ప్రపంచంలో అందాలన్నీ ఓచోట చేరిస్తే విశాఖగా మారిందన్నట్లుగా.. దేశానికి వచ్చే ప్రతి 10 మంది పర్యాటకుల్లో ముగ్గురు ఈ నగరాన్ని సందర్శిస్తుంటారు. విదేశీ పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న విశాఖ.. ఏ చోటకు వెళ్లినా భూతల స్వర్గమంటే ఇదేనేమో అన్న అనుభూతిని కలిగిస్తుంది. సందర్శకుల మనసు దోచేలా ఈ సౌందర్యసీమను పర్యాటకంలో అగ్రభాగాన నిలిపేందుకు కొత్త ప్రాజెక్టులెన్నో పట్టాలెక్కనున్నాయి.
సాక్షి, విశాఖపట్నం: ప్రకృతి అందాలతో అలరారే విశాఖ పర్యాటకాన్ని కొత్త పుంతలు తొక్కేందుకు సరికొత్త ఆలోచనలతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తోంది. ఒకవైపు సాగర సోయగాలు.. మరోవైపు ఎత్తయిన తూర్పు కనుమల అందాలు అంతర్జాతీయ టూరిస్టులను కట్టిపడేస్తుండగా.. ప్రపంచ పర్యాటక పటంలో టూరిజం రాజధానిగా భాసిల్లే విధంగా ప్రాజెక్టులకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. కార్యనిర్వాహక రాజధానిగా భాసిల్లుతున్న విశాఖ పర్యాటకంలో పెట్టుబడులు పెట్టేందుకు విదేశీ సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయి. దేశీ, విదేశీ పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తున్న విశాఖలో పీపీపీ విధానంలో పలు టూరిజం ప్రాజెక్టుల నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి. భవిష్యత్తులో విశాఖలో అలరించే సరికొత్త ప్రాజక్టుల వివరాలతో ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం.
పెట్టుబడులకు విదేశాలు ఆసక్తి
పర్యాటకులను మరింత ఆకర్షించేందుకు రిక్రియేషన్ టూరిజంకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిన నేపథ్యంలో.. సరికొత్త ప్రాజెక్టులను ఏర్పాటు చేసేందుకు వివిధ దేశాలు విశాఖవైపు అడుగులు వేస్తున్నాయి. రిక్రియేషన్ అండ్ అడ్వెంచర్ టూరిజం విభాగంలో భారీగా పెట్టుబడులు పెట్టి.. పర్యాటక ప్రాజెక్టులను ఏర్పాటు చేసేందుకు సింగపూర్, టర్కీ, ఫ్రాన్స్ తదితర దేశాలు ఆసక్తి చూపిస్తున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో రానున్న ఈ ప్రాజెక్టుల గురించి చర్చించేందుకు ఆయా దేశాల ప్రతినిధులు త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించనున్నారు.
ఐకానిక్‌గా.. స్కైటవర్
తీరంలో సముద్ర మట్టానికి ఎత్తున విహరిస్తూ.. ఓవైపు అలల అందాల్ని.. మరోవైపు విశాఖ నగర హొయలను చూసేలా స్కైటవర్ ఏర్పాటు చేయనున్నారు. ఏపీటూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఏపీటీడీసీ) ఈ ప్రాజెక్టు ఏర్పాటుకు సన్నాహాలు చేస్తోంది. దీనిపై స్విట్జర్లాండ్‌కు చెందిన ప్రపంచస్థాయి సంస్థ ఆసక్తి కనబరుస్తోంది. అంతర్జాతీయ వినోద రంగంలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న అమ్యూజ్‌మెంట్ రైడ్స్ సంస్థ ఇంటమిన్ ఈ ప్రాజెక్టుకు ఏపీటీడీసీ జాయింట్ వెంచర్‌గా ఉండేందుకు ముందుకొచ్చింది. రూ.100 కోట్ల పెట్టుబడులు పెట్టి.. స్కైటవర్ నిర్మాణానికి మొగ్గు చూపుతోంది. సుమారు 70 మంది సందర్శకులు చుట్టూ కూర్చొనే విధంగా 360 డిగ్రీల కోణంలో తిరుగుతూ స్కైటవర్ పైకి తీసుకెళ్తుంది. రాత్రి వేళ మిరుమిట్లు గొలిపే కాంతులతో కనిపించే ఈ టవర్.. నగరానికి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.
అరకు అందాల్లో తేలినట్టుందే..
మరోవైపు అడ్వెంచర్ టూరిజంని కూడా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ప్రకృతి అందాలకు నిలయంగా.. అంతర్జాతీయ టూరిస్టుల్ని ఆకర్షిస్తున్న విశాఖ మన్యం అడ్వెంచర్ టూరిజంకి కేంద్రంగా మారనుంది. ఇందులో భాగంగా అరకులోయలో టెథర్డ్ గ్యాస్ బెలూన్ ప్రాజెక్టు రానుంది. ఫ్రాన్స్‌కు చెందిన ఏరో ఫైల్ సంస్థ దీనికి ఆసక్తి చూపిస్తున్నట్లు ప్రకటించింది. ఒకేసారి 30 మంది గాల్లో విహరించే సామర్థ్యం ఉన్న బెలూన్‌లో పర్యాటకులు విహరించేలా ప్రాజెక్టు పట్టాలెక్కనుంది ఇలా.. సరికొత్త పర్యాటకాన్ని విశాఖ వచ్చే టూరిస్టులకు పరిచయం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమై.. రిక్రియేషన్ ప్రాజెక్టులు వీలైనంత త్వరగా పట్టాలెక్కించేందుకు ఏపీటీడీసీ అధికారులు సమాయత్తమవుతున్నారు.
జలచరాల మధ్యలో విహరించేలా..
టన్నెల్ అక్వేరియం.. ఓ అద్భుత ప్రపంచంలా ఉంటుంది. సముద్ర లోతు ల్లో ఉండే పగడపు దీవులకు వెళ్లి.. 360 డిగ్రీల కోణంలో జలచరాల్ని చూస్తున్న అనుభూతిని కలిగిస్తుంది. అత్యంత పారదర్శకమైన గాజు నిర్మాణంలో.. నీలి నీలి అందాలు.. చూపు తిప్పనీకుండా చేస్తాయి. టర్కీకి చెందిన పోలిన్ గ్రూప్.. ఈ టన్నెల్ అక్వేరియంని నిర్మించేందుకు ఆసక్తి చూపిస్తోంది. ఇందుకు రూ.100 కోట్లు పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించింది. టన్నెల్ అక్వేరియంకు ఎక్కువ శాతం సముద్రపు నీరు కావాల్సిన నేపథ్యంలో తొట్లకొండ ప్రాంతం అనువుగా ఉన్నట్లు పర్యాటక శాఖ అధికారులు గుర్తించారు.
Comments
Please login to add a commentAdd a comment