్యాపులు ఖరారయ్యాయి. పర్యాటక మణిహారంగా చెప్పుకునే అరకు లైన్‌ రాయగడ డివిజన్‌లోకి వెళ్లినట్లు సమాచారం. అరకు వరకు రాయగడ డివిజన్‌ సరిహద్దుగా.. దాని కంటే నాలుగు స్టేషన్లు ఆవల ఉన్న శివలింగాపురం ప్రాంతం విజయవాడ డివిజన్‌ సరిహద్దుగా నిర్ణయించారని తెలుస్తోంది. కిరండూల్, కొరాపుట్‌ ..ఇవన్నీ రాయగడ డివిజన్‌లోకి వెళ్లిపోతాయి. పార్వతీపురం, శ్రీకాకుళం, విజయనగరం, నౌపడ జంక్షన్‌ వరకు విజయవాడ డివిజన్‌లో ఉంచినట్లు సమాచారం. ఇవే సరిహద్దులు ఖరారైతే అతి పెద్ద డివిజన్‌గా రాయగడ, అత్యల్ప ప్రాధాన్యమున్న డివిజన్‌గా విజయవాడ మిగిలిపోనున్నాయి.

యూనియన్లపై ఉద్యోగుల మండిపాటు..
వాల్తేరు విభజన్‌ ఏర్పాట్లు ఒక్కొక్కటిగా పూర్తి అవుతుండటంతో ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది. డివిజన్‌ను విభజిస్తే ఆదాయం కోల్పోవడమే కాకుండా ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. 126 సంవత్సరాల చరిత్ర ఉన్న వాల్తేరు డివిజన్‌లో 17,600 మందికి పైగా ఉద్యోగులు ఏ చిన్న పనికోసమైనా డివిజన్‌ కేంద్రమైన విజయవాడకు పరుగులు తీయాల్సిందేనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డివిజన్‌ను కొనసాగించాలని యూనియన్లు ఉద్యమాలు నిర్వహించినా.. ఉద్యోగులు మాత్రం యూనియన్లపై మండిపడుతున్నారు. దక్షిణ కోస్తా జోన్‌ ప్రకటన ఫిబ్రవరి 27న వచ్చినప్పుడే వాల్తేరు డివిజన్‌ విభజన చేస్తున్నట్లు ప్రకటించారు. అప్పుడే యూనియన్లన్నీ ఢిల్లీ పెద్దలపై ఒత్తిడి తీసుకొచ్చి ఉంటే..  పరిస్థితి ఇంతదాకా వచ్చేది కాదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా కేంద్రంపైనా, రైల్వే బోర్డుపైనా యూనియన్లతో పాటు రాజకీయ ప్రతినిధులు తీవ్ర స్థాయిలో ఒత్తిడి తీసుకొచ్చి వాల్తేరు డివిజన్‌ను కాపాడాలని కోరుతున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement