దొండపర్తి(విశాఖ దక్షిణ): విశాఖను పర్యాటక రంగంలో అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి కృషి చేస్తున్నారని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ తెలిపారు. ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వార్షిక సర్వసభ్య సమావేశం శనివారం నగరంలో ఒక హోటల్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన మంత్రి ముందుగా ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నూతనంగా రూపొందించిన యాప్‌ను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విశాఖలో పారిశ్రామిక, ఐటీ రంగాల అభివృద్ధితో పాటు పర్యాటకంగా మరింత ప్రగతి సాధించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఇందులో భాగంగా భీమిలి వరకు ఉన్న బీచ్ రోడ్డు 30 కిలోమీటర్ల మేర పర్యాటకాభివృద్ధికి చేపట్టాల్సిన ప్రాజెక్టుల రూపకల్పన కోసం అంతర్జాతీయ కన్సల్టెన్సీలో మాస్టర్‌ప్లాన్ రూపొందించాలని సీఎం ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి విశాఖ నుంచే పరిపాలన సాగించాలని ముఖ్యమంత్రి భావిస్తున్న నేపథ్యంలో విశాఖ మరింత ప్రగతికి బాటలు పడతాయన్నారు. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుతో పాటు పారిశ్రామికవేత్తలకు అవసరమైన సహాయ సహకారాలు అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. అనంతరం రాష్ట్ర అధికార భాషా సంఘం చైర్మన్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ మాట్లాడుతూ తెలుగు భాష, సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. పారిశ్రామికవేత్తలు కూడా ఈ బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు.
మహిళా కమిటీ ఏర్పాటు
ఏపీ చాంబర్ ఆఫ్ కామర్స్ మహిళా కమిటీ నూతనంగా ఏర్పాటైంది. శనివారం ఒక హోటల్‌లో జరిగిన ఛాంబర్స్ వార్షిక సర్వసభ్య సమావేశంలో కమిటీని ప్రకటించారు. ఈ కమిటీ చైర్‌పర్సన్‌గా లీలారాణి, వైస్ చైర్‌పర్సన్‌గా గీతాశ్రీకాంత్‌లు నియమితులయ్యారు. అలాగే కమిటీలో ఇతర సభ్యులుగా గ్రంధి మల్లిక, హిమ బిందు, ఉమా వర్మ, జయలక్షి్మ, ఐశ్వర్య, రజితారెడ్డి, వినీత, రజనిచిత్ర, నిర్మల, విజయకుమారి నియమితులయ్యారు. ఈ నెల 25వ తేదీన ఈ కమిటీ ఆధ్వర్యంలో మేఘాలయ హోటల్‌లో అంగడి పేరుతో ఎక్స్‌పోను ఏర్పాటు చేస్తున్నట్లు ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ రాష్ట్ర అధ్యక్షుడు పైడా కృష్ణప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్(ఎలక్టెడ్) పి.భాస్కరరావు, ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్, కోశాధికారి ఎస్.అక్కయ్యనాయుడు, భారీ సంఖ్యలో పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment