సాక్షి, అమరావతి: విశాఖపట్నం రుషికొండ రిసార్టు పునరుద్దరణ ప్రాజెక్టుకు సంబంధించి పిటిషనర్లు చెబుతున్నవన్నీ అవాస్తవాలని పర్యాటక అభివృద్ధి సంస్థ తరఫు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ.. హైకోర్టుకు చెప్పారు. పూర్తి వాస్తవాలను కోర్టు ముందుంచుతామన్నారు. పిటిషనర్లు దాఖలు చేసిన అదనపు అఫిడవిట్లకు తిరుగు సమాధానం దాఖలు చేస్తామని విజ్ఞప్తి చేశారు. దీనికి హైకోర్టు అనుమతిస్తూ తదుపరి విచారణను ఆగస్టు 5వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్‌ఎస్ సోమయాజులుతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.
ఆదేశాలను ఉల్లంఘిస్తే అధికారులపై చర్యలు..
విశాఖ జిల్లా యందాడలోని సర్వే నంబర్ 19 పరిధిలో ఉన్న కోస్టల్ రెగ్యులేషన్ జోన్‌లో చెట్ల నరికివేత, భూమి తవ్వకాలకు అధికారులు అనుమతులివ్వడం కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ అనుమతులకు, విశాఖ పట్టణ ప్రాంతాభివృద్ధి సంస్థ మాస్టర్ ప్లాన్‌కు విరుద్ధమంటూ జనసేన నేత మూర్తి యాదవ్ గతేడాది హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఇదే అంశంపై టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ కూడా పిల్ వేశారు. ఈ వ్యాజ్యాలపై బుధవారం సీజే ధర్మాసనం మరోసారి విచారణ జరిపింది. మూర్తి యాదవ్ తరఫున న్యాయవాది కేఎస్ మూర్తి వాదనలు వినిపిస్తూ.. కోర్టు ఇచ్చిన ఉత్తర్వులకు విరుద్ధంగా 20–30 ఎకరాల్లో అదనంగా కొండను తవ్వేశారని ఆరోపించారు.
తవ్వకాల వ్యర్థాలను బంగాళాఖాతంలో వేస్తున్నారని చెప్పారు. హైకోర్టు స్పందిస్తూ.. పనులకు సంబంధించి తామిచ్చిన ఉత్తర్వులకు విరుద్ధంగా తవ్వకాలు జరిపినట్లు తేలితే.. బాధ్యులైన అధికారులను కోర్టు ధిక్కారం కింద జైలుకు పంపిస్తామంది. రిసార్టును ఎంత మేర కూల్చివేశారో.. ఆ మేరకు నిర్మాణాలు చేపట్టాలంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఉల్లంఘించినా కూడా కోర్టు ధిక్కార చర్యలు తప్పవని స్పష్టం చేసింది. క్షేత్రస్థాయిలో నిజ నిర్ధారణ కోసం అవసరమైతే జిల్లా జడ్జి నేతృత్వంలో ఓ కమిషన్‌ను ఏర్పాటు చేస్తామంది.
ఆ మేరకు ఉత్తర్వులిచ్చేందుకు హైకోర్టు సిద్ధం కాగా.. అభిషేక్ సింఘ్వీ జోక్యం చేసుకుంటూ, పిటిషనర్ల ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. వారు దాఖలు చేసిన అదనపు అఫిడవిట్లకు తిరుగు సమాధానంలో అన్ని వాస్తవాలను కోర్టు ముందుంచుతామని చెప్పారు. కోర్టు ఆదేశాలను ఉల్లంఘించలేదన్నారు. తమ సమాధానం చూసిన తర్వాతే కమిషన్ ఏర్పాటుపై నిర్ణయం తీసుకోవాలని కోరారు. ధర్మాసనం స్పందిస్తూ.. 5.18 ఎకరాలకు మించి నిర్మాణాలు చేసినట్లు తేలితే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.
టీడీపీ ఎమ్మెల్యే రామకృష్ణబాబు తరఫు న్యాయవాది అశ్వనీ కుమార్ జోక్యం చేసుకుంటూ.. 20 ఎకరాలకు పైనే తవ్వకాలు జరిపారని.. సమీపంలోని బస్టాండ్‌ను కూల్చి వేశారన్నారు. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది చింతల సుమన్ జోక్యం చేసుకుంటూ.. సుప్రీంకోర్టు ఆదేశాలివ్వడానికి ముందే.. గతంలో ఎప్పుడో బస్‌స్టాండ్‌ను తొలగించినట్లు చెప్పారు. ఈ విషయం పత్రికల్లోనూ వచ్చిందన్నారు. ఇదే అంశంపై ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిల్ గురించి అతని తరఫు న్యాయవాది ఉమేశ్ చంద్ర ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. ఈ వ్యాజ్యంపై త్వరలో కౌంటర్ వేస్తామని సుమన్ చెప్పారు.
పిటిషనర్లవన్నీ అవాస్తవాలే
Published Thu, Jul 28 2022 3:41 AM | Last Updated on Thu, Jul 28 2022 8:09 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment