రూ. 700 కోట్లతో నాసిరకంగా తాత్కాలిక సచివాలయం నిర్మించిన టీడీపీ ప్రభుత్వం
రుషికొండలో రూ.400 కోట్లతోనే ఐకానిక్ భవనాలు నిర్మించిన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం
ప్రభుత్వ స్థలంలో నిర్మించిన ప్రభుత్వ భవనాలివి..
శిథిలమైన హరిత రిసార్ట్స్ స్థానంలో నూతన భవనాల నిర్మాణం
ఏపీ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్మాణం
61 ఎకరాల్లో 9.88 ఎకరాల్లోనే నిర్మాణాలు.. 2021లోనే కేంద్ర అటవీ, పర్యావరణ శాఖకు సమగ్ర వివరాలిచ్చిన ప్రభుత్వం
విశాఖ ఖ్యాతిని ఇనుమడించేలా, రాష్ట్రానికే తలమానికంగా భవనాలు
ప్రపంచ పర్యాటకులను ఆకర్షించేలా ఫైవ్ స్టార్ వసతులతో నిర్మాణం
విశాఖ నుంచి పరిపాలనకు ఈ భవనాలు అనువైనవని తేల్చిన అధికారుల కమిటీ
దీంతో సీఎం నివాసం, కార్యాలయానికి అనుకూలంగా కొన్ని మార్పులు
అయినా సొంత భవనాలంటూ టీడీపీ నేతల గగ్గోలు
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు మంచి చేయడం అనేది తెలుగుదేశం పార్టీకి, ఆ పార్టీ ప్రభుత్వానికి చేతకాదు. విభజిత రాష్ట్రానికి 2014 నుంచి 2019 వరకు అధికారంలో ఉన్న టీడీపీ.. ఏ కార్యక్రమం చేపట్టినా దాన్ని సాగదీసి, స్వలాభం చూసుకోవడమే తప్ప, రాష్ట్రానికి చేసిన మంచి ఒక్కటీ లేదు. రాజధాని పేరుతో చేసిన విధ్వంసం, తాత్కాలిక సచివాలయాల పేరుతో నిర్మించిన నాసి రకం భవనాలు, పోలవరం ప్రాజెక్టులో తప్పులు.. ఇలా అన్నీ రాష్ట్రానికి తలవంపులు తెచ్చే పనులే. ఇప్పుడూ అదే చేస్తోంది టీడీపీ. రుషికొండపైన అంతర్జాతీయ స్థాయిలో పర్యాటకులను ఆకర్షించేలా, విశాఖ ఖ్యాతిని మరింతగా పెంచేలా అద్భుత భవనాలను నిర్మిస్తే, దానిపై వికృత రాజకీయం చేస్తోంది.
ప్రభుత్వ స్థలంలో ప్రభుత్వ భవనాలను నిర్మిస్తే వాటిపై చేస్తున్న విష ప్రచారం ఆ పార్టీ సంస్కృతికి నిదర్శనం. తన చేతకానితనాన్ని కప్పిపుచ్చుకొనేందుకు చేస్తున్న కపట నాటకం. రూ.700 కోట్లతో తమ ప్రభుత్వం నిర్మించిన తాత్కాలిక సచివాలయం చిన్న వర్షానికే లీకైపోయి, నీరంతా గదుల్లో ప్రవహించగా.. ఇప్పుడు కేవలం రూ. 400 కోట్లతో రుషికొండపై విశాఖకే కాక యావత్ రాష్ట్రానికే తలమానికంగా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం నిర్మించిన ఈ ఐకానిక్ భవనాలను చూసి తల ఎక్కడ పెట్టుకోవాలో టీడీపీ అధినేతలకే తెలియడంలేదు. అందుకే ఈ అగ్లీ (చెత్త)ఏడుపు. విశాఖపట్నంలోని బీచ్‌కి ఆనుకొని ఉన్న రుషికొండపై రాష్ట్ర పర్యాటక శాఖకు చెందిన హరిత రిసార్ట్స్ భవనాలు చాలా కాలం క్రితం నిర్మించినవి.
అవి శిథిలమై ప్రమాదకరంగా మారడంతో వాటిని తొలగించి, కొత్త భవనాలు కట్టాలని గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వంతోనూ సంప్రదింపులు జరిపింది. ప్రపంచ స్థాయిలో, 5 స్టార్ వసతులతో అత్యాధునికంగా, విశాఖ నగర ఖ్యాతిని మరింతగా ఇనుమడింపజేసేలా డిజైన్లు రూపొందించింది. సీఆర్‌జెడ్ పరిమితులకు లోబడి నిర్మాణాలు ప్రారంభించింది. రుషికొండపై ఏ భవనాలు, ఎందుకు నిర్మిస్తున్నారో సమగ్ర వివరాల్ని 2021లోనే కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖకు అప్పటి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అందజేసింది. ఏపీ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఏపీటీడీసీ) ఆధ్వర్యంలో ఫైవ్ స్టార్ పర్యాటక విడిది కేంద్రంగా మొత్తం రూ.412 కోట్లతో 7 బ్లాకుల్ని నిర్మించింది.
రుషికొండ మొత్తం 61 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఇందులో 9.88 ఎకరాల విస్తీర్ణంలోనే ఈ భవనాలు నిర్మించింది. గతంలో హరిత రిసార్టు 48 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండేది. ప్రస్తుత భవనాలు 19,968 చ.మీ విస్తీర్ణంలో ఉన్నాయి. వీటన్నింటినీ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించేందుకు వీలుగా నిర్మించారు. ప్రెసిడెన్షియల్ సూట్, సూట్ రూమ్, బాంక్వెట్ హాల్‌తో విజయనగర బ్లాకు, ప్రెసిడెన్షియల్ సూట్ రూమ్స్, సూట్ రూమ్స్, డీలక్స్ గదులు, బాంక్వెట్ హాల్‌తో కళింగ బ్లాక్ నిర్మించింది. సూట్ రూమ్‌లు, కాన్ఫరెన్స్ హాల్‌తో పల్లవ బ్లాక్, సమావేశ మందిరాలతో చోళ బ్లాక్, రిక్రియేషన్ లాంజ్, బిజినెస్ సెంటర్‌తో గజపతి బ్లాక్, ప్రైవేట్ సూట్ రూమ్‌లతో వేంగిబ్లాక్, రెస్టారెంట్స్, లాంజ్, కిచెన్, పార్కింగ్ సౌకర్యాలతో ఈస్ట్రన్ గంగా బ్లాక్‌లని నిర్మించింది.
విశాఖను పరిపాలన రాజధానిగా చేస్తే..
విశాఖ నగరాన్ని పరిపాలన రాజధానిగా చేస్తే, రాష్ట్రం మరింతగా అభివృద్ధి చెందుతుందన్నది వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం తలంచింది. ఇందుకు ఏర్పాట్లూ ప్రారంభించింది. విశాఖలో పాలన ప్రారంభించడానికి అనువైన భవనాల పరిశీలనకు ఉన్నతాధికారులతో కూడిన కమిటీని నియమించింది. ఈ కమిటీ విశాఖలోని పలు భవనాలను పరిశీలించింది. వీటిలో రుషికొండపై నిర్మించిన భవనాలు ప్రభుత్వ కార్యకలాపాలకు అనువైనవని తేల్చింది. ఇక్కడ సీఎం నివాసం, సీఎం కార్యాలయానికి ఇవి అనువుగా ఉంటాయని వెల్లడించింది. అప్పట్నుంచి ఈ భవనాల్లో సీఎం నివాసం, కార్యాలయానికి అనుగుణంగా కొన్ని మార్పులు చేశారు.
వాటిని నిర్మించింది ప్రభుత్వం. పనులు జరిగింది ఏపీటీడీసీ ఆధ్వర్యంలో. ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమాలు, అంతర్జాతీయ సదస్సులు ఇక్కడే నిర్వహించేందుకు వీలుగా అత్యద్భుతంగా ఫైవ్‌స్టార్ హోటల్స్‌ని తలదన్నేలా నిర్మాణం జరిగింది. సాగర తీరంలో అద్భుతంగా, రాష్ట్రానికి అంతర్జాతీయంగా పేరు తెచ్చేలా నిర్మించిన ఈ భవనాలను చూసి గర్వపడాలి కానీ.., ఎవరో సొంతగా భవనాలు కట్టేసుకొన్నట్లుగా టీడీపీ ప్రభుత్వం, ఆ పార్టీ నేతల ఏడుపులు, పెడబోబ్బలు ఎందుకు? అవి ప్రభుత్వం నిర్మించిన భవనాలు. అనుమతి ఉన్న వారు ఎవరైనా వెళ్లొచ్చు. అయినా, టీడీపీ నేతలు ఏదో ఘనకార్యం చేసినట్లు ప్రభుత్వం భవనం లోపలికి వెళ్లి, ఫొటోలు దిగి, వీడియోలు తీసి చెడు ప్రచారం చేయడం నీచత్వానికి పరాకాష్టే. మంచి చేయడమే కాదు.. మరొకరు చేసిన మంచిని అంగీకరించడం కూడా చేతకాదని వారికి వారే నిరూపించుకోవడమే.
Comments
Please login to add a commentAdd a comment