
అనంతగిరి: ప్రముఖ పర్యాటక కేంద్రం, సహజ సిద్ధంగా ఏర్పడిన బొర్రా గుహలకు సరికొత్తగా సాంకేతిక సొబగులు అద్దుకుంటున్నాయి. ఇక్కడికి దేశ విదేశాలతోపాటు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున పర్యాటకులు తరలివస్తుంటారు. వీరికి ఎటువంటి ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతో పర్యాటక శాఖ అధునాతన సౌకర్యాల కల్పనకు చర్యలు చేపట్టింది. ప్రస్తుతం ఆన్‌లైన్ ఈ–పోస్ టికెట్ల ద్వారా గుహలు లోపలికి అనుమతిస్తున్నారు. ఈ నేపథ్యంలో పర్యాటకుల రద్దీ పెరిగే కొద్దీ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దాంతో గుహలు ముఖద్వారం వద్ద కొత్తగా మెట్రో గేట్లను ఏర్పాటు చేస్తున్నారు. లోపలకు వెళ్లేందుకు మూడు, బయటకు వచ్చేటప్పుడు మూడు గేట్లు చొప్పున అమర్చేందుకు చర్యలు చేపడుతోంది.
ఇందుకోసం రూ. 12 లక్షల వరకు వెచ్చిస్తోంది. తాజాగా టెక్నీషియన్లు వచ్చి ఇన్‌స్టాలేషన్ చేస్తున్నారు. ప్లాట్‌ఫాం నిర్మించిన వెంటనే మెట్రో గేట్లను ఏర్పాటు చేస్తారు. గుహలను తిలకించేందుకు వెళ్లే పర్యాటకుల్లో పెద్దలకు రూ. 70, చిన్నపిల్లలకు రూ. 50 చెల్లిస్తే మాగ్నెటిక్స్ కాయిన్స్ ఇస్తారు. వీటిని చూపించగానే గేటు తెరుచుకుంటుంది. గుహలను తిలకించి తిరిగి బయటకు వచ్చేందుకు మరోసారి చూపించాలి. త్వరలోనే ఈ సౌకర్యం అందుబాటులోకి రానుంది. దీంతో పర్యాటకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికి పాత టికెట్ల ధరలు అమలులో ఉన్నట్లు పర్యాటక శాఖ సిబ్బంది తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment